విజయం

– నీరజ వింజామరం

మౌన శరాలతో , మాటల బాణాలతో
మనసును ఛిద్రం చేసే
విలువిద్య నేర్వనే లేదు
అదను చూసి పదునైన కరవాలంతో
ఎదను గాయపరిచే కత్తిసాము రానేరాదు
ఏ అస్త్రమూ లేదు
ఏ శస్త్రమూ తెలీదు
మొండిబారుతున్న ఆయువు తప్ప
ఏ ఆయుధమూ లేదు
సమయం చూసి నువ్వేసే
సమ్మెట పోట్ల నుండి రక్షణ లేదు
ఏ వేటును ఎలా ఎదుర్కోవాలో
తెలిపే శిక్షణ లేదు
ఎటువైపు నుండి ఏమి తగిలి
తల్లడిల్లాలోనని అల్లాడిపోతూ
క్షణక్షణ నరకం కంటే
మరణమే మేలని తలచే తరుణంలో
విజయకాంక్షా వీచికొకటి నను తాకింది
మరణమే విజయమనుకుంటే
అది వరించే వరకు పోరాడమంది
నిలువెల్లా గాయాలతో కుప్పకూలిన నన్ను
నూతన శక్తితో కదన రంగంలో నిలిపింది
నా ఓటమిని కోరుకునే
నీకిదే నా ఆహ్వానం
నీ సర్వ శక్తులను నియోగించు
అన్ని అస్త్రాలను ప్రయోగించు

నిరస్త్రనైనా నిర్భయంగా నిలిచాను
నీకు ఎదురు తిరిగిన మరుక్షణమే నేను గెలిచాను

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.