
వీలునామా
वसीयत
హిందీ మూలం – – డా. ఆశా పాండే
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
[`చాల్’ అంటే ముంబయిలో ఒక ప్రత్యేకపద్ధతిలో కొన్ని అంతస్తులతో సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్మించిన నివాసగదుల భవనం. ఒక్కొక్క గది ఒక కుటుంబం నివసించే యూనిట్. దీనినే `ఖోలీ’ అంటారు. `మ్హాడా’ అంటే – మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డవలప్ మెంట్ అథారిటీ.]
***
ఇక్కడే, ఇదే చోట ఒక చాల్ ఉండేది. అందులో నాలుగు ఖోలీలు మావి. అటువైపు ఆనంద్ అపార్ట్ మెంట్ కి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లోకి మేము తరువాత వచ్చాం. మొదట్లో ఇక్కడినుంచి ఆ ఫ్లాట్ కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు చూస్తే, మధ్యలో ఇన్ని ఫ్లాట్లు తయారైపోయాయి. ఇక్కడ ముంబయి గురించి అయితే అడిగే పని లేదు. ప్రతి నెలలోనూ ఒక కొత్త ఫ్లాట్ పుట్టుకువస్తుంది.
ఆ సంవత్సరం మ్హాడా స్కీము ఈ ఏరియాకి కూడా వచ్చింది. మా అన్నయ్య కూడా ఫారం పూర్తిచేసి వాళ్ళకి ఇచ్చాడు.
మా అన్నయ్య అదృష్టంకొద్దీ లాటరీలో వాడి నెంబరు వచ్చింది. అప్పుడు వాడిదగ్గర పూర్తిగా డబ్బుకూడా లేదు. దొరికిన చోట అప్పుతెచ్చినా చాలలేదు. మా వదిన మా అమ్మ నగలని అమ్మివేయమని అన్నయ్యకి సలహా ఇచ్చింది. నగలు అనేవి ఉన్నది ఇటువంటి అవసరాలకోసమే కదా. అన్నయ్య ఆ నగలని అమ్మేశాడు. అమ్మ నగలకి డబ్బులు బాగానే వచ్చాయి… పాతకాలంనాటి సిసలైన బంగారంతో చేసిన లావుపాటి నాలుగు కడియాలు, మెడలో వేసుకునే లావుపాటి గొలుసు, నాయనమ్మ ఇచ్చిన లావుపాటి బంగారు ఒడ్డాణం కూడా ఉంది. ఉంగరాలు, దుద్దులయితే చాలా జతలు ఉండేవి అమ్మదగ్గర. కొన్ని తనకి పెళ్ళిసమయంలో వచ్చినవి. కొన్ని నాయనమ్మ ఇచ్చినవి. అమ్మ ఉన్నంతవరకూ తన నగలని జాగ్రత్తగా సంరక్షించి ఉంచింది. అందువల్లనే కదా ఆ నగలు అన్నయ్యకి ఉపయోగపడ్డాయి.
మా ఫ్లాట్ నాలుగో అంతస్తులో ఉంది. ఆ అంతస్తులో ఇంకా నాలుగు ఫ్లాటులు ఉన్నాయి. అన్నీ వన్ బి.హెచ్.కే.లు… ఒక హాలు, ఒక బెడ్ రూం, ఒక కిచెన్… వంటిల్లు కూడా కలిపి మొత్తం మూడు గదులు. ఉండేది మేము అయిదుగురం- నేను, మా అన్నయ్య, మా వదిన, వాళ్ళకి ఇద్దరు పిల్లలు- ఒక కొడుకు, ఒక కూతురు.
నేను పొద్దునే లేచి ఇంట్లో చీపురుతో తుడిచి, తడిగుడ్డతో శుభ్రం చేసేదాన్ని. గిన్నెలు తోమేదాన్ని. దుకాణం నుంచి పాలు, బ్రెడ్ తీసుకువచ్చేదాన్ని. కూరలు తరిగేదాన్ని. పిండి తడిపి పెట్టేదాన్ని. అప్పటికి మా వదిన కూడా లేచేది. మా వదినకి ఇంట్లో ఎక్కువమంది జనం ఉండటం ఇష్టం ఉండేది కాదు. అందుకని ఆవిడ నిద్ర లేవగానే నేను హాలుకి ఆనుకుని ఉన్న పైకి వెళ్ళే మెట్లమీద కూర్చునేదాన్ని. జనం లిఫ్టులో పైకి-కిందకి వెడుతూ వస్తూ ఉండేవారు. అందువల్ల మెట్లు ఖాళీగానే ఉండేవి. నేను కూర్చునేందుకు సరిపోయే చోటు దొరికేది.
టిఫిన్, భోజనం వదినే చేసేది. నన్ను చూస్తే ఆవిడకి అసహ్యంగా ఉండేది… నా పళ్ళు కొంచెం పెద్దవిగానూ, అందవికారంగానూ ఉండేవి. అందుకని. వంట పూర్తి అయేవరకూ నన్ను వంటింట్లోకి రానిచ్చేది కాదు. వదిన అందరికీ బాక్సుల్లో టిఫిన్ సర్దిపెట్టి తనకి కూడా టిఫిన్ తీసుకుని డ్యూటీకి బయలుదేరి వెళ్ళిన తరువాతనే నేను వంటింట్లోకి వెళ్ళేదాన్ని. టిఫిన్ కాని, అన్నం కాని ఏది ఉంటే అది తిని వంటిల్లంతా శుభ్రం చేసేదాన్ని. బట్టలు ఉతికేదాన్ని. మధ్యాహ్నం కూర్చుని టి.వి. చూసేదాన్ని.
