కనక నారాయణీయం -79

పుట్టపర్తి నాగపద్మిని

‘భలే ఉందిరా! విశాఖనూబెజవాడనూ, గుంటూరినీ, నెల్లూరునూ గ్రీష్మ తాపానికి పరాకాష్టగా వర్ణిస్తూ, చివరికి రిక్షావాడి వేదనతో ముడిపెట్టడం, నాకు నచ్చింది. బుక్ ఇక్కడే పెట్టేసి పో! మొత్తం చదివి, ముందుమాట రాస్తాలే!’

వెంకట సుబ్బయ్య ముఖంలో  IAS  పాసైనంతటి సంతోషం!

ఇంకేమప్పా! సంతోషంగా పోయి ఆ కవిగారికి చెప్పు యీ వార్తా కనకమ్మ మోములో ముసిముసి నవ్వులు!

పుట్టపర్తి కూడా శృతి కలిపారు!

వాగర్థావివ సంపృక్తౌ ..శ్లోకం ముందు సాక్క్షాత్కరించినట్లే ఉంది వెంకట సుబ్బయ్యకు!

***

నాగపద్మిని చెంగు చెంగున రామకృష్ణా హైస్కూల్ నుంచీ భోజనం బెల్ సమయానికి  ఇంటికి వచ్చింది. తళిహింటిలో తూర్పు వైపు ఉన్న అరుగు మీద దేవుని మందాసనం ముందు మూర్చుని

పారాయణం చేసుకుంటూ ఉంది అమ్మ.

‘అమ్మా! ఆకలి!’

కనకమ్మ నాగ కేసి చూసి, అక్కయ్యనడుగు అన్నట్టు సైగ చేసి, యీలోగా  కాళ్ళు కడుక్కుని రమ్మనట్టు సైగ చేసింది.

నాగ బావి దగ్గరికి అదే పరుగుతో పోయి కాళ్ళూ చేతులూ కడుక్కుని వచ్చి, ‘అక్కయ్యా‘ అని గట్టిగా అరిచింది.

మిద్దె మీద అయ్య గదిలో బుక్స్ సర్దుతున్న తులజ ఆ పిలుపు అర్థం తెలుసు కాబట్టి వెంటనే కిందికి వచ్చి, తట్ట (భోజనం ప్లేట్) పెట్టుకుని కూర్చుని వున్న నాగకు వడ్డించే పనిలో పడింది.

కనకమ్మ ఇద్దరివైపూ ఒకసారి చూసి, మళ్ళీ పారాయణం కొనసాగిస్తూ ఉంది. త్వరగా చేసుకోవాలి. భర్త  కూడా ఇంతలోనే సాపాటుకు వచ్చేస్తారు కదా మరి!

‘అక్కయ్యా! రామసుబ్బలక్ష్మి నిన్న మల్లెపూలు, మరువం, దవనం, కనకాంబరాలు..అన్నీ కుట్టిన అట్ట వేసుకుందంట! ఆ అట్ట  రాత్రి తీసి తడిగుడ్డలో చుట్టిపెట్టిందంట వాళ్ళమ్మ!

మళ్ళీ యీ రోజు ఆ అట్ట జడకు కుట్టుకోని, స్కూల్ కు వచ్చింది. పూలు కొంచెం వాడిపోయినాయి కానీ, మరువం దవనం భలే గుభాళిస్తూ వున్న్నాయి. అందరూ ఆ పిల్ల చుట్టే ఉన్నారు తెలుసా!’

తులజ ఏదో లోకంలో ఉంది. నాగ మాటలు విన్నట్టులేదు.

అక్కయ్య ముఖంలోకి చూస్తూ మళ్ళీ గట్టిగా అంది నాగ. ‘అక్కయ్యా! నిన్నే! నాకూ అట్లాంటి అట్ట జడ కుట్టిపెట్టవే!’

తులజ అప్పుడంది.’అట్ట జడా! అంటే?’

అట్టంటే…’ ఎలా చెప్పాలో తెలీలేదు నాగకు.

పారాయణం ముగించుకుని వస్తున్న కనకమ్మ ఒక నవ్వు నవ్వి అందుకుంది. ‘ అట్ట అంటే అట్ట కాదే తులజా! అరటి మట్టలుంటాయేఅవన్నమాట! వాటిని జడ కొలతలకు తగినట్టు

కత్తిరించి పెట్టుకుంటారు ముందు. మల్లెపూలు, కనకాంబరాలు, మరువం, దవనం ఇవన్నీ పుల్లలకు గుచ్చి, ఆ పుల్లలను వాళ్ళ దగ్గరున్న డిజైన్ ప్రకారం, చక్కగా కుడతారు. అంతేనా నాగా?’

నాగ అమ్మకేసి ఆరాధనగా చూసి అంది, ‘అమ్మా! ఒకసారి నాకా జడ వేస్తావా?’

కనకమ్మ అంది,’మల్లెపూల సువాసనంతా, ఆ అట్టకే ఉండిపోతుంది. నీ జడకే మల్లె పూల వంకీ జడ వేస్తే, అబ్బ, ఎంత బాగుంటుందో తెలుసా? కదే తులజా? పైగా నీ పొడుగు వెంట్రుకలకు,

రెండు అట్టలైనా కావల్సి వస్తుంది.’  తులజ కూడా నవ్వింది.

