
ఆడపిల్లలున్న ఇల్లు
लड़कियों वाला घर
హిందీ మూలం – – సుభాష్ నీరవ్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
అద్దెకి ఉంటున్న ఇల్లు విడిచిపెట్టి గవర్నమెంటు క్వార్టరుకి వచ్చిన సంతోషం ఇంత తొందరగా రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుందని మిసెస్ శర్మ ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళకి క్వార్టరు ఎలాట్ చేసిన ప్రభుత్వ కాలనీలో టైప్-టూ క్వార్టర్లలో రెండు అంతస్తులు బ్లాక్ చేసి ఉంచారు. ఈ క్వార్టర్లు క్లర్కు స్థాయికి చెందిన వారి కోసం ఉంచారు. నిజానికి వీటిలో అసలు యజమానులు తక్కువ, అద్దెకి ఉండేవారే ఎక్కువ. వాళ్ళ క్వార్టరుకి, మెయిన్ రోడ్డుకి మధ్య ఒక సన్నపాటి సిమెంటు రోడ్డు ఉంది. దానిమీద మెయిన్ రోడ్డుమీద వెళ్ళే ట్రాఫిక్ కన్నా ఎక్కువ వేగంగా క్లర్కుస్థాయికి చెందినవారి స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళే అబ్బాయిలు బైక్ నడుపుతూ ఉంటారు. రెప్పపాటులో ఎటునుంచో వస్తారు. రెప్పపాటు సమయంలోనే అదృశ్యం అయిపోతారు. ఈమధ్య ప్రమాదాలు మెయిన్ రోడ్డుకన్నా ఎక్కువగా ఈ సన్నపాటి రోడ్డులోనే జరుగుతున్నాయి.
కాని, మిసెస్ శర్మ దిగులుకి కారణం ఇది కాక, మరొకటి.
మెయిన్ రోడ్డు మీద ఒక బస్ స్టాప్ ఉంది. ఈ బస్ స్టాప్ సరిగా ఇరవై ఒకటి నెంబరుకి ఎదురుగా ఉంది. ఇరవై ఒకటి నెంబరులో ఉంటున్నది శర్మగారి కుటుంబం. అంటే… మిస్టర్ శర్మ, ఆయన భార్య మిసెస్ శర్మ, బి.ఏ. ఫస్ట్ ఇయర్ లోనూ, హయ్యర్ సెకండరీ లోనూ చదువుతున్న వారి ఇద్దరు అమ్మాయిలు, ఎనిమిదో క్లాసులో చదువుతున్న ఒక అబ్బాయి. సూర్యోదయం నుంచి రాత్రి తొమ్మిది-పది అయేవరకు బస్ స్టాప్ దగ్గర జనం గుంపుగా ఉంటారు. పది-పదిహేనుమంది ఎప్పుడూ బస్సులకోసం ఎదురుచూస్తూ నిలబడి ఉంటారు. ఉదయం-సాయంత్రం ఈ సంఖ్యలో పెరుగుదల ఉంటుంది. ఇంటితలుపు కాని, లేదా కిటికీలు కాని తెరిచి చూస్తే బస్ స్టాప్ దగ్గర నిలబడివున్న ఒక్కొక్క మనిషిని చూసి లెక్కపెట్టవచ్చు. మిసెస్ శర్మకి కలుగుతున్న ఇబ్బంది, దిగులు సహజమైనవే. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలున్నారు. ఎప్పుడు చూసినా, బస్ స్టాప్ దగ్గర నిలబడిన ఎవరో ఒకరు ఇటువైపే చూస్తూ ఉంటారు.
కూర్చోవాలన్నా, నిలబడాలన్నా కాస్త చోటు మెయిన్ రోడ్జువైపుకే ఉంది. ఇంటికి ఎదురుగా కొంచెం ఖాళీ స్థలం ఉంది. దానిలో అక్కడక్కడ పచ్చిగడ్డి మొలిచింది. ఈ కొద్ది ఖాళీస్థలాన్ని ఇరవైఒకటి నెంబరు వాళ్ళు లాన్ లాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లలు మాత్రం ఏంచెయ్యగలరు. ఎప్పుడూ గదులు బంధించుకుని లోపల ఉండటం సాధ్యం కాదు కదా. అందుకనే కాస్త మంచిగాలిని పీల్చు కునేందుకు కిటికీని, తలుపును తెరుచుకుని కూర్చుంటారు.