మా అన్నయ్య కూతురు మీతా పెద్దమనిషి అయాక దానికి పెళ్ళి చేశారు. కాని ఈ లోకంలో ఎటువంటి మనుషులు ఉన్నారో తెలియదు. పాపం దాన్ని ఎలా చూశారో ఏమో… అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. కొన్ని రోజుల తరువాత వాళ్ళనుండి తను విడాకులు తీసుకుంది. దాన్ని చూస్తే మాత్రం నాకు కడుపు తరుక్కుపోయేది. నేను లోలోపలే ఏడుస్తూ ఉండేదాన్ని.
ఇప్పుడు ఇంక మీతా కూడా ఇంట్లోనే ఉంటోంది. మధ్యాహ్నం పూట మేమిద్దరం కలిసికూర్చునే టి.వి. చూస్తున్నాం. తను దీవాన్ మీద కూర్చునేది. నేను కింద నేలమీద కూర్చునేదాన్ని. తను నన్ను అసహ్యించుకునేది కాదు. వదినకి సెలవు ఉన్న రోజున నేను పని పూర్తి అయిన తరువాత మధ్యాహ్నం అంతా మెట్లమీదనే కూర్చుని ఉండేదాన్ని. మిగిలిన రోజుల్లో ఏమీ ఇబ్బంది ఉండేది కాదు కాని వర్షాకాలంలో వానజల్లు మెట్లదాకా వస్తూఉండేది.
మా ఇంటికి ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో షిందే కుటుంబం ఉండటానికి వచ్చింది. షిందే వదినా, మా వదినా అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. లిఫ్టులో పైకి-కిందకి వస్తూ-పోతూ ఉండే సమయంలో నేను మెట్లమీద కూర్చుని కనిపిస్తే ఆవిడ నన్నుకూడా ఎలా ఉన్నావని అడిగేది. నా పెదవులు ఎక్కువగా తెరుచుకోకుండా జాగ్రత్త పడుతూ నేను నెమ్మదిగా నవ్వుతూ ఉండేదాన్ని. నవ్వడం తప్ప నేను ఆవిడకెప్పుడూ ఏమీ జవాబు ఇచ్చేదాన్నికాదు. క్రమంగా ఆవిడ నన్ను ఏమన్నా అడగడం కూడా మానేసింది. కాని ఎదురుపడితే మాత్రం తప్పకుండా నవ్వుతూ ఉండేది.
నా పళ్ళు అసహ్యంగా మురికిగా ఉన్నాయని మా వదిన అంటూఉండేది. మా వదిన నా పళ్ళు చూసి అసహ్యించుకుంటున్నట్లుగానే వేరేవాళ్ళకి కూడా నా పళ్ళు చూస్తే అసహ్యం కలుగుతోందేమోనని నేను అనుకునేదాన్ని. అందుకనే, నేను ఎవరితోటీ మాట్లాడటం, ఎవరినైనా చూసి నవ్వడం మానేశాను.
ఒకరోజున మా వదినకి సెలవురోజు అయినప్పుడు తను పకోడీలు చేసింది. ఒక ప్లేటునిండా పకోడీలు పెట్టి నన్ను షిందే వదిన యింట్లో ఇచ్చిరమ్మని చెప్పింది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు షిందే వదిన నన్ను కూర్చోమంది. నేను సంకోచిస్తూనే కూర్చున్నాను. ఆవిడ నన్ను అడిగింది-“నువ్వు వీళ్ళ యింట్లో పని చేస్తున్నావా?” నేను నా నోటిమీద చెయ్యి అడ్డంపెట్టుకుని చెప్పాను-“లేదు. ఇది మా అన్నయ్యగారి ఇల్లు. నేను ఇక్కడే ఉంటున్నాను.”
“ఈయనకి నువ్వు చెల్లెలివా?”
“అవును.”
ఆవిడకి నమ్మకం కలిగినట్టు లేదు. అందుకే అదే ప్రశ్న నన్ను మళ్ళీ అడిగింది- “నిజంగా! నువ్వు ఈయనకి చెల్లెలివా?” నేను మళ్ళీ “అవును” అని చెప్పాక ఆవిడ ఊరుకుంది. నేను లోలోపలే సిగ్గుతో బిక్క చచ్చిపోయాను. ఈవిడ నన్ను పనిచేసే అమ్మాయి అనుకుంటోంది.
ఆవిడ నాకు చాయ్ తాగమని ఇచ్చింది. కొంచెంసేపు అక్కడ కూర్చుని నేను తిరిగి వచ్చేశాను. ఆరోజు ఆవిడతో నేను ఎక్కువ మాట్లాడలేదు. కాని, ఆ కాస్తలోనే, అంతమాత్రంతోనే నాకు ఆవిడ ఎంతోబాగా నచ్చింది. ఆవిడతో మళ్ళీమళ్ళీ మాట్లాడాలని అనిపించేది. నేను నా పళ్ళని బాగా రుద్ది-రుద్ది బ్రష్ చేసుకోసాగాను.
