AI వల

-డా||పి.విజయలక్ష్మిపండిట్

నా కన్నుల వెనుక రంగురంగు వలయాలుగా నృత్యం చేయిస్తున్న వెలుగు తరంగాలు ..,

సంగీతనాదం వినిపిస్తోంది …కొంతమంది వెలుగు శరీరాలతో గిరకీలు తిరిగుతూ నృత్యం చేస్తున్నారు.

ఆ గుంపులో నేను అతను సీతాకోక చిలుకలుగా మేము నృత్యం చేస్తున్నాము . మా ముఖాలు మావే కాని శరీరాలు రంగురంగుల దుస్తులు ధరించిన సీతోకోక చిలుకల్లా ఉన్నాయి. ఇంకో  మారు చిలకా గోరింకల్లా తిరుగుతూ ఉన్నాము.

ఆ వెలుగు  తరంగాల నుండి పుట్టుకొస్తున్నాయి మానవ ఆకారాలు… వృక్షాలు జంతువులు.!

ఎక్కడున్నాను నేను..? అన్న ప్రశ్న నాలో ప్రతిధ్వనించింది.

అంతలో నేనో కొమ్మ ఆకునై వేలాడుతున్నాను, మరో క్షణంలో రాలిపడి మట్టినైనాను. ఆ మట్టి నుండి మనిషి పుట్టింది మెరిసే పసుపురంగు చీరచుట్టి పెద్ద బొట్టు పెట్టి. ఆమె కడుపులో నేను ఊపిరాడక కదలాడు తున్న అనుభవం…!

కిటికీ నుండి పడి తాకుతున్న ఉదయ కిరణాల గిలిగింతలుకు వసంత కంటూన్న కల చెదిరిపోయింది.

“ఇదేమిటి …ఈ కలలు నాకే ఎందుకు వస్తాయి” అనుకుంటూ  కనులు  నులుపుకుంటూ  లేచింది వసంత. అపుడే రూములోకి వచ్చిన వసంత అమ్మమ్మ “నీవు ఎపుడు పగటి కలలు కంటుంటావు కదా ..అందుకు నిద్రలో కూడా అవి నిన్ను వదలవు.”అంటూన్న అమ్మమ్మ వైపు కోపంగా ఓ కోరచూపు విసిరి బాత్ రూమ్ లోకి నడిచింది వసంత.

“అమ్మమ్మకు నా గురించి ఎపుడు ఆలోచనే. ఎవడితో అలా రోజు సెల్ ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుతావు మెసేజ్ లు పంపుతూ “ అంటూ నన్ను ఎప్పుడూ గమనిస్తూ ఆటపట్టిస్తూ ఉంటుంది అమ్మమ్మ

“ఈమెకు వేరే పని ఉండదు “అంటూ విసుక్కుంటుంది వసంత.

అమ్మను మరిపించిన అమ్మమ్మ అంటే వసంతకు ప్రాణం. కళావతమ్మకు లేక లేక పుట్టిన మనవరాలంటే ప్రాణం.

“అమ్మ, వసంత ఇరువురి ప్రేమ తరంగాలు ఎంతగా అల్లుకు  పోయాయో “అని వసంత అమ్మ విశాలాక్షి అబ్బురపడుతూ అంటూ ఉంటుంది భర్త రాఘవరావుతో.

***

విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్ళే బస్సులో డ్రైవర్ సీటుకు వెనకల రెండో లైనులో కిటికి దగ్గర కూర్చున్న వసంతకు దుఃఖం ఆగడం లేదు. మాటి మాటికి కర్చీఫ్ తో  కండ్లు తుడుచుకుంటూ బయటకు చూస్తూ ఉంది.

“ఎంతగా మోసపోయాను  WhatsApp లో వాడు పంపే మురిపించే రంగు రంగుల వీడియోలు, మెసేజ్ల మోజులో పడి.” వసంతకు గడిచిన సంవత్సరం సంఘటనలు ఓ సారి రీలులా కండ్ల ముందు మెదిలింది .

