
ఋణానుబంధం
-అక్షర
అమ్మకు అంత్యక్రియలు జరిపి నేను, మా అబ్బాయ్ సంజూ , శ్రీనివాస్ తో కలిసి ఇంటికి తిరిగి వచ్చాము. వాళనాన్నమ్మ ఇంక ఉండదు అని తెలిసిన దగ్గర నుంచి వాడు కంటికి మంటికి ఏక ధారగా ఏడుస్తూనే ఉన్నాడు. “ ఇన్నాళకి నాకు కష్టం మీద దొరికిన నాన్నమ్మని కూడా దేముడు ఇంత త్వరగా తీసుకు పోయాడు” అంటూ నన్ను భారతిని పట్టుకుని కుమిలిపోతున్న కొడుకుని ఎలా సముదాయిం చాలో తెలీక మేమిద్దరం మౌనం వహించాము. మర్నాడు శ్రీనివాస్ “మా అమ్మను ఇంత ప్రేమాభిమానాలతో దగ్గర ఉంచుకుని ఆఖరి వీడుకోలు కూడా ఇచ్చినందుకు, నేను చేయవల్సిన పని మీరు చేసినందుకు సిగ్గు పడుతూ ధన్యవాదాలు చెప్పటం చాలా చిన్న , తేలిక పని. ఇక మీరు సెలవిస్తే నేను తిరిగి వెళ్తాను.” అన్నాడు శ్రీనివాస్.
అదేమిటి కనీసం దశాహం దాకా అయినా ఉండరా, ఇన్నాళకి ఇంత దూరం వచ్చి ??? పన్నెండో రోజు అమ్మ పూర్వం ఉండిన వృద్ధాశ్రమంలో అందరికీ మీ చేతులతో కూడా భోజనాలు పెట్టి సంతర్పణ చేద్దాము. మీ చేతుల మీదగా చేసిన అన్నదానానికి అమ్మ ఆత్మ తప్పకుండా తృప్తీ పడుతుంది. ఆ కార్య క్రమం అయ్యాక వెళ్ళండి శ్రీనివాస్. ‘సరే’ అని శ్రీనివాస్ అంత వరకు తమ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉండటానికి వెళీపోయాడు.
**************************
అమ్మ లేని ఇల్లు బోసి పోతుంటే ఆవిడ మా ఇంటికి వచ్చిన గ్యాపకాలు మనసున నిండుకున్నాయి.
కొన్నాళుగా ఐదవ తరగతిలో చదువుతున్న మా సంజయ్ స్కూల్ నుంచి చాలా నిరుత్సాహంగా రావటం గమనించాము నేనూ, భారతి. ఏమైందని అడిగితే మాట్లాడలేదు. కొన్ని రోజులకి తానే సర్దుకుంటాడు లే అని ఊరుకున్నాము. కానీ పదీ-పదిహేనురోజులైనా సంజు ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆఖరి ప్రయత్నంగా అడిగాను “ ఏం రా ఎందుకు అంత డల్ గా ఉంటున్నావు? నువు చెపుతావా లేక పోతే మీ స్కూల్ కి వచ్చి మీ టీచర్స్ ని అడగమంటావా?” అని.
“ఇది మా టీచర్స్ ఇవ్వగలిగే పరిష్కారం కాదు నాన్న” అన్నాడు.
“మరయితే ఏమిటో నువ్వే చెప్తే సమాధానం ఏమైనా ఆలోచిచవచ్చు” అన్నా.
“మా క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ అమ్మమ్మో, నాన్నమ్మో, తాత అనో ఏవేవో కబుర్లు చెపుతూ ఉంటారు. వాళ అమ్మమ్మ/నాన్నమ్మ చేసిన స్నాక్స్ తెస్తూ ఉంటారు. మరి నాకు ఎవరూ ఎందుకు లేరు నాన్నా?” అంటూ అడిగాడు ఒక పక్క నుంచి దుఃఖం ముంచుకు వస్తుంటే. వాడి చిన్ని మనసుకి అర్థం అయ్యేట్టు ఎలా చెప్పాలో తెలియక వాడిని దగ్గరకు తీసుకుని “నువు పుట్టక మునుపే దేముడు వారందరినీ తీసుకు పోయాడురా. ఏం చేయమంటావు చెప్పు. నీకే కాదు మాకు కూడా కావాలి అనిపిస్తుండి రా. కానీ దేముడి దగ్గరకు వెళీపోయిన వారిని తిరిగి తీసుకురావటం ఎవరికీ చేతకాని పనిరా సంజు???” అని వాడిని సముదాయిస్తూ. నేను తీర్చలేని సమస్యే ఐనా కనీసం తన మనసులో మాట మాతో పంచుకున్నందుకు సంతోషించా.