ఒకరోజు మధ్యాహ్నం. వదిన తన డ్యూటీకి వెళ్ళింది. తేజస్ స్కూలుకి, మీతా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు. నేను ఆవిడ తలుపు తట్టాను. తలుపు ఆవిడే తీసింది. నేను హడావిడిగా అడిగేశాను-“మీరు ఏ షాంపూ వాడతారు?… మీ జుట్టు చాలా బాగుంది. నేను కూడా అదే షాంపూ వాడదామనుకుంటున్నాను.” ఆవిడని ఎదురుగా చూసి నాకు చెప్పడానికి మనస్సులో అదే వంక తట్టింది. ఆవిడ నవ్వింది. ఆవిడ షాంపూ పేరు చెప్పింది. నిజానికి నాకు దాని అవసరం ఏమీ లేదు. నేను ఆ షాంపూ పేరు వెంటనే మరిచిపోయానుకూడా. ఆవిడని ఇంకో ప్రశ్న అడిగేశాను- “ఆరోజు పకోడీలు బావున్నాయా?”
“ఆ. చాలా బాగున్నాయి. రా, ఇలా వచ్చి కూర్చో.” నాకు కావలసింది కూడా అదే. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా లోపలకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను.
“ఉప్పు కాస్త తక్కువయిందని మీతా అంది.”
“లేదే, సరిపోయింది… నువ్వు కూడా తినే ఉంటావుకదా?”
“లేదు… పకోడీలు తక్కువయ్యాయి.” అనుకోకుండా నా నోట్లోంచి వచ్చేసింది. ఆవిడ నన్ను కొంచెంసేపు అలా తదేకంగా చూస్తూ ఉండిపోయింది. నేను నా తడబాటు నుంచి తేరుకునేందుకు అక్కడవున్న వస్తువులమీద దృష్టి సారిస్తూ కూర్చుండిపోయాను. ఆవిడ నన్ను అడిగింది- “నువ్వు ఇంత ఎండలోకూడా మధ్యాహ్నం అంతా బయట మెట్లమీదనే కూర్చుని ఉంటావు, ఎందుకని?”
ఆవిడ అడిగిన ప్రశ్న విని నాకు నవ్వాలనిపించింది. కాని ఎందుకనో నేను ఏడ్చేశాను. ఆవిడ నన్ను కౌగలించుకుంది. ఊరుకోబెట్టింది. కొంచెంసేపు అక్కడ కూర్చుని నేను మా ఇంటికి వచ్చేశాను.
ఆ తరువాత నేను అవకాశం దొరికినప్పుడల్లా ఆవిడ దగ్గరికి వెడుతూ ఉండేదాన్ని. ఆవిడ నన్ను చాలా విషయాలు అడుగుతూ ఉండేది. నేను ఆవిడకి చాలా విషయాలు చెబుతూ ఉండేదాన్ని. ఉదాహరణకి- మేము మొదట్లో వెనకాల ఉన్న చాల్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడు మా అమ్మా-నాన్నా లేరు. నాకు ఒక చాలా మంచి ఫ్రెండ్ ఉండేది. మేము కలిసి బజారుకి వెళ్ళేవాళ్ళం. సినిమాలు చూసేవాళ్ళం. భేల్ పూరీ, వడా-పావ్ తినేవాళ్ళం. నా స్నేహితురాలు చాలా లేని కుటుంబానికి చెందినది. తన చదువుకి అయ్యే ఖర్చు కూడా మా అమ్మే ఇస్తూ ఉండేది. నాన్నగారికి ఒక కిరాణా దుకాణం ఉండేది. మా నాన్నగారికి హార్ట్ ఫెయిల్ అయినప్పుడు ఆ షాపుని మా అన్నయ్యే చూసేవాడు. మా ఫ్రెండ్ చాలా మంచిది. మా అన్నయ్యతోపాటు బజారుకి వెడుతూ ఉండేది. షాపుకోసం బేరసారాలాడి టోకుగా సామాను కొనిపించేది.
పన్నెండో క్లాసు అయిన తరువాత మేమిద్దరం నర్సు ట్రైనింగులో చేరాం. ఆ ట్రైనింగులో మూడు-నాలుగు నెలలు మాత్రమే గడిచాయో లేదో ఒకరోజున మా అమ్మకి కూడా హార్టు ఫెయిల్ అయింది. నేనూ, మా అన్నయ్య, తల్లిదండ్రులు లేనివాళ్ళమైపోయాము. నా ఫ్రెండ్ మా ఇద్దరి విషయంలోనూ ఇప్పుడు ఇంకా శ్రద్ధ తీసుకోసాగింది. ఒకరోజున తను నాకు ట్రైనింగు వదిలేసి ఇంట్లోనే ఉండమని నచ్చ జెప్పింది. ఎందుకంటే అన్నయ్య తిండివసతి, ఇంట్లో కావలసినవన్నీ చూసుకోవడం ట్రైనింగుకన్నా ఎక్కువ అవసరమయిందని చెప్పింది. నాక్కూడా తను చెప్పింది బాగానే ఉందనిపించింది… నేను ఇంట్లో ఉంటే అన్నయ్యకి ఇల్లు ఇల్లులాగా ఉంటుందని, లేకపోతే అమ్మని తలుచుకుంటూ కూర్చుని ఉండిపోతాడని… ఇవన్నీ ఆలోచించి నేను నర్సు ట్రైనింగు వదిలేశాను. కొన్నాళ్ళ తరువాత అన్నయ్య పెళ్ళి చేసుకున్నాడు.
“నువ్వు చేసుకోలేదా పెళ్ళి?” నాకు మధ్యలోనే అడ్డంవస్తూ ఆవిడ అడిగింది.
