
తరలిపోయిన సంజ
-ఉదయగిరి దస్తగిరి
కాగుతున్న బెల్లంగోరింటాకు వాసనలా
నేరేడి సెట్టుకింద నవ్వుతుంటే
రాలుతున్న పండ్లన్నీ
వేళ్ళకి నోటికి కొత్త రంగుమాటల్ని పూసేవి
పొంతపొయ్యిలో కాల్చిన రొట్టెని
బతుకుపాఠంలో ముంచి తినిపిస్తుంటే
కాలిన మచ్చలన్నీ
బెల్లమేసిన పెసరపప్పులా పచ్చగా మెరుస్తూ
ఆకలిబానల్లోకి జారిపోయేవి
సీకటయ్యాలకి రాత్రిని
కోళ్లగంప కింద మూయాలని
దంతె పట్టుకొని అరుగులెక్కి దుంకుతుంటే
చెక్కభజనలో ఆడగురువులా కనిపించేది
ఘల్లుమనే యెండికడియాల
సందమామల్ని సూసి
పూలచెట్టు జామచెట్టు కాళ్ళమ్మడి
రంగు కోడిపిల్లల్లా తిరుగాడేవి
ఉసిరికాయని ఉప్పుతోకలిపి తిన్నాక
నీళ్లుతాగినప్పుడు ఊరే అనుభూతిలాంటి కథల్ని
వెన్నెల సుద్దముక్కతో గుండె పలకనిండా రాసి
నిద్దుర కంబలిని కప్పేది
ముళ్లతొవ్వలో పూలమొగ్గలా
వొనారుగా నడవడమెలాగో నేర్పిస్తూ
జీవితవృక్షాలకి కాస్తున్న
మంచిచెడ్డల సత్యఫలాలని కాకెంగిలి చేసిచ్చేది
బతకుదెరువును సముద్రాల ఆవలికి
మోసుకుపోయిన బావని తల్సుకొని
గుండె భారాన్నంతా కన్నీళ్లతో పారబోసుకుంటూ
తడిసిన ఆకుపచ్చని కలల్ని
దేవుని గూట్లో ఆరబెట్టుకుంటున్నప్పుడు
పూటపూటకో ముడుపుకట్టుకునే
జెండాగుడ్డలెక్కనే అగుపించేది
రాఖీకట్టీ హారతిచ్చిన చేతికి
నూర్రుపాయల చీర యియ్యగానే
కానుపైన బిడ్డ నుదిటిపై తల్లి పెట్టే తొలిముద్దులా
చెంపపై తడి సంతకాన్ని చేసేది
యిప్పుడు అక్కలేని ఇల్లు
దుఃఖపు దూలాన్ని మోస్తూ
కమిలిన భుజంలా వుంది
చూపుడు వేలు తెగిన కుడిచేయిలా వుంది
తిరిగిరాని శూన్యంలోకి తప్పిపోతూ
నిశ్శబ్దంగా వదిలెల్లిన గుర్తులన్నీ
హృదయాలని ముట్టిచ్చి
జ్ఞాపకాల పుల్లల్ని ఎగదోస్తూనే వుంటాయి..!
*****

ఉదయగిరి దస్తగిరి ఊరు కానపల్లె గ్రామం, ప్రొద్దుటూరు మండలం,కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
1993 లో జన్మించాను. ఎటువంటి సాహితీ సువాసనలు లేని కుటుంబం నుండి వచ్చాను. 2020 నుండి కవిత్వం రాస్తున్నాను. చద్దికూడు అనే నా మొదటి అభ్యుదయ భావ కవితా సంపుటిని 2021 లో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో వెలువరించాను. సామాజిక కవిగా కొనసాగుతూ ప్రస్తుతం గల్ఫ్ లో వలస జీవనాన్ని సాగిస్తున్నాను.
