
జీవన ప్రస్థానం!
-శాంతిశ్రీ బెనర్జీ
ఒక ఉషోదయాన
వేడి వేడిగా చాయ్
గొంతులోకి జారుతుంటే
వార్థక్యానికి చేరువైన నాకు
జీవిత అంతరార్థం అర్థంకాసాగింది
పెరిగే వయసు లెక్కలు కాదు
జీవన గాంభీర్యాన్ని ఒడిసి పట్టుకోవాలని!
తల్లిగా ఇల్లాలిగా చెల్లిగా కూతురిగా
దశాబ్దాలుగా సాగుతున్న నాకు
నేను నేనుగా మిగిలి కనిపించాను
నును వెచ్చని ప్రభాత కిరణాలవలె
సున్నిత సత్యాలు గోచరించాయి
జీవితం సాగిపోతూనే ఉంటుంది
పిల్లలు వాళ్ళ మార్గాలను ఎంచుకుంటారు
స్నేహితులు వాళ్ళ గమ్యాలను చేరుకుంటారు
శరీరాలు మార్పులకు లోనవుతాయి
గుప్పెట్లో నీళ్ళను నిలపలేనట్లే
జీవితంపై ఆధిపత్యం చెయ్యాలని
చేసే ప్రయత్నం వ్యర్ధం!
ఎన్నో ఏళ్ల వివాహబంధం నిలబడేది
కొరత రహిత పరిపూర్ణతతో కాదు
హృదయాల మృదుత్వం వలన
క్షమ అహాన్ని అధికమించినప్పుడు
సంసార బంధం బల్ల మీద మెరిసే
బంగారు పూత పూసిన పతకం కాదు
ప్రతినిత్యం కనబరచే శ్రధ్ధకు చిహ్నం!
శరీరం చెప్పే మాటలు పట్టించుకోవాలి
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
దాని ఆదేశాలను పాటించాలి
కంటి నిండా నిద్ర వంటికి వ్యాయామం మంచి ఆహారం
తక్కువ తీపులు ఉప్పులు సూర్యరశ్మి స్పర్శలు
ఇవన్నీ దేహపు అవసరాలు
ఆఖరి మజిలీలో శాంతిపథమే గమ్యం!
యవ్వనంలో గుర్తింపు కోసం అస్థిత్వం కోసం
భధ్రత కోసం పరుగులు పెడితే
ఇప్పుడు నిశ్శబ్దమే తోడుగా నిలిచేది
ప్రతి విమర్శకు స్పందించకు
వాదవివాదాలకు దూరంగా ఉండు
శాంతియుత జీవనమే సోపానం!
చిన్న చిన్న ఆనందాలు
సాధించిన విజయాల్లో ఉండవు
వెచ్చని దుప్పటి ప్రాతఃకాల వెలుగులు
ఆత్మను తాకే మృదు మధుర గానం
నిన్ను ప్రేమించే వ్యక్తి తో కలిసి భోంచేయడం
ఇవే సాధారణంగా కనబడే
అసాధారణ ఆహ్లాదాలు అనుభవాలు!
వృద్ధాప్యం అనివార్యం
లోతైన జీవితంలోకి పయనమే ముఖ్యం!
జీవితంలో మనుష్యులు
వస్తుంటారు పోతుంటారు
తొలి శ్వాస నుండి ఆఖరి మజిలీ వరకు
నువ్వే నీ చిరకాల సహచరివి
నీ ప్రయాణం నీతోనే
దాన్ని ప్రేమించడం నేర్చుకో!
మన బిడ్డలకు చెప్పాలనిపిస్తుంది
మనం ఒకప్పుడు చిన్నవాళ్ళమేనని
ప్రేమించామని తప్పులు చేశామని
జీవిత పాఠాలు నేర్చుకున్నామని
మీరు మనుష్యులుగా ఎదిగారు
మేం వృద్దులు గా మిగిలాం!
మనల్ని మనం అర్థం చేసుకోవాలి
క్షమించి గౌరవించుకోవాలి
కుటుంబాలు నిలబడేది సహానుభూతి వలనే!
మన పిల్లలు సంక్లిష్టమైన
సమాజంలో బతుకుతున్నారు
మన అనుభవాలు గొప్పవని
వాళ్ళని తక్కువ చెయ్యకూడదు
మనం అనే ద్వారం దాటినాక
వాళ్ళు నడిచే మార్గం విభిన్నం
వాళ్ళకే ప్రత్యేకం!
ఆసరా లేనప్పుడు
నీ అంతట నువ్వే నిలబడాలి
నీలోకి నువ్వు
స్వేచ్ఛగా స్వచ్ఛంగా ప్రయాణం చెయ్యాలి
అదే అసలైన జీవన ప్రస్థానం!
( సామాజిక కార్యకర్త సంగీత మిత్థల్ ఇంగ్లీషు వ్యాసం చదివి ప్రభావితమై, దానికి కవితా రూపం ఇస్తూ చేసిన స్వేచ్చానువాదం )
*****

నేను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢీల్లీలో, ఎమ్.ఫిల్. చేశాను. తీన్ మూర్తి భవన్, ఢీల్లీలో, నెహ్రూ కి సంబంధించిన ప్రాజెక్ట్ లో అసోసియేట్ ఎడిటర్ గా పని చేశాను. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత తెలుగు లో కథలు, కవితలు, వ్యాసాలు, ట్రావెలాగ్సు రాయడం మొదలుపెట్టాను.