“లేదు… చేసుకోలేదు… మొదట్లో నాకు చాలా సంబంధాలు వచ్చాయి. చాలా చోట్ల మాటలు కూడా అయ్యాయి. కాని మా అన్నయ్యకి, వదినకి ఏ అబ్బాయి కూడా నచ్చేవాడు కాదు. వాళ్ళకి నచ్చిన అబ్బాయికి నేను నచ్చేదాన్ని కాదు. ఆ తరువాత నెమ్మదిగా సంబంధాలు రావడం ఆగిపోయాయి… నేను కూడా ఎవరైనా పెళ్ళి చేసుకునేంత అందంగా లేను కదా…” నేను నవ్వాను.
“ఎవరన్నారు? నువ్వు ఇప్పుడుకూడా చాలా అందంగా ఉన్నావు. కాని నువ్వు సరయిన పద్ధతిలో ఉండవు… ఇంతకుముందు కూడా ఇలాగే ఉండేదానివేమో… ఇప్పుడు చూడు, … ఇంత పొడుగ్గానూ, వదులుగానూ ఉన్న కుర్తా వేసుకుంటున్నావు. మెడకి ఏ రంగుపడితే ఆ రంగు చున్నీ కప్పుకుంటున్నావు… నేనంటున్నానని తప్పుగా అనుకోకు. కాని, సరిగా ఉంటే ఇప్పుడు కూడా అందంగా ఉంటావు.”
“ఏమో… కాని, వదిన బట్టలు నాకు పెద్దవిగానూ, వదులుగానూ ఉంటాయి.”
“అయితే కుట్టించుకుని నీ కొలతకి సరిపోయేలా చేయించుకో.”
“టైలరు చాలా డబ్బులడుగుతాడు. ఈ డబ్బులతో అయితే కొత్తవే కుట్టించుకోవచ్చని వదిన అంటుంది.”
“అయితే కొత్తవే కుట్టించుకో. అది సరేకాని, నువ్వు మాట్లాడేటప్పుడు నోటిమీద చెయ్యి పెట్టుకుంటున్నావు. ఇదికూడా పాత అలవాటేనా?”
“అవును… నా పళ్ళు చాలా పెద్దవిగానూ, మురికిగానూ ఉంటాయి కదా.” నేను కిందకి చూస్తూ అన్నాను.
“నీ పళ్ళు అంత మరీ పెద్దవేమీ కాదు. మురికివి కూడా కాదు… నీ కొలతలకి సరిపోయేలా బట్టలు వేసుకో. మాట్లాడేటప్పుడు నోటిమీద చెయ్యి పెట్టుకోకు… నీలో ఎటువంటి లోపమూ లేదు. నిన్ను నువ్వు తక్కువగా అనుకోకు.”
నేనేమీ జవాబు చెప్పలేదు. ఆవిడ నిజమే చెబుతోందని నాకు ఆ రోజు మొదటిసారి అనిపించింది. నేను నా కొలతలకి సరిపోయేలాగానే బట్టలు వేసుకోవాలి. కొంచెంసేపు మౌనంగా ఉన్నాక నేను ఆవిడకి చెప్పాను- “నా ఫ్రెండ్ ఉన్నప్పుడు నేను తనతో వెళ్ళి నా కొలతలకి సరిపోయేలా బట్టలు కొనుక్కునేదాన్ని… తను బాగా సెలక్ట్ చేసేది. అప్పుడు నా దగ్గరకూడా డబ్బులు ఉండేవి.”
“నీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడ ఉంది?”
“ఇక్కడే ఉంది.”
“ఈ ఊళ్ళోనేనా?”
“అవును.” నేను గొంతుక కాస్త తగ్గించాను..
“నిన్ను కలుసుకునేందుకు ఎప్పుడూ రాదా?” నేనేమీ జవాబు చెప్పలేదు. తన మాటని కొనసాగిస్తూ ఆవిడ అంది, “తనకి పెళ్ళి అయివుండచ్చు కదా?”
“అవును. ఎప్పుడో అయింది.”
“పెళ్ళి అయాక బాధ్యతలెన్నో నెత్తిమీదకి వస్తాయి. అందువల్లనే తను రాలేకపోతోందేమో… మీరు కలుసుకుని కూడా చాలా కాలం అయివుండచ్చు. ఒకసారి నువ్వు వెళ్ళి కలుసుకుని రా. మళ్ళీ కలుసు కోవడం అనేది మొదలవుతుంది. నీక్కూడా బాగుంటుంది… ఒక్కదానివీ వెళ్ళడానికి ఇబ్బంది అయితే మీ మేనగోడలినో, వదిననో, నీతోకూడా తీసుకువెళ్ళు.” నేనేమీ మాట్లాడకుండా ఉందామనుకున్నాను. కాని నేను తలవంచుకుని నెమ్మదిగా ఎలా చెప్పానో నాకే తెలియదు-“మా వదినే నా ఫ్రెండు.”
“ఏమిటీ?” ఆవిడ గట్టిగా అని ఉలిక్కిపడింది. తరువాత చాలాసేపు వరకు మేమిద్దరం మౌనంగానే కూర్చుని ఉన్నాం. అప్పుడు ఆవిడ అంది- “అయితే నీ ఫ్రెండ్ చాలా తెలివైనది. మీ అన్నయ్యని, నిన్ను బుట్టలోపెట్టి తన పబ్బం బాగానే గడుపుకుంది. ఇప్పుడేమో నిన్ను ఇలా చూస్తోంది.”తరువాత నేను మా యింటికి వచ్చేశాను.
తరువాత చాలా నెలలవరకు అంతా బాగానే నడుస్తూ ఉంది. ఈలోగా మునిసిపాలిటీ వారు మా చాల్ ని పడగొట్టి ఆ స్థానంలో అపార్ట్ మెంట్ నిర్మించడం మొదలుపెట్టారు. మా ఖోలీలకి బదులుగా మా అన్నయ్యకి రెండు `వన్ ఆర్ కే’ ఫ్లాట్లు దొరుకుతాయి.
