
కథా మధురం
ఆ‘పాత’ కథామృతం-3
-డా. సిహెచ్. సుశీల
“ఆంధ్రా మదర్ థెరీసా”దుర్గాబాయమ్మ బహుముఖ ప్రజ్ఞాశాలి యైన ” మహిళా రత్నం”, మాతృదేశ విముక్తి ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన “వీర దుర్గ”, విద్యాధికురాలై, న్యాయవాద వృత్తిని స్వీకరించి, న్యాయం కోసం – ముఖ్యంగా మహిళల కోసం పోరాడిన “స్త్రీ మూర్తి”, నిరంతరం సామాజిక సేవా తత్పరురాలై మహిళాభ్యుదయం కొరకు “ఆంధ్ర మహిళా సభ” ను స్థాపించి, ఎందరో అభాగ్య మహిళలకు కొత్త జీవితం ప్రసాదించిన “ఆంధ్రా మదర్ ధెరిసా” మన గుమ్మడిదల దుర్గాబాయమ్మగారు. అటువంటి విశిష్ట మహిళ ఆంధ్రదేశంలో జన్మించటం ఆంధ్రులకి గర్వకారణం. 1909 జులై 15 న బెన్నూరి రామారావు, కృష్ణవేణమ్మలకు రాజమండ్రిలో జన్మించినా పెరిగినదంతా కాకినాడలో. ఈ రెండు పట్టణాలు సామాజిక చైతన్యానికి సంఘ సంస్కరణలకు నిలయాలు. పసిమి ఛాయలో నిండైన రూపం, తెలుగుదనం ఉట్టిపడే వేషధారణ ఆమెది. మెండైన వ్యక్తిత్వం ఆ రూపానికి మరింత వన్నెతెచ్చింది. ఆమె నిత్య చైతన్య జీవిత స్రవంతికి తల్లిదండ్రులతోపాటు సోదరుడు నారాయణరావు ప్రోత్సాహమూ తోడైంది. నిర్భయత, నిస్వార్థం, కార్యసాధన, పట్టుదల ఆమెకు పెట్టని ఆభరణాలు. ఆమె అదృష్టాలతోపాటు ఎనిమిదేళ్ళ వయసులో ఒక గొప్పింటి కోడలు కావటము ఆమెకు మరో అదృష్టం అన్నారంతా. తన ఆదర్శాల నిర్వహణలో పదిమందితో నిరాడంబరంగా కలుపుగోలు తనంతో ఆమె మెలగటానికి ఆ అదృష్టమే అడ్డు అయింది. సమాజమూ , ప్రజలూ, దేశమూ అంటూ సామాన్య ప్రజలతో కలిసిమెలిసి తిరగటం ఆ ‘గొప్పింటి’ (మేనత్త) వారికి ఇబ్బంది కలిగించింది. అందుకే దుర్గాబాయమ్మ కుటుంబ జీవితాన్ని త్యజించాలన్న నిర్ణయానికి వచ్చారు. అత్తవారింటి వారికి నచ్చజెప్పి, భర్తను ( సుబ్బారావు) మరొక వివాహం చేసుకో వలసిందిగా కోరి తిమ్మాయమ్మతో వివాహం జరిపించింది. తన వైవాహిక జీవితాన్ని వదులుకొని సమాజం కోసం స్థిర చిత్తంతో నిలబడి, తన పూర్తి శక్తి సామర్థ్యాలను దేశ సేవకే వినియోగించాలనుకోవడం – ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే.కనుకనే దుర్గాబాయమ్మ అసాధారణమైన ఆదర్శమూర్తి. సంఘసంస్కర్త. ధీర చిత్త. తెలుగు, హిందీ, ఉర్దూ భాషలలో ప్రావీణ్యముండటమే కాక ‘చదువులలోని సారమెల్ల’ గ్రహించిందామె. నూటికి నూరు శాతం ఆచరణలో చూపింది. తండ్రి మరణానంతరం సంప్రదాయం పేరుతో తల్లికి శిరోముండనం చేయించాలని బంధువులందరూ పట్టు బడితే ఎదిరించి, వారందరినీ ఇంటి నుండి పంపివేసింది. బెనారస్ యూనివర్సిటీ నుండి మెట్రిక్యులేషన్, ఆంధ్రా యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో ఎం.ఏ. చేసారామె. 1940 లో ఎల్.ఎల్.