అమ్మ నాన్న వద్దన్నా మొండి కేసి ఇంటర్మీడియట్ ఆఖరున సెల్ ఫోన్ కొనిచ్చుకుంది. సరేలే కాలేజికి వెళుతుందికదా అవసరమేలే అని జాగ్రత్తలు చెప్పి కొన్నాడు నాన్న మొబైల్ ఫోన్.

అమ్మమ్మ ఒకటే జాగ్రత్తలు చెప్పేది “పనికి మాలిన మగపిల్లలు వాళ్ళు తియ్యటి కబుర్లు చెప్పుతూ ఫోన్లలో మోసం చేస్తారంట .. జాగ్రత్తే వసూ…”అని.

“అలాగే అమ్మమ్మా ఈ జనరేషన్ వాళ్ళకు మాకు తెలుసులే  ఇవన్నీ “అని కొట్టి పారేసేది.

“అలాగేలే…అని మొదట అనక పోతే సలహాలు చెపుతూనే ఉంటుంది అమ్మమ్మ అని ఆమె సంతోషం కోసమని జవాబులు చెప్పేది కొన్ని తప్పించుకునే అపద్దాలవి.

ఎంత అందమైన వీడియోలు కృత్రిమ మేధ AI ఎక్సపర్ట్  అట అతను. నేను అతను రెండు సీతాకోక చిలకల్లాగా సీతాకోక  చిలుకలకు , అందమైన జంట పక్షులకు మా తలలు పెట్టి మార్ఫింగ్ అట.. చేసి నాకు పంపాడు ఒక సారి వాడు. నేను పరిచయం లేదు ఎలా తెలుసు నేను ?! నా వాయిస్ తో  చిలుక గోరింక అతనితో మాట్లాడుతున్నట్లు అతను నాతో ప్రేమ పలుకులు పలకుతూ కబుర్లాడుతున్నట్టు . అవి చూసినప్పుడు అదోలా అయిపోతుంది మనసు. మరలా మరలా చూడాలనిపించేది.

అదే విషయం స్నేహితురాలు మాధవితో అన్నపుడు ..;

“ఇదొక పిచ్చిమాలోకపు  AI గుంపు. మొహాలు మార్చి వీడియోలు  వదులుతూంటారు రాజకీయవేత్తల , సినిమా హీరో హీరోయిన్ల వారి వాయిస్ తో అవి వైరల్ అయిన తరువాత గాని నిజనిజాలు తెలుసుకుని వాళ్ళు అవి తమవి కావని ఫేక్ వీడియోలని వివరించు కుంటారు వీడియోల ద్వారా. నీకు పంపిన వీడియోలను పట్టించు కోకు “ అని సలహా ఇచ్చింది. మాధవికి ఉన్న ఇంగిత జ్ఞానం నాకు లేకుండా పోయింది. అయినా మనసు ఒక్కోసారి విచక్షణ లేని కోతి కదా … వద్దన్న దానిపై మోజు పెంచుకుంటుంది.

నా మనసు కోతి గెంతి నట్టు ఆ వీడియోల చుట్టూ తిరుగుతూ ఆ మాయలో పడి అతనితో చాటింగ్ మొదలు పెట్టింది. అతనో AI సాఫ్టువేర్ ఇంజనీర్ అట .. పేరు కృష్ణ చందు నట. అందమైన మొహం. ఎవరో పేరు గుర్తులేదు..పాత హిందీ సినిమా హీరోలా ఉన్నాడు అనుకున్నాను.

బస్ ఆగింది ..,ఆలోచనల నుండి బయటపడి కలయచూశాను. ప్రయాణికులు కొంత మంది దిగిపోతున్నారు. బస్ మరలా కదలడంతో సీటు వెనక్కు వాలి కండ్లు మూసుకుని చలిగాలికి నా దుప్పట్టాను చెవులు బుజాలచుట్టూ కప్పుకున్నాను.

మరలా గతంలోకి జారుకున్నాయి నా ఆలోచనలు.

ఆ రోజు …మూడువారాల నుండి ప్లాన్ చేసుకున్నా బట్టలు సర్దుకుని అమ్మానాన్నకు అసలు విషయం చెప్పకుండా వెళ్ళాలని విజయవాడకు అతనిని కలవడానికి. కృష్ణ చెందు ఒక వారం ఉండేట్టు రమ్మని పదే పదే మెసేజ్ లు పెట్టేవాడు. అలా అలా తిప్పి విజయవాడ పరిసరాల అందాలు చూపిస్తాను నీకు”అని.

