విజయవాటిక-19

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

           ఆశ్చర్యంగా వింటున్నాడు శ్రీకరుడు. అతనికి రాజమాత ధ్యాననిష్ఠ మీద గొప్ప నమ్మకం. ఆమె ధర్మ పరిపాలన మీదా అంతే నమ్మకం.

           ఆమె తన భర్త మహారాజు రెండవ మాధవవర్మకు మాట ఇచ్చింది. ఆ మాట కోసం నేటి మహారాజును రాజును చేసి తన పుత్రుని యువరాజుగానే ఉంచింది.

           ఆమె మరోలా చెయ్యగలిగినా, మాట తప్పలేదు. రాజులకు వైదికధర్మమే సరి అయినదన్న ఆమె నమ్మకం విష్ణుకుండినులను దక్షిణాపథమున గొప్ప రాజ్యంగా నిలబెట్టింది.

           శ్రీకరునికి ఇవన్ని స్తుతిపధంలో మెదిలాయి. ఆమె నవ్వింది. ఎంతో స్వచ్చమైన నవ్వు అది.

           “శ్రీకరా నేను ఉన్నంత వరకూ పర్వాలేదు. కానీ నేను లేని నాడు ఈ రాజ్యము ఖండఖండాలుగా కాకుండా నీ వంటి వీరుడు నిలబడాలి…”

           “తల్లీ! అంత మాట అనకండి. మీరు శత వర్షములు నిలబడాలి…”

           “నాయనా మన చేతిలో ఏమున్నది. పరమేశ్వరుని ఆజ్ఞ. నీవు పోయిరమ్ము…”

           శ్రీకరుడు ఆమెకు ప్రణామాలు ఆచరించి వచ్చేశాడు.

           బయటకు వచ్చినా అతనికి కూడా భవిష్యత్తులో ఏదో విపత్తు రాబోతున్నదని అర్థ మవుతూనే ఉంది…

***

‘తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః

సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః

రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః’

           సూర్య సంక్రమణం… పండించిన పంటలతో రైతులు సంకురాత్రి పండుగ చేసుకుంటున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది.

           విజయవాటిక నగరం పువ్వులతో అలంకరించారు. దేశమంతా పండగ మొదలయ్యింది. ఆ పండుగలో అలా శివరాత్రి వరకూ వేడుకలు జరుగుతాయి.

           వేద పండితుల సమక్షంలో అపూర్వమైన గుహాలయాలను ప్రతిష్ఠించారు. వరుసగా ఆ పది రోజులు దేశములోని అన్ని శివాలయాలలో రుద్రాభిషేకాలు జరిగాయి. ఇంద్రపురి నుంచి వచ్చిన రాజగురువులు పరమేశ్వరశాస్త్రుల పర్యవేక్షణలో ఈ ప్రతిష్ఠలు వేడుకగా జరిగినాయి.

           తదనంతరం అశ్వమేధం మొదలయింది. మొదటి రోజు అగ్నిని, ఇంద్రుణ్ణి, విష్ణువును పూజించారు. మహాగణపతి హోమం, రుద్రహోమం జరిపారు. సంగీతం, నృత్యంలతో విజయవాటిక ఆనందడోలికలాడింది. ఋత్వికుల వేదనాదములో విజయవాటిక మురిసింది. రెండవరోజు బలి కార్యక్రమం జరిగింది. తదనంతరం దానాలు జరిగాయి. ఆ సందర్భంలో అగ్రహారాల దానాలు జరిగాయి. దాన పత్రాలు రాగి రేకుల మీద ముద్రించిన విష్ణుకుండినుల ముద్రతో బ్రాహ్మణులకు దానాలు చేశారు.

(ఇలా చేసిన దాన శాసనాలు కొన్ని దొరికాయి. వాటి వలన విష్ణుకుండిన రాజుల చరిత్ర మరింత వివరంగా మనకు తెలిసింది- రచయిత్రి)

           వేడుకలుగా మూడవ రోజు కూడా యాగం జరిగింది. అందరికీ కానుకలు పంచారు మహారాజు.

           అతిథులుగా యువరాజు, కళింగరాజు, ఎందరో ప్రముఖులు విచ్చేసి ఆ మూడు రోజులు ఆ యాగం చూసి మాహారాజుకు కానుకలు ఇచ్చారు. మూడవరోజు ఒక ప్రముఖులైన వారిని సత్కరించటం ఆచారం. దానితో యాగసమాప్తి కాగలదు. మహారాజు మాధవవర్మ రాజమాతను ఆ సత్కారం స్వీకరించవలసినదిగా ఆహ్వానించాడు.

           రాజమాత నెమ్మదిగా వచ్చి ఆసనం పై కూర్చొన్నది.

           ఆమెకు మహారాజు మాధవవర్మ వేద మంత్రాల మధ్య పాదపూజ చేశాడు.  తదనంతరం ఆమెను పూలతో సత్కరించి, గంధక్షతలు వేసి, నమస్కరించారు రాజదంపతులు.

           రాజమాత సంతోషంగా వారిని దీవించింది.