మధ్యాహ్నంవేళ అమ్మాయిలు స్కూలునుంచి, కాలేజీనుంచి తిరిగివచ్చినప్పుడు కొన్నిరోజులనుంచి కొందరు అబ్బాయిల స్వరూపాలు రోజూ కనిపిస్తున్నాయి. మిసెస్ శర్మ లోలోపలే కోపంతో రగిలిపోతోంది. సణుక్కుంటోంది –“అడ్డగాడిదలు! మిడిగుడ్లు వేసుకునిఎలా చూస్తున్నారో.”
వేసవికాలం. సాయంత్రం అవుతూనే ఇటుపక్క కుర్చీలు వేసుకుని కూర్చోవాలనే ఉబలాటం అమ్మాయిల్లో రోజురోజుకీ పెరుగుతోంది. సాయంత్రం అయిదుగంటల నుంచి రాత్రి తొమ్మిది-పదిగంటల వరకు వాళ్ళు ఇక్కడే కూర్చుంటున్నారు. బస్ స్టాప్ దగ్గర కబుర్లాడుకుంటున్న అబ్బాయిలని చూసి మిసెస్ శర్మకి వాళ్ళు వీళ్ళ అమ్మాయిల గురించే గుసగుసలాడుకుంటున్నారని అనిపిస్తోంది. లేచివెళ్ళి ఆ తిరుగుబోతు వెధవలకి గుణపాఠం చెబుదామా అనిపిస్తుంది. కాని ఆవిడ లోలోపలే మథనపడుతూ ఉండిపోతోంది. కళ్ళు ఎర్రజేసి అమ్మాయిలని వచ్చి లోపల గదిలో కూర్చోమని సంజ్ఞచేస్తుంది. అమ్మాయిలు కాస్త మొండితేరిపోతున్నారు. ఒకసారి నవ్వుకుంటూ లోపలికి వస్తారు. మరోసారి అమ్మ కోపంగా చూసే కళ్ళని లెక్క చెయ్యకుండా అక్కడే కూర్చుండిపోతారు. అప్పుడప్పుడూ తిరిగి జవాబు కూడా ఇస్తారు- “ఏమిటమ్మా నువ్వు మరీనూ..?”
ఆ సాయంత్రం శర్మగారికి, వాళ్ళ ఆవిడగారికి మధ్య వాగ్యుద్దం జరుగుతుంది. మిసెస్ శర్మ ఆయన ఆఫీసు నుంచి రాగానే అమ్మాయిల మొండితనం వివరించి చెబుతుంది. బస్సుస్టాప్ దగ్గర తిరుగుబోతు అబ్బాయిల గుంపు ఆరోజుకారోజు పెరిగిపోతూఉందని చెబుతుంది. తొందరగా ఇల్లు మారిపోదామని పట్టుపడుతుంది. శర్మగారు ముందు మౌనంగా అంతా వింటాడు. ఆ తరువాత ఆవిడకి నచ్చజెబుతాడు. ఆ తరువాత భార్య చేస్తున్నరొద భరించలేక అరవడం మొదలుపెడతాడు. మిసెస్ శర్మ గారికి మాత్రం సమస్య ఎంత సీరియస్ గా అవుతోందో దాన్ని శర్మగారు అంతే తేలికగా తీసుకుంటున్నారని అనిపిస్తోంది. ఆయన మాత్రం ఆవిడ అమ్మాయిలని ఏ కారణం లేకుండా అనుమానిస్తోందని అనుకుంటున్నాడు.
మిసెస్ శర్మ మాత్రం విడవకుండా అమ్మాయిల మీద ఒక కన్నువేసి ఉంచింది. వాళ్ళిద్దరూ ఉదయం స్కూలుకి, కాలేజీకి బయలుదేరేటప్పుడు ఆవిడ తలుపుదగ్గరికి వచ్చి నిలబడుతుంది. అమ్మాయిలకి బస్సు దొరికి వెళ్ళేవరకూ ఆవిడ అక్కడే నిలబడి ఉంటుంది.
మధ్యాహ్నం అమ్మాయిలు తిరిగి వచ్చేవరకూ మిసెస్ శర్మ ముందుగానే తలుపుదగ్గర నిలబడి వాళ్ళకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఉదయం కోలాహలం చేస్తూ బస్సు ఎక్కి వీళ్ళతో వెళ్ళే అబ్బాయిలే మళ్ళీ వీళ్ళ అమ్మాయిలతో బాటు దిగుతున్నారని ఆవిడ గమనించింది.