“అమ్మా ..హాలిడేస్ కదా విజయవాడలో మాధవిని కలిసి వారం రోజులు ఉండి వస్తాను “ అని అమ్మతో అన్నాను.

“ ఇపుడేమి వసంతా అంత తొందర నిన్ననే కదా హాలిడేస్ మొదలయ్యాయి “నిదానంగా  వెళ్ళచ్చులే అంది అమ్మ .

“తరువాత వెళుదువులే నాన్న వసూ.. “ అంటూ వంత పాడాడు నాన్న.

వారం తరువాత  మాధవి వాళ్ళ అక్క పెండ్లికి రమ్మని పెండ్లి పత్రిక వాట్సాప్ చేసి తప్పక అమ్మ నాన్నతో కూడా రమ్మని మరీ మరీ ఫోన్ చేసింది మాధవి. పెండ్లి విజయవాడలో. ఇదో సాకు దొరికింది కృష్ణ చందును కలవడానికి అని అమ్మానాన్నకు ఆ పెండ్లి పత్రిక చూపి ఒప్పించింది.

“మేము రావడం లేదు నీవు వెళ్ళిరా వసూ..” అన్నారు అమ్మ నాన్న.

వారం రోజులకు సూట్ కేసులో బట్టలు సర్దుకుని ఆ రోజు రాత్రి సంతోషంగ ఆ వీడియోలు అతని మాటలు పదే పదే గుర్తు చేసుకుంటూ పడుకున్నాను.

***

సూట్కేస్ తీసుకుని ఇంటి బయటకు వచ్చి గేటు బయటకు అడుగు పెడుతున్న నన్ను ఎవరో నన్ను వెనక్కు లాగుతున్నట్చు అనిపించి వెనుతిరిగి చూశాను తన చున్నీ జామ చెట్టు కొమ్మకు తగులు కుంది గట్టిగా. విడిపించుకోడానికి వంగి ప్రేమగా జామకొమ్మలను నిమిరాను. తనకోసం అమ్మమ్మ నాటిన జామ చెట్టు అది. అమ్మమ్మ చనిపోయి ఆరు నెలలు అవుతున్నా ఆ జామ చెట్టును తన అమ్మమ్మగా అనుకుంటూ జామచెట్టు కింద అరుగు మీద కూర్చుని దోర జామకాయలు  తింటూ వాటి రుచిని  ఆస్వాదిస్తూ ఆ రోజు కబుర్లను ఆ జామచెట్టు నా అమ్మమ్మ అన్నట్టు కబుర్లు చెప్పుకోవడం అలవాటయి పోయింది నాకు..అమ్మమ్మ చనిపోయాక.

చున్నీని విడిపించు కోడానికి వంగాను ..,నా చెవి దగ్గర ..”వసూ నీవు కలవాలనుకుంటున్న వాడు మోసగాడు. నలబయి ఏండ్లు పైబడ్డ పెండ్లి అయి ఇద్దరు పిల్లల తండ్రి వెంకట్. డ్రైవర్ పని చేస్తాడు. వాడి స్నేహితునితో వీడియోలు చేయించుకుని ఆడపిల్లలతో చాట్ చేయడం మోసం చేయడం వాడి అలవాటు” అని అమ్మమ్మ గొంతు ఆగిపోయింది.

పరువు మీద నుండి దిగ్గున లేసి మేల్కొన్న నాకు అది నాకు సుషుప్తిలో వచ్చిన కల అని తెలిసింది. గోడపై ని గడియారం రాత్రి ఒంటిగంట అని ఒక గంట కొట్టింది. అమ్మమ్మ గొంతు ఆమె మాటలు మాత్రం ఇంకా చెవిలో ప్రతిధ్నిస్తున్నాయి.

లేచి మంచి నీళ్ళు తాగి అలాగే కూర్చుండి పోయాను.

