నడక దారిలో-59

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ కావటం, రిటైర్ కావటం, పెద్దక్క మరణం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, వీర్రాజు గారు తన ఏకాగ్రత అంతా పెయింటింగ్స్ వేయటంపై పెట్టారు. పల్లవి కొన్న సరూర్ నగర్ లో అపార్ట్మెంట్ గృహప్రవేశం అయ్యాక, మిత్రులు బంధువులకు విందు ఇచ్చాం. డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం మొదలుపెట్టాను. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. వీర్రాజుగారికి బోయి భీమన్న, బాపూరమణల పురస్కారాలువచ్చాయి. చిన్నన్నయ్య, సత్యవతీ చనిపోవటం, నేనూ, నా సాహిత్య పరిశోధనలూ..తర్వాత—)

***

          ఒకసారి రామలక్ష్మి గారికి ఇచ్చినపుడు అనుకుంటా అమృతలతగారు నిర్వహించే అపురూప పురస్కారాల సభకు హాజరు అయ్యాను. వారి పేరు వచ్చే పాటనే నేపధ్యంలో వేస్తూ అతిథులను ఆహ్వానించటం గమ్మత్తుగా అనిపించింది. రెండుమూడు గంటల సభనీ ఆహ్లాద భరితంగా టీమ్ వర్క్ తో, నిబద్ధతతో, చక్కని క్రమశిక్షణతో చివరకు సభకు హాజరైన సభికుల్ని కూడా పాల్గొనేలా చేస్తూ రంగరంగ వైభవంగా సాగిన విధానం అబ్బుర పరిచింది. అంతే కాకుండా పురస్కారం పొందిన వారిపై పరిచయ వ్యాసాలతో కూర్చి అందంగా ముద్రించిన అభినందన సంచికను ఆవిష్కరించి వచ్చిన వారందరికీ అందజేసారు.
 
          అంతకు ముందు ఎన్నోసార్లు అమృతలతగారి ఆహ్వానం అందుకున్నా కూడా ‘నాకు కూడా పురస్కారం ఇవ్వండి’ అనే ఉద్దేశంతో ఆమె చుట్టూ తిరిగినట్లౌతుందేమో నన్న మొగమాటంతో ఎప్పుడూ వాళ్ళ సభలకు హాజరు కాలేదు.
 
          ఇంత ఆహ్లాద వాతావరణంలో జరిగిన ఈ సభ నన్ను ఆకట్టుకుంది. ఇంకెప్పుడు మిస్ కాకూడదు అనిపించింది.                        
 
          మాది గేటెడ్ కమ్యూనిటీ కావటం వలన అక్కడ ఎవరింట్లో పెళ్ళిళ్ళూ, పుట్టిన రోజులూ వంటివి ఏవి వచ్చినా అందరూ కలిసి ముస్తాబులై సంబరంగా జరుపుకుంటారు . మా ఫ్లోరులోనే అంతకుముందు అద్దెకు ఇచ్చిన ఇంటిని ఇంటి ఓనర్ ఖాళీ చేయించి ఆ ఇంట్లోనే కొడుకు పెళ్ళి చేయాలనుకుంటున్నారని తెలిసింది.
 
          మా ఫ్లోరంతా సందడి నెలకొంది.పెళ్ళికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకూ కొన్నింటికి నేను,పెళ్ళికి పల్లవి, ఆషీ వెళ్ళారు.పెళ్ళి హడావుడి తగ్గిన తర్వాత బంధువు లంతా ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అంతవరకు ఆ ఇంటామె గురించి తెలియలేదు. ఆ యింటి ఆమె డా.సుశీలమ్మగారనీ, గుంటూరు డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ గా ఉద్యోగానంతరం పదవీవిరమణ చేసారని తెలిసింది. మా బిల్డింగ్ లో జరిగే కార్యక్రమా లలో కలుస్తున్నా చొచ్చుకు పోయే స్వభావం నాకు లేనందున అంతకన్నా పరిచయం పెరగలేదు.
 
          బిల్డింగ్ లో జరిగే గణేష్ వుత్సవాలలో, ఇతరేతర సంబరాల్లో కలిసినప్పుడు పలకరించుకునే వాళ్ళం.
 