నాగ ఉడుక్కుంటూ అంది, ‘పొడుగు వెంట్రుకలుంటే కూడా తప్పేనా? నా జడ చూసి అందరూ కుళ్ళుకుంటారు తెలుసామ్మా?’

‘నిజమే! అంత పెద్ద జడకు మల్లెపూల వంకీ జడ ఎంత బాగుంటుందో తెలుసా? ఘుమఘుమలాడిపోతుంది నీ జుట్టంతా!’

నాగ తగ్గేదేల్యా అన్నట్టు అందుకుంది. ‘ఊహూ! ఈ సారి నాకు చిట్టి వేసుకున్న జడే కావాలంతే! అదిగో, అక్కడ అమ్మవారి శాల వీధిలో, పూలమ్మే సాయిబులు  ఇటువంటి అట్టలు తయారు చేస్తారంట! ముందు రోజు పోయి జడ కొలత ఇచ్చి, ఏమేమి పూలు కావాలో యే డిజైన్ కావాలో చెప్పి డబ్బులిచ్చి వస్తే, మరుసటి రోజు, మధ్యాహ్నం కల్లా కుట్టి పెట్టుతారు. ఆ టైంకి అది తెచ్చుకుని, జడ వేసుకోనిజడకు కుట్టేసుకోవడమే! ఎంత బాగుంటుందో అమ్మా!’ ఆకాశంలో తేలిపోతున్నట్టుగా అంది నాగ.

తులజ అందుకుంది. ‘మరి రెండ్రోజులు నీకోసం అమ్మవారి శాల వరకూ రావడం, వాళ్ళతో మాట్లాడి బేరం కుదుర్చుకుని, డబ్బులిచ్చి, మళ్ళీ మరుసటి రోజు దాన్ని తీసుకుని నీకివ్వడం – ఇవన్నీ ఎవరు చేస్తారంట?’

నాగకు రోషం పొడుచుకొచ్చింది. ‘నువ్వూ, అరవిందూ లేరా? ఆ మాత్రం చెయ్యరా నాకోసం?’ కళ్ళనిండా నీళ్ళు.

తులజ కూడా తగ్గలేదు. ‘ఆ ఆ..నువ్వేమో ఏదైనా పని చెబితే, మాట వినకుండ తుర్రున పోతావు. మేమేమో నీకు పనులు చేసి పెట్టాలా?’

నాగ ఏడుపందుకుంది. ‘అమ్మా! నువ్వే రా నాతోపాటీనాకీ సారి అట్టపూలజడ కావాలంతే! పైగా వాళ్ళ నాన్న చిట్టికి మూర్తి ఫోటో స్టూడియోలో పూలజడతో ఫోటో కూడా తీయించినాడంట! నాకూ కావాలంతే!’ తార స్థాయిలో ఏడుపు.

కనకమ్మకు జాలి తోసుకుని వచ్చింది. పాపం, ఈ సారైనా ఆ అట్ట జడేదో వేయించాల్సిందే దీనికి! చాలా సార్లు మల్లె పూల వంకీ జడలు వేస్తూనే ఉంటుంది తను నాగకుతులజకైతే  యీ పూల జడలవీ అంతకాబట్టవు. నాగకివన్నీ మహా ఇష్టం. రాధ ఇంకా యీ జడల స్థాయికి రాలేదు. ఈ ముచ్చటంతా నాగదే ప్రస్తుతానికి! కానీ అమ్మవారి శాల దగ్గర కుట్టే యీ తరహా జడల వెల కూడా ఇరవై రూపాయల దాకా ఉంటుంది. అంత డబ్బు జడకోసం పెట్టాలంటే మాటలా? పైగా మూర్తీ స్టూడియోలో ఫోటో కూడా! అన్నీ కలిపితే ముప్ఫై రూపాయలదాకా ఖర్చు.  అదే పది రూపాయలకే మల్లె, కనకాంబరాలు, మరువం, దవనం అన్నీ వస్తాయి. ఓపిగ్గా ఇంటి దగ్గరే వేస్తేతృప్తికి తృప్తీడబ్బూ మిగులుతుంది. పిల్లలకేమి? ఏదైనా అడుగుతుంటారు. ఇంటి పరిస్థితి వీళ్ళకేమి తెలుస్తుంది? దాదాపు ఒకేసారి ఇద్దరాడ పిల్లల పెళ్ళిళ్ళూఅట్లే దాదాపు ఒకే సమయానికే వాళ్ళ కానుపులకే ఎంతో ఖర్చయింది. ఇప్పుడీ ఖర్చులు కొంతైనా తగ్గించుకోవాలంతే!

 తనకూ యీ జడ ముచ్చటేదో తీర్చాలనే ఉంది కానీ, యీ సారికయ్యే పని కాదు. ఈ నాగకు ఎట్లాగైనా నచ్చజెప్పే పని చెయ్యాలంతే!!’

  ‘సరేలే, చూద్దాం. నువ్వింక స్కూల్ కు పోవా ఇప్పుడు?’ అడిగింది కనకమ్మ.

  ‘ఈ సారి నాకు అట్ట జడకావాలంతే!! ఈ రోజు స్కూల్ డే రెహార్సల్స్ ఉన్నాయి. నే పోతున్నా’ కళ్ళు తుడుచుకుని నాగ పరుగుతీసింది.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.