ఒక స్త్రీ అపూర్వకృత్యాలు

एक स्त्री के कारनामे

హిందీ మూలం – – డా. సూర్యబాల

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

[ఈ కథలో, ఎటువంటి లోటు లేకుండా, అన్ని సౌకర్యాలతో, సదుపాయాలతో ఉన్న ఒక సంపన్నకుటుంబంలోని ఇల్లాలు తన భర్త నుండి తనపట్ల ప్రేమాభిమానాలు, ఆప్యాయత, ఆత్మీయత కరువైన కారణంగా, చివరికి ఆయన తనతో మాట్లాడటం కూడా దాదాపు లేకపోవడంవల్ల బయటికి అంతా సహజంగా, సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ, ఆయన పెడుతున్న క్షోభని లోలోపలే సహించుకుంటూ, మధ్యమధ్యలో పొంగిపొర్లుతున్న తన ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, బాధని తనలోనే అణచుకుంటూ, మానసికంగా అంతర్మథనం చెందుతూ, అందరూ దేవుడిలాంటివాడని తన భర్తని మెచ్చుకుంటూవుంటే భరిస్తూ కాలం గడుపుతోంది. ఇది తను ఉన్న పరిస్థితిపట్ల ఆవిడ వ్యంగ్యభరితమైన స్వగతంతో కూడిన ఒక వ్యంగ్యరచన (సెటైర్) అని రచయిత్రి స్పష్టం చేశారు. – అనువాదకర్త]

నేనొక సగటు ఒడ్డు-పొడుగు ఉన్న ఇంచుమించు అందమైన ఆడదాన్ని. నన్ను మహిళ అంటే ఎక్కువ బాగుంటుంది. చదువుకున్న, మర్యాదగల, నెమ్మదిగల, బుద్ధిమంతురాలిని. తెలివితేటలున్నదాన్ని. వివాహితను. ఇంచుమించు తెల్లగా, స్ఫురద్రూపిగా, ఆరోగ్యంగా, మొత్తం అయిదడుగుల పదకొండు అంగుళాల పొడుగున్న, మృదువుగా, మితంగా మాట్లాడే ఒక భర్తకి భార్యని. మరి పిల్లలు? ఉన్నారు కద. కూతురు కూడా, కొడుకులు కూడా. అదృష్టంకొద్దీ సమయానికి, సౌకర్యంగా జన్మించి, చక్కని పోషణతో పెరిగినవాళ్ళు. వినయవిధేయతలతో, కుశాగ్రబుద్ధితో ఉన్నవాళ్ళు, అంతేకాక సమయానికి హోంవర్కు చేసుకునేవాళ్ళు కూడా… ఒక భర్త, ఇద్దరు పనిచేసే అమ్మాయిలు, ముగ్గురు పిల్లలతో ఉన్న ఈ బృందం అడుగడుక్కీ ముందుకి వెడుతూ, ఇంచుమించు ప్రతి అడుగుకీ సంతోషాన్ని తెలిపే పాటలు పాడుకుంటూ పురోగమించడానికి సరిపడా సంపన్నత, సౌకర్యాలు ఉన్నాయి. అంటే చదువుసంధ్యలు, ట్యూషన్, టర్మినల్… అన్నీ సౌకర్యవంతంగా, ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నాయి. మొత్తం జీవితం అంతా.

నేను డబ్బు ఎంత అడిగితే అంత మావారు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళదలుచుకున్నా వెళ్ళనిస్తారు. ఎప్పుడూ ఆపరు, అడ్డుచెప్పరు. అడగరు, ప్రశ్నించరు.

