చిత్రం-73

-గణేశ్వరరావు

నలుడు హంసను పట్టుకుంటాడు. ‘ హింసించడానికి శత్రురాజులు లేరా? పూలు తింటూ మునుల్లా తపం చేసుకుంటున్న నేనే నీకు కావాల్సి వచ్చిందా?’ అంటూ హంస దయచూపమంటుంది. నలుడు దానిని వదిలిపెడతాడు, హంస కృతజ్ఞతతో రాజుకు మేలుచేయాలనుకుంటుంది.

ముందుగా దమయంతి అందాన్ని వర్ణించి, అతన్ని ప్రేమలో పడేస్తుంది. అంతే చాకచక్యంతో దమయంతిని ఆకట్టుకొంటుంది. దమయంతి నలుడి పొందు కోరుకుంటుంది. దమయంతి పాణిగ్రహం ఆశించి దిక్పాలురు నలుని రాయబారిగా పంపుతారు. అతిలోకసుందరి దమయంతి పై అనురాగం పెంచుకున్నా, దూతగా తాను నెరవేర్చాల్సిన కర్తవ్యం తలచుకొని నలుడు మథనపడతాడు.
సందర్భోచితమైన పదాలు వాడటంలోనూ, పాత్రల చిత్రణలోనూ. ఒక నవలా రచయితకున్న వీలూ, స్వాతంత్య్రము కవులకు లేకపోయినా, శ్రీనాధుడు కవిగా అసమానమైన ప్రతిభ కనబరుస్తాడు. తాను కోరుకుంటున్న ప్రియుడు, తన స్వయంవరంలో వేరొకరిని వరించమని రాయబారం జరుపుతూంటే ఆమె ఏం సమాధానం చెప్పాలి? నలుడు కూడా ఆమెనే కోరుకున్నాడు, కానీ దేవకార్యానికి కంకణం కట్టుకున్నాడు. ‘నేను మిమ్మల్నే వరించాను, వేరొకరిని పెళ్లాడను’ అన్న దమయంతికి ఏం సమాధానం చెప్పాలి? దమయంతి ఉరిపోసుకుని చనిపోతే, అంతరిక్షాన్ని పాలిస్తున్న ఇంద్రుడికి, అగ్నికి ఆహుతి అయిన పక్షంలో అగ్నిదేవునికి, నీట మునిగి ఆత్మహత్య చేసుకుంటే, వరుణుడికి , మరేవిధంగా మరణించినా మృత్యుదేవత యముడికి ఆమె చెందక తప్పదని, అందువలన ఎవరో ఒక దిక్పాలకుడిని స్వీకరింప వలసిందని నలుడి చేత అనిపిస్తాడు. ఇందులో ఎంత మంచి భావన ఉందో, చమత్కృతి ఉందో, నిశిత పరిశీలన ఉందో గమనించండి.

‘హంస ద్యూతం’ సన్నివేశాన్ని రాజా రవి వర్మ చిత్రించారు. అది ప్రాచుర్యం చెందింది. 1913 లో మెకంజీ దాని స్ఫూర్తితో ( చిత్రాలలో ఉన్న పోలిక ‘వస్తువు’ వరకే, ఎవరి బాణి వారిది) తనదైన శైలిలో ఈ చిత్రాన్ని చిత్రించాడు. ఇది వడ్డాది పాపయ్య, ‘శంకర్’ (‘చందమామ’ పత్రిక) బాపు illustrations కు దగ్గరలో వుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.