కనక నారాయణీయం -77

పుట్టపర్తి నాగపద్మిని

బైట వల్లంపాటి వెంకట సుబ్బయ్య నిలుచుని ఉన్నాడు.

‘నువ్వా నాయనా!రా రా! ఇంట్లో అంతా బాగున్నారా?’

ఆప్యాయంగా అడిగిందామె.

‘బాగున్నారమ్మా! అయ్యగారు ఉన్నారామ్మా ఇంట్లో?’

‘లేరయ్యా, రామకృష్ణ సమాజంలో ఉన్నారేమో!’

‘సరేనమ్మా! నేనక్కడికే  పోతాను.’

‘ఊరికేనా, ఏమైనా పనుందా?’

యధాలాపంగా అడిగిందామె.

తాను తెచ్చిన అరటి పళ్ళ సంచీని అమ్మకు అందిస్తుంటే ‘ఎందుకయ్యా ఇవన్నీ?’ అన్నదా తల్లి.

‘పెద్దవాళ్ళ దగ్గరికి వట్టి చేతులతో పోకూడదంట, మా అమ్మ అంటూ ఉంటుంది. అరటి పళ్ళే కదమ్మా!! నేను అయ్యగారిని అక్కడే కలుస్తాను.’

వెనుదిరుగుతున్న వెంకట సుబ్బయ్యనడిగింది కనకమ్మ,’నీ చదువూ, రచనలూ ఎట్లా ఉన్నాయి?’

వెంకట సుబ్బయ్యన్నాడు ,’నా సంగతేమో కానీ, ఇటీవల నాకొక మంచి కవి గారితో పరిచయమయింది. దిట్టమైన పద్య కవి అనిపించిందమ్మా! సంస్కృతాంధ్రాల్లో మంచి పట్టుంది. ఇంగ్లీష్ లో కూడా రచనలు చేస్తుంటాడట!

వారి పనిమీదే వచ్చినాను.’

‘అవునా? మంచిదే, ఇంతకూ ఆ కవిగారి పేరేమన్నావు?

వారి పేరు గుంటూరు శేషేంద్ర శర్మ గారమ్మా. వారు మా దగ్గర మునిసిపల్ శాఖలో ఉన్నతోద్యోగిగా ఉన్నారు. వారు ప్రాచీన, సంస్కృతాంధ్ర సాహిత్య విశ్లేషణలో దిట్ట అని అక్కడి మా పెద్దవాళ్ళమాట. ముఖ్యంగా వాల్మీకిలోని ఎన్నెన్నో విశేషాలు అద్భుతమైన విశ్లేషణతో చెబుతూ ఉంటారు. ఇటీవల వారు ఋతు ఘోష అని ఒక కావ్యం వ్రాశారు. దానికి స్వామివారితో ముందు మాట కోసం..’

వాల్మీకి అనగానే కనకమ్మ కళ్ళు విస్ఫారితాలయ్యాయి. ఆమెకు కూడా వాల్మీకి ప్రానంతో సమానం మరి.

‘అవునా? ఇంకేం మరి? మీ అయ్యగారిని కలిసి అడుగు.

తీరా రామకృష్ణ సమాజానికి వల్లంపాటి చేరుకునేసరికి పుట్టపర్తి ఇప్పుడే వెళ్ళిపోయారని తెలిసింది. అరెరే..ఎక్కడికి పోయుంటారబ్బా? పోతే ఇంటికే కదా? అనుకుంటూ, మణి హోటల్ లో కాఫీ తాగి, మళ్ళీ మోచంపేటలో పుట్టపర్తి ఇంటికి చేరుకున్నాడు వల్లంపాటి.

ఇంటి ముందు కూరగాయలు కొంటున్న కనకమ్మగారిని అడిగాడు, అయ్యగారు ఇంట్లో ఉన్నారామ్మా?’ అని!

‘ మిద్దె మీదే ఉన్నారు. పో మరి!’ చెప్పారామె!

శుభ శకునం అనుకున్నాడు వల్లంపాటి.

మెల్లిగా మెట్లమీదుగా మేడమీదికి చేరుకుంటూండగా పుట్టపర్తివారి గాత్రసాధన ధీర గంభీర స్వరంలో!

     శివుని  దలచవే ఓ మనసా..

     భవ భయ బాధల పారగ ద్రోలెడు.

                      ..శివుని తలచవే ఓ మనసా..

