కనక నారాయణీయం -75

పుట్టపర్తి నాగపద్మిని

చిలుక ద్వాదశి రోజు. తులసి కోట చుట్టూ దీపాలు పెట్టి, శాస్త్రోక్తంగా పూజ, శ్రీ సూక్త, పురుష సూక్తాలు చెప్పుకుని, తులసి చెట్టు మొదల్లో పెట్టిన లక్ష్మీనారాయణ విగ్రహాల మీద పూలు, అక్షతలూ వేసి, పాటందుకుంది కనకమ్మ.

        బృందావనమే మందిరమైన ఇందిర శ్రీ తులసీ!

       నందనందనుని ప్రియ సతివై అందముగా మా ఇంటను నెలకొన్న….బృందావనమే…

  1. గృహమునకందము బృందావనమూ  దేహమునకు   తులసిదళమూ

       నీవున్నదె నందనవనమౌను నీ దళసేవయె రోగహరమూ… బ్రందావనమే..

  1. పడతులు తీర్కాణ ద్వాదశినాడూ నడిమింటను నిను కొలువుంచీ

పట్టుచీరె కట్టి బొట్టుకాటుక పెట్టి సుష్టుగ పూల పూజించెదరమ్మ…. బృందావనమే..

  1. వరలక్ష్మీ! శ్రీతులసీ! నీ యెడ పరమ భక్తులౌ పడతులకెల్లను

       ఇష్టమాంగల్యములిచ్చి బ్రోచెదవు అష్టాక్షరి నాయకి ! దరహసితే! .. .బృందావనమే….

అమ్మ తన్మయత్వంతో పాడుతూ ఉంటే, తానూ భక్తిగా కళ్ళు మూసుకుని కూర్చుని వుంది నాగ. పాట పూర్తయింది. టెంకాయ తెచ్చుకోలేదని గుర్తుకు వచ్చింది కనకమ్మకు!

‘ఇదిగో నాగా! ఎదురింటి కోమటి అంగట్లో టెంకాయ తీసుకుని రాపో!’

పరుగులు పెడుతూ రోడ్డు దాటి అటువైపున్న కోమటి అంగడిలోకి వెళ్ళింది నాగ.

కోమటాయన కనిపించలేదు.

ఎదురుగా సీసాల్లోంచీ కనిపిస్తూ నోరూరిస్తున్న పప్పుల ఉంటలుకేసి (పప్పులు బెల్లం పాకంలో వేసిన ఉండలు) చూస్తూ నిలబడింది కాసేపు.

ఇంతలో లోపలినుంచీ కోమటాయన ఇల్లాలు బైటికి వచ్చింది.

‘ఏం కావాలమ్మా?’

ఆమె ప్రశ్న విన్న షాపాయన కింద కూర్చుని వున్నాడేమో ఏదో సర్దుతూ, చటుక్కున లేచి నిలుచుని నాగను చూసి, కళ్ళెగరేశాడు.

చేతులో ఉన్న ఐదు రూపాయల నోటు చూపిస్తూ ‘టెంకాయ..’ అంది.

కోమటాయన ఇల్లాలు షాప్ బైట అరుగు మీద పెట్టిన టెంకాయల సంచీలో నుంచీ ఒకటి తీసి, చేతుల్లో మట్టిగాజులు గలగల మంటుంటే, వంగి, ఒక టెంకాయ తీసి, శుభ్రంగా  పీచు తీసి, చేతికిచ్చింది.

నీళ్ళున్నాయా అని చెవి దగ్గర పెట్టుకుని ఆడించి చూసింది నాగ.

‘రూపాయిన్నర.’ లోపలున్న భర్తకు చెప్పింది, ఐదు రూపాయల్లో ఒకటిన్నర పోతే, తక్కిన మూడున్నర రూపాయల డబ్బు తిరిగివ్వాలని సూచిస్తూ!!

కోమటాయన జాగ్రత్తగా మూడు ఒక  రూపాయి  నాణాలు, ఆరు అణాల నాణాలు ఎనిమిది చేతులో పెట్టాడు. అప్పట్లో 6 పైసలు ఒక అణా. నాలుగణాలు, ఒక పావలా. ఎనిమిదణాలు అర్ధ రూపాయి. అమ్మెప్పుడో చెప్పినట్టు గుర్తు,

‘అణాలు తీసుకోవద్దు, పావలా నాణెమే కావాలని అడుగు..’ అని! అణాలు తీసుకుంటే మనం నష్టపోతామట! అదేమిటో!!

‘పావలా లేదాన్నా?’