ఎప్పుడైనా ఆయన్ని కూడా ఎక్కడికైనా రమ్మంటే నాతో వస్తారు. రానని ఎప్పుడూ అనరు. భోజనం కూడా ఎప్పుడూ నిరాడంబరంగా, ఆరోగ్యప్రదంగా ఉండేలా చేస్తారు. ఎప్పుడైనా ఒకే రకమైన వంటకాలు మళ్ళీ మళ్ళీ చేయడం జరిగితే నేను క్షమించమని అడిగే మూడ్ లో నెమ్మదిగా `సారీ’ అంటే ఆయన చాలా నెమ్మదిగా `ఇట్సాల్ రైట్’ అని తన వంతు లేదా టర్న్ ముగిసినట్లుగా ప్రకటిస్తారు. లేకపోతే, సామాన్యంగా ఇతరుల ఇళ్ళలో కాస్తంత ఉప్పు తక్కువైనా, కొంచెం కారం ఎక్కువైనా, దానికి ఎంతగానో రాద్ధాంతం చేసే భర్తలని నేను చాలామందిని చూశాను. ముందు రాద్ధాంతం మొదలవుతుంది. తరువాత భూకంపం వస్తుంది. దాని పిమ్మట బతిమాలుకోవడం, సర్దుకోవడం. మొత్తం నిత్యకల్యాణ కార్యక్రమం పూర్తికావడానికి ఒకటి-రెండు గంటలు పట్టనే పడుతుంది. …అప్పుడేకదా అంతా చెప్పుకునేది మా ఆయన మనిషికాదు, దేవుడని.

ఇంటికి మూడు పేపర్లు వస్తాయి. రెండు ఫోనులు, ఒక కలర్ టీవీ ఉండనే ఉన్నాయి. ఆయన ఆఫీసు టైముకి ముందు, తరువాత కూడా మొత్తం అన్ని పేపర్లు చదువుతారు. దానితోబాటు టీవీ కూడా నడుస్తూ ఉంటుంది. ఏ ఛానెల్లో ఏం వస్తుందో దాన్ని చూస్తారు. నడుస్తున్న ఛానెల్ ని నడవనిస్తారు. ఏ కార్యక్రమం వస్తున్నా దాన్ని వస్తూ ఉండనిస్తారు. ఎప్పుడూ ఇబ్బంది పడరు. ఆయనకి సమయం గడవడం ఎలా అన్న సమస్య లేనే లేదు. సమయం అనేది తనంతట తానే గడుస్తూ ఉంటుంది. … లేకపోతే `టైమ్’ లేదా సమయం అనేదాన్ని ఎంతమంది దీన్ని ఎలా గడపాలి, దీన్ని ఎలా మిగుల్చుకోవాలి అని తాపత్రయ పడుతూ ఉంటారు. మావారికి ఇటువంటి నిర్ణయించుకోలేని పరిస్థితి ఏదీ ఎప్పుడూ బాధించదు. ఇటువంటి ప్రతి సమస్యకి పరిష్కారంగా సాక్షాత్తు తానే స్వయంగా ఒక ఉదాహరణ. ఈ కారణంగానే అందరూ ఆయన్ని మనిషి కాదు, దేవుడంటారు.

కాని నా గురించి నేను ఏం చెప్పను? చెప్పాలన్నా సిగ్గుగా ఉంది. ఆయన దైవత్వాన్ని జాగ్రత్తగా సంరక్షించుకునే తెలివి కూడా నాకు లేదు. ఆయన ఎంతగా దేవుడిగా అనిపించుకుంటారో, నేను అంతగానే ఏమీ తెలియని మనిషిని అవుతున్నాను. నవ్వితే పకపకా నవ్వుతూనే ఉంటాను. ఏడిస్తే హద్దూ-పద్దూ లేకుండా శ్రావణ-భాద్రపదాల జల్లుని కురిపిస్తాను. ఇంక కోపం వస్తేనో… అది ఎప్పుడూ నాకు ముక్కు మీదనే ఉంటుంది. అదికూడా కారణం లేకుండానే. ఏదయినా కారణం ఉన్నా, లేకపోయినా అగ్గిబరాటాలాగా మండిపడుతూ ఉంటాను. తరచు ఏమన్నా విషయం ఉన్నా లేకపోయినా కూడా. దేవుడిలాంటి నా భర్తమీద కూడా. పొరపాటు నాదేనని నాకు బాగా తెలుసు. అయినా ఆయన శాంతంగా (నేను ఏ విషయంలో మండిపడ్డానో అది గ్రహించకుండానే) అసలు సంగతేమిటో తెలుసుకోకుండానే, అర్ధం చేసుకోకుండానే ఎప్పుడయినా “ఇట్స్ ఓ.కే.” అంటారు. మరొకప్పుడు “సో సారీ…” అంటారు. ఇరుగుపొరుగు వాళ్ళు ఎప్పుడూ ఆయన మాట బయటికి వినిపించదని అంటూవుంటారు. నిజమే మరి. ఇంట్లోనే ఎవరికీ వినిపించనప్పుడు బయటివాళ్ళకి మాత్రం ఎలా వినిపిస్తుంది.

