కాదేదీ కథకనర్హం-18

తిరిగిరాని గతం

-డి.కామేశ్వరి 

ఆటో దిగి శ్రీవల్లి లోపలికి అడుగుపెట్టింది. అప్పుడే ఇంట్లోంచి ఏదో శవం వెళ్ళినట్లు ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. అంతా తలోమూల వాడిన మొహాలతో కూర్చుని వున్నారు. మహిమ తండ్రి పేపరు ముఖానికి అడ్డం పెట్టుకున్నారు. పెద్దన్నయ్య శ్రీధర్ ఓ పుస్తకం, చిన్నన్నయ్య శ్రీకర్ ఓ పుస్తకం పట్టుకుని కూర్చున్నారు. – మహిమ ఎక్కడుందో కనపడ లేదు —

‘అంకుల్….ఏమయింది? ఎందుకు అంత అర్జంటుగా రమ్మన్నారు….’ వల్లి అందర్నీ చూస్తూ ఆరాటంగా అడిగింది. వల్లి గొంతు వినగానే మహిమ తల్లి జానకి, పెద్ద వదిన శశిరేఖ, చిన్నవదిన లత లోపల్నుంచి వచ్చారు……అంతా ఒక్క సారి ‘అదికాదు వల్లీ…….’ అంటూ ఏదో చెప్పబోయారు. “ష్…..వుండండి, కూర్చో వల్లీ….” అంటూ రాజారావుగారు అందరినీ వారించి “ఏంలేదమ్మా….నీకు తెల్సుగదా ఇవాళ మహిమని చూడటానికి సాయంత్రం మీ పినమామగారి అబ్బాయి వస్తున్నాడు గదా, అతన్ని తీరా పెళ్ళిచూపులకి పిలిచాక ఇప్పుడు మహిమ ఏమో తనకేం పెళ్ళిచూపులు వద్దు, ఇప్పుడ సలు పెళ్ళే చేసుకోను అంటోంది” రంగనాధంగారు మొదలుపెట్టారు.

“ఉదయం నుంచి గొడవ మొదలుపెట్టింది….తనకి చెప్పకుండా అసలు ఎందుకు పిలవాలని యెగిరిపడ్తోంది.” జానకమ్మ మొహం ఎర్రపరచుకుని ఆవేశంగా అంది. “మంచి సంబంధం….పెద్ద చదువులు చదివి, పదివేల రూపాయలు తెచ్చుకుంటున్నాడు అన్నింటికంటే నీ బంధువులు, మంచి కుటుంబం, అబ్బాయీ బాగున్నాడు ఫోటోలో…. ఇంతకంటే ఇంకేం కావాలి ఏ ఆడపిల్లకన్నా…..యిన్నాళ్ళూ చదువు అని అంటే సరే అన్నాం…..ఇప్పుడింకేం అభ్యంతరం అని పెళ్ళిచూపులు ఏర్పాటు చేస్తే…..’ ఆవిడ ఆవేశంగా చెప్పుకుపోతోంది.

“దానికి ముందుగా చెప్పలేదనుకో, ఎలాగో శలవులకి వస్తోంది, వచ్చాక చెప్పొచ్చు అని రాయలేదు – ఏదీ నిన్నగా వచ్చింది – ఉదయం లేచాక సావకాశంగా కూర్చోపెట్టి చెపుదాం అనుకునేసరికి……..” అన్నారు రంగనాధంగారు.

“పొద్దునే లేవగానే ఇంట్లో హడావుడి చూసింది. ఆ తరువాత మొదలుపెట్టింది గొడవ…..తనకు చెప్పకుండా పిలిచారని, అంచేత తన తప్పు ఏమీలేదని, ఎంతమాత్రం పెళ్ళిచూపులకి కూర్చోనని గొడవ….”

‘అంటే, అసలు పెళ్ళి వద్దంటుందా….లేక పెళ్ళిచూపులని వద్దంటుందా, అసలు తన అభిప్రాయం ఎమిటట? పెళ్ళే చేసుకోనంటుందా, లేక అరేంజ్డ్ మేరేజ్ వద్దంటుం దా’ శ్రీవల్లీ మధ్యలో అంది.