‘లేవమ్మా, అన్నీ అణాలే ఉన్నాయి. ఇదిగో, ఈ పప్పులుండ తీసుకో, దానికి బదులు.’

అని చటుక్కున పప్పులతో చేసిన బెల్లపు ఉండ ఒకటి  గాజు జార్ నుంచి తీసిచ్చాడతను.

పప్పులు బెల్లం ఉండ నోరూరిస్తూ ఉంది. అమ్మ చెప్పిన మాట మర్చిపోయింది నాగ. ఇలా ఇవ్వగానే అలా తీసుకుని, నోట్లో పెట్టేసుకుని, టెంకాయ పట్టుకుని రోడ్డు దాటి ఇంట్లోకొచ్చేసింది. చిల్లర పక్కన పెట్టేసి,

నాగ బుగ్గన బెల్లం ఉండ చూసి, నవ్వుకుంటూ, కనకమ్మ తులసికోట దగ్గర టెంకాయ కొట్టి, తులసెమ్మకు సమర్పించి మంగళహారతి పాటందుకుంది.

నాగ బుగ్గనున్న బెల్లం ఉండను ఆస్వాదిస్తూ, భక్తి ఎంత తియ్యగా ఉంటుందో అంచనా వేస్తున్నట్టు, కళ్ళూ మూసుకుని నిలబడింది.

***

నాగ తన స్నేహితురాలు రామసుబ్బలక్ష్మి (చిట్టి అని ముద్దు పేరు) ఇంటినుండీ తాడాట ఆడుకుంటూ వస్తూ ఉంటే, తమ ఇంటి ముందు  అంబాసిడర్ కారు ఆగిఉండటం చూసింది. అంటే ఇంటికి బంధువులొచ్చారన్న మాట!

ఆ..ఔను…ఆ కారు కడప కాలేజీ ప్రిన్సిపాల్ సంపత్ గారిది. అంటే, వాళ్ళింట్లో ఏదో పేరంటానికి తమను పిలిచేందుకు వచ్చారన్న మాట! వాళ్ళు తమకు దూరపు చుట్టాలంట! అమ్మ చెబుతూ ఉంటుంది. వాళ్ళింటినుంచీ ఎవరైనా వస్తే, రెండు మూడు డజన్లు అరటి పళ్ళు ఇంటికొచ్చినట్టే! నాగ నోట్లో నీళ్ళూరాయి. వాళ్ళింట్లో అరటి తోటే ఉందనుకోవాలి మరి. ఎప్పుడూ గెలలు వేలాడుతూనే ఉంటాయి. దానికి తోడు పెద్ద పెద్ద టెంకాయ చెట్లు కూడా! కడప రైల్వే స్టేషన్ దగ్గర, ఎర్రముక్క పల్లెలో విశాలమైన ఇల్లు వాళ్ళది. వాళ్ళింటికి వెళ్ళడమంటే తనకు భలే ఇష్టం. కారణం, వాళ్ళింట్లో పెద్ద చెక్క ఉయ్యాల ఉంది. ఎన్ని సార్లు ఊగినా అదిలించేవాళ్ళుండరు.

ఉత్సాహం మరీ ఎక్కువై, తాడు చేత్తో పట్టుకుని పరుగులు పెడుతూ ఇంటికొచ్చింది నాగ.

పడసాలలో ఉన్న కుర్చీ మీద, తమ బంధువు సంపత్ గారి శ్రీమతి కూర్చుని వుంది.

చాలా అందగత్తె ఆమె.

తెల్లగా, పొడుగ్గా, ఎత్తుకు తగ్గ లావు, వర్చస్సున్న ముఖం, వజ్రం ముక్కుపుడక తళతళలాడుతూ ఉంటే, చేతుల్లో ధరించిన నాలుగు నాలుగు బంగారు గాజులు ఆడిస్తూ చిరునవ్వుతో ఏదో చెబుతూ ఉందామె!

పక్కనే తొమ్మిది గజాల చీరెలో భుజాల మీదుగా కొంగు కప్పుకుని చిరునవ్వుతో ఆమె మాటలు వింటూ నిలుచుని ఉన్న అమ్మ!

ఆమె ఏదో అడిగింది, దానికి సమాధానంగా అమ్మ..

‘కరుణా, తరులతా అంతా బాగానే ఉన్నారమ్మా! ఇదుగో, తులజ ఇంకా హిందీ ప్రేమీ మండలినుంచీ రాలేదు. అందరికంటే చిన్నది రాధ, పక్కింటి గుడిపాటవ్వతో శివాలయానికిపోయింది. ఇదిగో, ఇది నాగపద్మిని.