బి. పూర్తి చేసి, మద్రాస్ హైకోర్టు లో ప్రాక్టీస్ మొదలుపెట్టి క్రిమినల్ లాయర్ గా పేరు గడించారు. జాతీయ కాంగ్రెస్ సమావేశాల సమయంలో జరిగిన ఖాదీ ప్రదర్శనకి వాలంటీర్ బాధ్యత అప్పగించబడిన దుర్గాబాయమ్మ టికెట్ లేని వారిని లోపలకు పంపకుండా ఆపివేసిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ కూడా ఉన్నారు. అంతటి నిబద్ధత ఆమెది. చేసే పనుల్లో పట్టుదల, కార్యనిర్వహణా సామర్థ్యం ఎంత ఉందో, ఆమె మనసు అంత కళాత్మకమైనది. రంగవల్లులు తీర్చేదిద్దడం, పూల జడలు వేయడం, వీణ హార్మోనియం వాయించటం, కుట్లు అల్లికలు, పాటలు పాడటం, పాఠాలు చెప్పడం, నాటకాలు వేయించటం ఎదుటివారు మంత్ర ముగ్ధులయ్యేలా ప్రసంగించడం వంటి కళల్లో ఆమె నేర్పరి. ముఖ్యంగా కథలు రాయటం. తన ఆశలు, ఆశయాలు, ముందు తరాల వారు అనుసరించవలసిన ఆదర్శవంతమైన జీవితాలను ప్రతిబింబించేలా కథలు రాయటం ఆమె ప్రత్యేకత. నే ధన్యనైతిని భారతి 1929 జనవరి నెలలో శ్రీమతి గుమ్మడిదల దుర్గాబాయమ్మ రచించిన కథ “నే ధన్యనైతిని” ప్రచురించబడింది. ‘లీల’ తర్వాత ‘ శ్యామ సుందరుడు’ అనే పాత్రలతో మొదలైనా, కథ యావత్తూ శారదాబాయి అనే బలమైన పాత్ర చుట్టూ అల్లుకునే ఉంటుంది. శారదాబాయిలో మనకు దుర్గాభాయమ్మ కనిపిస్తారనటం అతిశయోక్తి కాదు. లీల తల్లిదండ్రులు మరణించగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని శారదాబాయి వచ్చి వారికి తన సొమ్ముతో దహన సంస్కారాలు చేసి లీలను తనతో పాటు తీసుకొని వెళ్లినది. చదువు సంస్కారాలతో పాటు ఉత్తమ ఆశయాలతో లీలను పెంచి పెద్ద చేస్తుంది. బాల్య వితంతువైన శారదాబాయి బంధువుల, చుట్టుపక్కల వారల నిరాదరణ భరించలేక ఇల్లు విడిచి ధైర్యంగా పూనా పట్టణము చేరుకొని నాలుగు సంవత్సరముల పాటు విద్యను అభ్యసించి జన్మభూమి కేతెంచి ‘శారదా భవనమ’ను పాఠశాల నేర్పరచినది. శారదాబాయి పెద్ద అన్నగారు ప్రసాదరావు ముక్కోపి. నాటి ప్రభుత్వంలో ఉద్యోగి. తమ్ముడు శ్యామసుందరుడు దేశము, స్వాతంత్య్రమూ అంటూ తిరగటం అతనికి ఇష్టం లేదు. పైగా ఆనాడు ఉధృతంగా సాగిన సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అతను పాల్గొనుటచే పాఠశాల నుండి తొలగింపబడటంతో అగ్గిమీద గుగ్గిలం లా మండిపడ్డాడు. భార్య లక్ష్మి నచ్చచెప్పినా వినలేదు. శ్యామసుందరుడు ఇల్లు విడిచి అక్కగారి వద్దకు చేరి ఆశయాలకు తోడునీడగా నిలిచాడు. లీల శ్యామసుందరుల మధ్య మొలకెత్తి మారాకు వేసిన ప్రేమను గుర్తించిన శారదాబాయి వారిని ఆశీర్వదించి శారదా భవనం పూర్తి బాధ్యతలను వారి కప్పగించి “నే ధన్యనైతిని” అని తృప్తిగా కన్ను మూసినది. క్లుప్తంగా ఇదీ కథ. కానీ దుర్గాబాయమ్మ అనేక రాజకీయ సాంఘిక పరిస్థితులను వివరిస్తూ, విశ్లేషిస్తూ దీనిని పెద్ద కథగా మలిచారు. ఆమె దృఢమైన భావాలను స్పష్టపరిచారు. మొట్టమొదట లీల పాత్రను పరిచయం చేయుచున్నప్పుడే ఆమె రాట్నం వడుకు తున్నదని చెబుతారు. “డిసెంబర్ నెలలో జరిగబోవు కాంగ్రెస్ మహాసభకు వస్తు ప్రదర్శనకై మా పాఠశాల బాలికలు ఎవరు చాలా సన్నగా నూలు వడికి తెత్తురో వారిచే నూలు దండలు తయారు చేయించి వారికి బహుమానమిత్తురని ఉపాధ్యాయులు చెప్పినా”రని లీల అనగానే తండ్రి శ్రీనివాసరావు కూడా ఆమె కార్యదీక్షకు