“ఏది సరిగా చెపితే గదా తల్లి. ఇప్పుడీ పెళ్ళిచూపూలు వద్దట. తనింకా పెళ్ళి గురించి ఆలోచించలేదట. కొన్నాళ్ళు జాబ్ చెయ్యాలట. ఏదేదో అంటోంది” రంగనాధం గారన్నారు వాడిన మొహంతో.

‘చూడమ్మా వల్లీ…..నీవే నీ స్నేహితురాలికి ఎలాగైనా నచ్చచెప్పి వప్పించి సాయంత్రం పని జరిగేట్టు చూడు తల్లీ, లేకపోతే మా పరువు పోతుంది. నీ బంధువులు కూడాను…..దానితో కాస్త మాట్లడమ్మా వెళ్ళి….’

‘వుండండి అంకుల్…..నేనసలు విషయం ఏమిటో కనుక్కుంటాను. మీరు వర్రీ కాకండి. నేను ఒప్పిస్తాను లెండి – ఎక్కడుంది…..మేడ మీద వుందా…..’ వల్లి లేచింది.

“ఏం చేస్తానో, ఎలా ఒప్పిస్తావో, పరువు కాపాడేట్టు చూడమ్మా…..చేసుకోవడం మానడం తరవాత ఆలోచిద్దాం. ముందు పెళ్ళిచూపులకి కూర్చునేట్టు వప్పించు.” జానకమ్మ నీదే భారం అన్నట్లుగా అంది.

వల్లి మహిమ గదిలోకి వెళ్ళే సరికి ముఖం మాడ్చుకుని కూర్చున్న మహిమ వల్లిని చురచుర చూసింది. ‘అందరూ అయ్యారు నీవొక్క దానివి మిగిలావనా ఉపదేశాలు చెయ్యడానికి వచ్చావు -” స్నేహితురాలి మీద గయ్మని లేచింది. వల్లి నవ్వి మంచం మీద కూర్చుని, “ఏమిటే నీ అలక. దేనికోసం ఈ రాద్దాంతం….” హాస్యంగా మొదలుపెట్టింది.

“షటప్….పెద్ద తెలివిగా మాట్లాడుతున్నానని అనుకోకు. అన్నీ విన్నా నువ్వు నాకేం ప్రేమలు దోమలు మీద నమ్మకాలు లేవనీ, తెలిసే అడుగుతావెందుకు” గయ్మంది. ఆమె లేత గులాబి రంగు మొహం ఎర్ర గులాబి రంగులోకి మారింది.

‘అయితే మరి పెళ్ళిచూపులు వద్దంటూ ఈ గొడవేమిటి – ప్రేమలు లేవు గనకే పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధం చేసుకోడానికేం……ఇరవై మూడేళ్ళు వచ్చాయి. ఇంకా నీకు పెళ్ళి వయసు రాలేదనా నీ ఉద్దేశం. కన్న వాళ్ళకి కూతురి పెళ్ళి చేసి బాధ్యత తీర్చుకోవాలన్న ఆరాటం వుండదా…..వాళ్ళ ఆరాటం అర్ధం చేసుకోకుండా చిన్న పిల్లలా యీ ఆగడం ఏమిటి…..నీ వయసు దాన్ని నాకు పెళ్ళి అయి ఏడాది అయింది……’ నచ్చచెప్పే ధోరణిలో అంది.

“ఏం నీవు చేసుకుంటే నేను చేసుకోవాలని రూలుందా…..నాకిప్పుడు పెళ్ళి చేసుకోవాలని లేదు. చేసుకోదలచనప్పుడు యీ పెళ్ళిచూపులేమిటి?’ విసుగ్గా అంది.

“ఇప్పుడు చేసుకోవాలని లేదా, అసలు చేసుకోవాలని లేదా….” రెట్టించింది వల్లి.