           యాగం సంపూర్ణమైనదని రాజగురువు ప్రకటించాడు.

***

           విక్రమేంద్రవర్మ ఇంద్రపురికి తిరిగి ప్రయాణమయ్యాడు.

           రాజమాత తన మండలదీక్ష పూర్తి చేసుకున్నా, బలహీనపడినందున కదలలేదు.

           రాజ్యంలో, త్రికూటంలో తిరునాళ్ళ హడావిడి మొదలైంది.

           ఎక్కడెక్కడ నుంచో ప్రజలు ప్రభలుకట్టుకు వస్తున్నారు. కీకారణ్యమైన త్రికూటము (కోటప్పకొండ) ఆ తిరుణాలకు మాత్రం భక్తులతో నిండిపోతున్నది. ఆ లోయ మొత్తం శివపంచాక్షరితో మారు మ్రోగుతున్నది.

           మహాదేవుని మంత్రంతో రాజ్యం పునీతమవుతున్నదా రోజులలో.

           శివరాత్రి నెళ్ళాళ ముందే దేశమంతటా నాటకాలు, నృత్యాలతో పండుగే.

           ప్రతి పల్లెలో ఒక తిరునాళ్ళు జరుగుతాయి. నాటకాలు, శివ పురాణ ప్రవచనాలు, నృత్యాలు, శివతాండవ ప్రదర్శనాలతో ప్రజలు ఆనందంగా గడుపుతున్నారు.

           గోవిందుడు శివరాత్రికి వేసే నాటకాలకు తమను వెళ్ళటానికి అనుమతి ఇవ్వమని మహాదేవవర్మను  ప్రార్థించాలని నిశ్చయించుకున్నాడు. ఆనాటి సాయంత్రం హరిక నృత్యవిన్యాసం పూర్తి అయిన తరువాత గోవిందుడు భక్తిగా రాజకుమారుని వద్దకు వచ్చి “ప్రభూ మేము త్రికూటములో నృత్య ప్రదర్శననివ్వాలని అనుకున్నాము. మాకు అనుమతి ఇచ్చిన, త్రికూటమెళ్ళగలము…” అన్నాడు. 

           “ఎన్నాళ్ళు మీ ప్రదర్శనలు?” అడిగాడు మహాదేవవర్మ.

           “శివరాత్రి వరకు ప్రభూ!”

           “ఆలోచించి చెబుతా…” మారు మాట్లడనియ్యకుండా మహాదేవుడు వెళ్ళిపోయాడు. 

           గోవిందునికి నిరాశ కలిగింది. 

           అదీ బంధీలమంటే పూర్తిగా కాదు. అలాగని కోట దాటి బయటకు వెళ్ళటానికి లేదు. విచారంగా అనిపించింది. 

           తప్పించుకు పారిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా కలిగింది అతనికి చాలాసార్లు, కానీ తనను నమ్ముకు వచ్చిన సంగీతకారులను వదిలి వెళ్ళలేక మిన్నకున్నాడు.  

***

           మహాదేవుడు, శ్రీకరునితో సమావేశమైనాడు.

           “కారా! ఆ నృత్యకారులను విడుదల చేయి…”

           “వద్దు ప్రభూ! మనము కొంత కాలము జాగ్రత్త వహిస్తే చాలు. ఆ కళింగులతో తేలి పోతుంది విషయము…”

           “మనము బలవంతులము. ధైర్యవంతులము. ఈ చిన్న నాట్యకారులకు భయపడవలసినదేమున్నది?” అన్నాడు మహాదేవుడు కొద్దగా చిరాకు కూడిన స్వరంతో.

           పైగా అతనికి కొద్ది రోజులుగా ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. కారణం లేకుండా అతను జబ్బు పడ్డాడు. రాజవైద్యుడి మందులు పని చెయ్యటం లేదు.

           రోజు రోజుకు నీరసిస్తున్నాడు. భోజనం సహించటం లేదని తినటం కూడా లేదు.

           ఆ రోజు హరికను పిలిపించాడు. 

           ఆమె వచ్చి అతని ముందు నిలిచింది. 

           అతను ఆమెను దగ్గరకు పిలిచి ఆమెకు నెమ్మదిగా చెప్పాడు “హరికా! రాజుల జీవితాలు వారివి కావు. ప్రజల కోసమే వారు జీవించాలి. నేను నిన్ను హృదయములో ఉంచి కొలిచితి. నాకు నిన్ను వివాహము చేసుకోవాలని ఉన్నా మా తండ్రిగారి ఆజ్ఞ లేదు. నీవు నేటి నుంచి స్వేచ్ఛా జీవివి. నీకు కావలసిన ధనము తీసుకొని వెళ్ళు. సుఖంగా జీవించుము…” అన్నాడు. 

           హరిక కళ్ళ వెంట కన్నీరాగలేదు. 

           “ప్రభూ! నేను మిమ్ముల విడిచి వెళ్ళలేను…”

           “నీవు వెళ్ళవలసినదే. ఇది నా ఆజ్ఞ…” చెప్పాడు మహాదేవుడు.

