కనక నారాయణీయం -78

పుట్టపర్తి నాగపద్మిని

కనకమ్మగారు పడసాలలోనే ఉన్నారు. వల్లంపాటిని చూస్తూనే నవ్వుతూ అడిగారు,’వచ్చిన పని ఏమైందప్పా?’ అని!

ముఖం వేలాడేసుకుని ఉన్న వల్లంపాటిని చూస్తూనే అర్థమైపోయిందామెకు.

పనికాలేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు వల్లంపాటి.

‘ఇంతకూ, నువ్వు తెచ్చిన ఆ వ్రాత ప్రతి ఎక్కడ?’ అడిగారు శ్రీమతి పుట్టపర్తి.

వెంకట సుబ్బయ్య బ్యాగ్ లో నుంచీ పుస్తకం తీస్తూ ఉంటే ఇంతలో తులజ లోపలికి వచ్చింది.

వెంకట సుబ్బయ్యను చూడగానే,’బాగున్నారా అన్నా?’ అంది.

‘బాగున్నానమ్మా! ఇంతకూ మీ చిత్తూరు ప్రయాణం గురించి మీ స్నేహితురాళ్ళు ఏమన్నారు?’ అడిగాడు వెంకట సుబ్బయ్య.

‘మీరు బాగా చూపించినారు కదా! పైగా చక్కెర ఫాక్టరీకి కూడా తీసుకొని పోయినారు. వాళ్ళకు చాలా నచ్చింది ఆ ఫాక్టరీ.’

కనకమ్మ ముఖంలో చిరునవ్వు.

వెంకట సుబ్బయ్య బుక్ తీసి ఆమె చేతికిచ్చాడు.

ఇంతలో పుట్టపర్తి మిద్దె మీదనుండీ కిందకు వచ్చారు.

‘ఒరే, నువ్వింకా పోలేదా?’

‘వాడెక్కడికి పోతాడు? ఏదో పనిమీద వచ్చినాడు కదా! అదవ్వాలంట!’

కనకమ్మగారు, బుక్ చేతిలో పట్టుకుని లోపల టేబుల్ మీద పెట్టి తళిహింట్లోకి వెళ్ళారు.

‘ఒరే సుబ్బయ్యా! నేనేమో ‘కవుల ప్రశంస జేసి నవ భాగ్యములందుటకంటె ….మృణ్మయ పాత్రలో అన్నం తిన్నా చాలు తండ్రీ’ అని నియమం పెట్టుకున్న వాడిని. గుణిని గుణజ్ఞో రమతే.. ఒకరిలోని పాండిత్యం,  ఎదుటివాడిలోని పాండిత్యాన్ని చూసినప్పుడు  ఉప్పొంగిపోతుందని పెద్దలన్నారు కానీ, ‘బోద్ధారో మత్సర గ్రస్తా:’  అన్న మాట కూడా అన్నారురా! ఇటువంటి వారినే నేను ఎక్కువగా చూసినాను కోస్తా జిల్లాలలో! (ఇది పుట్టపర్తి అనుభవం అప్పటి కాలంలో.) డబ్బు పొగరూ, వారి భాషే నాగరీకమైనదన్న భావనా.. ఇవన్నీ చూసి, అసహనం నాలో! పైగా సీమ వాసులంటే తక్కువ చూపు. అందుకే నేను ఇట్లా కఠినంగా తయారైనాను.’ ఈ మాటలంటూ నడుస్తూ వెళ్ళి పుట్టపర్తి పడసాల (హాల్) లో కుర్చీ మీద కూచున్నారు.

ఈ లోగా కనకమ్మ గారు చెంబులో మంచి నీళ్ళు తెచ్చి పుట్టపర్తి వారి పక్క టెబుల్ మీద పెట్టి, వెంకట సుబ్బయ్య ఇచ్చిన వ్రాత ప్రతి మళ్ళీ అతనికిస్తూ అన్నారు, ‘ఏదీ, దీనిలోంచీ రెండు పద్యాలు చదివి వినిపించు.’ అన్నారు.

అమ్మవారి అనుగ్రహం లభించింది. ఇక అయ్యవారి దయా కురుస్తుందనే నమ్మకంతో వెంకట సుబ్బయ్య బుక్ తెరిచి అందుకున్నాడు.

                 నీలి జలంబు నీలి ధరణీ వలయంబు వినీల శైలముల్

                నీలి తరు ప్రపంచములు నీలి యనంతము యెందు జూచినన్

                నీలిమ; నీలిమా కలిత నిర్భర కంఠము పిల్చినట్లు నా

                నీలిమ దేహ పంజర వినిర్గతమై పరుగెత్తె నెంతయున్!