రామకృష్ణా హైస్కూల్ లో ఆరవ తరగతి. ఏముందింక! ఆయనెప్పుడూ రాతకోతల్లో మునిగే ఉంటారు. నాకు తప్పదు, ఇంటా బైటా ..అన్నిపనులకూ నేనే!’

నాగ శ్రద్ధగా వాళ్ళమాటలు వింటూ ఉంది.

‘నిజమే కనకమ్మా! మా ఆయనా అంతేలే! కాలేజీలో ప్రిన్సిపాల్ గా ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తారో తెలుసు కదా! ఇంటికొస్తేనైనా ఇంటి విషయాలు పట్టించుకుంటారా అంటే ఊహూ..కాసేపు శ్రీశ్రీ, కాసేపు విశ్వనాథ..

కాసేపు, తన రచనలు..విశ్వనాథ విజయము అని ఒక కావ్యం రాశారుగా! దానిగురించి ఎవరో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇంకా పాత కాలం ముచ్చట్లు ఉండనే ఉంటాయి కదా!!  మా అమ్మెప్పుడూ నాకు తోడుగా ఉంటుంది కాబట్టే ఇటువంటి పనులు చేసుకోగలుగుతున్నా! లేకపోతే నావల్లయ్యేదా చెప్పు? ఇంతకూ తప్పకుండా రావాలమ్మా, ఆరోజు! మీ దంపతులు మా పిల్లను ఆశీర్వదిస్తే, ఇంకేమి కావాలి మాకు?’

‘ఎంతమాటమ్మా! తప్పకుండా వస్తాము.’

అమ్మ వంటింట్లోనుంచీ కుంకుమ భరిణె తెచ్చి ఆమె ముందు పెట్టింది. చిరునవ్వుతో ఆమె అందులోంచీ కుంకుమ తీసి పెట్టుకుని, కుర్చీలోనుంచీ లేచింది, వెళ్ళేందుకు!

నాగ తలమీద చేయి వేసి ప్రేమగా అందామె,’నువ్వూ రావాలారోజు, మా ఉయ్యాల అడుగుతూ ఉంది, నువ్వెప్పుడొస్తావని?’

నాగ సిగ్గుపడుతూ అమ్మ చాటుకు చేరుకుంది.

అమ్మతో వీధి తలుపుదాకా వెళ్ళి ఆమె కారులో కూర్చోగానే నవ్వుతూ నిలబడ్డారు. కారు మెల్లిగా కదిలింది. నవ్వుతూ చేతులూపుతూ వీడుకోలు పలికారిద్దరూ!

వాళ్ళ అంబాసిడర్ కారటు వెళ్ళి. వీళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చిన కాసేపటికి, పుట్టపర్తి ఇంట్లోకొచ్చి కుర్చీలో కూర్చుని, నాగా, చెంబులో మంచినీళ్ళు తీసుకురా!’ అని ఆజ్ఞాపించారు.

నాగ బదులు కనకమ్మ నీళ్ళు పట్టుకొచ్చి పుట్టపర్తి దగ్గరున్న టెబుల్ మీద పెట్టి, కాస్త దూరాన నిలుచుని అంది.

‘శంఖవరం సంపద్రాఘవాచార్యుల వారి భార్య వచ్చి పోయిందిప్పుడే! వాళ్ళమ్మాయి బెంగుళూరులో పెద్ద చదువుకోసం పోతూ ఉందంట! మీ దంపతులొచ్చి ఆశీర్వదించాలమ్మా! అనింది. వచ్చే శుక్రవారం సాయంత్రం రమ్మని చెప్పిందామె! చాలా కలుపుగోలు మనిషి. భేషజమేమాత్రమూ లేదు పాపం!’

ఆమె మాటలకు తల పంకిస్తూ అంగీకారం తెలిపారు పుట్టపర్తి. దూరపు చుట్టం యీ శంఖవరం సంపద్రాఘవాచార్యులు. అంతకు మించి అయ్యకు మంచి స్నేహితుడు. కవితం వ్రాయడమే కాదు, మంచి సాహితీ విశ్లేషకుడు కూడా! దానికి తోడు, అదృష్టం బాగుంది కాబట్టే, పెద్ద చదువు చదివి, ఇప్పుడు కడప కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు. తన రచనలంటే కూడా బాగా ఇష్టపడతాడాయన! కాకపోతే శ్రీశ్రీ పట్ల మక్కువ ఎక్కువ! లోకో భిన్న రుచి: మరి!

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.