“ఎవరా అబ్బాయిలు? వాళ్ళు తెలుసా మీకు?” ఆవిడ అమ్మాయిలని అడుగుతుంది.
“మాకు తెలియదమ్మా…” అని చెప్పి ఇద్దరూ నవ్వుకుంటూ తమ డ్రస్సులు మార్చుకునేందుకు బాత్ రూంలోకి వెడతారు. మిసెస్ శర్మ కేవలం నిట్టూరుస్తూ ఉండిపోతుంది.
మిసెస్ శర్మ ఇప్పుడు చాలా జాగ్రత్తగానూ, భద్రతాభావంతోనూ ఉంటోంది. మహానగరంలోని గవర్నమెంటు కాలనీల్లో అప్పుడప్పుడూ జరుగుతున్న దొంగతనాల గురించి వార్తలు పేపర్లో చదివి ఆవిడ గుండె దడదడలాడిపోతుంది. ఒక భయం రేయింబవళ్ళు ఆవిడని వెంటాడుతూ బాధిస్తోంది. ఆవిడ స్వంతఖర్చుమీద వెనుకవైపు వరండాకూడా కవర్ చేయించుకుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలకి గట్టిగా చెప్పివెడుతుంది- “ఎవరు వచ్చినా సరే, తలుపు తీయద్దు. కన్నంలోంచి ముందు బాగా చూడండి.”
భయాందోళనలతో కూడిన ఈ పరిస్థితిలో మిసెస్ శర్మకి రాత్రుళ్ళు సరిగా నిద్రకూడాపట్టడంలేదు. మనస్సులో వస్తున్న రకరకాల ఆలోచనలతో ఆవిడ సతమతమవుతోంది. ఆవిడ బ్లడ్ ప్రెషర్ పెరుగుతోంది. దీనికన్నా ఆ అద్దెయింట్లోనే బాగా ఉండేవాళ్ళమని ఆవిడ ఆలోచిస్తోంది. ఎలాగో ఈ గవర్నమెంటు క్వార్టరు నెంబరయితే వాళ్ళపేరిట వచ్చింది. లేకపోతే, సాధారణంగా రిటైర్ మెంటుకి కొద్ది సంవత్సరాలే మిగిలి ఉన్నప్పుడు క్వార్టరు ఎలాట్ అవుతుంది. క్వార్టరు ఎలాట్ అయిన సంగతి విన్నవాళ్ళంతా మిస్టర్ శర్మగారిని అభినందించారు. కంగ్రాట్స్ చెప్పారు. ఆఫీసులోవాళ్ళకయితే ఆయన పార్టీ కూడా ఇచ్చాడు. వాళ్ళన్నారు- “మిస్టర్ శర్మా, మీరు నిజంగా లక్కీ. క్వార్టరు ఎలాట్ అయింది కూడా సెంట్రల్ ఏరియాలో. ఇక్కడి క్వార్టరు కోసం పెద్ద పెద్ద స్థాయిలో రికమెండేషన్లు చేయించుకుంటారు. అప్పుడే ఇలాంటి చోట దొరుకుతుంది. మీరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఏదయినా సోర్సింగూ అదీ చెయ్యలేదుకదా?”
కాని ఇప్పుడు మిస్టర్ శర్మ క్వార్టరు చేంజ్ కోసం అప్లికేషన్ ఇచ్చాడు. కాని ఎవరూ వినిపించుకోలేదు. ఇప్పుడు ఆయన బస్సుస్టాప్ కి సరిగ్గా ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటే కలుగుతున్న బాధ స్వయంగా చూస్తున్నాడు. కొంతమంది కుర్రకారు అబ్బాయిలు కావాలని బస్సుస్టాప్ దగ్గర గుమికూడి ఉంటారు. వీళ్ళ ఇంటివైపే అదే పనిగా చూస్తూ ఉంటారు. అమ్మాయిల్లో కూడా కాస్త నిర్లక్ష్యవైఖరి అనేది కనిపిస్తోంది. ఏదో ఒక వంకతో బయటికి రావడం, కొంచెం తొంగిచూడటం వాళ్ళకి అలవాటైపోయింది. ఇప్పుడు తన భార్య చెప్పిన విషయాలు ఆయనకి నిజమని అనిపిస్తున్నాయి. ఆయనైతే రోజంతా ఆఫీసులో ఉంటాడు. వెనకాల పాపం వాళ్ళ ఆవిడ ఒక్కతే అంతా ఎదుర్కోవలసివస్తుంది. అంతా సహించుకోవలసి వస్తుంది. గుండెని రాయి చేసుకుని ఈ నాటకం అంతా చూడవలసి వస్తుంది.