“వక్కర్ని కూడా నా కోసం ఉంచకుండా దేముడు ఎందుకు అలా చేశాడు నాన్నా?”
“అవును రా దేముడు కూడా చాలా సార్లు మన కష్ట సుఖాలు ఆలోచించకుండా పనులు చేస్తూంటాడు. నాలుగురూ ఎదో ఒక జబ్బు చేసి పోయారురా.” అన్నాను.
నేను చెప్పింది విని సంజు ఎంత ఊరట చెందాడో తెలీదు కానీ వాడి బాధ తెలిశాక నేనూ భారతి కొంత వరకు సమాధాన పడ్డాము. మాతో తన బాధ పంచుకున్నాక సంజులో మేము ఆశించిన మార్పు ఏమీ రాలేదు. ఒక రోజు సంజు పక్కన లేనప్పుడు భారతి అన్నది “ ఏమండీ మీరు సరే అంటే సంజు కోసం మనం ఒక పని చేయవచ్చునంది”’
ఏమిటి అన్నట్లు చూశాను తన వేపు.
“మనకి దేముడు ఇచ్చింది బాగానే ఉంది కదా!!!! మన ఊరిలోనే ఉన్న వృద్ధాశ్రమ్మం నుంచి తమకు ఎవరూ లేని పెద్దవారిని సంజు కోసం దత్తత చేసుకుందామా”అడిగింది నా ప్రతిక్రియ ఎలా ఉంటుందో అని నా వేపు చూస్తూ.
“నీ ఆలోచన బాగానే ఉంది కానీ ఆ ఆశ్రమానికి అటువంటి ప్రణాళిక లెందీ మన కోసం ఒప్పుకుంటారా?”
“నిజమే. ఒకసారి వ్యక్తిగతంగా వెళ్ళి చూసి అడుగుదాము. మనం అడిగి నందువల్ల వారు ఇటువంటి ప్రణాళిక ఏదైనా కొత్తగా పరిచయం చేయొచ్చు కదా!!” అంది భారతి.
“సరే ముందర ఆ సమాజానికి ఫోన్ చేసి విషయం చెప్పి వారు అనుమతీస్తే ఏ రోజు రమ్మంటారో అడుగు. ఇప్పుడే సంజుకి మాత్రం ఏం చెప్పకు. మన ప్రయత్నం ఫలిస్తే వాడికి సర్ప్రైస్ ఇద్దాము.”
సరే అని భారతి ప్రయత్నం ఆరంభంచింది. మా ఊరిలో ఉన్న రెండు సమాజాలు కూడా “ప్రస్తుతం అటువంటి రిక్వెస్ట్స్ రాలేదు కాబట్టీ అటువంటి ప్రావధానం లేదు. కానీ మా కమిటీతో మాట్లాడి ఒక వారం రోజుల్లో మీకు చెపుతాము” అన్నారు. వారం తరువాత మరలా కాల్ చేసి అడిగితే ఒకరు కలవటానికి ఫలానా రోజు రమ్మంటే , సంజుని స్కూల్ కి పంపించి వెళ్లాము.
ఆశ్రమం కమిటీ సభ్యులు నలుగురు ఉన్నారు అక్కడ. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే ఉన్నది ఉన్నట్లు చెప్పాము. మేమేదో పెద్ద పరోపకారం చేస్తున్నామని కాదు కానీ మా ప్రయత్నం ఫలిస్తే మా వాడికి ఒక నానమ్మో /తాతతో పాటూ వారికి కూడా ఈ వయస్సులో అభిమానంగా చూసే ఒక కుటుంబం దొరుకుతుంది కదా అని అన్నాము. ఒక వేళ ఏ కారణం వల్ల నైనా వారు మాతో ఇమడ లేక పోతే మళ్ళీ మీ దగ్గరకు తిరిగి రావచ్చు. మా దురదృష్టవశాత్తు అలా కనుక జరిగితే మేము ఏ విధంగానూ వారిని నిర్బధించంని మాత్రం మేము రాసి ఇస్తాము. అన్నీ కుదిరి మా ప్రయత్నం ఫలిస్తే మాత్రం వారి అంతిమ శ్వాస వరకు మాదే బాధ్యత. అది కూడా రాసి ఇస్తాము, అని చెప్పిన మీదట కమిటీ మా ప్రస్తావన స్వీకరించి మా వివరాలు ఇంకొన్ని అడిగి తృప్తీ చెందాకా “ వారి ఆశ్రమ్మంలో ఒక డభ్హయి ఏళ్ల ఆరోగ్యవంతు రాలైన ఆవిడ ఉన్నారు, భర్త పోయారు, ఒక్క కొడుకు సకుటుంబంగా యూ.ఎస్. లో స్థిర పడిపోయారు, వారితో ఆవిడకు ఎటువంటి అనుబంధం ఏర్పడలేదని, మా ప్రస్తావన నచ్చి ఆవిడను అడిగితే , మీమ్మల్ని కలిశాక ఏ విషయం చెపుతామన్నారు.” అని ఆవిడను పిలిపించారు.