          ఉద్యోగరీత్యా వూపిరి సలపని పనులతో, పుట్టిన దగ్గర్నుంచి అదే వూర్లో వుండటంతో బిజీగా గడిచిన జీవితం ఆమెది. తర్వాత వున్న వూరు వదిలి రావటం ఒకవంక , స్నేహితులకూ, పిల్లలకూ దూరంగా వుండటం మరోవంకా, తెలియని పరిసరాలూ, మనుషులూ ఇంకొక వంకా సుశీల గారికి చెరువులో నుండి బయటపడిన చేపలా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒక్కసారిగా ఒంటరిగా అయిపోయింది. దాంతో డిప్రెషన్ లోనైనట్లుగా డల్ గా అయిపోయారు.
 
          ఆమెకు కూడా మేము రచయితలమని తెలిసి ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడారు. అప్పుడు పూర్తిగా మా గురించి తెలిసింది. మా గురించి చెప్పి ఆమెకు తెలిసిన సాహిత్య మిత్రులను కూడా మా గురించి వాకబు చేసారు. సుశీలగారి సహాధ్యాయి అయిన కవి, విమర్శకుడు పాపినేని శివశంకర్ గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు గ్రహీత కావటం వలన వీర్రాజు గారికి బాగా తెలిసిన వాడే. కడియాల రామ్మోహన్ రాయ్ గారికి మా కుటుంబం పట్ల చాలా గౌరవాభిమానాలు వున్నవారు. అందులోను నా కవిత్వం అంటే ఆయనకు ఇష్టం కూడా వుంది. ఏవో సభల్లో నా కవిత గురించి ప్రస్తావించానని ఫోన్ కూడా చేసి చెప్పేవారు. ఆయన సుశీల గారికి గురువుగారు. ఇలా మా ఇద్దరికీ అభిమానులు అయిన వాళ్ళు ఉండటం వలన కావచ్చు మాకు స్నేహం సులభంగా ఏర్పడింది.
 
          అప్పటి నుండి తరుచూ ఆమె మా ఇంటికి వచ్చే వారు. నేను అప్పుడప్పుడు వెళ్ళే దాన్ని. మా మధ్య సాహిత్యం గురించి ఎన్నెన్నో కబుర్లు దొర్లేవి.
 
          ఒకసారి ఆమె చేసిన విశ్వనాథ కిన్నెరసాని పై చేసిన ఎమ్ఫిల్, ముళ్ళపూడి వెంకటరమణ సాహిత్యం పై చేసిన పీహెచ్డీ పరిశోధనా ఆమె చూపించారు. అవి చూసి “మీకు పెన్షన్ బాగానే వస్తుంది కదా మీ పరిశోధనల్ని పుస్తకంగా వేసుకోవచ్చు కదా” అని వీర్రాజు గారు అన్నారు. అది సుశీలగారిపై మంత్రంలా పని చేసింది.
 
          వీర్రాజుగారినే తన పుస్తకానికి ముఖచిత్రం వేయమని కోరారు. ఈ మధ్య చాలా కాలంగా ముఖచిత్రాలు వేయటం మానేసారు. కాని ఆమె కోరిక కాదనలేక అందులోనూ సలహా యిచ్చింది తానే కనుక చాలా రోజులకు ముఖచిత్రం వేయటానికి కూర్చున్నారు.
 
          ఆమె డల్ గా వుంటూ బిల్డింగ్ లో కార్యక్రమాలకి కూడా పాలుపంచుకోకుండా ఇంటికే పరిమితం కావటంతో నాతో పాటు నేను వెళ్ళే సాహిత్య కార్యక్రమాలకు రమ్మని పిలిచే దాన్ని. ఆ విధంగా ఆమెకు జంట నగరాల్లోని రచయితలూ, రచయిత్రులూ, కవులు పరిచయం అయ్యారు.
 
          మీకు విమర్శ పట్ల మక్కువ కనుక కథలూ కవితలూ కాకపోయినా విమర్శ వ్యాసాలు రాస్తూ వుండొచ్చు కదా. మీకూ కాలక్షేపం, మనసుకు ప్రశాంతత కలుగుతుంది అనేదాన్ని. ఆమెకు అంతకుముందు నుండీ సాహిత్య రచన అలవాటు వున్నా నిస్పృహలో వుండటంతో రాయటం తగ్గిపోయింది.
 
          పుస్తకాలు ప్రచురణకు నిర్ణయించుకోవడంతో ప్రూఫుల దిద్దుబాటు పనులతో తిరిగి సుశీలగారు డిప్రెషన్ మూడ్ నుండి బయటపడ్డారు.
 
          నాకు కూడా సాహిత్యం గురించి మాట్లాడుకోవడానికి ఒక స్నేహితురాలు దొరికింది.
 