మిస్టర్ శర్మ క్వార్టర్ చేంజ్ కోసం తన ప్రయత్నాలు తీవ్రం చేశాడు. చాలా తనుకులాడిన తరువాత ఒక మంత్రిగారి పి.ఏ. తో ఆయన కాంటాక్టు చెయ్యగలిగాడు. మంత్రిగారి నుంచి ఒక ఉత్తరం పంపిస్తానని ఆయన హామీ ఇచ్చాడు. మిస్టర్ శర్మ విడవకుండా ఆయన్ని వారం-పదిరోజులకి ఒకసారి కలుసుకుంటూనే ఉన్నాడు.
ఇంక ఏరోజున మంత్రిగారివైపునుంచి ఉత్తరం వెళ్ళిందో ఆరోజు నుంచి ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. మిసెస్ శర్మ కూడా ఆనందించింది. ఇప్పుడు పని అయిపోయిందనే అనుకో. మంత్రిగారు చెబితే ఎవరైనా ఎలా కాదనగలరు. కాని ఆ సంతోషం కూడా తొందరగానే మాయమైపోయింది. నెలకూడా తిరక్కుండానే ఆయన అప్లికేషన్ రిజెక్ట్ అయింది. రిగ్రెట్ లెటర్ కూడా ఇచ్చారు.
మిసెస్ శర్మ నిరుత్సాహంగా అంది- “అయితే మనం రిటైర్ మెంటు వరకూ ఇక్కడే ఉండవలసివస్తుందా? ఆలోగా ఏదో ఒకటి జరిగే అవకాశం లేదంటారా?”
మిస్టర్ శర్మ మౌనంగా ఉండిపోయాడు. ఆయన మాత్రం ఏం చెప్పగలడు? తనవైపు నుంచి ఆయన చెయ్యగలిగినదంతా చేశాడు. తల్లిదండ్రులిచ్చిన వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు ఏదీ ఈ మహానగరంలో లేదు కదా. ఉంటే అన్నీ విడిచిపెట్టి అక్కడికే వెళ్ళిపోయేవాళ్ళు. ఇంక ఇప్పుడు ఇక్కడే ఉండక తప్పదు.
మిసెస్ శర్మ చాయ్ పెట్టి తీసుకువచ్చింది. మిస్టర్ శర్మగారికి కప్పు అందించి తనుకూడా ఆయనకి దగ్గరగానే కూర్చుంది. ఉన్నట్టుండి ఆవిడకి ఏదో జ్ఞాపకం వచ్చింది. ఆవిడ ముందుకి వంగి శర్మగారికి గొంతుక తగ్గించి చెప్పింది- “మీరు విన్నారా? మూడో నెంబరువాళ్ళ అమ్మాయి ముఫ్ఫైఒకటో నెంబరువాళ్ళ అబ్బాయితో రిజిస్టరు మ్యారేజీ చేసుకుంది.”
మిస్టర్ శర్మ ఏమీ మాట్లాడకుండా చాయ్ తాగుతున్నాడు. ఆయన ముఖంలో ఔత్సుక్యం కాని, ఆశ్చర్యం వ్యక్తపరిచే రేఖలు కాని ఏవీ లేవు. ఆయన వైపు నుంచి ఏమీ ప్రతిక్రియ రాకపోవడంతో మిసెస్ శర్మ కొంచెంసేపు మౌనంగా ఉండిపోయింది. కాని ఆవిడ మనస్సులో మరేదో విషయం స్ఫురించింది. ఆవిడ ఇంచుమించు సంతోషం వ్యక్తపరుస్తూ అంది- “నేను చెప్పేది వినండి. మనం ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఇల్లు అద్దెకి ఇచ్చేసి మనం ఇంకెక్కడైనా అద్దెకి తీసుకుని ఉందామా?”