ఆవిడ పేరు కాంతం అని పరిచయం చేశారు. మంచి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చారు. మచ్చి/మాంసం అసలు ముట్టరు. మరి మీ సంగతి ఏమిటి అని అడిగారు.
మేము కూడా తినమని చెప్పాము. ఆవిడను చూడగానే నాకూ భారతికి సదభిప్రాయం కలిగి ఒకరి వేపు ఒకరు చూసుకుని కళ్లతోనే సరే అనుకున్నాము.
“ఆవిడ స్వవిషయాలు అడిగి బాధ పెట్టకూడదని ఒక్కటే చెప్పాము-“అమ్మా! మీకు మా విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా అడిగి తెలుసుకోవచ్చు. మీకు సమ్మతమైతే మాతో ఉండి చూడండి. మనకు పరస్పరం సానిహిత్యం కుదిరితే సరి లేకుంటే తిరిగి ఆశ్రమానికి వచ్చేస్టామంటే మా వేపు నుంచి ఎటువంటి నిబంధన ఉండదు. అని హామీ ఇచ్చాము. మాతో ఉంటూ మీకు తోచి నప్పుడు ఆశ్రమానికి వచ్చి కలవ వచ్చు. మీ ఇష్టం. లేదా మీ బంధువుల్ని కలిసి రావచ్చు. అన్నీ కుదిరి మా సంజూకి మీరు నాన్నమ్మోకానీ అమ్మమ్మోకానీ కాగలుతే అంతకన్నా సంతోషకర మైన విషయం మాకు వేరే ఉండదు”. అని నమ్మకము ఇచ్చాము. ఆలోచించి రెండు రోజుల్లో చెపుతామన్నారు కాంతంగారు. రెండు రోజుల్లో కబురు వచ్చింది – వచ్చి పేపర్ వర్క్ పూర్తి చేసి కాంతం గారిని వెంట తీసుకు వెళ్లమని. సంజూకి అసలు విషయం చెప్పలేదు ఇంకా. ఆవిడ వచ్చాక కూడా వారిద్దరి మధ్య ఎంత వరకు సామరస్యం కుదురుతుందో చూసి సంజుకి అసలు విషయం చెపుదామని. ముందు జాగర్త పడ్డాము.