          కాత్యాయనీ విద్మహే ఫోన్ చేసి పెనుగొండలో ప్రరవే సభలకు నాకు నచ్చిన నా రచన గురించి మాట్లాడటానికి రమ్మని ఆహ్వానించారు. ఇంద్రగంటి జానకీ బాలను కూడా ఆహ్వానించామని చెప్పారు. జానకీబాలా, నేనూ ప్రరవే నిర్వహించే సమావేశాలు ఎక్కడ జరిగినా జంటకవుల్లా కలిసి వెళ్ళటం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇద్దరం ఇక్కడ ట్రైను ఎక్కిన దగ్గర్నుంచి తిరిగి వచ్చేవరకూ ఎన్ని ముచ్చట్లు చెప్పుకునేవారమో . సినీమాలూ, పాటలూ, సాహిత్యం, పత్రికలూ ఇలా ఎన్నో కబుర్లు. మా ప్రపంచమే వేరుగా వుండేది. మా గురించి తెలుసు కనుక ప్రరవే వాళ్ళు మా ఇద్దరికీ ఒకే చోట వసతి కల్పించే వారు.
 
          పెనుగొండలో మొదటి రోజు రెండవ సదస్సులో ఒకే వేదికపై ఇద్దరం పాల్గొన్నాం . నాకు నచ్చిన నా రచన కార్యక్రమంలో ఇద్దరం పాల్గొన్నాం. నేను “నాకు నచ్చిన నా రచన – యుద్ధం ఒక గుండె కోత “గురించి ప్రసంగించాను.
 
          ఆ రోజు సదస్సులు అయ్యాక అందరం మసకచీకటిలోనే దగ్గరలో వున్న ఒక ఆలయానికి వెళ్ళాం. ఆలయం అంతా గాజుతో కట్టిన దానిలాగా దీపకాంతి పడేసరికి రంగులీనుతూ వుంది. నా దగ్గర వున్న చిన్న ఫోన్ తోనే ఫొటోలు తీసాను. అక్కడ నుండి తిరిగి వచ్చి భోజనాలు చేసి మాకు ఇచ్చిన హాస్టల్ కి బయట కూర్చొని అందరం పన్నెండు గంటల వరకూ పాటలు పాడుకున్నాము . ఒకరిద్దరు వీథినాటకం వేసారు. పన్నెండు దాటాక నేనూ, జానకీ బాలా మా రూమ్ లోకి వెళ్ళి పడుకున్నాం .
 
          మర్నాడు ఉదయం సెషన్ అయ్యాక అందరం బస్ లో పోలవరం ముంపు ప్రాంతాలను చూడటానికి , అక్కడి ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళాం. పోలవరం ముంపు ప్రజలకు ప్రభుత్వం అందించిన సహాయాలు, రాయితీలు గురించి కొందరు చెప్తున్నారు. కొందరు బాధితులు దిగులు నిండిన కళ్ళతో అలాగే వున్నారు. చాలా మందితో మాట్లాడాము. నాకు అర్థమైనదేమిటంటే అక్కడ కూడా ప్రభుత్వానికి, బాధితులకూ మధ్య బాధితుల నుండే కొందరు దళారీలుగా మారి తమ జీవితాల్ని బాగు చేసుకుంటున్నారు. కొందరు బాధితులు అలాగే వుండిపోయారు. కొందరు అన్ని సౌకర్యాలతో పెద్ద ఇళ్ళను కట్టుకుని సుఖవంతంగా వున్నారు.
 
          నాకు గల ఆసక్తి వలన అక్కడ కనిపించిన ఒక స్కూల్ కి వెళ్ళాను. బయట బోర్డు మీద ప్రభుత్వ ఉన్నత పాఠశాల అని వుంది. లోపల ఒకే మాష్టారు, చిన్నచిన్న పిల్లలూ వున్నారు. ఆయన్ని అదే విషయం అడుగుతే బోర్డు తప్పుగా రాసారు అన్నాడు కొంచెం నాపై విసుగు ప్రదర్శిస్తూ. కొన్ని బడులు సంగతి తెలిసిన దాన్ని కదా నవ్వుకున్నాను. బహుశా ప్రభుత్వం నుండి హైస్కూల్ రాయితీలు పొందుతూ నడుస్తున్న ప్రాధమిక స్కూల్ అన్నమాట. ఆ మారుమూలకి సూపర్ విజన్ కి ఎవరూ రాకుండా చూసుకుంటార నుకుంటాను. మనం కట్టే పన్నుల్లో ఎంత శాతం ఇలా దుర్వినియోగం అవుతుందో కదా.
దారిలో కొందరు పిల్లలతో కూడా మాట్లాడాను. టాటా బైబై చెప్పి బయలుదేరుతున్నప్పు డు. ఒక చిన్న పిల్లాడు ” మేడం మీరు మా వూరిని, మమ్మల్ని దత్తత తీసుకుంటున్నారా” అన్నాడు. బహుశా అప్పుడే వచ్చిన శ్రీమంతుడు సినీమా ప్రభావం కావచ్చు. ఆ పిల్లాడి మాటలో, గొంతులో భవిష్యత్తు గురించి తొంగి చూసిన ఆశ నాలో చాలా కాలం వెంటా డింది. ఈ సందర్భాన్ని నేను ” రేపటి ప్రతిధ్వని ” అనే కథగా రాసాను. అది గోదావరి పత్రికలో ప్రచురితమైంది.
 
