
దుఃఖపుమిన్నాగు
-డా.కె.గీత
దుఃఖం
జీవితం అడుగున పొంచి ఉన్న మిన్నాగు
ఎప్పుడు నిద్రలేస్తుందో దానికే తెలీదు
ఎప్పుడు జలజలా పాకుతుందో ఎవరికీ తెలీదు
ఎగిసిపడ్డప్పుడు మాత్రం
ఎప్పటెప్పటివో
నిశ్శబ్ద వేదనలన్నీ ఒక్కోటిగా తవ్వుకుంటూ
జరజరా బయటికి పాక్కొస్తుంది
దాని పడగ నీడలో
ప్రతిరోజూ నిద్రిస్తున్నా
ఏమీ తెలియనట్టే
గొంతు కింద
ఎడమ పక్క
సిరలు ధమనులు
చుట్ట చుట్టుకుని
బయట పడే రోజు కోసం
తపస్సు చేస్తుంటుంది
ఒక్కసారి
నెత్తుటి గంగలా
బయట పడ్డదా
దాని తాండవం
ఆపడానికి
యముడే దిగిరావాలి
దాన్నించి
తప్పించుకునేందుకు
కోరికల్ని
తప్పించుకోవాలట
అసలు
దుఃఖమే
ఆకాంక్షల
ఆశయాల
ఆశల
వినాశిని-
ఉత్కృష్ట జీవితాన్ని
కాలరాసి కాటేసే
వినోదిని-
దుఃఖం
కాలమంతా విషాన్ని చిమ్ముతూన్నా
శ్వాస చివరి వరకూ
దాన్ని కౌగిలించుకునే
జీవితాన్నించి
తప్పించుకుందుకు
మళ్లీ దాన్నే ఆశ్రయించాలి!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

చక్కని భావ సంపుటి.. శీర్షికలోనే కవిత్వం ఉంది
మనువు, తనువు భరించలేని బాధోద్వేగాలు అనేకానేకం మనిషి జీవితం చుట్టూ ముడేసుకుని ఉండిపోతాయి. వాటిని ఎదుర్కొనేందుకు మనం చేసే ప్రయత్నాలే మనమేంటో ప్రపంచానికి నిరూపిస్తాయి. నిరంతర మానవమథనాన్ని చూపిస్తూ సాగిన ‘దుఃఖపుమిన్నాగు’ కవిత్వం చాలా బాగుంది. శీర్షిక ఆకట్టుకునేలా ఉంది.
ఆకాంక్షల, ఆశయాల, ఆశల వినాశినిగా- ఉత్కృష్ట జీవితాన్ని కాలరాసి కాటేసే వినోదినిగా దుఃఖాన్ని చిత్రించడం ఒక అపూర్వ భావన.
శ్వాస చివరి వరకూ- దుఃఖాన్ని కౌగిలించుకునే జీవితాన్నించి తప్పించుకుందుకు- మళ్లీ దుఃఖాన్నే ఆశ్రయించాల్సిన’ అసహాయతను ఎత్తి చూపడం- అద్భుతమైన అవగాహన. కవయిత్రికి అభినందనలు.
చాలా చాలా బాగుంది మీ కవిత.