కాంతం గారు వచ్చి తనకి ఇచ్చిన గదిలో ఆవిడ సామాను సర్దుకునేంతలో సంజయ్ స్కూల్ నుంచి వచ్చాడు. కొత్త మనిషిని చూసి ఆవిడ గది పక్కన నుంచుని ఆవిడను బెరుకుగా గమనిస్తూన్టే భారతి “వెళ్లరా లోపలికి పరవాలేదు. నీకు నాన్నమ్మో అమ్మమో కావాలన్నావు కదా? మరి దగ్గరకు వెల్లవేమీ? “ అని అడిగితే వాడు తెలివిగా నాకు నిజమైన నాన్నమ్మ కావాలి అన్నాడు. ఆవిడ నిజమైన నాన్నమ్మ కాదని ఎలా అనుకుంటున్నావు అని అడిగితే “ మరైతే ఇంతవరకు కనిపించ లేదేమీ? ఎక్కడ ఉన్నారు? అని అడిగితే “అవును నిజమే కదా? మనకు చాలా చాలా దూరం ఊరిలో మీ ఈ నాన్నమ్మకి నీ లాంటి చిన్న మనవడు ఉన్నాడు. వాడు మీ నాన్నమ్మని ఇక్కడకు పంపటానికి ఎంతకూ ఒప్పుకోలేదు. ఇప్పటికీ ఎలాగో నువు తన కోసం రోజూ అడిగి ఏడుస్తున్నవంటే ఒప్పుకుని వదిలాడు. మీ గ్రాండ్ పేరెంట్స్ అందర్నీ దేముడు తీసుకు పోయార్కానీ లక్కీగా మీ నాన్నమ్మ చెల్లి ఈవిడ, నీకు నిజమయిన నాన్నమ్మే.” అని ఎలాగో సర్ది చెప్తే సంజూ మళ్ళీ “ మరైతే మళ్ళీ వాడి దగ్గరకు తిరిగి వెళి పోతారా నాన్నమ్మా?’ వాడికి అప్పుడీ మరో బెంగ మొదలైంది. “ మరందుకే వెళ్ళి త్వరగా ఆవిడతో స్నేహం చేసుకొ” అని అంటే సందేహంగా కాంతం గారి వేపు చూశాడు. ఈ సారి కాంతం గారు కూడా నవ్వుతూ “ నా సంజూ నా దగ్గరకు ఎప్పుడు వస్తాడు? అని పిలిచేసరికి ఇంక భారతిని ఎక్కువ ప్రశ్నలు వేయకుండా ఆవిడ దగ్గరకు వెళ్ళాడు. ఆవిడ వాడిని దగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చో పెట్టుకుని మరి మీ స్కూల్ కబుర్లు నాకు చెప్తావా?” అని వాడికి ఇష్టమైన విషయం ఎత్తేసరికి అన్నీ మరచి కబుర్లు మొదలెట్టాడు. వారిద్దర్నీ అలా చూసేసరికి నిజంగానే ఎన్నాళ తరవాతో కలిసిన నాన్నమ్మ మనవడు అనిపించారు నాకూ భారతికి.
మేము ఉద్దేశ్య పూర్వకంగానే సంజయ్ కి కాంతంగారికి కలిపి ఒకే గది ఇచ్చాము, ఆ రకంగా వాళ్ళిద్దరు దగ్గర పడతారని.
అలా ఆరంభమైన వారిద్దరి మధ్య అనుబద్ధం పెరుగుతూ పోయి సంజు భారతి కంటే ఎక్కువగా కాంతం గారి చుట్టూ తిరిగేవాడు ఇంట్లో ఉన్నంత సేపూ. అప్పడప్పుడు మేము ఏటై నా వెళ్ల వలసి వస్తే కాంతం గారు ఇష్టం ఉంటే వచ్చే వారూ లేకపోతే ఆవిడా సంజయ్ ఇంట్లో ఉండి పోయేవారు.
కాలం గడుస్తున్న కొద్దీ నేనూ భారతి కూడా ఆవిడను అమ్మా అని పిలవటం అలవర్చుకున్నాము. ఆవిడ కూడా ఇంటి పనుల్లో భారతికి సహాయ పడుతూ ఆప్పుడప్పుడు ఆవిడకు వచ్చిన పిండివంటలు చేసి పెడుతూ మాలో ఒకరిగా కలసి పోయారు.