“నీకేమన్నా పిచ్చి పట్టిందా?” తన మౌనవ్రతం ముగించి ఆయన ఫిరంగి పేల్చినట్టుగా అరిచాడు-“ఇందులో ఎంత రిస్కు ఉందో తెలుసా నీకు? ఎవరైనా రిపోర్టు చేశారంటే తిక్క అంతా అణిగిపోతుంది.” వెంటనే ఆయనకి ఆఫీసులోని గోవిందరావు జ్ఞాపకం వచ్చాడు. గోవిందరావు తన మొత్తం ఇల్లు అంతా అద్దెకి ఇచ్చేశాడు. ఎవరో ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఎస్టేట్ ఆఫీసువాళ్ళు ఒకరోజున రేడ్ చేశారు. గోవిందరావు పరుగులెత్తుకుంటూ తిరిగాడు ఎన్నిరోజులో. అతనిమీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నారు. ఇల్లు ఎలాగూ వెనక్కి తీసేసుకున్నారు. దానితోబాటుగానే ఆ ఇల్లు ఎలాట్ చేసినప్పటి నుంచి… అంటే నాలుగేళ్ళకి మార్కెట్ రేటు కూడా ఇచ్చుకోవలసి వచ్చింది.
మిసెస్ శర్మ చాయ్ తాగడం ముగిస్తూ అంది- “అరే, అటువంటిదేదీ జరగదు. మీరు ఊరికే భయపడిపోతున్నారు. ఇక్కడ అంతా తమ ఇళ్ళలోనే ఉంటున్నారా ఏమిటి? ప్రతి బ్లాకులోనూ నాలుగైదు ఇళ్ళు తప్పించి అందరూ అద్దెకి ఉన్నవాళ్ళే.”
“అయితే ఏమిటి? నేనుమాత్రం అటువంటి పని అసలు చెయ్యను.” మిస్టర్ శర్మ కూడా చాయ్ కప్పు కింద పెడుతూ తన నిర్ణయాన్ని తెలియపరిచాడు.
ఒక సాయంత్రం పరిస్థితి హద్దుమీరిపోయింది. మిసెస్ శర్మ లోపల కిచన్ లో ఉంది. అమ్మాయిలు లాన్ లో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. దగ్గరలోనే వాళ్ళ తమ్ముడు ఆడుకుంటున్నాడు. అప్పుడే కాగితంతో చేసిన ఒక రాకెట్టు వాళ్ళమధ్యకి వచ్చి పడింది. అమ్మాయిలు బస్ స్టాప్ వైపుకి తిరిగి చూడగానే కొందరు అబ్బాయిలు పకపకా నవ్వారు. ఒక అబ్బాయి అయితే నోట్లో వేళ్ళు పెట్టుకుని, తన కుడికన్ను కొడుతూ ఈల కూడా వేశాడు. “గాడిదవెధవలు…” అంటూ అమ్మాయిలు అటువైపునుంచి చూపులు మరల్చుకోగానే మరొక రాకెట్టు గాలిలో ఎగురుతూ వాళ్ళమీదకి వచ్చి పడింది.
వెంటనే పెద్దమ్మాయి లేచి బస్ స్టాప్ వైపుకి నడిచింది. ఆమె వెనకాలే చిన్నమ్మాయి కూడా బయలుదేరింది. అబ్బాయి వెంటనే లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మని పిలుచుకు వచ్చాడు. మిసెస్ శర్మ బయటికి వచ్చి చూసింది. పెద్దమ్మాయి ఒక అబ్బాయిని కాలర్ పట్టుకుని ఉంది. చిన్నమ్మాయి చెప్పుతో అతన్ని కొడుతోంది- “నీకు అక్కలు, చెల్లెళ్ళు లేరేంట్రా? సిగ్గూ-శరం లేకుండా రాకెట్లు వదిలిపెడుతున్నావు.. నీకూ నీ తోటి కుర్రాళ్ళకీ…”
మిసెస్ శర్మ పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మాయిల చేతుల్లోంచి ఆ అబ్బాయిని విడిపించింది. వాడివంక కోపంగా చూస్తూ అంది- “పో ఇక్కడినుంచి. లేకపోతే ఇంకా దెబ్బలు తింటావు.” ఆ పిల్లాడు ముఖం ఇంత చేసుకుని అక్కడినుంచి తప్పుకున్నాడు. మిగిలిన పిల్లలు అంతకిముందే ఇటూ-అటూ పారిపోయారు. బస్ స్టాప్ దగ్గర ఉన్న జనం వర్తులాకారంలో నిలబడ్డారు. మిసెస్ శర్మ అమ్మాయిలతో పాటు ఆ వృత్తంలో నుంచి బయటికి వచ్చి తమ ఇంట్లోకి వచ్చింది. ఆవిడ గుండె దడదడా కొట్టుకుంటోంది. కాని లోలోపలే ఆవిడ సంతోషంగా కూడా ఉంది. అమ్మాయిలు అలా చేస్తారని ఆవిడ అసలు అనుకోలేదు. వాళ్ళ ఈ రూపాన్ని ఆవిడ మొదటిసారిగా చూసింది. ఆవిడ శిరస్సు గర్వంతో ఉన్నతమయింది.
