
అద్దం మీది తడిఆవిరి
– శ్రీధర్ చౌడారపు
కాలం కత్తికట్టిందని తిట్టుకోకు
విధి వెక్కిరించిందని వెక్కివెక్కి ఏడవకు
ఎదిగేకొద్దీ ఎన్నెన్నో జతకూడుతూనే ఉంటాయి
అంతులేనన్ని అనుబంధాలు
అలవోకగా అంటుకట్టుకుంటుంటాయి
బరువు ఎక్కువైందనో ఏమో
బాధ్యతలు దూరంగా లాగేసాయనో ఏమో
సంబంధాలు కొన్ని సడలి విడిపోతుంటాయి
అనుబంధాలు మరికొన్ని
అనుకోనివిధంగా అకస్మాత్తుగా తెగిపోతుంటాయి
ఏడడుగులు నడిచినవాడూ
ఏళ్ళుగా వెన్నంటి ఉన్నవాడు
ఏడని, ఏడున్నాడని, ఏడకెళ్ళిపోయాడని
నిన్ను వీడి ఏ మిన్నుల్లోకెళ్ళిపోయాడని ఏడవకు
నీ కంటిపాపల్లో చల్లని వెన్నెల వెలుగుగా
నీ పెదిమె వంపుల్లో చెదరని చిరునవ్వుగా
నీ హృదయపు అరల్లో జ్ఞాపకాల సుగంధంగా
నీ ఒంటి పరిమళాన్ని పరవశంగా ఆస్వాదిస్తూ
నీ ఇంటి పరిసరాలను నిశ్శబ్దంగా గమనిస్తూ
నీ చుట్టూ సంఘటనల పారిజాతాలను విరజిమ్ముతూ
నీతోనే ఉన్నాడు… నీలోనే ఉన్నాడు
నీవే తానై ఉన్నాడు
నీ ఆనందం తనదిగా ఆస్వాదిస్తున్నాడు
నీ ఆశగా … నీ శ్వాసగా
నీ నీడగా … అగుపించని నీ తోడుగా
ఎప్పటికైనా… ఇంకెప్పటికైనా
ఎన్నేళ్ళుగడిచినా నీవే తానై ఉంటానంటున్నాడు
కాలం తెచ్చిచ్చిన ఈ పుట్టినరోజును
ఆనందంగా అందుకోమంటున్నాడు
అయినవాళ్ళ ఆశీస్సులనూ ఆకాంక్షలనూ
అందుకుని హృదయానికి ఆర్ద్రంగా అద్దుకోమంటున్నాడు
తనువు లేకున్నా తను నీ వెన్నంటే ఉన్నానని
అర్థంలేని ఈ ఆవేదనని
అనంతంగా సాగనీయొద్దని
అద్దంమీది తడిఆవిరిలా తుడిచేసి
అందరిలో తనను
తనివితీరా చూసుకోమంటున్నాడు
*****

పేరు శ్రీధర్ చౌడారపు. ఆదిలాబాద్ జిల్లాలోని ముధోల్ నా జన్మస్థలమైతే, స్వస్థలం నిర్మల్. నివాసం హైదరాబాదు. బి.ఏ., బీ.ఎడ్ చేసిన నేను తొమ్మిదేళ్ళు ఉపాధ్యాయునిగా పనిచేశాను. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా మొదలెట్టి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖలో అదనపు సంచాలకునిగా పనిచేస్తున్నాను.

చాలా అర్థవంతమైన కవిత …
చాలా బాగుంది sir
కవిత బాగుంది.
అభినందనలు.