నేను చెప్పేది నమ్మండి. సెలవురోజున ఆయన బయటికి వెళ్ళడానికి బయలుదేరుతూ కనిపిస్తే నేను ఉండబట్టలేను. వెంటనే అడిగేస్తాను- “ఎక్కడికయినా వెడుతున్నారా?”

“అవును…”

“ఎక్కడికి?”

“బయటికి.”

“బయటికెక్కడికి?”

“ఒకళ్ళని కలుసుకునేందుకు…”

“ఎవరిని?”

“ఆయన నీకు తెలియదు…”

“అలాగా. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తారు?”

“తొందరగానూ రావచ్చు. లేకపోతే ఆలస్యం కూడా కావచ్చు.”

అదే, నేను ముందే చెప్పాను కదా ఆయన మృదుభాషి అని, మితభాషి అని. ఇందులో ఏమన్నాకోపం తెప్పించే విషయం ఉందంటారా మీరే చెప్పండి. లేదు కదా? అయినా కూడా నేను తగువుకి సిద్ధమవుతాను. ఆయన మంచితనాన్ని అటక మీద పెట్టి గొడవ పెట్టుకుంటాను. ఒకసారయితే నేను తిన్నగా కంప్లయింట్ చెయ్యడానికి ఉపక్రమించాను, “మీరు నాతో ఎప్పుడూ అసలు మాట్లాడటమే లేదు. మొత్తం టైమంతా పేపరు, టీ.వీ., కంప్యూటరు, ఫోన్ లకే. …..”

ఆయన పేపరు మూసేసి, టీ.వీ. కట్టేసి వివేకంతో కూడిన స్వరంలో అన్నారు- “ఓ. సారీ… సరే, చెప్పు ఏం మాట్లాడను?”

ఇప్పుడింక ఇది అనుకూలంగా ఉండటానికి తారాపథం అయిపోయింది కదా, ఆయనంతట ఆయనే తనతో ఏం మాట్లాడమంటావో చెప్పమని అంటున్నారు. కాని, సరయిన సమయానికి నా తెలివి తెల్లవారిపోతుంది. కంగారుపడుతూ, నేను ఈయనకి దేని గురించి నాతో మాట్లాడమని చెప్పనా అని ఆలోచనలో పడ్డాను. ఆయన ఎదురుచూస్తున్నారని, చెప్పడానికి నాకేమీ స్ఫురించడంలేదని కూడా కంగారుగా ఉంది.

తడబడుతూ నేను చెప్పాను- “అరే, ఏమీ లేకపోతే కనీసం ఇవాళ రోజంతా ఆఫీసులో ఎలా గడిచిందని. రోజుమొత్తంలో ఏమేం జరిగాయని. అదే కాస్త. ….”

“ఓ…యస్…” ఆయన జ్ఞాపకం తెచ్చుకునేందుకు ప్రయత్నించి, స్థిరభావంతో చెప్పడం మొదలుపెట్టారు. నేను శ్రద్ధగా వినసాగాను. ఆయన ఉదయం ఆఫీసుకి చేరుకునేసరికి ప్యూన్ ప్యారేలాల్ ఎప్పటిలాగానే మరో ప్యూన్ కామతా దగ్గరికి ఖైనీ (చాలామంది అలవాటుగా వాడే ఎండిన పొగాకుతో సున్నం కలిపి చేసిన చూర్ణం) అడగటానికి వెళ్ళిఉన్నాడు. ఆపరేటర్ కూడా ఆలస్యంగా వచ్చింది. ప్యాకింగ్ లో పదిన్నర నుండి `గో-స్లో’ మొదలయింది. అందువల్ల మామూలు పద్ధతి ప్రకారం మూడున్నరకి అయిపోవలసిన లోడింగు అయిదు గంటల నలభైఅయిదు నిముషాలవరకు నడిచింది. బయట నిలబడివున్న ట్రక్కులు ఎక్కువ ఎదురుచూడవలసి వచ్చింది…. వీటన్నిటిమూలంగా ప్యాకింగ్ డిపార్టుమెంటుకి, లోడింగు చేసేవాళ్ళకి మధ్య ఉద్రిక్తత నెలకొంది…. క్యాషియర్ బారువా సెలవు పొడిగించాడు. చాలా బిల్లులకి పేమెంటు ఆగిపోయింది. కెమికల్ ల్యాబ్ అసిస్టెంటు మఖీజా ఇవాళ మళ్ళీ వాక్సీన్ కల్చర్ దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. … మధ్యలో గంటన్నరసేపు కరెంటు పోయింది. … రహమత్ గంజ్ ట్యాంకరుకి బ్రేక్ డౌన్ అయింది. మూడున్నర నుంచి బడ్జెట్ మీటింగు మొదలయింది. అంతేకాక…– అనుకోకుండా నాకు మత్తు వదిలింది. ఆయన అడుగుతున్నారు… ఇంకా చెప్పమంటావా లేకపోతే ఇవి సరిపోతాయా?

