విషమ పరీక్ష

-ప్రమీల సూర్యదేవర

పిన్నీ పిన్నీ పిప్పళ్ళూ!!
పిన్నీకూతురు జాలమ్మా !!
అట్లాకాడా సుబ్బమ్మా !!
అల్లూడొచ్చాడు లేవమ్మా !!

          నందు, చందు, అనూష ముగ్గురూ దొడ్లో చిక్కుడుతీగను పందిరిపైకి మళ్ళిస్తున్న అనిత చుట్టూ చేరి, చప్పట్లు చరుస్తూ పాడసాగారు.

          “ఒరే, గాడుదుల్లారా ఎవరు నేర్పారురా మీకు ఈ పాట?” అని నవ్వుతూ వారివెంట పడింది అనిత. చిక్కుడు, కాకర, దొండ పందిళ్ళ చుట్టూ తిరిగి వాములదొడ్లోకొచ్చారు. వాముల చుట్టూ పరుగెత్తి , అలసిపోయి పిల్లలు ముగ్గురూ కిలకిలా నవ్వుతూ, గడ్డివాముపై వెల్లకిలా పడ్డారు. అనిత కూడా నవ్వుతూ వారి ప్రక్కన చేరింది.

          “ఇంకొక రెండు గంటల్లో పెండ్లివారు వస్తుంటే నువ్వేమిటే గడ్డివాముల చుట్టూ గంతులేస్తున్నావ్?” బావి దగ్గర గిన్నెలు తోముకుంటున్న వెంకాయమ్మగారు కేక వేసింది.

          “వస్తే రానీ. నన్నిలాగే చూస్తారు.”

          “ఆ చూస్తారు. విదేశాలకు వెళ్ళే ఆబ్బాయి గడ్డివాముల చుట్టూ తిరిగే పిల్లను చేసుకుంటాడేమిటి?”

          “మా పిన్నేం గడ్డివాముల చుట్టూ తిరగదు.” నందు పౌరుషంగా అన్నాడు.

          “ష్,” అని సైగచేసి అనిత నందు చెవిలో ఏదో చెప్పింది.

          “ఓ భలే! భలే!” వస్తున్న నవ్వును ఆపుకుంటూ నందు అడుగులో అడుగు వేసు కుంటూ వెంకాయమ్మగారి వెనక్కు వెళ్ళాడు.

          “అయితే అత్తా, గడ్డివాముల చుట్టూ తిరగటం తప్పంటావు?” అనిత ఆవిడను మాటల్లో దించింది.

          “కాదేమరి! అందులోను పెళ్ళివారొచ్చేరోజు! మీ మామయ్య నన్ను చూట్టానికి వస్తామని వ్రాసిన రోజు నుండి మా అమ్మ నన్ను బయటకు వెళ్ళనిచ్చేది కాదు నల్లబడి పోతానేమోనని.” ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది.

          “నాకో సందేహం అత్తా , నువ్వు రంగా? మామయ్య రంగా ?”నల్లగా నిగనిగ లాడుతున్న ఆమెవైపు చూస్తూ అడిగింది అనిత.

          “పోవే భడవా, నేను పెళ్ళప్పుడు ఎలాగున్నానో అడుగు మీ మామయ్యను. అత్తింట్లో నానాచాకిరీ చేసి ఇలాగైపోయాను గాని.” తళ తళ మెరుస్తున్న గిన్నెలు బుట్టలో సర్ది పైకిలేస్తూ, పమిటకొంగు బరువుగా ఉండటంతో వెనక్కు తిరిగి కొంగుకు ముడివేసిన బకెట్ విప్పుతూ, “వొరె నందూ నీపనేరా ఇది? రానీ మీనాన్నను, చెప్తా నీపని. పిల్లలిలా అల్లరి చేశారని చెప్తే కాళ్ళు విరగ్గొడ్తాడు.” కేకలు వేసింది. 

          “నాన్నగారికి నిజంగానే చెప్పేస్తుందేమో!” నందూ భయం భయంగా అనిత వెనుక నక్కుతూ అన్నాడు.

          “ఏదోలే చిన్నవాడు ఈసారికి పోనీలే అత్తా .”

          “ఏమే నంగనాచీ, నీ సంగతి నాకు తెలియదనుకున్నావా? వాడికి పురమాయించి ఏమీ తెలియనట్టు నాటకమాడుతున్నావు. ఆ పెళ్ళివారిని రానీ నీచిలిపితనమంతా వెళ్ళగక్కుతాను.” బకెట్ విసిరికొట్టి , గిన్నెలబుట్ట తీసుకుని విసురుగా వెళ్ళిపోయింది.

