
చిత్రం-31
-గణేశ్వరరావు
ఈ కళాత్మక చాయా చిత్రం తీసినది పారిస్ కు చెందిన మార్తా (moth art అన్న దానికి బదులుగా ఈ పేరు ను వాడుతుంది ఆమె, అసలు పేరు చెప్పదు). సాధారణమైన రూప చిత్రాలపై ఆమె ఎంత పట్టు సాధించిందో అన్న దానికి ఈ ఫోటో ఒక రుజువు. తన మోడల్స్ హావభావాలను శక్తివంతంగా కెమెరా లో బంధిస్తుంది. ఆమె తీసిన ప్రతీ ఫోటో ఒక కథను చెబుతుంది. ఫోటోలోని అమ్మాయి ఒక్క చూపు చాలు, అరేబియన్ నైట్స్ లోని ఆఖరి రాణీలా వేయి కథలను చెప్పగలదు. ఆమె వాడే కెమెరా మరీ అంత ప్రత్యేకమైనది కాదు, సాధారణమైన 50mm లెన్స్ .. సహజమైన వెలుతురు చాలు. అయితే ఆమె ముందుగా ఒక ప్రణాళిక వేసుకుంటుంది, ఆ ప్రకారం పని మొదలు పెడుతుంది. ఆమె తీసిన ప్రతీ ఫోటో లో .. సున్నితత్వం..సహజ సౌందర్యం .. వింత అనుభూతి చోటు చేసుకుంటాయి. వాటితో ఆమె చూపరులను కట్టిపడేస్తుంది. ఏవో తెలీని లోకాలకు మనల్ని తీసుకెళ్తుంది – ఫోటోల్లోని రంగులు.. వైవిధ్యం అనూహ్యంగా కనిపిస్తాయి. ఆమె creative process ను ఎవరూ విడమర్చలేరు, ఎందుకంటే ఆమె ఒక చాయా చిత్ర మాంత్రికురాలు, తన మాయాజాలంతో మనల్ని సమ్మోహితుల్ని చేస్తుంది. ఆమె ఫోటోలు చూసి ఆనందించడానికి, ఏ వ్యాఖ్యాయనమూ అనవసరం. లేదు.****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