“ఐ హేట్ టు గెట్ మారీడ్…..నాకు పెళ్ళంటే అసహ్యం…..జీవితంలో పెళ్ళి తప్ప మరీ ముఖ్యమైనదేదీ లేనట్టు పెళ్ళీ పెళ్ళీ అని చంపుతారెందుకు…..ఏం లేకుండా బతకలేమా….. ఏమో తరువాత సంగతి ఎలా మారుతుందో నాకు తెలియదు గాని ఇప్పుడు ఎంతమాత్రం పెళ్ళి చేసుకోవాలని లేదు….” మొహం ఎర్రపరచుకుని సీరియస్గా అంది.

“మరేం చెయ్యాలని నీ ఉద్దేశం….?”

“ఏం చెయ్యడమేం…..ఉద్యోగం చేస్తాను, కొన్నాళ్ళు హాయిగా, ఫ్రీగా స్వతంత్రంగా లైఫ్ ఎంజాయ్ చేస్తాను.

“ఇదిగో మహీ…..చూడు పెళ్ళి చేసుకున్న ఆడవాళ్ళంతా అష్టకష్టాలూ పడిపోవడం లేదు, చేసుకొని ఆడవాళ్ళంతా సుఖపడ్తున్నారని చెప్పలేము. దేన్లో వుండే ఇబ్బందులు దాన్లో వున్నాయి. నీలా అందరూ అనుకుంటే నూటికి తొంబై తొమ్మిది మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారంటావు- సేక్యూరీటీ కోసమో, చేంజ్ కోసమో, సుఖం కోసమో, పిల్లల కోసమో, ఏదో ఒకటి ఆశించే చేసుకుంటున్నారు గదా – పెళ్ళి చేసుకోకుండా వుంటే ప్రాబ్లమ్స్ వుండవనా….’

“అందరి సంగతి నాకెందుకు, నాకేం ప్రాబ్లమ్స్ వుంటాయి. చదువుకున్నాను ఏదో ఉద్యోగం చేస్తూ ఇండిపెండెంట్గా వుండగలను. నాకేం ఇబ్బందులుంటాయి. ఒకవేళ ఏదన్నా ఇబ్బందులుంటే అప్పుడే ఆలోచించవచ్చు” మొండిగా అంది.

‘అవును…..ఏ ముప్పైకో, నలబైకో ఈ ఒంటరితనం విసిగెత్తి అప్పుడు ముసలమ్మవి అయ్యాక చేసుకుందువు గాని…..చూడు మహి, ఇప్పుడు ఏదో ఆవేశమో, ఆదర్శమో ఏదో అనుకుని ఇలా వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకుంటే తర్వాత విచారిస్తావు. ఎందుకంటె ఏ వయస్సులో జరగాల్సినవి ఆ వయసులో జరగాలంటారు పెద్దవాళ్ళు. నీవెప్పుడో మనసు మార్చుకునే వేళకి టూ లేట్ అవచ్చు. నీ సంగతి అలా వుంచు…..కన్న వాళ్ళ సంగతి ఆలోచించావా…… వాళ్ళకి వాళ్ళుండగా వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవాలని వుండదా…..’

అబ్బ, నీవేమిటి మామ్మలా, అమ్మమ్మలా మాట్లాడుతూ సాధిస్తున్నావు. ఏం యిప్పుడెంకొంప మునిగిందని గొడవ చేస్తున్నారు, నాకేదో నలభై ఏళ్ళు రేపో మాపో వచ్చేస్తున్నట్టు రాద్దాంతం చేస్తున్నారు. పాతికేళ్ళకి ఇంకా రెండేళ్ళు తక్కువే నాకు -” వల్లి అదోలా నవ్వింది.

“నలభై వచ్చేస్తే ఇంక గొడవ ఎవరు చేస్తారు. చేయడానికి ఏముంటుంది అప్పుడు. ఎప్పటికయ్యేది ప్రస్తుతమప్పటికని. పెద్దవాళ్ళు ఆరాటపడ్తున్నారు. అసలింతకీ నీకు పెళ్ళి మీద యింత విముఖత ఎందుకొచ్చింది, ఎప్పుడొచ్చింది” కాస్త వ్యంగ్యంగా అడిగింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.