మిస్టర్ శర్మ ఇదంతా విన్నాక ఉప్పొంగిపోయాడు. “ఏమిటీ? నా కూతుళ్ళు ఇంత ధైర్యవంతులా!”
ఆ సాయంత్రం మిస్టర్ శర్మకి చాయ్ చాలా బాగుంది. రాత్రి పడుకునే సమయంలో మిస్టర్ శర్మ తన భార్యతో అన్నాడు- “మన అమ్మాయిలు నువ్వు ఇప్పటివరకూ అనుకుంటున్నట్లు అలాంటి-ఇలాంటి వాళ్ళు కారు సుమా.”
“అది సరే.” మిసెస్ శర్మ అంది, “కాని ఆ అల్లరివెధవలతో భరోసా ఏముంది? అమ్మాయిలు స్కూలుకి, కాలేజీకి బస్సులో వెడుతూ-వస్తూ ఉంటారు. రేపు ఇంకేమన్నా లేనిపోని ఇబ్బంది ఏదీరాకుండా ఉండాలి.”
“అరే, అదేమీ కాదు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నఆకుర్రాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడుంది. అమ్మాయిలు మాట్లాడకుండా ఊరుకున్నంతవరకూ వాళ్ళు అలా ఎగురుతారు. ఎప్పుడైనా అమ్మాయిలు జనం ముందు వాళ్ళని అగౌరవపరిచారంటే మొత్తం కుర్రతనపు పొగరంతా… ఎగిరిపోతుంది.”
“అయినా, ఈ ఇల్లు అసలు బాగుండలేదు.” మిసెస్ శర్మ మళ్ళీ పాతవిషయానికి వచ్చింది. “ఇక్కడ దొంగలభయం ఎక్కువగా ఉంటుంది.”
“అరే, ఈరోజుల్లో దొంగలభయం ఎక్కడలేదంటావు?” మిస్టర్ శర్మ ఆవిడకి నచ్చజెబుతూ అన్నాడు-“ఈ రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంటుంది.”
మాటల్లోనే మిసెస్ శర్మకి ఎప్పుడు కునుకు పట్టిందో మిస్టర్ శర్మకి తెలియనేలేదు.
దాస్ బాబు కొడుక్కి పుట్టినరోజు. మిస్టర్ శర్మ ఆఫీసు నుంచి బయలుదేరి తన కొంతమంది సహోద్యోగులతో తిన్నగా దాస్ బాబు ఇంటికి చేరుకున్నాడు. దాస్ బాబు వెనకటి రోజుల్లో మిస్టర్ శర్మ వాళ్ళ ఆఫీసులోనే ఉండేవాడు. ప్రస్తుతం మరో మినిస్ట్రీలో డెప్యుటేషన్ మీద ఉన్నాడు. దాస్ బాబుకి కూడా గవర్నమెంటు క్వార్టర్ అలాట్ చేశారు. ఆయన ఉన్న ఇల్లు కింద ఉండటమే కాక, ఒక మూలగా కూడా ఉంది. మూడువైపులా ఓపెన్ గా ఉన్న నేలను ఆయన అందమైన లాన్ గా మార్చేసుకున్నాడు. ఎత్తైన గోరింటాకు మొక్కలతో లాన్ ని కవర్ చేసి ఉంచాడు.
పార్టీనుంచి తిరిగివచ్చి మిస్టర్ శర్మ రాత్రంతా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. మర్నాడు తొందరగా లేచిపోయాడు ఆరోజు ఆదివారమైనా సరే. సెలవురోజున ఆయన తొమ్మిది-పది గంటలలోపల ఎప్పుడూ లేవడు.