***
ఆ ఏడాది సంజయ్ స్కూల్ లో గ్రాండ్ పేరెంట్స్ డే ‘ జరుపుకున్నప్పుడు మొదటి సారి ఆనందంతో పొంగి పోతున్న ముఖంతో వాళ నానమ్మ దగ్గరకు వచ్చి కూర్చున్న వాడిని అలా చూస్తూ ఉండిపోయాము మేము. అలా వారిద్దరినీ వదిలి తిరిగి కారు దగ్గరకు వస్తున్న భారతికి మరో బ్రేన్ వేవ్ వచ్చింది- “ ఈ పెద్ద పెద్ద స్కూల్ కమిటీస్ అన్నీ సదుపాయాలతో కూడిన జీవితం గడుపుతున్న గ్రాండ్ పేరెంట్స్ ని ఆహ్వానించి విందు చేస్తున్నారు. బాగానే ఉంది, కానీ దానితో పాటూ అతి తక్కువ సదుపాయాలతో జీవిస్తున్న వృద్ధాశ్రమ్మాల్లో వృద్ధులు క్కూడా ఎవరో ఒకరి గ్రాండ్ పేరెంట్స కదా. వారీ దగ్గరకు ఈ పిల్లలను తీసుకు వెళ్ళి కొంత సమయం గడిపితే వాళ్లు ఎంత సరదా పడతారో కదా!! మన సంజయ్ స్కూల్ కమిటీకి సజెస్ట్ చేద్దామ్మా ? మీరేమంటారు” అంటూ నా వేపు చూసింది. “భారతి, నీకీ మధ్య బ్రేన్ వెవ్స్ చాలానే వస్తున్నాయే. అలాగే సజెస్ట్ చేద్దాం. తప్పు లేదు. పదా” అని నేనూ భారతి స్క్కూల్ ప్రిన్సిపాల్ మా మాట వినిపించికుంటుదేమో అని వెళ్లి పర్మిషన్ అడిగాము. లోపల్కి పిలిస్తే వెళ్ళి మా మనసులో మాట చెప్పాము. ఆవిడ చాలా సరదా పడి తప్పకుండా కమిటీతో మాట్లాడి వీలైతే ఆ రోజే మా సజేశన్ని కార్యాన్వితం చేయటానికి ప్రయత్నిస్తాం”అని అన్నారు. మేము ఆ రోజు ఎంతో తృప్తీ గా ఇంటికి తిరిగి వచ్చాము. అలా మా సంజూకి నాన్నమ్మ దొరికి పదేల్లు గడిచిపోయినాయి. ప్రస్తుతం సంజయ్ కాలేజ్ విద్యార్థి. ఇప్పుడు మాకు ఒక అమ్మాయి స్నేహ’ కూడా ఉంది. తను కూడా వాళ నాన్నమ్మకు బాగానే చేరువ అయింది.
స్నేహ పుట్టక మునుపు తరవాత కూడా కాంతం గారు మాకు చేసిన సాయం మరువ రానిది. మా స్వంత అమ్మ ఉన్నా కూడా ఇంత సాయం ఉండేదో లేదో అని అనిపించక పోలేదు . ఆ రోజుల్లో సంజు అంతలా అడిగి ఉండక పోతే మాకు ఇంత చక్కటి ఆలోచన ఎప్పటికీ వచ్చేది కాదేమో అని మా వాడికి మనస్సులోనే ధన్యవాదాలు చెప్పుకున్నాము నేను భారతి .
అలా కలిసిపోయిన కాంతంగారు దాదాపు ఏడాదన్నర క్రితం నుంచీ అనారోగ్యంగా ఉంటం గమనించి బలవంతంగా ఆసుపత్రికి తీసుకు పోయి పరీక్షలు చేయిస్తే కిడ్నీ కాన్సర్ అనీ అప్పటికే నాలాగవ స్టేజ్ అనీ తేలింది. ఏ వైద్యం చేయించినా కూడా ఎడాదిన్నర కంటే ఎక్కువ బ్రతకలేరని చెప్పేశారు డాక్టర్లు. నాకూ భారతికి ఏం చేయాలో బోధ పడలేదు. అసలు జబ్బు ఇంత ముదిరే దాకా మాకు ఏ మాత్రం తెలీకుండా ఎలా ఉండి పోయిందో తెలీదు. కాంతం గారిని అడిగితే ‘తనకి పెద్దగా బాధ ఏమీ తెలీలేదు అన్నారు. బాగా నీరసంగా ఉంటే వయస్సు పై పడుతోంది కదా అందు వల్లే అనుకున్నాను.’ అన్నారు. ఆహారం కూడా అప్పుడప్పుడు సరిగ్గా తినే వారు ,అప్పుడప్పుడు అసలు ఆకలి లేదని చెప్పి పడుకునే వారు. ఇదంతా చూస్తూ కూడా మేమిద్దరం ఆవిడను ముందే ఆసుపత్రికి తీసుకు రాకుండా ఎందుకు అశ్రద్ధ చేశామా అని తెగ విసుక్కున్నాము. మమ్మల్ని మేము క్షమించుకునే స్థితిలో కూడా లేము. విషయం తెలిసాక కాంతం గారు-“ జరిగింది ఏదో జరిగి పోయింది. ఇక ముందు మాత్రం నాకు కీమో తెరేపి అని రేడియో తెరేపి అని మీరు తాపత్రయ పడి నన్ను హింస పెట్టకండి. ఇంత కాలం నా జీవితం హాయిగా గడిపాను. ఇప్పటికే నాకు ఎనభై ఏడు సంవత్సరాలు. మహా అయితే ఇంక ఎంత కాలం బ్రతుకుతాను చెప్పండి’.” అని వెడుకున్నారు. మాకు ఏం చేయటానికి తోచక ఆశ్రమానికి వెళ్ళి విషయం చెప్పి ఏం చేయమంటారని అడిగాము. కాంతం గారు మా జీవితంలోకి వచ్చాక వచ్చిన సందడి మళ్ళా మనకు దూరం అయిపోతుంటేనే చాలా విచారంగా ఉంది. “ఆవిడ అంతలా వద్దు అంటుంటే తెరేపి జోలికి పోకండి. ఆవిడ శరీరం చాలా కష్ట పడుతుంది. ఆ బాధ మనం అసలు చూడలేము. అయినా ఆవిడ కొడుక్కి కూడా చెప్పాలి కదా. మేము అతన్ని కాంటాక్ట్ చేసి అంతా చెపుతాము. చూద్దాం అతను ఏమంటాడో.” అన్నారు వాళు. సరే అని ఇంటికి తిరిగి వచ్చిన నాకూ భారతికి తిండి సయించలేదు. కాలేజ్ నుంచి వచ్చిన సంజయ్ వాడి పోయిన మా మొహాలు చూసి ఏదో అయిందని పసి గట్టి ఒకటికి రెండు సార్లు గుచ్చి గుచ్చి అడిగితే ఇంక ముభ్య పెట్టలేక తెగించి ఉన్న మాట చెప్పాము. విని కాసేపు స్టబ్దుగా ఉండి పోయిన సంజయ్ ఒక్క సారి వలవలా ఏడవవటం మొదలెట్టాడు వాళమ్మను చుట్టేసి. వాడిని ఊరుకో పెట్టటం మా తరం కాలేదు. “ సంజూ ఊరుకోరా ప్లీస్ . నువ్వు ఇలా దుఃఖ పడతూ ఆవిడ ముందుకు వెళ్లావంటే సంవత్సరంన్నర బ్రతకాల్సిన మీ నాన్నమ్మ తన చావుని నీ మొహంలో చూడలేక ముందే పోతారు. పెద్దవాడివి అవుతున్నావు కదా నీ మనసు పై నిగ్రహం నువ్వే నేర్చుకోవాలని” చెప్పగా ఎలాగో కొంచెం శాంతించాడు సంజు.
ఆశ్రమం వారు విషయం తెలిపిన వెంటనే కాంతంగారి అబ్బాయి శ్రీనివాస్ వారం రోజుల్లో వచ్చి మమ్మల్ని కలిశాడు. కొడుకుని చూసి ఆనందించిన ఆవిడ ముఖం అతను వక్కడే వచ్చాడని తెలిసి ముడుచుకు పోయింది. ఆవిడ మనస్సును గ్రహించిన శ్రీనివాస్ “ అమ్మా , కారన్ కి నువ్వాన్తే ఇష్టం అయిష్టం అని ఎలాంటి భావనా లేదు, కానీ తానూ పిల్లలు అక్కడి వాతావర్ణంలో పుట్టి పెరిగిన వారు ఒక్కసారిగా ఇక్కడకు వచ్చి ఇమడలేమంటే నేను బలవంత పెట్టలేదమ్మ వాళని. అక్కడకు వెళ్ళాక వారి చేత వీడియో కాల్ చేయిస్తాగా” అని సంజాయిషీ చెప్పుకున్నాడు. “అమ్మకు ఇష్టం లేకపోతే ఆవిడకు ఎటువంటి తెరెపీస్ వద్దనే” అతను కూడా చెపుతుంటే ఇంకా ఎందుకు ఆవిడ శరీరాన్ని బాధకి గురి చేయటం’. అనే అతని ఉద్దేశ్యం. అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాక శ్రీనివాస్ తిరిగి వెళ్ళి పోయాడు. తన తల్లికి ఒక కుటుంబం ఏర్పరిచి తన బాగోగులు ఇంత శ్రద్ధగా చూసుకుంటునందుకు తృప్తీతో వెళిపోయాడు అతను. తిరిగి వెళ్ళాక వారానికి ఒక సారైనా వీడియో కాల్ చేసి తన భార్యా పిల్లల చెత ఏదో మాట్లాడించే వాడు. ఇదే పని అతను ఇంతకు ముందు నుంచీ ఎందుకు చేయలేదో ‘ అని అనుకున్నాము.