అబ్బా… ఆయన్ని మాట్లాడమని నేనే అడిగానన్న సంగతి నేను మరిచేపోయాను. నేను చెప్పినదానికి ఆయన ఇంతసేపూ రోజంతా జరిగిన కార్యకలాపాలని వివరిస్తున్నారు. బహుశా నేను మధ్యలో వచ్చిన కునికిపాట్ల కారణంగానూ, మరేదో ఆలోచించడం మొదలుపెట్టినందు వల్లనూ మొత్తంమీద ఒకటి-రెండు వాక్యాలకన్నా ఎక్కువ సరిగా విని అర్థం చేసుకోలేకపోయాను. ఇది నా అవివేకానికి హద్దులేకుండా పోయి, నేనే అడిగినప్రశ్నలకి జవాబు వినడానికి బదులు ఒకపక్క ఆవలింతలు వస్తూ వుంటే, ఇంకేదో ఆలోచిస్తూ కునికిపాట్లు పడుతూ ఉండిపోయాను… కాని ఆయన మాత్రం ఇంకా ఏమైనా చెప్పుకుందామా అని అడుగుతున్నారు…

ఓటమి అంగీకరించలేక నేను మరో మార్గం అనుసరించాను, “ఇంకేం వద్దులెండి. మీరు అలిసిపోయి ఉంటారు. నేను చాయ్ పెట్టి తీసుకొస్తాను. పెట్టి తీసుకురానా?”

నేను వద్దని చెప్పాక, ఆయన నిశ్చింతగా టీ.వీ. చూస్తూ కూర్చున్నారు. నేనన్నది ఆయనకి వినపడలేదు. నేనే కాస్త ఆగి ఎదురుచూశాను. మళ్ళీ అడిగాను- “చాయ్ పెట్టనా? తాగుతారా?”

అప్పుడు ఆయన శాంతభావంతో అన్నారు- “అలాగే, తాగుతాను.”

నేనొక మంచి బుద్ధిమంతురాలిలా, తెలివైన భార్యలాగా కిచన్ లోకి వెళ్ళాను. గిన్నె గ్యాసుపొయ్యిమీద పెట్టాను. ఇంతలోనే ఏమయిందో తెలియదు, నాలో ఏదో తీవ్రమైన కోపం జ్వాలలాగా భగ్గుమంది. పూర్తిగా ఒక ఉన్మాదప్రహారంలాగా. మనస్సులోనూ, బుర్రలోనూ ఉన్న మొత్తం తెలివి అంతా ఒక్కసారిగా తెల్లవారి, నాశనమైపోసాగింది. ఏదో అక్రమ కట్టడాలని పడగొట్టేవారి బృందం, బిల్డింగులని నేలకూల్చే బుల్ డోజర్ తో ఉన్నట్టుండి ఒక లైనులో, పద్ధతి ప్రకారం నిలబడివున్న బిల్డింగులని పడగొడుతూ, ధ్వంసం చేయడం మొదలుపెట్టినట్లుగా అనిపించింది. ఆ విధ్వంసక బృందాన్ని అధికారపూర్వకంగా నిర్దేశిస్తూ అదంతా నేనే చేయిస్తున్నట్లు అనుభూతి కలిగింది. … దాన్ని ఆపటానికి కంగారుతోకూడిన అరుపులు-కేకలు, ఆర్తనాదాలు కూడా నేనే చేయిస్తున్నాను. అల్లర్లు-కేకల మధ్య నాకు వినపడుతూ, అర్థమవుతున్నదాని ఆశయం ఏమిటంటే-