          అక్కడి నుండి నేనూ జానకీ బాల తణుకు వెళ్ళే బస్ ఎక్కాము. తణుకు జానకీ బాల చిన్ననాటి వూరు. అక్కడ ఆమెని ఎన్నాళ్ళ నుండో రమ్మని ఆహ్వానిస్తున్న తెలిసిన మిత్రుని ఇంటికి వెళ్ళాము.
 
          ఆ మిత్రుడు నన్ను వూరూ, పేరూ కనుక్కున్నాక “మీదే గోత్రం” అని ప్రశ్నించాడు. నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. నేను బ్రాహ్మలం కాదని చెప్పాను. అవునా అన్నాడు. తర్వాత జానకీ బాల స్నానం చేసి రావటంతో సంభాషణ మరోవైపు మరలింది. అతను కూడా రచయితే కానీ అతని సాహిత్య ధోరణి వేరు. పుస్తకాలు కూడా ఇచ్చాడు.
 
          స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యాక భోజనాలకు కూర్చున్నాం. నేను వాళ్ళపిన్నిలా వున్నానంటూ అతనిభార్య నాకు ప్రేమగా కొసరి కొసరి వడ్డించింది. కానీ నాకే అతని ప్రశ్న గుర్తు వచ్చి ఇబ్బందిగా అనిపించింది. వారి ఎదురింట్లో మాకు పడకలు ఏర్పాటు చేసారు.
పక్క మీద పడుకుని మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు జానకీబాలకి ఈ విషయం చెప్పాను. “అయ్యో అవునా సారీ సుభద్రగారూ అలా జరుగుతుందని అను కుంటే ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం పెట్టే దాన్ని కాదు “అని చాలా బాధ పడ్డారు.
 
          మర్నాడు ఉదయమే తయారై అలా ఎక్కడైనా కూర్చొని కబుర్లు చెప్పుకుందామని వూర్లోకి బయలుదేరాం. కానీ ఎక్కడా మాకు అనువైన స్థలం దొరకలేదు. కాసేపు అక్కడేదో గుడి కనిపిస్తే అక్కడ కాసేపు కూర్చున్నాం. కానీ ఆ రోజు గుడిలో ఏదో ప్రత్యేక పూజలు ఉన్నట్టున్నాయి. ఒకటే జనం. అక్కడ నుండి తిరిగి వాళ్ళింటికి వెళ్ళి లగేజీ తీసుకుని జానకీ బాల చిన్ననాటి స్నేహితురాలి ఇంటికి వెళ్ళాం. వాళ్ళు ఆ రోజుల్లో జమిందారీ కుటుంబమట. జానకీబాల తల్లిగారు వాళ్ళింట్లో అమ్మాయిలకు సంగీతం నేర్పేవారట. వాళ్ళు మా ఇద్దరినీ చాలా ప్రేమగా ఆహ్వానించారు. ఎప్పుడెప్పటి కబుర్లో వాళ్ళు చెప్పు కుంటుంటే వింటూ కూర్చున్నాను. తిరిగి ఆ సాయంత్రం మమ్మల్ని ట్రైనుకు ఎక్కించారు. ట్రైనులో మా కబుర్లు కొనసాగాయి. క్షేమంగా ఇద్దరం ఇంటికి తిరిగి చేరుకున్నాం.
 