ఎంతో గంభీరంగా వారి గొంతు వినిపిస్తూ ఉంది. ఆ నిముషంలో వారి ధ్యానాన్ని భంగపరచటం భావ్యమా? సందేహంతో పిల్లి వలెనే నెమ్మదిగా అడుగులు ముందుకు వేశాడు వల్లంపాటి. మరి కొంతసేపు ఆగి వారి సంగీత సాధనను ఆస్వాదిద్దామనుకుంటూ, మెట్లమీది మలుపు దగ్గర మెల్లిగా కూర్చున్నాడు.

     రక్ష లేక మార్కండేయుదు శుభ

     లక్షణుడు చరణంబులు గొలిచిన

     ఆ క్షణంబుననె యముని నదలిచి

     ఆక్షయ మోక్షము ఆ ముని కొసగిన…శివుని దలచవే..

     కరకటెరుక విజ్ఞానము లేకయె

     కరకుట్లే నైవెద్యంబిడగ,

     పరమ ప్రీతితో భుజియించి తా

     తిరమగు మోక్షము తిమ్మని కొసగిన…శివుని దలచవే..

     అష్తాక్షరిపతి ననవరతంబు

     ఆర్ద్రమైన భక్తిని సేవించి

     ఆతని దయతో అఖిల కాలముల

     అతి వేలము మాయకు లోబడని..శివుని తలచవే..ఓ మనసా…

స్వామి వారు ఎంతో గంభీరంగా హార్మోనియం మీద కూడా ఆ పాటను పలికిస్తూ పాటలో లీనమైపోయి పాడుతూ ఉంటే, తన్మయత్వం చుట్టుముట్టింది వల్లంపాటిని! ఒక వైష్ణవుడు, ఇంత గొప్పగా శివ స్తుతి వ్రాయటం,

అద్భుతం కదా! అనుకున్నాడొకసారి!

పాట ముగించినట్టు హార్మోనియం మూత వేసిన చప్పుడు.

ఇంతలో దగ్గు మొదలయ్యింది స్వామివారికి! దగ్గుతూనే ,’కనకా! మంచినీళ్ళూ!’అని గట్టిగా పిలవటం వినిపించి, తానే గబగబా మెట్లు దిగి వంటింట్లో పనిలో ఉన్న అమ్మగారినడిగి, పెద్ద స్టీల్ గ్లాస్ లో నీళ్ళు తీసుకుని అవి తొణికి పోకుండా జాగ్రత్తగానూ, త్వరగానూ మెట్లెక్కి పైకి చేరుకున్నాడు వల్లంపాటి.

మంచి నీళ్ళ గ్లాసు పుట్టపర్తి వారికందించాడు నమస్కారం అంటూ!

చిరునవ్వుతో నీళ్ళందుకుంటూ కళ్ళెగరేశారు పుట్టపర్తి ,’నువ్వెప్పుడు వచ్చినావురా?’ అన్న అర్థం స్ఫురింపజేస్తూ!

‘వచ్చి పదినిముషాలైంది స్వామీ! మీరెంతో గంభీరంగా గాత్ర సాధన చేసుకుంటూ ఉంటే భంగపరచడమెందుకని, మెట్లమీదే కూర్చున్నాను.’

మంచి నీళ్ళు తాగిన తరువాత పుట్టపర్తి అన్నారు, ‘అట్లనా? ఇంట్లో అందరూ బాగున్నారారా?’

‘అందరూ బాగున్నారు స్వామీ!’

‘ఇంతకూ నువ్వొచ్చిన పనేందప్పా?’

‘ఆ..ఏమీ లేదు కానీ..’ ఆగిపోయాడు వల్లంపాటి.

‘మదనపల్లె నుంచీ పనేమీ లేకుండా నన్ను చూసేదానికే వచ్చినావా?’ పుట్టపర్తి ముఖంలో దరహాసం.

‘సరేలే! ఆ సంచిలో ఏముందప్పా?’

చల్లకొచ్చి ముంత దాచటం అన్న సామెత గుర్తుకు వచ్చింది వల్లంపాటికి!