           ఆమె మహాదేవవర్మకు నమస్కరించి కన్నీటితో వెళ్ళిపోయింది. 

           ఆ మరుసటి రోజు గోవిందుని బృందాన్ని త్రికూటం వద్ద దింపారు రాజ భటులు. 

           చాలా కాలం తరువాత లభించిన స్వేచ్ఛకు బృందం ఆనందపడింది. శివరాత్రికి తన ప్రదర్శన చెయ్యగలనని అక్కడి నిర్వహకులతో చెప్పి వచ్చాడు గోవిందుడు. 

           గలగల పారే గోదావరి లాంటి హరిక మాత్రం మారిపోయింది. ఆమెలో దిగులు స్పష్టంగా కనపడుతున్నది.

           ఆమె మహాదేవవర్మను మరువలేకపోతున్నది. సరయుకు మాత్రమే హరిక దుఃఖం అర్థమయింది. 

           బృందములోని వారు ఎంత పిలిచినా ఆమె నృత్యం చెయ్యనని చెప్పింది. తను కళింగకు వెళ్ళిపోతానని చెప్పి మంకుపట్టు పట్టింది హరిక.

           “శివరాత్రి పదర్శన ఒక్కటీ చెయ్యి! మనము శివరాత్రి మరునాడు వెళ్ళిపోదాము. మాకూ కళింగకు వెళ్ళాలని ఉన్నది” బ్రతిమిలాడుతూ అడిగాడు గోవిందుడు.

           “ఈ రాజ్యములో నిముషముండలేక పోతున్నాను…” కన్నీటితో చెప్పింది హరిక.

           ఆమె కన్నీరు మున్నీరై మరసటి రోజుకు, ఆమెకు లేవలేనంత జ్వరం కూడా వచ్చింది.

           గోవిందుడు చేసేది లేక బృందాన్ని శివరాత్రి నృత్యం ప్రదర్శించమని చెప్పి హరికను తీసుకు బండి కట్టించుకొని కళింగకు ప్రయాణమైనాడు.

***

           శివరాత్రి వేడుకలు అమరావతిలో కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నవి.

           శివరాత్రి నాడు రాత్రి లింగోద్భవ వేళ మహాదేవుని ధ్యానిస్తూ రాజమాత వాకాటక మహాదేవి అనాయాస మరణము పొందింది. ఆమెది ఇచ్ఛా మరణమది. శివైక్యమొందిన ధన్యజీవి మహారాణి, వీర పత్ని, వీరమాత. విష్ణుకుండినులకు దిశానిర్దేశము చేసిన ఘనత పొందినదామె చరిత్రలో.

           ఆమె మరణవార్తతో రాజ్యమంతటా దుఃఖ సముద్రంలో మునిగింది. ద్వందీ భావములో ఊగింది.

           ఆమె శివరాత్రి నాడు ధ్యానంలో మరణించటం వింతగా, ఆమె శివభక్తికి నిదర్శనంగా ప్రజలు చెప్పుకున్నారు. ఇన్ని రోజులు పెద్ద దిక్కుగా ఉండి కాపాడిన ఆమె ప్రతిభ, నేడు రాజ్యానికి కరువైనదని దుఃఖం పెరిగింది అందరిలో.

           శ్రీకరునికి, ఆమె మరణం ఆమెకు తెలుసని అనిపించినది. అతనికి ఆమె తన వద్ద తీసుకున్న ప్రమాణం గుర్తుకొచ్చింది. అతను ఆలోచనగా రాజ మందిరం వైపు నడుస్తున్నాడు.

           శివరాత్రి గడిచి వారం రోజులు అయింది. మహారాజు మాధవవర్మ విజయవాటిక నుంచి వచ్చాడు. మహాదేవవర్మను చూడటానికి మహాదేవుని పరిచారిక ఎదురు వచ్చింది. ఆమె శ్రీకరుని చూసి నమస్కరించి “ప్రభూ! రాజకుమారులు ఇప్పుడే నిద్ర కుపక్రమించారు. ఈనాడు కూడా ఆయన ఏమీ తినలేకపోయారు..” చెప్పింది.

           శ్రీకరుడు తల ఊపి అక్కడ మండపంలో నిలబడ్డాడు. మాధవవర్మ ప్రక్కనే కూర్చున్నాడు.

           రాజవైద్యుడు, మంత్రులు ప్రక్కనే ఉన్నారు.

           రాజ్యవైద్యునితో “సమస్య ఏమిటి? ఎందుకు మహాదేవునికి నయమవటము లేదు?”  అడిగాడు మహారాజు.

           రోజు రోజుకు చిక్కిపోతున్న మహాదేవుని చూస్తూ “ప్రభూ! మన రాజకుమారుని పై విష ప్రయోగము జరిగిందని అనుమానము. జబ్బు తగ్గటము మన చేతులలో లేదు. ఆ పరమేశ్వరుని కృపతో తగ్గాలి. మనము ఏమీ చెయ్యలేము…” చెప్పాడు వైద్యుడు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.