          ఒకరోజు అమృతలతగారు ఫోన్ చేసి నిజామాబాద్ లోని వాళ్ళ నిర్వహణలో వున్న విజయా హైస్కూల్ టేలెంట్ షోకి గౌరవ అతిథిగా రమ్మని కోరారు. స్కూల్ లో జరిగే కార్యక్రమాలు పట్ల గల ఆసక్తితో సరే అన్నాను. మా ఆషీని కూడా తీసుకు వెళ్ళాలను కున్నాను. ఉదయమే ఏడుగంటలకు కారు తీసుకుని అమృతలతగారి మేనకోడలు వచ్చింది. అయితే దారిలో సినీతార సంగీతని పికప్ చేసుకోవాల్సి వచ్చింది. ఆమె చాలా ఆలస్యం చేయటంతో మేము చాలా సేపు రోడ్డు మీదే వెయిట్ చేయాల్సి వచ్చింది. నాకు రాజకీయనాయకులు, సినీతారలతో పొత్తులు నచ్చవు‌. అందుచేత ఆమెతో పెద్దగా కలవ లేక పోయాను. నిజామాబాద్ చేరేసరికి ఒంటిగంట దాటింది. స్కూల్లోనే భోజనం ఏర్పాటు చేసారు. నాన్ వెజ్ పదార్థాలు ఎక్కువగా పెట్టారు. నేను తిననని తెలిసి అమృతలతగారు ఇబ్బంది పడ్డారు. పరవాలేదని చెప్పి పప్పు, పెరుగులతో కానిచ్చాను. నేను తినలేదని అమృతగారు కూడా నాన్ వెజ్ తినలేదు.
 
          తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాక తయారై కార్యక్రమానికి వెళ్ళాము. విద్యార్థు లు చేసే అద్భుత నృత్యాలతో కార్యక్రమం ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది. అమృతలత అపురూప అవార్డులు సభ ఎంత హృద్యంగా జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా అమృతలతగారి డిసిప్లిన్, అభిరుచీ, పాఠశాల సిబ్బంది టీమ్ వర్క్ ప్రతీది అద్భుతంగా వ్యక్తమయ్యాయి. ఆ రాత్రి వాళ్ళింట్లోనే బస. మర్నాడు ఉదయం టిఫిన్ ల తర్వాత అపురూప దేవాలయానికి తీసుకు వెళ్ళారు. ఇంకా కొన్ని నిర్మాణాలు జరుగు తున్నాయి. ఎందుకు నిర్మించారనే విషయాన్ని అమృతగారు వివరించారు.
 
          ఆ రోజు ఆర్మూర్ స్కూల్ లో కార్యక్రమం వుంది. ఉండమని అన్నారు కానీ తిరుగు ప్రయాణానికి బయలుదేరి పోయాము.                  
 
          తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి సారథ్యంలో ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ ఏర్పాటైంది . కేవీ రమణాచారి, అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ, దేశపతి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ సభ్యులు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలో
2017, డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచా నికి తెలియచేయాలనే సంకల్పంతో నిర్వహించారు. ఈ సమావేశాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తో ముగింపు చేసారు.
 
          ఈ సభల్లో రెండు రాష్ట్రాలకు చెందిన కొందరు ప్రముఖులను సత్కరించారు. బహుశా సిథారెడ్డిగారు తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ కావటం వల్ల కావచ్చు ఈ వీర్రాజుగారిని కూడా గౌరవంగా సత్కరించారు.
 
          ఒకరోజు వుదయమే కళ్యాణ్ నుండి ఫోన్ వాళ్ళమ్మ అంటే మా చిన్నక్క చనిపోయిం దనే వార్త. రంజనా కొడుకు అనురాగ్ కు నాన్నమ్మ మీద చేరిక, ప్రేమ ఎక్కువ. ఇక్కడ ఎంబీయే చదువుతున్నాడు. అందుకని అతను లేకుండా కార్యక్రమం చెయ్యటం కష్టమని, అతన్ని తీసుకుని ఫ్లైట్ లో రమ్మని కళ్యాణ్ చెప్పాడు. వెంటనే మా ఇద్దరికీ పల్లవి ఫ్లైట్ బుక్ చేసింది. ఈలోగా అనురాగ్ హాస్టల్ నుండి వచ్చాడు. గుమ్మంలో అడుగు పెడుతూనే ఏడుపు మొదలెట్టాడు. అనురాగ్ దుఃఖాన్ని ఆపటం కష్టమైంది.
 