మెల్లిగా వెంట తెచ్చిన సంచీలోనుండి, వ్రాత ప్రతి నోట్ బుక్ బైటికి తీసి, పుట్టపర్తి ముందున్న కరణం బల్ల మీద పెట్టి అన్నాడు.’ మన్నించవలె! మా దగ్గర మునిసిపల్ కమీషనర్ హోదాలో పనిచేస్తున్నారు గుంటూరు శేషేంద్ర శర్మగారని! వారు సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితులని అక్కడ పండితులన్నారు స్వామీ! వారి మాటల్లో వాల్మీకి మొదలు చాలామంది కవుల శ్లోకాలు అలవోకగా దొర్లిపోతుంటాయి. తెలుగులో పద్యరచనలో మంచి నిపుణులు కూడా! ఆంగ్ల సాహిత్యమూ బాగా చదువుకున్నారు. వారు ఇటీవల ఒక ఖండ కావ్యం వ్రాసినారు. దానికి మీ…’ ఆగిపోయాడు వల్లంపాటి.

‘ఊరకరారు మహాత్ములు.. అని పెద్దలేనాడో అన్నది ఇందుకేరా నాయనా! ఇంతకూ ఆయన పేరేమన్నావు?’

‘గుంటూరు శేషేంద్ర శర్మ.’

‘ఓహో! అంటే ఉత్తరాది వాడన్నమాట! పైగా శర్మ అంటున్నావు. వేదాలూ అవీ కూడా చదివినవాడు. అటువంటి వాళ్ళకు ఏదో యీ రాళ్ళ సీమలో ఒక మూల బతకలేక బడిపంతులుగా పనిచేసుకుంటున్న నా అభిప్రాయం ఎందుకురా? అక్కడే గొప్ప గొప్ప వాళ్ళున్నారు కదా చాలామంది!’

‘మీ గురించి వారు చాలా విన్నారంట! మీరు మహాకవిగా అక్కడివారికి బాగా తెలుసు. అందుకే..’ మళ్ళీ వల్లంపాటి గొంతు ఆగిపోయింది.

‘ఈ మాటలకేమిలే గానీ, నాకు అక్కడి వాళ్ళతో చాలా చిత్రమైన అనుభవాలున్నాయిరా వెంకట సుబ్బయ్యా! సీమ వాళ్ళకేమీ రాదనీ, ఉట్టి కోతల రాయుళ్ళనీ, ఆవేశ కావేశాలకే తప్ప సాహిత్యంలో అ ఆల జ్ఞానం కూడ లేదనేసినారొకసారి! ఇక్కడ అలంపూరు సభలో ఎంత అవమానపరచినారో ఇక్కడికొచ్చిన అక్కడివాళ్ళు !!శ్రీపాదతో వాళ్ళ ఊరిలోనే ముఖాముఖిగా కొట్లాడి మరీ వచ్చినానప్పా, నా పాండిత్యాన్ని ఎగతాళి చేస్తే! ఇంకా ఇదిగో, యీ తలమీద వెంట్రుకలన్ని అనుభవాలు! అందుకే, వాళ్ళకొక మాట చెప్పు, పుట్టపర్తికి తీరిక లేదంట అని చెప్పెయ్!’

‘అదికాదు స్వామీ..’

‘ఆ..ఇంతకూ..నీ రచనా వ్యాసంగం ఎట్లా ఉందప్పా?’ మరో మాటకు అవకాశం లేనట్టు అన్నారు పుట్టపర్తి.

‘స్వామీ! నేను..’

‘కొత్త బుక్కులేమీ చదవలేదా ఇంకా! పోనీలే! నీకింకా వయసుంది. శక్తీ ఉంది. ఫరవాలేదులే! పోయిరారా! నాకూ వేరే పనుంది.’ మరో మాట మాట్లాడే సాహసం చేయటానికే భయం వేసింది వెంకట సుబ్బయ్యకు! నమస్కారం చేసి, మెల్లిగా మెట్లు దిగి కిందికి వచ్చాడు.

కనకమ్మగారు పడసాలలోనే ఉన్నారు. వల్లంపాటిని చూస్తూనే నవ్వుతూ అడిగారు,’వచ్చిన పని ఏమైందప్పా?’ అని!

ముఖం వేలాడేసుకుని ఉన్న వల్లంపాటిని చూస్తూనే అర్థమైపోయిందామెకు.

పనికాలేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు వల్లంపాటి.

‘ఇంతకూ, నువ్వు తెచ్చిన ఆ వ్రాత ప్రతి ఎక్కడ?’ అడిగారు శ్రీమతి పుట్టపర్తి.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.