***
డాక్టర్లు ఇచ్చిన గడువు పూర్తవుతునప్పుడే కాంతంగారు మంచం పట్టేశారు.
తిండి పూర్తిగా ఆగి పోయింది. మధ్య మధ్యలో జావ చేసి నోట్లో పోస్తే ఎలాగో బలవంతం మీద మింగే వారు. ఆవిడ మంచం పట్టిన వెంటనే శ్రీనివాస్ కి కాల్ చేస్తే వచ్చి వాళ ఆఫీస్ గెస్ట్ హౌస్ లో దిగి రోజంతా ఎక్కువగా వాళ అమ్మ దగ్గరే కూర్చునేవాడు. కనీసం ఆవిడ ఆఖరి రోజుల్లో అయినా కొడుకు సాన్నిధ్యం దొరికినందుకు మేము కూడా సంతోషించాము.
పై ఊరిలో చదువుకుంటున్న సంజూ కూడా వచ్చి వీలయినంత వరకు వాళ నాన్నమ్మ దగ్గర గడిపే వాడు. ఆ రోజు సాయంత్రం కాంతం గారు ఊపిరి ఆడక మేలికలు తిరుగుతుంటే, కనీసం ఆఖరి శ్వాస అయినా ప్రశాంతంగా విడవగలరని కాంతం గారిని ఆసుపత్రికి తీసుకు వెళ్ళి వెంటిలేటర్ పెట్టాక ఆవిడ శరీరం కొంత శాంతిచింది. అప్పటి దాకా అక్కడే ఉన్న సంజయ్ వాళనాన్నమ్మ పడుతున్న బాధ చూడలేక పక్క గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే మా స్నేహ కూడా అన్నని చుట్టుకు పోయి ఏడుస్తోంది. ఎవరు ఎంత దుఃఖపడినా మానవ మాతృలం చేయ గలిగనది ఏముంది!!!!
అలా ఏ రక్త సంబంధంలేని వారి నానమ్మ కోసం దుః ఖిస్తున్న మా పిల్లల్ని చూసి వారి తల సాంత్వనగా నిమురుతూ ఉండి పోయాము, నేనూ భారతి. ఆ తరవాత అందరం ఆసుపత్రికి బయల్దేరాము ఏ రక్త సంబంధం లేని మా అమ్మకు వీడుకోలు ఇవ్వటానికి.
*****

పుట్టిపెరిగి గ్రాడ్యుయేషన్ చేసింది జంషెడ్పూర్ లో. ఎం. ఎ. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి చేసాను. మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ భాగవతుల ఉమామహేశ్వర శర్మగారు స్వయంగా తెలుగుసాహిత్యం, భాష అంటే ప్రాణంగా చూసుకునేవారు. ఆఖరిశ్వాస వరకూ తెలుగు కావ్య రచనలు చేసి, తెలుగుతల్లి సేవ చేసారు. ఆయన ప్రభావం వలన కొంతా, అప్పటికే తెలుగు రచయిత్రిగా మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న శ్రీమతి సుగుణమణి (అరవింద) గారి ప్రోత్సాహం, సాంగత్యం వలన నాలో కథలు రాయాలన్న ఉత్సాహం పొంగిపొర్లింది. ఫలితంగా నేను ప్రయత్నపూర్వకంగా తెలుగు రాయటం, చదవటం నేర్చుకుని, స్థానిక పత్రిక కోసం రాసాను. అవి అందరూ మెచ్చుకున్నందున ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలకు పంపటం, వారు వాటిని ప్రచురించటం జరిగింది. కథా రఅహ్యిత్రిగా పేరు తెచ్చుకుంటూన్న సమయంలోనే వివాహం జరిగి సంసార సాగరంలో మునిగితేలుతూ, స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తూ, జీవితాన్ని ఈ రెండింటికి అంకితం చేసాను. సంసార బాధ్యతలు కొంతవరకు తీరాక నాలోని రచయిత్రి నేను ఇంకా బ్రతికి ఉన్నానంటూ ముందుకొచ్చింది. ఈసారి నా బంధువు అయిన అనూరాధ ప్రోత్సాహంతో మళ్లీ రాయటం మొదలుపెట్టాను. నేను సాహితీ ప్రపంచంలోకి అడుగుపెడితే పైలోకంలో ఉన్న మా నాన్నగారు చూసి తప్పకుండా సంతోషిస్తారన్న ఆశతో…
