జ్ఞాపకాల సందడి-30

-డి.కామేశ్వరి 

మాగ్నిఫిషియంట్ సెంచరీ: మనకు మాములుగా బ్రిటిష్ , యూరోప్ , హిస్టరీ  తెలిసినంతగా ఇతరదేశాల చరిత్ర , అక్కడి రాజరికాలు ,ప్రజా జీవితం ,వాతావరణ  స్థితిగతులు, ఆచారవ్యవహారాల గురించి తెలియదు. ఇప్పుడంటే గూగుల్ నిమిషాల్లో ఏదికావాలన్నా చెప్పేస్తుంది. మా రోజుల్లో హిస్టరీ, జాగ్రఫీలో చదివిన పాఠాల వల్ల  తెలుసుకొన్న వాటివల్ల కొంచెం తెలిసేది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని చాల రోజులు పాలించారు కనక వాళ్ళ చరిత్ర తెలిసేది. ఇండియన్ హిస్టరీ, బ్రిటిష్ హిస్టరీ అని రెండుభాగాలుండేవి చరిత్ర పుస్తకాల్లో. పెద్దయ్యాక ఇంగ్లీష్ నవలలు చదవడం ద్వారా రష్యా, జర్మనీ  వగైరా దేశాల గురించి రెండు ప్రపంచ యుద్ధాల బేస్ మీద అనేక నవలలు వచ్చినవి చదివి కొన్ని తెలిసాయి.  ఇంతకీ ఈ  ఉపాద్ఘాతం  ఎందుకంటే , చెప్పేగా  గత ఏడాదిగా టర్కిష్ సీరియల్స్కి అడిక్ట్ అయిపోయి  తెగ చూస్తున్నా. ఎంతబాగుంటున్నాయంటే ఇంకోటి చూడలేకపోయా . ఈ మధ్య ‘మాగ్నిఫిషియంట్ సెంచరీ’ అనే సీరియల్ టర్కీ రాజు సులేమాన్ సుల్తాన్ గురించిన కథ. సులేమాన్ సుల్తాన్ పేరు ఏదో వినడం  తప్ప మిగతాది ఏమి తెలియదు.

      ఐదారు వందల సంవత్సరాలక్రింద టర్కీ దేశాన్ని ottomans  వంశపు రాజుల పరిపాలనలో 1924వరకు ఉండేది. చాలామంది రాజులూ పాలించిన సులేమాన్ సుల్తాన్ పేరే ప్రఖ్యాతి గాంచింది.  ఐదారువందల ఏళ్ళక్రితం ఆ రాజరికం అప్పటి స్త్రీల స్థితిగతులు ఎంత ఘోరంగా ఉండేవో చూస్తుంటే   రాజరికాలు పోయాక స్వాతంత్య్రాలు వచ్చాక ప్రజలు జీవితాల్లో ఎంత మార్పులు వచ్చాయో అర్ధం అవుతుంది. మన దేశంలోనూ ముస్లిం రాజుల పాలనలు, హిందూరాజుల పాలనల గురించి చదివాం చాలా. అక్కడ సుల్తాన్ అంటే తిరుగులేని రాజు అతని కనుసన్నల్లోనే పరిపాలన. తల్లి తండ్రి తప్ప మిగతా అందరు వంగి సలాములు చేయాలి ఎదుటపడినప్పుడల్లా. అతని ఆజ్ఞ  శాసనమే. ఆ రోజుల్లో ప్రజలని డబ్బిచ్చికొనలేకపోతే కప్పం కట్టలేనివారిని, ఎదురుతిరిగివారిని ఖైదీలుగా బంధించి బానిసలుగా మార్చి సైనికులుగా కొందరిని , రాజుగారి సేవకులుగా , కాపలావారీగా , ఆడవారిని అంతపురం లో పరిచారికలుగా  రకరకాలుగా ఉపయోగించుకునేవారు. ఆరోజుల్లోకూడా ఇప్పటి క్యాబినెట్ మంత్రివర్గంలా ముఖ్య మంత్రి , మిగతా పదవులకి  అన్నిటితో దర్బార్ నిర్వహించడం, ఏ దేశం బలహీనంగావుంటే దండెత్తి ఆస్తులు బంగారాలు పెద్ద ఎత్తున సంధించి ఆ దేశపు రాజులూ కప్పం కట్టడం ఇలా రాజ్య పాలనా, సైనిక బలం వున్నవారిదే గెలుపు. తప్పు చేసినా,  ద్రోహంచేసినా ఎదురు తిరిగిన అక్కడికక్కడే  అందరి ముందు శిరచ్ఛేదనంత  కఠిన శిక్షలుండేవి.  అలా చిన్నచిన్న యూరోప్ దేశాలనికూడా వశంలోకి తెచ్చుకుని  సులేమాన్ ది  గ్రేట్  అని ఏకచ్ఛత్రాధిపత్యం గా అంత పవర్ వుండే రాజు .