రాగ యుక్తంగా పద్యం చదివి, తలెత్తి చూశాడు వల్లంపాటి.

పుట్టపర్తి దంపతులిద్దరూ కళ్ళు మూసుకుని, జాగ్రత్తగా వింటున్నారు అని నిర్ధారణైంది.

మరొక మంచి పద్యం కోసం పుటలు తిరగేసి,మళ్ళీ మొదలుపెట్టాడు.

                ఇది వాసంత రస స్రవంతి; ఇది ధాత్రీజీవకూలంబులన్

               గదియంబారెను హోరుమంచు నళినీకాసారతీరంబులన్

               బొదలన్ దోటల  బాటలాధరలతో పోలేని కూలీ జనుల్

               మదిలో గుందుచు చేలలో దిరిగిరా మధ్యాహ్న కాలంబులన్!

వెంకట సుబ్బయ్య తలెత్తి చూశాడు. కనకమ్మ గారి ముఖంలో ప్రసన్నత.

‘గాధా సప్తశతి బాగా చదివినట్టు తోస్తూంది.’ అన్నారు.

 కానీ పుట్టపర్తి గారి మోములో ఇంకా యే భావమూ కనిపించటం లేదు. ధైర్యం విడనాడకుండా, పుటలు తిరగేసి మరో పద్యం శ్రావ్యంగా అందుకున్నాడు.

             లోకాలోక పరీత భూవలయ కల్లోలంబులన్ దాటి యే

            రాకా కోకిల శోకమో మలయ నారంభించె వాసంతికన్,

            నా కల్యాణ హృదంతరాళ కలకంఠ స్వైరఘంటాపథ

            వ్యాకీర్ణ స్వర మాధురీలహరులై భాసింప తద్వైఖరుల్.

కనకమ్మగారి మోములో ఆనంద తాండవం. ‘అబ్బో, శ్రీనాథుడి సహవాసం బాగానే చేసినట్టుందండీ ఇతనెవరో! వెంకట సుబ్బయ్యా! భేష్! మీ స్వామి పీఠిక రాస్తారులే. దిగులెందుకు?’ అని తళిహింటిలోకి వెళ్ళిపోయారు కనకమ్మ గారు.

‘ బ్రదుకు జీవుడా! అనుకుంటూ, స్వామి ముఖం కేసి చూస్తే, చేత్తో సైగ చేశారు, మరో పద్యం చదవమని! వల్లంపాటి హుషారుగా అందుకున్నాడు.

             ముదుసలి తల్లిదండ్రులను ముగ్గురు పిల్లలు చిన్న చెల్లెలున్

            ఒదిగి పరున్న జీర్ణ కుటిలో నిటువైపున భార్య యావలన్

           జిదుగుల చెంత దాను శయ నించును కన్నులు మూసి మిన్నులన్

           దదియ శశాంక రేఖయు నితాంత నిశాగతి నస్తమింపగన్!

పుట్టపర్తి యీ పద్యాన్ని రెండవ సారి వినిపించమన్నారు. ‘బాగుంది. పద్య రచనలో చేయి తిరిగిన పద్ధతి బాగుంది. సీసమేదైనా ఉందా?’ అడిగారు.

వెంటనే మొదలు పెట్టాడు, వెంకటసుబ్బయ్య.

           వివిధ నిమ్నోన్నత వీధులన్ బరువెత్తి

                 వైశాఖలో మేను వాల్చెనొకడు,

          ద్రాఘిష్ట ఘంటా పథమ్ములందిరుగాడి

                 బెజవాడ కన్నీరు బెట్టెనొకడు

           మధ్యాహ్న పరితప్త మార్గమ్ములంబోయి

                గుంటూరులో కుప్ప గూలెనొకడు

           కాలాహి కుటిల శృంగాటకమ్ములు జుట్టి

                 నెల్లూరిలో సొమ్మసిల్లెనొకడు

           క్రూర దారిద్ర్య దుర్విధి కారణమున

           తన భుజాగ్రమునెక్కు భేతాళ మూర్తి

          సర్వ కాలానువర్తి రిక్షా ధరించి

          లాగలేకను వేసవికాగలేక!

‘భలే ఉందిరా! విశాఖనూ, బెజవాడనూ, గుంటూరినీ, నెల్లూరునూ గ్రీష్మ తాపానికి పరాకాష్టగా వర్ణిస్తూ, చివరికి రిక్షావాడి వేదనతో ముడిపెట్టడం, నాకు నచ్చింది. బుక్ ఇక్కడే పెట్టేసి పో! మొత్తం చదివి, ముందుమాట రాస్తాలే!’

వెంకట సుబ్బయ్య ముఖంలో  IAS  పాసైనంతటి సంతోషం!

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.