సంతసించి, “మంచిగా నూలు వడికి, విజయము నొంది, ఉపాధ్యాయుల ఆదరమునకు పాత్రురాలు కమ్మ”ని ఆశీర్వదిస్తారు. పెరటి తోటలో నున్న లీల ఏవో పాటలు పాడుకొను చున్నదని, తండ్రి ఆమెను గాంచి సంతసించెనని కథను కొనసాగించవచ్చు. కానీ దేశభక్తి, సంఘ సేవిక యైన దుర్గాబాయమ్మ రచనా పద్ధతియే వేరు. సందర్భానుసారంగా… ఒకచోట సందర్భాన్ని కల్పించి మరీ దేశభక్తి నుద్భోధిస్తారు. బడిలో నేర్చుకున్న జాతీయ గీతములను లీల పాడుకొనుచున్నది. అది చూసిన తండ్రి ‘సుగుణాల రాశి అయిన ఈమె సదయ హృదయమునకు తోడు దేశభక్తి కూడా అలవడినది’ అని సంతోషించినాడట. చివరకు అనారోగ్యంతో మరణించు సమయమున కూడా కుమార్తెను దగ్గరకు తీసుకొని ‘నేను పోవుచున్నాను అమ్మ! మాతృదేశము, మాతృభూమిని మరువ వలదు…. భారతాంబరుణము తీర్చి…. నా ఆత్మకు శాంతి కలిగింపుము’ అనినాడు. కొంతకాలానికి తల్లి కూడా మరణిస్తూ కుమార్తె వివాహం చేయలేదని పరితపించుతూ కూడా ” నీ తండ్రి గారు తమ మరణ సమయమందు నీకు ఆదేశించిన మాట మరువ వద్దు. నా కోరిక కూడా నదియే. మానవ సేవకు అంకితమై, చదువుల సరస్వతి వై, అంధకారమందు మునిగితేలుతున్న స్త్రీలను ఉద్ధరింపుము…” అని పలుకుట దుర్గాబాయమ్మ గారి పరోక్ష ఉద్బోధయే. అన్నగారి ఆగ్రహానికి గురైన శ్యామసుందరుడు “దీనానయై దిక్కు లేక తన పుత్రులేమో తన్నుద్ధరించెదరని నమ్మి యున్న భారతమాత… శివాజీ, రాణా ప్రతాప్, తిలక్, గాంధీ ప్రభృతులను కన్న మాతృభూమి… మాతృదేశము అని విలపించుచు ప్రాణములర్పించిన చిత్తరంజన్, గోఖలే, నౌరోజీ, లజపతిరాయ్ మొదలైన వీరశిఖామణు లను కన్న భారత రత్నగర్భ నాజన్మధాత్రి…” అని యోచించి, దేశమాత సేవకు రంగము న దుమికెదనని నిర్ణయించుకొని, ఇల్లు విడిచినాడు. ఇక శారదాబాయి గారి పాఠశాలలో జరుగు కార్యక్రమములు, బాలికలకు ఆమె చెప్పు పాఠములు, ఆటలు, రాట్నము, మగ్గములు, అన్నీ దుర్గాబాయమ్మ గారి భావాలకు అనుగుణంగానే ఉన్నవి. లీల, శ్యామసుందరుడు కలిసి శారదాబాయి ఆశయాలకు అనుగుణంగానే వర్తించుచూ, ప్రజలలో దేశభక్తి పెంపొందించుటకు స్వార్థరహితముగా ఫలాపేక్ష లేకుండా మనోవాక్కాయ కర్మలతో పనిచేయడంతో శారదా భవనము కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందసాగెను. వారి కృషిని విన్న పెద్దన్న ప్రసాదరావు కూడా వారి వద్దకు వచ్చి తన ప్రవర్తనకు క్షమాపణలు కోరినాడు. ఆ రోజుల్లో ఈ కథ చాలా మందికి స్పూర్తి కలిగించిందట. దుర్గాబాయమ్మ ” బాలిక హిందీ పాఠశాల” ను కూడా స్థాపించారు. స్త్రీలకై రెండు హాస్పిటల్స్, మూడు ఉన్నత పాఠశాలలు, రెండు మహిళా కళాశాలలు, అనేక వసతి గృహాలు, నర్సింగ్ హోమ్ లు, శారీరక మానసిక వికలాంగులకు వృత్తి విద్యా కేంద్రాలు నిర్మించారు. భారత రాజ్యాంగ నిర్మాణ సభలో నాడు ఉన్న ఏకైక మహిళ ఆమె. ప్లానింగ్ కమిషన్ సభ్యురాలుగా, బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ కి అధ్యక్షురాలిగా సేవలందించారు. దేశ ప్రథమ ఆర్ధిక మంత్రి, మొట్టమొదటి (మాజీ) రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, సంస్కృత కవి యైన చింతామన్ ద్వారకా నాధ్ దేశముఖ్ ను ( మరాఠీ) 1953 లో నెహ్రూ గారి సమక్షంలో వివాహం చేసుకొన్నారు. గాంధీజీ అంటే అపరిమితమైన గౌరవం ఆమెకు. ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. తను స్థాపించిన ‘బాలికా పాఠశాల’,కు జాతీయస్థాయి గుర్తింపు రావటం, కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యేందుకు మహిళలను సమాయత్త పరచటం, ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహంలో ఆమె చురుకైన పాత్ర వహించటం అమోఘం. ఆమెది ఎంత వజ్ర సంకల్పమంటే – ఉప్పుని తన పిడికిలిలో పట్టుకొని, పోలీసులు చేతులపై లాఠీలతో కొడుతుండగా చెమటతో ఉప్పు తడిసి నీరుగా మారి బొట్లుగా కారుతున్నా పిడికిలి విప్పలేదామె. ఆమె కర్తవ్యదీక్ష మొక్కవోనిది. స్వాతంత్య్ర పోరాటంలో సత్యాగ్రహ ఉద్యమంలో అనేకసార్లు జైలు శిక్ష అనుభవించ వలసి వచ్చింది. జైల్లో ఎ క్లాస్ గది ఇస్తామన్నా తిరస్కరించి సి క్లాస్ గదిలో ఉండి, ఇతర మహిళా ఖైదీలతో పాటలు పాడించి, నాటకాలు వేయించి ప్రోత్సాహాన్ని కలిగించేది. అయితే క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. గతంలో లాగా నిత్య చైతన్యమంతంగా చురుగ్గా తిరగలేక పోయినా, మానసికంగా మాత్రం ఉత్సాహంగానే ఉండేది. దుర్గాబాయమ్మగారు అనగానే మొదట గుర్తుకు వచ్చేది ఆమె స్థాపించిన “ఆంధ్ర మహిళా సభ”. అది ఆమె కలల సాకార రూపం. ఈ సంస్థ ద్వారా వివిధ రకాలైన చేతి పనులు, వృత్తి విద్యలలో శిక్షణ, పారిశ్రామిక శిక్షణ, వయోజన విద్య మొదలైన శిక్షణలతో ఎందరో మహిళలకు – అభాగినులకు, వితంతువులైన మహిళలకు జీవనోపాధి కల్పించినది. ఎందరో దాతల వితరణలతో, స్వచ్ఛంద సేవికల నిస్వార్థ సేవలతో ఈ సంస్థ బహుముఖాలుగా ఎదిగింది. విసుగు విరామము లేకుండా నిరంతర తపనతో సంస్థ శాఖోపశాఖలుగా విస్తరించడానికి ఎంతో కృషి చేశారామె. 1937 నుండి 1981 వరకు దాదాపు 130 సేవాసంస్థలను స్థాపించారంటే ( 1937 లో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ సంస్థ వంటివి) ఆమె సాధారణ వ్యక్తి కాదు. స్త్రీ జనోద్దరణకు బలమైన బాటలు వేసిన ఒక వ్యవస్థ ఆమె. చరిత్రలో నిలిచిపోయే మహోన్నతమైన మహా శక్తి ఆమె. ‘ఆంధ్ర మహిళ ‘ అనే పత్రికను స్వీయ సంపాదకత్వంతో ప్రారంభించారు. దాతలు ఇచ్చిన విరాళాలు ఒక్క పైసా కూడా వ్యర్థం కాకుండా తాను చూసుకుంటూ, మరికొందరికి శిక్షణ ఇచ్చి నిష్ణాతులుగా తయారు చేయటం వల్లనే నేటికీ ఆమె స్థాపించిన సంస్థలు ఒక క్రమబద్ధంగా పనిచేస్తున్నాయి. పాల్ జిహాఫ్ మన్ అవార్డు, నెహ్రూ లిటరసీ అవార్డు, పద్మవిభూషణ్ గ్రహీత అయిన శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ 1981 మే 7న భౌతికంగా మనకు దూరమైనా ఆమె స్థాపించిన అనేక సంస్థలు, వాటిలో చేరి తమ జీవితాలను సుసంపన్నం చేసుకొన్న ఎందరో హృదయాలలో చిరంజీవి గా నెలకొని ఉన్నారామె.
