
చిత్రం-72
-గణేశ్వరరావు
ప్రముఖ చిత్రకారుడు చంద్రను తెలియనివాళ్ళు వానలో తడవని వాళ్ళు ఉండరు. చంద్ర కథకుడు కూడా. అతని కథలు చదవడం, అతని బొమ్మలు చూడటం వేరు.. వేరు;
చంద్రను ప్రముఖుల దృక్కోణంనుంచి చూడటం వేరు. స్థూలంగా వాళ్ళందరు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఒకటే – చంద్ర గొప్ప చిత్రకారుడు, కానీ ఆ విషయాన్నే ఒక్కొక్కరు ఒక్కక్క రీతిలో వాటిని వెలిబుచ్చుతారు. ఒకే ఇతివృత్తాన్ని తీసుకొని పదిమంది రాసినప్పుడు కథా శిల్పం ఒకేలా ఉండదు కదా! అందరూ చంద్ర గురించి బాగా రాసినది.. అందరిలోకి నాకు నచ్చింది – ‘అనుభూతి కవి’ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రాసింది. చంద్ర గురించి వారు వెలిబుచ్చిన అభిప్రాయం :” మా వ్యసనాలు సమానం కావడం వల్లనో ఏమో మా మైత్రి చెదిరి పోలేదు.. వ్యసనం అంటే దు:ఖం – మనస్సు నిభాయించలేని సౌందర్యం – ప్రకృతిలో, ప్రవృత్తిలో, శిల్పంలో, సంగీతంలో అది ఎక్కడైనా ఉండొచ్చు. అదేదో మాలో ఉంది. .. చంద్ర కొన్ని వేల కథలకు బొమ్మలు వేసి ఉంటాడు. అతని చేతిలో అద్భుత గుణం ఏమంటే – ఆయా సన్నివేశాల ఉ ద్రిక్త సాంద్రత – ఊహనుంచి దృశ్యంగా మార్చగలడు. బొమ్మలో త్రీ డైమెన్షనల్ ఎఫెక్ట్ – డెప్త్ తీసుకురాగలడు. .సన్నివేశానికి సంబంధించిన దృశ్యానికి జీవాన్నీ, విస్తృతిని సమకూరుస్తాడు.. పాత్రల బొమ్మల హావభావాలను కళ్ళ ద్వారా చిత్రిస్తాడు. అతని చిత్రకళలో ఆకర్షించే విధానం ‘కూర్పు’ – కంటికి నిండుగా ఉంటుంది. ఆతను రంగులు సమకూర్చడంలో ఒక లయ వుంది. సన్నివేశాల మనోవృత్తుల్ని చిత్రించడం – పాత్ర గతంగా ఉండే మన స్థితిని అధ్యయనం చేసి తన చిత్ర రచనలో వాడటం చంద్రకి తెలుసు .”
నేను పోస్ట్ చేసినది నాకు నచ్చిన రూప చిత్రం. దాశరధి కవితకు కూర్చినది. అందమంతా బొమ్మలో ఉంది, కవులు కథకులు చెప్పని ఎన్నో విషయాలని అవి కళాత్మకంగా చెబుతాయి.
*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