“తాగుతాను?…అంటే దాని అర్ధం ఏమిటి? నాకేమన్నా ఉపకారం చేస్తారా?…”“సరే, పెట్టు…. నాక్కూడా చాయ్ తాగాలని ఉంది.” అని మామూలుగా చెప్పవచ్చుకదా. లేకపోతే, “చూడు. కాస్త అల్లం, మిరియాలు వేసి స్ట్రాంగ్ గా మసాలా చాయ్ పెట్టు…. సరేనా?” అని కూడా చెప్పవచ్చుకదా.

ఇటువంటి మొత్తం కథనాలన్నీ అనుచితమైనవిగా…, కట్టడాలన్నీ చట్టవిరుద్ధమైనవిగా… ఏవీనిలబడలేకపోయాయి, అన్నీ ధ్వస్తమైపోయాయి. శిథిలాలమీద కేవలం ఒకే ఒక నిరుపయోగమైన పదం వినిపిస్తోంది- “తాగుతాను.” …

కాని, ఇదంతా నాలోపలి లోకంలోని మాయ. బయటమాత్రం గ్యాసుపొయ్యిమీద చాయ్ కోసం పెట్టిన నీళ్ళు మరుగుతున్నాయి. ట్రేలో పద్ధతిప్రకారం పంచదార ప్యాకెట్లు, పాల పాట్ తో బాటు టీ కప్పులు అమర్చి ఉన్నాయి. ఉన్నట్టుండి మళ్ళీ నాకేమవుతోందో తెలియదు. చాయ్ కోసం పెట్టిన నీళ్ళు నాలోపల మరుగుతున్నాయి. బర్నర్ జ్వాలలు తీవ్రంగా కంపిస్తున్నాయి. అంతటా అంతా మండుతూ, వేడెక్కసాగాయి. మనస్సు, హృదయం ఏదీ నా వశంలో లేదు. నాలో ఒక అంతులేని ఆవేశం వ్యాపించింది. అప్రయత్నంగానే నన్ను నేను కంట్రోలులోకి తెచ్చుకుంటూ, చాయ్ పొడి, దంచిన అల్లంతో బాటు మొత్తం చెంచాడు మిరియాల పొడిని ఆ మరుగుతున్న నీటిలో వేశాను. ఇంక ఇప్పుడు నేను ఊపిరిని నిలుపుకుని, గుండె చప్పుడుని తట్టుకుని ఆయన తేనీరు మొదటి గుక్కని తీసుకోవడం చూస్తున్నాను. ఆయన ఇప్పుడు… అంటే ఇప్పుడే అంటారు…అబ్బా, ఇంక నేను ఎక్కువ ఎదురుచూడలేను.

“ఏమిటి? ఏమయింది… ” నేను ఇంచుమించు ఆగలేక అడిగాను- “మిరియాలు బాగా ఎక్కువైపోయాయా… చెప్పండి చెప్పండి.”

“అవును.”

“అయితే?” నేను నా గుండె చప్పుడును ఆపుకుంటూ అడిగాను.

“ఇట్స్ ఆల్ రైట్.”…

“ఏమిటీ…?” నా చెవులని నేనే నమ్మలేకపోయాను. నా మౌనం ఆగ్రహభరితమైపోయింది. “ఏమీ ఎందుకు కాదు? చాయ్ లో మిరియాలు ఎక్కువైపోయాయని స్పష్టంగా ఎందుకు చెప్పరు. చాయ్ కారంగా ఉండటం కాదు, ఇది కారంతో చేసిన పులుసు అని… ఈ పులుసు నేను చేశానని…. కావాలనే- ఎందుకంటే ఈ ఇంట్లో పరిచిన మంచు పలకలు ముక్కలైపోవాలని. మంచు కరిగితే నీళ్ళుగా అయిపోవాలని… నీళ్ళు ప్రవహించాలని, గాలి విజృంభించాలని, తుఫానురూపంలోనైనా సరే. గాలి, నీళ్ళు, మంచు, తుఫాను… మేఘాలు, మెరుపులు… అన్నీ ఒకేసారి… చాలా ఎక్కువైపోయింది దైవత్వం. కొంచెమైనా సరే పాశవికతని, ఆటవికతని కూడా చూడాలి. అష్టధాతువుల మూసలో పోతపోసిన, చైతన్యరహితమైన ప్రతిమ స్థానంలో, రక్తమాంసాలతో ఉన్న ఒక సంపూర్ణ మానవుడు కదా తారసిల్లాలి…..”
కాని నేను ఎదురుచూస్తూనే ఉన్నాను. తుఫాన్ ఏదీ రాలేదు. పిడుగు ఏదీ పడలేదు. మేఘాలు గర్జించలేదు, వర్షం కూడా ఏదీపడలేదు.