      అసలు ఇంట్రెస్ట్ ఏమిటంటే అంతఃపుర  భాగోతం. అక్కడ అందమైన అమ్మాయిలని వెతికి, బానిసలుగా బంధించి తెచ్చి వాళ్ళని అంతఃపుర అలవాట్లు కట్టుబాట్లు, మెలగాల్సిన రీతులు నియమావళి. పాట, నాట్యం  కట్టుబాట్లు.  మొత్తం వాళ్ళని చిత్రిక పెట్టి, సానపెట్టి తయారుచేయడం అనంతపురంలో వుండే కొజ్జా వారి పని. పురుషులని నపుంసకులుగా మార్చి అలాంటివారికి అంతఃపుర పర్యవేక్షణ భారం అప్పచెపితే   అందులో ముఖ్యుడి  ఆజ్ఞ ప్రకారం అందరు నడవాలి. రాణివాసం కంప్లైన్ట్లు,   అవసరాలు. రాజుగారి అమ్మాయిల సప్లై అంతా అతని ఆధీనంలో ఉంటుంది. రాజుగారికి మనసు పుడితే ఒక కనుసంజ్ఞతో కొత్తకొత్త అమ్మాయిలందరినీ అలంకరించి లైన్లో నిలబెడితే రాజు అలవోకగా చూసీచూడనట్టు ఆలా నడుస్తూ కంటికి ఇంపైన అమ్మాయి కనపడగానే చేతి రుమాలు ఆ అమ్మాయి మీద విసిరి పోతాడు. సెలెక్ట్ అయినఅమ్మాయి సంబరం  చూడాలి. మహారాజుగారితో రాత్రి గడపడం మాటలా!  ఎంత అదృష్టం పడితే అలాటి అవకాశం దొరుకుతుంది.  సెలెక్ట్ కాని వాళ్ళు నెక్స్ట్ టైం వరకు ఎదురుచూడాలి. ఈ లోగా ఇంకా కొత్తవాళ్లొస్తే ఇంకా శాశ్వతంగా దాసిబతుకే వారికి. ఆ రాత్రి రాజుగారి గదిలోకి పంపే అమ్మాయికి సుగంధ ద్రవ్యాలతో నలుగులు  పెట్టి స్నానం, ముస్తాబులు. అత్తరులు, సెంట్లు,  నగలు అలంకరించి రాత్రి దాసదాసీలు వెంటరాగా రాజుగారి గదిలోకి పంపుతారు. రాజుగారిని మెప్పించే హొయలు చాకచక్యం, అందం అన్నీ వుండే అమ్మాయికి రాత్రంతా వుండి ఆ పక్కన పడుకునే అదృష్టం దొరుకుతుంది. చచ్చు దద్దమ్మ, భయస్తురాలు,సిగ్గు లాటి మైనస్  గుణాలుంటే పనవగానే  ఇంకా వెళ్ళనేస్తాడు ఆ  మహారాజు. ఇంక దాని  గతి  దాసీ  గానే మిగులుతుంది. అలకాక రాజుగారిని అందచందాలతో తెలివితో బుట్టలో వేసుకోగలిగితే రాజుగారు ప్రసన్నులవుతే మళ్లీ  పిలిచే ఛాన్స్ ఉంటుంది.  ఆమె అదృష్టం బాగుంటే నెల తప్పి ఒక. మొగ పిల్లాడిని కందంటే అదృష్టం అందలమెక్కిస్తుంది. అప్పటినించి ఆమెకొక ప్రత్యేక  నివాసం, దాసీలు వుండి రాజుగారెప్పుడో ఒకసారి కొడుకుని చూసుకోడానికి వస్తాడు అన్న ఆశతో బతుకుతూ ఆ పిల్లాడి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకీడుస్తుంది.  Concubines  అంటారు వీళ్ళని ఇంగ్లీషులో. మన తెలుగులో ఉంపుడు గత్తెలు అనేవారు. ఇలావచ్చిన వాళ్లలో ఒక నెరజాణ రాజుని వశ  పరుచుకుని ఎలా రాణి అయింది? సవతులమధ్య ఈర్ష్య, అసూయలు, ఎత్తులు,  పైఎత్తులు.  అబ్బో చాల వున్నాయి.  మిగతా వచ్చే నెల. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.