బ్యాంకాక్ నగరం

-డా.కె.గీత

బ్యాంకాక్ నగరం
సంధ్యాకాంతులకివతల
మత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ ఉంది
అంతా
అతనూ ఆమె కాని
శరీరాన్ని చూస్తున్నారు
నాకు
పైకి మిసమిసా మెరుస్తూన్నా
లోపల పుళ్ళు పడ్డ దేహం మీద
మచ్చలు మాత్రమే కనిపిస్తున్నాయి
ఆమె నునుపైన దేహాన్ని
కళ్ళతో తాగడం
వేళ్ళతో తాకడమేనా లక్ష్యం?
కళ్ళలో వలపు వెనక
కడుపులో సుడి తిరిగే ఆకలిని
తాకిచూడు
ఆమెవరో తెలుస్తుంది
అతనెవరో తెలుస్తుంది
మైమరపు రంగుల కాన్వాసు
మీద ఎవరేం గీస్తే
అలా మలచ బడిన చిత్రం
బ్యాంకాక్ –
ఏముంది ఇక్కడ?!
ఒక వైపు
బుద్ధుడు వ్యాపించిన నేల మీద
ఆకాశాన్నంటే సుడిగుడులు
పొడి రాలే స్తూపాలు
బుద్ధం శరణం గచ్ఛామి-
మరో వైపు
కాలే కడుపుకి
పైనా కిందనా
చూపులు చేతలు పాకే మగ పురుగులు
దొలిచిన విచ్ఛిన్న శరీరావయవాలు
ఆనందం శరణం గచ్ఛామి-
పగటికి
రాత్రికి
పోలిక లేని
లాస్ వేగాస్
బ్యాంకాక్ నగరం-
రెప్పపాటులో
పగటిని
రాత్రిగా
మార్చే
మాయావి!
దాని వలలో
డబ్బుమద్యం సేవించి
గంజాయి నిద్ర తూగి
ఒళ్లంతా దాని పచ్చబొట్టు
సుఖాలు పొడిపించుకుని
కండకావర మసాజు
చొంగ కార్చుకోవడానికి
తండోపతండమయ్యే
వంకర బుద్ధి పుంగవుల
శతకోటి సుఖజూదాల
బ్యాంకాక్ నగరం
రాత్రి రహస్యాల్ని
మాత్రమే కాదు
పగటి నిజాల్ని
కూడా గుంభనంగా
దాచుకుంటుంది
అతనూ ఆమే కాని
అర్థ నారీశ్వర
బ్యాంకాక్ నగరం
ఎవరో చెరిచిన
రంగుల వర్ణ చిత్రమై
నా దుఃఖపు గుండెని
వేళ్ళాడుతూ ఉంది!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.