
తూకం
-రూపా దూపాటి
అందమైన మనిషిని
పువ్వుతో పోల్చడం తప్పేమీ కాదు!
కానీ ఒక అబ్బాయిని
రోజా పువ్వులా ఉన్నావు
అనడాన్ని నేను ఇప్పటి వరకు వినలేదు!!
వండు కోవడం, తినడం
మానవ అవసరాలే!
కానీ మీ బాబుకు వంట వచ్చా
అని పెళ్లి కుదుర్చుకున్న సంఘటన
నేను ఇప్పటి వరకు చూడలేదు!!
స్వతంత్రం మనకి ఎపుడో వచ్చింది!
కానీ ఆడపిల్ల ఒంటరిగా
తిరుగుతున్నప్పుడు
ధైర్యంగా ఉన్న మనసును
నేను ఇప్పటి వరకు తారసపడలేదు!!
అమ్మాయి, అబ్బాయి ఒకటే అయినా
అందరూ మనుషులే అయినా
అన్యాయం, బాధ, నొప్పి, ఆంక్ష
ఒకరికే ఎందుకు ఎక్కువో
నాకు ఇప్పటి వరకు అర్ధం కాలేదు!!
*****
Please follow and like us:

రూపా దూపాటి సత్తుపల్లి నివాసులు. బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, కవితలు రాయడం ఆమె అభిరుచులు.