జామ చెట్టు కొమ్మ నా చున్నిని పట్టి నన్ను ఆపడమంటే అమ్మమ్మ ఆత్మ నన్ను వెళ్ళవద్దని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూందన్న మాట.

“గాఢంగా ప్రేమించే వారిలో ఆత్మల ఆలోచనా శక్తి తరంగాల ఫ్రీక్వెన్సీ ఒకటై అనుసంధానం జరిగి ఆ శక్తి తరంగాలు మోసుకొచ్చిన మాటలు వినిపిస్తాయని “ చదవడం గుర్తు కొచ్చింది నాకు. “ఎంత ఆశ్చర్యం! .. అమ్మమ్మ చనిపోయినా తన ఆత్మ నన్ను కాపాడుతూంది”.

నాకు అమ్మమ్మ ప్రేమ ..నేనంటే ఎనలేని ఆప్యాయత గుర్తుకొచ్చి నాకు కన్నీళ్లు ఆగలేదు.

“కన్నీళ్లు కారితే కాని మనసులో గూడుకట్టుకున్న బాధ , చేసిన తప్పుకు పచ్చాతాప పడి ప్రక్షాళనం అయి సంతోషానికి కొత్త దారులు వేస్తుంది.” అని అమ్మమ్మ ఒక సందర్భంలో అన్న మాటలు గుర్తుకొచ్చి కండ్లు తుడుచు కున్నాను.

ఆ తరువాత నాకు నిద్ర పట్టలేదు. ఆ రోజు సాయంత్రం నాన్న నన్ను విజయవాడ బస్సు ఎక్కించి టాటా చెపుతూ “జాగ్రత్త వసూ.. చేరగానే ఫోన్ చేయి . మాధవి రిసీవ్ చేసుకుంటుంది కదా నిన్ను.”అంటూ చేయి పట్టుకుని వదిలాడు.

“అవును నాన్నా వస్తానంది “అని లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని నవ్వుముఖంతో అంటున్న నాకు నేనంటే నాకే అసహ్యం వేసింది.

పుట్టినప్పటి నుండి ఎక్కడ కందిపోతానో అని అమ్మ నాన్న అమ్మమ్మ బాబాయిలు మామయ్యలు ఎంత ఆప్యాయంగా పెంచారు నన్ను. నేనేమో అమ్మా నాన్నకు అసలు విషయం చెప్పకుండా వాడిని చూడడానికి వెళ్ళాలనుకోవడం అమ్మ నాన్నను మోసగించడం కాదా ..!” మనసు పచ్చాతాప పడసాగింది. నాన్న ప్రేమగా నా చేతిని అందుకుని..

“ ఏమి నాన్నా వసూ …అలా ఉన్నావు.. ఒంట్లో బాగానే ఉందికదా ..? నీకు వెళ్ళాలని లేకపోతే వెళ్ళిపోదామమ్మా” అన్నాడు.

“ బాగానే ఉన్నాను నాన్నా వెళ్తాను మాధవి ఉంది కదా..” అంటూండగా డ్రైవర్ హారన్ మోగించాడు

బస్సు స్టార్టయింది. నాన్న కనుమరుగయేవరకు చూస్తూ తరువాత నా సీటులో వెనక్కు వాలి కూర్చున్నా .

“మాధవికి నా కల గురించి అమ్మమ్మ హెచ్చరిక మాటలు గురించి చెప్పి సలహా అడగాలి” అనుకుంటూ ఉండి పోయాను.

***

మాధవి అక్క పెండ్లి చాలా వైభవంగా జరిగింది. మాధవి నాన్న పేరుమోసిన లాయరు. ఉన్నవాళ్ళు కావడంతో బందువులు స్నేహితులు , లాయర్లు ఇతర వర్గాలు బాగా వచ్చారు. మూడు రోజులయినాక గాని నాకు నా కల కథను మాధవికి చెప్పడానికి కుదర లేదు.