ఒకరోజున మాయింట్లో ఎవరూ లేనప్పుడు షిందే వదిన నన్ను వాళ్ళ ఇంటికి పిలిచింది. వాళ్ళ ఇంట్లో ఒక మేడమ్ కూర్చుని ఉంది. ఆవిడ ఒక సంస్థకి అధ్యక్షురాలని, వాళ్ళ సంస్థ మహిళల శ్రేయస్సుకోసం పని చేస్తుందని షిందే వదిన చెప్పింది. ఆ మేడం నన్ను మా నాన్నగారి పేరు, మా చాల్ అడ్రసు, నెంబరు అడిగింది. నేను ఆవిడకి చెప్పడం అంటే చెప్పాను కాని నాకు మనస్సులో అనిపించింది ఇప్పుడింక ఆ చాల్ పడగొట్టేశాక దాని అడ్రసు, నెంబరు అడిగి ఈవిడ ఏం చేస్తుందని. ఈ అడ్రసు, నెంబరు అడిగిన సంగతి ఎవరికీ చెప్పవద్దని షిందే వదిన నాతో అంది. నాకు ఆవిడ కావలసిన మనిషిలాగా అనిపించింది. అందుకనే నేను ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకున్నాను. ఎవరితోనూ అసలు చెప్పలేదు.
ఒక నెల తరువాత మునిసిపల్ కార్పొరేషన్ వారి నుంచి ఒక నోటీసు వచ్చింది. అది చదివి మా అన్నయ్య దిగులుగా ఉన్నాడు. నేను బయట మెట్లమీద కూర్చుని ఉన్నాను. అన్నయ్య వదినతో అంటున్నాడు- “ఖోలీకి కేవలంనేనొక్కడినే వారసుడిని కానని ఎవరో కంప్లయింట్ చేశారు. ఇప్పుడు చెకింగ్ చేస్తారు.” తరువాత వదిన ఆ కాగితాన్ని చాలా సేపటివరకు చదువుతూ కూర్చుంది.
అప్పటినుంచి చాలా రోజులవరకు మునిసిపల్ కార్పొరేషన్ నుంచి చాలామంది ఉద్యోగులు వచ్చారు, వెళ్ళారు. మా అన్నయ్య లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈ జరుగుతున్నదంతా నేను ఆ మహిళకి ఖోలీ అడ్రసు, నెంబరు చెప్పడంతోనే దీనంతటికి సంబంధం ఉండవచ్చునేమోనని నాకు అనుమానం వచ్చింది. అవకాశం చూసుకుని నేను ఎదురుగా ఉన్న వదిన దగ్గరికి వెళ్ళాను. ఆవిడకి అంతా చెప్పాను. నేను అడ్రసు, నెంబరు చెప్పడంవల్లనే ఇదంతా జరుగుతోందా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాను.
నేను షిందే వదినని అడిగినదానికి ఆవిడ జవాబు ఇవ్వకుండా మళ్ళీ నన్నే అడిగింది- “మీ నాన్నగారికి ఉండే ఖోలీలో నీకు కూడా వాటా కావాలని నువ్వు అనుకోవడంలేదా?”
“వాటానా! … వాటా తీసుకుని నేనేం చేసుకుంటాను? … నేను ఇక్కడే కదా ఉంటున్నాను.”
“అవును. మెట్లమీద కూర్చుని, ఇంకొకళ్ళు విడిచేసిన బట్టలు తొడుక్కుని, మిగిలితే ఏమన్నా తిని, లేకపోతే సరిపెట్టుకుని…” ఆవిడ ఆవేశంతో చెబుతోంది. నేను ఆశ్చర్యంగా ఆవిడని చూస్తూ ఉండి పోయాను. నిజానికి నాతో ఆవిడకి ఏం సంబంధం ఉందని! అయినా ఆవిడ నాకు ఎంత ఆత్మబంధువులాగా అనిపిస్తోంది! కొంచెంసేపట్లోనే ఆవిడ ఒక్కసారిగా సహజస్థితికి వచ్చి నార్మల్ అయింది. నా భుజంమీద చెయ్యివేసి అంది- “నాలుగు ఖోలీలకి బదులుగా రెండు ఫ్లాటులు దొరుకుతున్నాయి – వన్ ఆర్ కే అయితే మాత్రం ఏమయింది, కాని రెండు ఫ్లాటులు కదా- వాటిలో ఒకటి నీకు దొరికితే అందులో తప్పేముంది? …మధ్యాహ్నంపూట విశ్రాంతిగా గడపాలని నీకు అనిపించడంలేదా, చెప్పు?”
నేను `అవును’ అంటున్నట్లుగా తల ఊపాను.
“అయితే నువ్వు ఏం మాట్లాడకుండా ఉండు. కాస్త జాగ్రత్తగా ఉండి, ప్రాపర్టీకి చెందిన ఏ కాగితంమీద కూడా సంతకం చెయ్యకు. ఎప్పుడు చెప్పవలసిన అవసరం వచ్చినా తెగించి చెప్పు మీ నాన్నగారి ఆస్తిలో నీక్కూడా వాటా కావాలని. తెలిసిందా?”