          చిన్నక్కతో నాకు మానసిక బంధం ఎక్కువే. ఏ కష్టమొచ్చినా, దుఃఖమొచ్చినా ఒకరితో ఒకరం పంచుకునేది మేమిద్దరమే. నాకున్న ఒకే ఒక్క రక్తసంబంధం ఆమెనే. పెద్దన్నయ్య ఉన్నాడు గానీ లేనట్టే. అంత బంధం వున్నా నా కంటి నుండి నీళ్ళు రాక పొందటం నాకే ఆశ్చర్యం అనిపించింది. బహుశా ఎన్నో మరణాలు చూడటం వల్ల కొంతకాలానికి దుఃఖానికి అతీతులం అవుతామేమో.
 
          నేనూ, అనురాగ్ ఇద్దరం ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి , వైజాగ్ చేరేసరికి పన్నెండు దాటింది. అక్కడ మిమ్మల్ని పికప్ చేసుకుని కోరుకొండ చేరేసరికి మరో గంటన్నర. అంతవరకూ అనురాగ్ ని మామూలు స్థితికి తీసుకు రావటానికి నేను ఎంతగా కబుర్లు చెబుతున్నా మౌనమునిలా వుండిపోయాడు. అక్కడకు వెళ్ళాక ఎలా పట్టుకోగలుగుతామో అని సందేహించాను.
 
          ఎట్టకేలకు ఇల్లు చేరాము. నిశ్తలంగా వున్న అక్కని చూస్తూ ఉంటే ఆమె జీవిత మంతా కళ్ళముందు మెదిలింది.
 
          నాన్నగారు పోయిన అనంతరం ఆర్థిక ఇబ్బందులూ, కోటబొమ్మాళి వెళ్ళడం, అక్కడ మా మాష్టారుని ఇష్టపడటం, మేమంతా పెద్దక్క ఇంటికి చేరటం, తదనంతరం పరిస్థితులు కొంతవరకూ చక్కబడి, మాష్టారి పట్టుదలతోనూ, పెద్దక్క పూనుకోవటంతోనూ మాష్టారుతో చిన్నక్కకు వర్ణాంతర వివాహం జరగటం బంధువులంతా వాళ్ళిద్దరితోపాటూ మమ్మల్నందరిని దూరం పెట్టడం గుర్తు వచ్చింది. ఆ రోజుల్లోనే పట్టుదలగా వర్ణాంతరం చేసుకొని వారి ప్రేమను సఫలం చేసుకొని పెట్టమని ఆరేడు సంవత్సరాలు కూడా తిరగకుండానే, అక్కనీ, ఇద్దరు పసిపిల్లలనీ వదిలి హార్ట్ ఎటాక్ తో బావగారు పోయారు. ఆ పరిస్థితుల్లో బావగారు ఉద్యోగం చేసిన కోరుకొండ సైనిక్ స్కూల్ లోనే ఉద్యోగంలో చేరి ఒంటరి పోరాటంతో ఇద్దరు పిల్లలను వృద్ధిలోకి తెచ్చింది. జీవితంతో పోరాటం చేసి చిన్నక్క కొడుకూ, అనుకూలవతి ఐన కోడలు జయ ప్రేమలో సేద తీరింది. ఆమెకున్న బెంగంతా కూతురు జీవితం గురించే. నీళ్ళు నిండిన కళ్ళతో ఆమెని చూడలేకపోయాను.
 
          సైనిక్ స్కూల్ లో ఉద్యోగం చేయటం వలనా, వార్డెన్ గా అంకితభావంతో పని చేయటం వలనా, సుమారు యాభై ఏళ్ళ పాటు అక్కడే కేంపస్ లో ఉండటం వలన అందరి ప్రేమాభిమానాలు చూరగొంది. అందుకే స్టాఫ్ తో సహా అందరూ కదలి వచ్చి సైనిక లాంఛనాలుతో గాలిలోకి తుపాకులు పేల్చి గౌరవవందనంతో ఆమెకి వీడ్కోలు పలికారు. నిజానికి అందరి అభిమానాన్ని పొందటం కన్నా జీవితంలో అంతకన్నా ఏమి కావాలి.
 
          రంజన దుఃఖంతో దిగులు పడిపోయింది. ఆమెను ప్రేమగా ఆలింగనం చేసుకుని ఓదార్చాను.
 
          తల్లి భరోసాతో ధైర్యంగా గడుపుతున్న రంజనను తల్లిలా దగ్గరకు తీసుకుంది జయ.
 
          మూడురోజులు వుండి నేను తిరిగి వచ్చేసాను. దశదిన కర్మలకు పిల్లలకీ ఆషీ వెళ్ళారు. గడిచిపోయిన బంధాలు తలపోసుకుంటూ నేను ….

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.