
నువ్వు అణుబాంబువి
-తోకల రాజేశం
అయ్యో నా తోడబుట్టిన చెల్లెలా!
వాని దృష్టిలో మనుషులంటే రెండే జాతులు తల్లీ!!
ఒకటి నీచ జాతి రెండోది ఉన్నతమైనజాతి
మనుషుల రక్త నాళాల గుండా
మతాలు పారుతున్నంత సేపు
ఆలోచనా లోచనాలమీద
కులాలు సవారీ చేస్తున్నంత సేపు
మానవత్వానికి చిరునామా దొరుకుతుందా చెప్పు?
నిన్ను నీచమైన జాతిదానిగా శపించి
బందీఖానాలో వేసిన వాడు
నీకసలు స్వాతంత్రయమే లేదని
మంత్రాల నోటితో పలికించిన వాడు
వాని మెదడు మీద దేవుడై కూర్చున్నాడు కదమ్మా!
వానికి నువ్వెలా మనిషిగా కనిపిస్తావు
నువ్వొక ఆటబొమ్మవనుకుంటాడు వాడు
ఊపిరి లేని తోలు బొమ్మవనుకుంటాడు
కామం గజ్జితో కంపు కొడుతున్న వాడు
నిన్ను పాదాల కింద తొక్కిపెట్టాలనుకుంటాడు
కానీ వాడికి తెలియదు
నువ్వు వాని పాదాలను రెండుగా నరుకుతూ
తల ఎత్తే ధాన్యపు గింజవు
వాని అణువణువునూ చీల్చి
ముక్కలు చేసే అణుబాంబువి
(మహిళల పట్ల నోరుజారుతున్న మత ప్రవక్తల పట్ల నిరసనగా)
*****

తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు.9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు.వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు.ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006),చెమట చుక్కలు(నానీలు-2010),పాతాళ గరిగె(సాహిత్య వ్యాసాలు-2013),అడవి దీపాలు(వచన కవిత్వం-2017),మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర(తెలంగాణ సాహిత్య అకాడెమీ ప్రచురణ-2020),కొబ్బరి నీరా! శతకం(పదిమందితో కలిసి-2023),మట్టి విజయం(పద్యకవిత్వం-2024)అనే పుస్తకాలు ముద్రించారు.తెలుగులో వెలువడుతున్న ప్రసిద్ధ దిన, వార, మాస పత్రికలన్నింటిలోనూ రాజేశం రాసిన కవితలు, వ్యాసాలూ వచ్చాయి. తెలుగునాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం(2012),సహస్ర వసంతాల పద్య పురస్కారం(2012),సాహితీ శిరోమణి పురస్కారం(2015),సినారె పురస్కారం(2023),తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

ఖచ్చితంగా రాయాల్సిన కవిత ఇది. మీకు ప్రత్యేక అభినందనలు.
మత ప్రవక్తలు స్త్రీలని దేవుడికి, ఆచారానికి, స్వర్గానికి,ప్రాతివత్యానికి ముడిపెట్టి అణిచివేయడం అన్నది అనాదిగా జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా జరుగుతుంది. మొగుడు పనికిమాలిన వాడు అయినా, కొట్టి ప్రాణం తీస్తున్నా వాడిని వదిలించుకుంటే ఆమె ముఖాన్ని చూడడం కూడా పాపమని చెప్తున్నారు.
భర్తల ineer wear ని ఉతికి ఆరేయడం స్త్రీ ల ప్రథమ కర్తవ్యం గా అదే ఆమెకి స్వర్గ ప్రాప్తిగా, భర్త సేవ మినహా మరో మహాత్తర కార్యం స్త్రీ కి లేదని భోదించే వారు ఇప్పటికీ ఉన్నారు. ఇది స్త్రీని సామజికంగా వెనక్కి తోస్తూ మగాధిపత్యం చూపించడమే.
ఇలాంటి పరిస్థితితులు యీ దేశంలో అడుగడునా ఉండడం బాధాకరం.
కాలి కింద తొక్కిపట్టి ఉంచాలనుకునే ” పాదాలను రెండుగా నరుకుతూ తల ఎత్తే ధాన్యపు గింజవు
వాని అణువణువూ చీల్చి ముక్కలు చేసే అణుబాంబువి ” అని ఆమె స్వీయ చైతన్యం పొందేలా రాసారు.
-Udayagiri Dastagiri.
ధన్యవాదాలు మిత్రమా