బయటికి వచ్చి మిస్టర్ శర్మ చాలాసేపు ఇంటికి ఎదురుగా ఉన్న ఖాళీస్థలాన్ని చూస్తూ ఉండిపోయాడు. తరువాత ఒక్కసారిగా లోపలికి వెళ్ళి స్టోర్ రూంలో నుంచి ఒక విరిగిపోయిన తుప్పుపట్టిన పార తీసుకువచ్చాడు. రాతిముక్కతో కొట్టి-కొట్టి దాన్ని సరిచేశాడు. ఖాళీ స్థలాన్ని ఒకపక్కనుంచి తవ్వసాగాడు.
ముందుగా మిసెస్ శర్మ ఆయన్ని చూసింది. ఆ తరువాత పిల్లలు చూశారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిఉన్నారు. ఉండబట్టలేక మిసెస్ శర్మ అడిగేసింది- “ఏం చేస్తున్నారు మీరు?”
“ఇక్కడ మనం గోరింటాకు వేద్దాం.” ఒక్క క్షణం మట్టిని తవ్వడం ఆపుజేసి ఆయన భార్యవంక నవ్వుతూ చూసి అన్నాడు- “బాగా ఎదిగిన తర్వాత ఇది కంచె లాగా, మనం బయటివాళ్ళకి కనిపించకుండాఅడ్డుగా ఉండి మనని రక్షించడానికి పనికొస్తుంది. ఇంక మనం ఉండేది కూడా ఇక్కడే కదా!”
ఇప్పుడు ఆయనకి మిసెస్ శర్మ మాత్రమే కాక పిల్లలు కూడా సాయం చేస్తున్నారు.
***
సుభాష్ నీరవ్ – పరిచయం
27 డిసెంబరు 1953 న మురాద్ నగర్, ఉత్తర ప్రదేశ్ లో జన్మించిన శ్రీ సుభాష్ నీరవ్ (అసలు పేరు : సుభాష్ చంద్ర) హిందీ కథారచయితగా, కవిగా, పంజాబీ-హిందీలమథ్య అనువాదకర్తగా గత 42 సంవత్సరాలనుంచి ప్రసిద్ధి చెందినవారు. ఇప్పటివరకు వీరి 9 కథాసంకలనాలు, 3 మినీకథాసంకలనాలు, 3 కవితాసంకలనాలు, 2 బాలకథాసంకలనాలు, వెలువడ్డాయి. 6 కథాసంకలనాలకి సంపాదకత్వం చేశారు. కొన్ని కథలు విద్యాసంస్థల వేరువేరు స్థాయి కోర్సులలో పాఠ్యాంశాలుగా చోటు చేసుకున్నాయి. వీరు పంజాబీ నుంచి ఇంచుమించు 700 కథలు, 200 మినీకథలు, 500 కవితలను అనువదించారు. ఇవికాక వివిధప్రక్రియలలో 60 కన్నా ఎక్కువ సాహిత్యగ్రంథాలను పంజాబీనుంచి అనువదించారు. పంజాబీ కవితలకు ఒక హిందీఅనువాదసంకలనం సాహిత్య అకాడమీ, ఢిల్లీనుండి ప్రచురితమయింది. ప్రసిద్ధ హిందీపత్రికలు `కథాదేశ్’, `చేతన’, `మంతవ్య’ యొక్క పంజాబీ కథల ప్రత్యేక సంచికలకి సంపాదకత్వంమరియు పంజాబీనుండి అనువాదం చేశారు. ఉత్తమసాహిత్యసృజనకు భారతీయ అనువాద పరిషత్, రాజస్థాన్ పత్రిక, ఇండియా నెట్ బుక్స్ మొ. ద్వారా గణనీయమైన సన్మానాలు పొందారు. 2024 లో వీరు అందుకున్న `అమర్ ఉజాలా శబ్ద సమ్మాన్’, `హిందీ అకాడమీ అనువాద్ సమ్మాన్’,`వేలీ ఆఫ్ వర్డ్స్ బుక్ అవార్డ్’ కూడా విశిష్టమైనవి.జూలై 2025 లో ఇంటర్నేషనల్ ట్రాన్స్ లేషన్ అకాడమీ, కొచ్చిన్ వారు అనువాదానికి మొదటి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో వీరిని సన్మానించారు.కేంద్రప్రభుత్వంలో అండర్ సెక్రటరీ పదవినుంచి డిసెంబరు 2013లో రిటైర్ అయినతరువాత పూర్తిగా సాహితీవ్యాసంగానికి సమయం ఇస్తున్నారు. వీరు న్యూఢిల్లీ వాస్తవ్యులు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