నేను మళ్ళీ `అవును’ అన్నట్లుగా తలకాయ ఊపాను. కాని నాకు సరిగా అర్థం కాలేదు. దీనిగురించి నేనెప్పుడూ ఆలోచించనే లేదు. ఇది మా అన్నయ్య ఇల్లు. ఇందులో తనతో నేను ఉంటున్నాను. ఇలాగే ఉంటూ ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ నాకెప్పుడూ ఆలోచన రాలేదు. కాని ఇప్పుడు నాకు బుర్రలో ప్రతినిమిషం ఒకటే ధ్వనిస్తోంది—నాకు కూడా హక్కు ఉందని! రోజంతా నేను మెట్లమీదనే కూర్చుని ఉంటానని! నాక్కూడా హక్కు ఉంది, నేను వదిన విడిచేసిన బట్టలు ధరిస్తున్నాను! నాక్కూడా హక్కు ఉంది, నేను కుర్చీలోకాని, పక్కమీద కాని కూర్చోకూడదు! నాక్కూడా హక్కు ఉంది. నేను పకోడీలు, సమోసాలు లేకపోతే ఇంకేమైనా చేసినప్పుడు వంటింట్లో అవి తయారవుతూ ఉంటే చూసి సరిపెట్టుకుంటాను! నాక్కూడా హక్కు ఉంది! నాక్కూడా హక్కు ఉంది!
సుత్తిలాగా మాటిమాటికీ ప్రహరించి ఈమాట నన్ను చైతన్యవంతురాలిగా చేసింది. ఇప్పుడు ఒక ఫ్లాట్ నాకు కూడా కావాలని నేను అనుకుంటున్నాను.
మా అన్నయ్య, వదిన, వాళ్ళకి వ్యతిరేకంగా కంప్లయింట్ చేసినవారు బిల్డింగులోనే ఎవరో అయివుంటారని, లేకపోతే చుట్టాల్లోనే ఎవరైనా కావచ్చునని రోజంతా ఊహాగానం చేస్తున్నారు.
ఒకరోజున మా అన్నయ్య ఒక కాగితం నాముందు తెరిచిపెట్టి అన్నాడు- “ఇదిగో, ఇక్కడ సంతకం పెట్టు”. నాకు షిందే వదిన చెప్పినమాట జ్ఞాపకం వచ్చింది. నేను అడిగేశాను- “ఇదేమిటి?…నా సంతకం ఎందుకు కావాలి?”
“ఖోలీ గురించిన కాగితం. రెండు ఫ్లాట్లు నా పేరుతో రాయించాలి. అందుకని.” వాడు చెప్పగానే నేను సంతకం చేసేస్తానని మా అన్నయ్యకి నమ్మకం ఉంది. కాని నేను సంతకం చెయ్యడానికి నిరాకరించగానే వాడు అరిచాడు-“ఏమిటీ! నువ్వు సంతకం చెయ్యవా? ఎందుకని?”
“ఎందుకంటే నాక్కూడా వాటా కావాలి.” షిందే వదిన చెప్పినట్లుగానే నేను చెప్పేశాను. మా అన్నయ్యకి కరెంటు షాక్ తగిలినట్లయింది.
“అయితే నువ్వు నామీద కంప్లయింట్ చేశావా?”
“లేదు. నేనేమీ చెయ్యలేదు. కాని నాకు కావాలి.”
సంవత్సరాల తరబడి నేను అన్నయ్యముందు మౌనంగా ఉంటూ ఉన్నాను. ఇప్పుడు మాట్లాడింది కూడా తిన్నగా వాటా గురించి చెప్పాను. అన్నయ్య నా ఈ అవిధేయతని అసలు సహించలేకపోయాడు. వాడు నన్ను గట్టిగా తోసేశాడు. నేను నేలమీద పడిపోయాను. వాడు అరవడం మొదలుపెట్టాడు—“కృతఘ్నురాలా, నేను ఇన్ని సంవత్సరాలుగా నిన్ను పోషిస్తున్నాను. కాని నువ్వు నా ఉపకారాన్ని గుర్తించకుండా వాటా అడుగుతున్నావు… నీకు జ్ఞాపకం ఉందా, అమ్మ-నాన్న గతించి ఇరవైఅయిదేళ్ళు అయింది. నేను ముఖం చాటువేసి తప్పించుకొని ఉంటే నువ్వు ఒక అనాథలాగా ఎక్కడెక్కడో అడుక్కుంటూ పడి ఉండేదానివి. అప్పుడు నీ తెలివి ఇలా పని చేసేది కాదు… ఇవ్వాళ నువ్వు వాటా అడగడానికి బయలుదేరావు….”
వాడు అలా అరుస్తూనే ఉన్నాడు. నేను నేలమీద బోర్లా పడిపోయివున్నాను. దెబ్బ తగిలిన కారణంగా కాదు. మనస్సులో కలిగిన బాధ కారణంగా… నా ఒంట్లో శక్తి అంతా ఎవరో తోడేసినట్లు అయిపోయింది. నా అంతట నేను లేవడం కూడా నాకు శక్యం కావడం లేదు. మీతా ఇంట్లోనే ఉంది. తేజస్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. తేజస్ గురించి కాదుగాని, నాకు మీతా కనీసం నా దగ్గరికి వస్తుందని నేను ఆశతో ఉన్నాను. కాని, తనుకూడా నా దగ్గరికి రాలేదు. ఉన్నట్టుండి నాకు జ్ఞాపకం వచ్చింది. మీతా మాత్రం ఎలా వస్తుంది, ఏమయినా, నీరు నీరువంకకే పారుతుందికదా. నేనే నెరవేరని ఆశ పెట్టుకుని ఉన్నాను. హతాశ చెంది నా అంతట నేనే లేచాను. అన్నయ్య ఇంకా అరుస్తూనే ఉన్నాడు. నేను ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్నాను. సంతకం మాత్రం నేను చెయ్యలేదు.