పరితాపంతో, పశ్చాత్తాపంతోనేను మౌనంగా లేచాను. నాతోనేనే అంటున్నట్లుగా నేను విన్నాను- “సారీ, మిరియాల పొడి నా చేతుల్లో ఎక్కువ పడిపోయింది. మళ్ళీ పెట్టి తీసుకువస్తాను…” నేను ట్రే తీసుకుని వెళ్ళాను.

మీరు కూడా చూసి నమ్మలేకపోతున్నారు కదూ… నేను స్థాణువునైపోయి, స్వయంగా ఆశ్చర్యంగా చూస్తున్నాను- “దైవసమానులైన” మావారూ, నేనూ ఏం మాట్లాడకుండా కలిసి తేనీరు సేవిస్తున్నాం.

***

డా. సూర్యబాల – పరిచయం

ప్రముఖ సీనియర్ హిందీ రచయిత్రి డా. సూర్యబాల లాల్ గారు 25 అక్టోబరు 1944 న వారణాసిలో జన్మించారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుండి హిందీ సాహిత్యంలో ఎం.ఏ., పి-హెచ్.డి. చేశారు. వీరి సాహిత్యసేవ గణనీయమైనది. `మేరే సంధిపత్ర’ అనే నవలతో వీరికి బాగా గుర్తింపు వచ్చింది. ఇంచుమించు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న తన సాహితీవ్యాసంగంలో ఆరు నవలలు, పదకొండు కథాసంకలనాలు, నాలుగు వ్యంగ్యరచనా సంకలనాలు, ఇవికాక స్వానుభవ సంస్మరణలు, ట్రావెలాగ్స్, బాలసాహిత్యం మొ. ఎన్నో రచనలు చేసి అగ్రశ్రేణి రచయిత్రిగా ప్రఖ్యాతి చెందారు. వీరి రచనలు అన్ని ప్రసిద్ధ పత్రికలలోనూ, వార్తాపత్రికలలోనూ ప్రచురితమయ్యాయి. వీరి రచనలపై వచ్చిన టి.వి. సీరియళ్ళలో  `పలాశ్ కే ఫూల్’, `నా కిన్నీ నా’, `సౌదాగర్’, `ఏక్ ఇంద్రధనుష్’, `సబ్ కో పతా హై’, `రేస్’, `నిర్వాసిత్’ ఎక్కువ ప్రసిద్ధి చెందినవి. ఆకాశవాణి, దూరదర్శన్ లలో వీరి చాలా కథలు టెలీ ప్లే లుగా వచ్చాయి. దూరదర్శన్, జైపూర్ నుండి ప్రసారితమైన `సజాయాఫ్తా’ కథకి 2006లో ఉత్తమ టెలీఫిలిం అవార్డు లభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నో సాహితీకార్యక్రమాలలో వీరు ప్రసంగించారు, చాలా కార్యక్రమాలలో అధ్యక్షత వహించారు లేదా ముఖ్యఅతిథిగా ఆహ్వానించబడ్డారు,   స్వీయరచనాపఠనం చేశారు. కొన్ని ప్రసిద్ధ విదేశ టివి చానెళ్ళు వీరిని ఇంటర్ వ్యూ చేశాయి. వీరు చాలా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు, సన్మానాలతో సత్కరించబడ్డారు. 2025లో ముంబయిలో శబ్దసృష్టి అనే సంస్థ వీరికి జీవనసాఫల్యపురస్కారం బహూకరించి సన్మానించింది. డా. సూర్యబాల ముంబయి వాస్తవ్యులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.