
ఒక అప్రకటిత శిల ఆమె
-గవిడి శ్రీనివాస్
ఆమె ను చూస్తే నువ్వులు పూస్తాయి
కలలు వికసిస్తాయి వెన్నెల కురుస్తుంది.
ఆమె తొలి నాటి కలల ప్రతిరూపంగా
తొమ్మిది నెలల ఆశల ఆకాశాన్ని మోసింది.
ఇన్ని కుంకుమ పువ్వుల్ని పాలలో సేవిస్తూ
కాసింత కాటుకని కళ్ళలో మెరిపిస్తూ
కాలాన్ని కను రెప్పల పై మోసుకు పోయింది.
సమయం ఆసన్నమైనాక
చిన్న శిశువు ఉదయం కోసం
ఆకాశం వంక చూస్తూ కన్నీళ్ళ ను వదిలింది.
నల్లని మేఘాలు ఉరిమాయి
నెత్తుటి ముద్దలా కలలు రాలాయి.
మత్తు నుంచి లేచేసరికి
ఒక ప్రాణం ప్రవాహంలా
కొట్టుకు పోయింది.
ఆమె ఒక అప్రకటిత శిలలా మారింది.
ఆమె కలలు రాలిన సందర్భాన్ని తలచుకున్నప్పుడల్లా
రెండు కన్నీటి ప్రవాహాలు
హృదయాల్ని ముంచిపోతుంటాయి.
నిశ్శబ్దం ఆవరించిన ఆమెలో
మాతృత్వపు పేగు తెగి
సుడిగుండంలా ఆలోచనలు తిప్పుతూ
తల్లడిల్లుతూనే వుంటుంది.
ఆమె ఇప్పుడు
ఒక అప్రకటిత శిల.
*****

గవిడి శ్రీనివాస్ ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు. సెయింట్ ఆన్స్ స్కూల్ లో గణిత ఉపాధ్యాయునిగా చేశారు. నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. కన్నీళ్లు సాక్ష్యం, వలస పాట ప్రచురితమైన కవితా సంపుటులు. 2016లో సాహితీ సమాఖ్య నుండి కవితాసృజన పురస్కారాన్ని, 2017లో పాలపిట్ట మాస పత్రిక నుండి గొట్టిపర్తి లక్ష్మి నరసింహారావు పురస్కారాన్ని అందుకున్నారు.