తరువాత చాలా రోజుల వరకు మా వదిన, అన్నయ్య నాకు ఎన్నో రకాలుగా నచ్చజెప్పారు. ప్రేమ చూపించారు. ఆశ చూపించారు. కోప్పడ్డారు. కాని నేను మాత్రం అసలు ఏమీ తగ్గలేదు. షిందే వదిన చెప్పిన విషయం నాకు మా అన్నయ్య-వదినలు చెప్పేదానికన్నా ఎక్కువ నమ్మదగిందిగా అనిపించింది.
ఒకరోజు మా అన్నయ్య సహనం నశించిపోయింది. వాడు ముందు నన్ను బాగా తిట్టిపోశాడు. మనస్సుతీరేదాకా నామీద చెయ్యిచేసుకున్నాడు. చివరికి నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టాడు. రెండు అపార్ట్ మెంట్లు దాటి మాకు దూరపు చుట్టరికం ఉన్న ఒక పిన్ని ఉంది. నేను ఆవిడ యింటికి వెళ్ళాను. మా పిన్ని అంది- “నేను మీ ఇద్దరి గొడవల్లో జోక్యం కల్పించుకోను. కాని నువ్వు ఎన్నాళ్ళుకావాలంటే అన్నాళ్ళు నా దగ్గర ఉండవచ్చు.” నేను పిన్నిగారి ఇంట్లోనే ఉండసాగాను. అన్నయ్య కోర్టులో మా నాన్నగారికి తనొక్కడే సంతానమని రుజువు చేసుకోలేకపోయాడు. నేను నా వాటా విడిచిపెట్టడానికి సిద్ధంగా లేను.
… ఈ విధంగా రెండు ఆర్ కే ఫ్లాట్లలో ఒకటి, అంటే ఇది నాపేరుతో వచ్చింది.
ఫ్లాట్ నాకు దొరకడానికి ఇంకా ఒకటి-రెండేళ్ళ సమయం ఉంది. నేను పిన్నిగారి ఇంట్లోనే ఉంటున్నాను. పిన్ని అక్కడే దగ్గర్లోనే ఉన్న ఒక కిరాణా దుకాణంలో నాకు ఉద్యోగం ఇప్పించింది. పిన్నికి ఒక కూతురు ఉంది. తను వాళ్ళ అత్తవారింట్లో ఉంది. ఇక్కడ కేవలం పిన్ని, బాబాయి ఉంటున్నారు. నేను నాకు వచ్చే సంపాదనలో కొంత సొమ్ము పిన్నికి ఇస్తున్నాను. ఇంట్లోని పనుల్లో కూడా పాలు పంచుకుంటున్నాను. ఈ విధంగా నేను పిన్ని మీద భారంగా లేను.
ఇప్పుడు నేను యథేచ్ఛగా, నిరాటంకంగా ఊపిరి పీల్చుకుంటున్నాను. మనస్సులోనే నేను షిందే వదిన పట్ల కృతజ్ఞురాలిగా ఉన్నాను. అప్పుడప్పుడూ ఆవిడని కలుసుకోవాలని అనిపించేది. కాని వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుసుకుంటే మా అన్నయ్య-వదినలకి ఆవిడ మీద అనుమానం వస్తుంది. ఎప్పుడైనా దారిలో వెళ్ళేటప్పుడో, వచ్చేటప్పుడో కలుసుకోవడం జరిగితే నాకు ఎంతో బాగుందని అనిపించేది.
నేను పిన్నిగారింట్లో ఉండటం మొదలుపెట్టాక నేను మ్హాడా ఆఫీసులో పిన్నిగారింటి అడ్రసు ఇచ్చి వచ్చాను. ఒకరోజున ఒక కాగితం నా పేరుతో వచ్చింది. అందులో ఫ్లాట్ పూర్తిగా తయారయినట్లుగా సూచన ఉంది. నన్ను మ్హాడా ఆఫీసుకి పిలిచారు. నేను పిన్నిని నాతో కూడా తీసుకుని అక్కడికి వెళ్ళాను. మా అన్నయ్యకూడా అక్కడికి చేరుకుని ఉన్నాడు. నాకు వాడిని చూసి సంతోషమయింది. వాడు నన్ను తీక్షణంగా చూశాడు. కాని మళ్ళీ తన చూపులు మరోవైపు మరల్చుకున్నాడు. వాడు పిన్నితో కూడా ఏమీ మాట్లాడలేదు. నాకు చాలా బాధ అనిపించింది… నేను మళ్ళీ శక్తిహీనురాలినైపోయాను. మా అన్నయ్యే నాకు కానప్పుడు నేను ఫ్లాట్ తీసుకుని ఏం చేసుకుంటాను… కాని నా అశక్తత కొద్దిసేపే ఉంది. తొందరగానే నాకు షిందే వదిన చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. అన్నయ్య ప్రవర్తన జ్ఞాపకం వచ్చింది. నేను కూడా అన్నయ్యవైపు నుంచి చూపులు మరల్చుకున్నాను. నన్ను ఎక్కడెక్కడ సంతకం పెట్టమన్నారో అక్కడల్లా సంతకం పెట్టాను. ఫ్లాట్ పేపర్లు, తాళంచెవి తీసుకుని తిరిగి వచ్చాను.