“ కలలో అయినా మీ అమ్మమ్మ మాటలు నిజమే అయుంటాయి. వాడిక్కడే ఉన్నాడన్నావు కదా .. పట్టుకుని పోలీసులకు అప్పగిద్దాము. మానాన్నకు తెలిసిన DSP ఉన్నారు సైబర్ నేరాల డిపార్ట్మెంట్లో ఆ అంకుల్ తో ఈ విషయం చెప్పి ఎంక్వయిరీ చేయించమని నాన్నకు చెపుతాను” అని వాడి మొబైల్ నంబరు వాడి చాటింగ్ డీటెయిల్స్ , వీడియోలు తీసుకుంది మాధవి.

రెండు రోజుల తరువాత నన్ను మాధవిని సైబర్ క్రైమ్స్ ఆఫీసుకు DSP రమ్మన్నారని మాధవి నాన్న అన్నారు.

నేను మాధవి మరుసటి రోజు వెళ్ళాము DSP గారి P.A.ఇచ్చిన టైంకు. మేము సైబర్ క్రైమ్స్ ఆఫీసు లోపలికి వెళ్లి విజిటర్స వెయిటింగ్ రూములో కూర్చున్నాము. ఆఫీసు బాయ్ కి మాధవి వాళ్ళ నాన్న లాయర్ విజటింగ్ కార్డు ఇచ్చి DSP గారికి ఇమ్మని చెప్పింది .

లోపలికి వెళ్లిన ఆఫీస్ బాయ్ ఐదు నిముషాల్లో వచ్చి మిమ్మల్ని రమ్మన్నారు సర్ అనగానే ఇద్దరం లోపలకు వెళ్ళాము.

DSP గారు “లాయరు రామకృష్ణ గారి కూతురు మాధవి నీవే కదమ్మా మాధవి ! చాల రోజులయింది నిన్ను చూసి “అని అన్నాడు .

“అవును అంకుల్ “ నాన్న చెపుతుంటారు మీ గురించి “అంది మాధవి .

“తను నా స్నేహితురాలు వసంత “అని నన్ను పరిచయం చేసింది. దాదాపు మధ్యవయసున్న DGP .గారు “ ఏం మా.. వసంతా..నీవు ఈ ఇద్దరిలో ఎవరో నీకు WhatsApp మెసేజ్లు, వీడియోలు పంపిన దేవానంద్..అదే ఉరఫ్ కృష్ణ చందు ను గుర్తు పడతావా “అని అక్కడ నిలబడి ఉన్న ఇద్దరిని చూపించాడు.

ఇద్దరి మధ్య వయసులో ఉన్న మగవాళ్ళు అందులో ఒకరు బట్టతల ..,గడ్డం పెంచి మాసిన బట్టలతో  చమటలు పట్టి భయంగా భయంగా చూస్తున్నాడు ..,ఇంకో మనిషి కొంచెం నీటుగనే ఉతికిన బట్టలు వేసుకుని మెడలో ఏదో కంపెని ID card వేలాడుతూ ఉంది .సాఫ్టువేర్ ఇంజనీరు లాగా ఉన్నాడనుకుంది.

“లేదు సర్ అన్నాను”

“గడ్డం పెంచి మాసిన బట్టలు వేసుకున్న ఇతడు నీకు  పాత హిందీ సినిమా హీరో దేవానంద్ ఫోటో పెట్టి కృష్ణ చెందు అని పేరుతో WhatsApp messages , AI క్రియేట్ చేసిన వీడియోలు పెడుతూ చాట్ చేస్తూన్నాడు. ఇతను ఒక టాక్సీ డ్రైవర్. పేరు వెంకట స్వామి.పెండ్లి అయి దగ్గర దగ్గర నీ వయసు ఉన్న కూతురు ఒక పది సంవత్సరాల కొడుకు ఉన్నారు. “అన్నాడు DSP.

నాకు తల తిరిగి పోయింది అమ్మమ్మ కలలో చెప్పిన మాటలు నా చెవిలో మరో సారి గింగురు మంటున్నాయి. అవమానంతో తల వంచుకున్నాను నా మీద నాకు అసహ్యం వేసి.

“ ఇక ఇతను శేఖర్ ఒక AI అదే ..ఆర్ట్ ఫీషియల్ ఇంటలిజెన్స్ నేర్చుకుని డబ్బు తీసుకుని మార్ఫింగ్ లు చేసి పెడుతూంటాడు.” అన్నాడు DSP.