*****
వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

ప్రొ. సిహెచ్. సుశీల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, గుంటూరులో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రిన్సిపాల్ గా ఒంగోలు, చేబ్రోలులో పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెనేట్ మెంబర్ గానూ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి.ఏ. స్పెషల్ తెలుగు ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకి లెసన్స్ రైటర్ గా, ఎడిటర్ గా పని చేసారు.
జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రసమర్పణ, రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సదస్సుల్లో రిసోర్స్ పర్సన్ గానూ, జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన న్యూ ఢిల్లీ సదస్సులో పాల్గొనడంతో పాటు, ఆకాశవాణి దూరదర్శన్ లలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో రిసోర్స్ పర్సన్ గా పనిచేసారు. విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు పై ఎం.ఫిల్., ముళ్ళపూడి వెంకటరమణ రచనల పై పిహెచ్.డి. చేసారు. యు.జి.సి. సహకారంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్, మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ చేసారు.
వీరి నాన్నగారి పేరు మీద విమర్శారంగంలో కృషి చేస్తున్న వారికి కీ.శే. సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక సాహితీ పురస్కారాన్ని గత 3 సంవత్సరాలుగా అవార్డు ఇస్తున్నారు. వరుసగా గత మూడేళ్ళలో కడియాల రామ్మోహనరాయ్ , రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కె.పి. అశోక్ కుమార్ గార్లకు ఈ అవార్డుని అందజేశారు.
విద్యార్థినుల చైతన్యం కొరకు సంస్థల్ని ఏర్పాటు చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడమే కాక, తి.తి.దే. మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి సౌజన్యంతో అన్నమాచార్య జాతీయ సదస్సు ఏర్పాటు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, మద్రాసు తెలుగు అకాడమీ అవార్డు, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, ఎన్.టి.ఆర్. తెలుగు మహిళ పురస్కారం, ఎక్సరే రచయితల అవార్డు, ఇందిరాగాంధి సేవాపురస్కారం, మదర్ థెరీసా సేవాపురస్కారం, స్త్రీవాద రచయిత్రి అవార్డు, విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం, సాహిత్య విమర్శ రంగంలో “కవిసంధ్య ” ( శిఖామణి) అవార్డు, కిన్నెర ఆర్ట్స్ & కొవ్వలి అవార్డులు అందుకున్నారు.
అనేక పేరడీలు వివిధ పత్రికల్లో ప్రచురింపబడి, “పేరడీ పెరేడ్” పుస్తకంగా, “పడమటివీథి” కవితా సంపుటి వెలువరించారు. సురక్ష ( పోలీసు వారి మాస పత్రిక) లో40 నెలల పాటు ‘ ఈ మాసం మంచి కవిత’ శీర్షిక నిర్వహించారు.
రచనలు:
1.స్తీవాదం – పురుష రచయితలు
2. కొవ్వలి లక్ష్మీ నరసింహరావు గారి జీవిత చరిత్ర
3. విమర్శనాలోకనం ( విమర్శ వ్యాసాలు)
4. విమర్శ వీక్షణం ( విమర్శ వ్యాసాలు)