పిన్ని నాకోసం ఒక వత్తుల స్టవ్, కొన్ని అవసరమైన పాత్రలు, కొద్దిగా వంటసామగ్రి కొనిపించింది. నేను ఈ సామాను అంతా తీసుకొని నా యిల్లు సర్దుకుని ఉండసాగాను. ఉద్యోగం నేను ఇప్పుడు కూడా కిరాణా దుకాణంలోనే చేస్తున్నాను. ప్రతిరోజూ పిన్నిని కలుసుకునేందుకు వాళ్ళ ఇంటికి వెడుతున్నాను.
ఇప్పుడు నాకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి. అవసరాలకి సరిపడా డబ్బు, సౌకర్యాలు, మనశ్శాంతి, అన్నీ… అన్నీ. అయినా అప్పుడప్పుడూ అన్నయ్య, వాడి పిల్లలు జ్ఞాపకం వస్తున్నారు. అప్పుడప్పుడూ దారిలో తేజస్, లేకపోతే మీతా కలుస్తూ ఉంటారు. కాని నన్ను చూడగానే తమ దారిని మార్చుకుంటారు, లేకపోతే ముఖం తిప్పుకుని ఇంకోపక్కకి చూస్తూ వెళ్ళిపోతారు. అలా ఏ రోజున జరిగినా నేను పిన్ని దగ్గరికి వెళ్ళి గంటలతరబడి ఏడుస్తూ కూర్చుంటాను.
…ఇదంతా జరిగి పదేళ్ళు అయింది. ఇప్పుడు నేను ఉద్యోగం కూడా విడిచిపెట్టేశాను. నా యింట్లో పేయింగ్ గెస్టులని ఉంచుకుంటున్నాను—ఇద్దరు అమ్మాయిలు. వాళ్ళకి వంట కూడా చేసి ఇస్తున్నాను. నాకు లోటులేకుండా గడవటానికి సరిపడా డబ్బులు వస్తున్నాయి.
ఏమన్నారు? నా తరువాత ఈ ఇంటికి ఏమవుతుందనా? పిన్నికి కూడా ఇదే దిగులు ఉంది. అప్పుడప్పుడూ ఆవిడ అంటుంది తేజస్ పేరుతో విల్లు రాయమని. ఆవిడకయితే జీవితంలో సంధ్యాసమయం…. అందులోనూ వయస్సైపోయింది కదా…అలాగే అంటుంది. అయినా మీకో రహస్యం చెప్పనా? నేను వీలునామా రాశాను. అరే, తేజస్ పేరిట కాదు, మీతా పేరుతో.
తను విడాకులు తీసుకుని పుట్టింట్లో ఉంటోంది… మరి దానికి కూడా ఒక అన్నయ్య ఉన్నాడు కదా.
***
డా. ఆశా పాండే – పరిచయం:
14 నవంబరు 1964 న పీపర్ తాలీ, ప్రతాప్ గఢ్ (ఉత్తర్ ప్రదేశ్) లో జన్మించిన డా. ఆశా పాండే ఎం.ఏ.,పిహెచ్.డి. (ప్రాచీన చరిత్ర) చేశారు. వీరి 4 కథాసంకలనాలు, 1 నవల, 4 కవితాసంకలనాలు, 1 హైకూ సంకలనం,1 ట్రావెలాగ్, 1 వ్యాససంపుటి, బాలసాహిత్యంలో 4 కవితాసంకలనాలు, 1 కథాసంకలనం ప్రచురితం. వీరి నవల `ఖర్గాంవ్ కా చౌక్’ 2025 వరకు వచ్చిన పది ఉత్తమనవలల్లో ఒకటిగా పరిగణించబడింది. ఇంచుమించు పది ఇతర కథాసంకలనాల్లో వీరి కథలు కూడా ఉన్నాయి. కొన్ని కథలు నాటకరూపం ఇవ్వబడి ప్రదర్శించబడ్డాయి. అయిదేళ్ళపాటు `అమరావతి మండల్’ దినపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలకు సంపాదకురాలిగా ఉన్నారు. వీరి రచనలు అగ్రశ్రేణి హిందీ పత్రికలలో ప్రచురితమయ్యాయి. చాలా రచనలు ఇతరభాషలలోకి అనువదించబడి ప్రచురించబడ్డాయి. ఆకాశవాణి, టి.వి.లలో కథలు, కవితలు ప్రసారితం. కొన్ని కథలు ప్రతిష్ఠాత్మకమైన పోటీలలో బహుమానం పొందాయి. మహారాష్ట్ర హిందీ సాహిత్య అకాడమీ ద్వారా 2010-11 మున్షీ ప్రేమచంద్ పురస్కారం తో సత్కరించబడ్డారు. సృజన్ లోక్, చెన్నై, శారదాసమ్మాన్, లేహ్, తులసీసమ్మాన్, భోపాల్, జైపూర్ సాహిత్య సమ్మాన్, జైపూర్ ద్వారా సన్మానం పొందారు. రాజస్థాన్ యూనివర్సిటీలో వీరి కథాసంకలనం `ఖారా పానీ’ పై డిజర్టేషన్ వ్రాయబడింది. అమరావతి యూనివర్సిటీ బి.కామ్., బి.ఏ. సిలబస్ లలో వీరి కథలు, కవితలు పాఠ్యాంశాలుగా చేర్చారు. అమరావతి యూనివర్సిటీకి అనుబంధ కళాశాలలో లెక్చరర్ గానూ, ఇగ్నూ లో కౌన్సెలర్ గానూ సేవలు అందించి రిటైర్ అయిన డా. ఆశా పాండే గారు అమరావతి (మహారాష్ట్ర) వాస్తవ్యులు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