“వీళ్ళిద్దరిని  C.I. దగ్గరకు తీసుకుని పోయి కేసు ఫైల్ చేయమనండి “ అని పురమాయించాడు DSP అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్ తో. ఆ ఇద్దరిని బయటకు తీసుకుని వెళ్ళాడు కానిస్టేబుల్.

“చూడమ్మా వసంతా అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్దచేసి పైచదువులు చదవమని  కాలేజీల్లో చేర్చి మీ జీవితాలను మంచి మార్గంలో నడవాలని బాధ్యత గల యువతి యవకులుగా తీర్చి దిద్దాలని కలలు కంటారు . కానీ..మీ రేమో ఆ సోషియల్ మీడియాను ఎలా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకోవాలో తెలియక మీ జీవితాలను పీల్చి పిప్పి చేసే ఈ చాటింగులు మార్ఫింగ్ వీడియోల బారిన పడుతున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువ గా వస్తున్నాయి. చేపలు పట్టే వాళ్ళు ఎర వేసి చేపలను పట్టినట్టు ఈ మార్ఫింగ్ చేసి అందమైన వీడియోలు చేసి ఆడపిల్లలను ఆకర్షించడానికి AI వల వేస్తున్నారు మోసగాళ్లు. ఎవరిది తప్పు ఎక్కడుంది లోపం చెప్పమ్మా… “ అన్నాడు .

నా కండ్లు నిండి కన్నీరు కారిపోతూంది.

“వసంతా…ఏడవకు నీవు లక్కీ తొందరగా ఈ ఊబి నుండి బయట పడ్డావు.” అంటూ మెల్లగా లాలనగా అంటూంది మాధవి.

“చూడమ్మా వసంతా ఇక ఈ చాటింగుల వీడియోల జోలికి పోకుండా బుద్దిగా చదువుకుని నీ భవిష్యత్ ను దిద్దుకో .. అని .. DSP మాధవితో “ నేను మీ నాన్నతో మాట్లాడుతానని చెప్పమ్మా “అని నాకు

వేరే అర్జంట్ పని ఉంది వెళ్ళాలి “ అంటూ లేచాడు .

“అలాగే అంకుల్ “అంది మాధవి .

DSP కి నమస్కారం చేసి బయటికి వచ్చాము. మాధవి నా చేయి పట్టుకుని నిమురుతూ ఓదార్చింది.

***

ఇంటికి వచ్చిన నన్ను చూసి అమ్మ నాన్న

“ఏం నాన్న వసూ .. దిగులుగా ఉన్నావు అని అమ్మ వచ్చి నన్ను పట్టుకుని జ్వరంగాని వచ్చిందా ఏమి “అంటూ ఉండగానే నా ఏడుపు కట్టలు తెంచుకుంది. అంతా విని అమ్మా నాన్న అవాక్కయ్యారు. మా అమ్మ బుజంపై తల వాల్చిన నా తల నిమురుతూ ఓదార్చుతూ ఉండి పోయారు.

“ఎంత తప్పు జరిగింది ..అపుడపుడు ..పెరిగే పిల్లలకు సెల్ ఫోన్ వల్ల లాభ నష్టాల గురించి సోషియల్ మీడియాలో జరిగే ఈ అంతర్జాల అనర్థాల గురించి పెరిగే పిల్లలతో చర్చించడం సలహాలివ్వడం ఎంత అవసరమో ..ఇపుడు తెలుస్తూంది నాకు” అంటూ మా నాన్న బాధపడటం గమనించాను నేను.

హాలులో ఎదురుగా చిరునవ్వు చిందిస్తూ ఉన్న అమ్మమ్మ ఫోటో నన్ను ఆప్యాయంగా చూస్తున్నట్టు అనిపించి లేచి ఫోటో దగ్గరకు వెళ్లి ఫోటో మీద చేయి పెట్టి అమ్మమ్మ కండ్లలోకి మసక బారిన నా తడి కండ్ల తో చూస్తూ ఉండిపోయాను. మనసులో “ నన్ను కాపాడిన నా పాలిట దేవత నీవు అమ్మమ్మా “అని నా మనసు మూగగా రోదించింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.