          “నిజంగానే మనింటికి వస్తుందేమో తాతయ్యకు తెలిస్తే కోప్పడతారు.”

          “ఛ రాదురా, అత్త చాలా మంచిది. ఆవిడకు పిల్లలంటే ప్రాణం. కాని ఆవిడకు పిల్లలులేక, వాళ్ళ అల్లరి అలవాటులేక అలా అంటుంది అంతే,” భయపడ్తున్న పిల్లలకు ధైర్యంచెప్పి , “పదండి అమ్మమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది.” అని ఇంటిదారి పట్టింది.

          “అనితా ఏమిటమ్మా ఇంకా పిల్లల్తో కలిసి తిరుగుతున్నావు? స్నానంచేసి త్వరగా తయారవు తల్లీ. ఇలారా, కొంచెం ఈ పళ్ళానికి నెయ్యిరాసిపెట్టు పాకం వచ్చిందిలా వున్నది.” పొయ్యిమీద మైసుర్ పాక్ కలబెడ్తూ అనిత తల్లి సీతమ్మగారు అన్నది.

          “అమ్మా, కతికితే అతకదంటారుకదే! వచ్చిన వారెవరూ ఇవి ముట్టుకోరుకదా! ఇంతలా కష్టపడి చేయటమెందుకు?” గతంలో జరిగిన అనుభవాలు గుర్తుతెచ్చుకుంటూ అన్నది అనిత.

          “అలాగని వచ్చిన వారికి ఏమీ పెట్టకుండా పంపలేంకదా! అది మన సంప్రదాయం కాదు.” మైసూర్ పాక్ గిన్నెలో నుండి పళ్ళెంలోకి పోస్తూ అన్నది సీతమ్మగారు.

          “వేసవి శలవలకు పిల్లలు రావటంతో ఈ నెలరోజులు ఇల్లంతా కళకళ లాడుతుంది. రేపు నువ్వుకూడా వెళ్ళిపోతే నేనూ, మీ నాన్నగారూ బిక్కుబిక్కుమంటూ వుంటాం.” సీతమ్మగారు దిగులుగా అన్నది.

          అనిత ఏదో అనేలోగా, రఘుపతిగారు, అనిత తండ్రి , లోపలకు వస్తూ, “అనిత అప్పుడే వెళ్ళిపోవటం లేదుకదే! ఇప్పట్నుంచే నీకు దిగులెందుకు?” అని భార్యను సముదాయించి, “నువ్వెళ్ళి త్వరగా తయారవు తల్లీ , చలపతిమామయ్య స్టేషన్ కెళ్ళాడు వారిని తీసుకు రావటానికి,” అని అనితని తొందర పెట్టాడు.

          బీరువా తెరిచి తనకున్న ఒకే ఒక్కచీరె, నల్లంచువున్న గోధుమవన్నె జార్జెట్ చీరె కట్టుకుని, గోధుమరంగు జాకెట్ తొడుక్కుని, తలదువ్వి ఒదులుగ జడ అల్లుకుని, గులాబీ పువ్వు చెంపపిన్నుకి గ్రుచ్చి కుడిప్రక్క చెవికిపైన పెట్టుకుని, చీరెకు మ్యాచ్ అయ్యేలా మట్టిగాజులు, చెవులకు జూకాలు, మెడలో ఒంటిపేట బంగారం గొలుసు వేసుకుని, అద్దంలో చూసుకుని, చాల్లే సింగారం అనుకుని బయటకు వచ్చింది.

          “అనితని ఎక్కడో కాలేజీలో చూశాడట వదినా, తలి దండ్రులకు చెప్పాడట. వారికి రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు, ఒక పంచదార ఫ్యాక్టరీ ఉన్నాయట. ఇవికాక, స్వంత వూళ్ళో వందెకరాల పొలం ఉన్నదట. అంత ఆస్తిపరులు మన అమ్మాయి కావాలని రావటం ఎంత అదృష్టం! అబ్బాయి పైచదువులకు లండన్ వెళ్తాడట, వెళ్ళేలోపలే పెండ్లి చేసుకుని వెళ్ళాలనుకుంటున్నాడనీ, చూసుకోవటానికి వస్తామనీ మన పంతులుగారితో కబురు పంపినప్పుడు నమ్మలేక పోయాననుకో.” తనకు సాయం చేయాలని వచ్చిన వెంకాయమ్మగారితో సంతోషంగా చెప్పింది సీతమ్మగారు.

          “మన అనితకేం తక్కువమ్మా పిల్ల బంగారుబొమ్మ. చదువుకున్నది కూడాను. అది కాలుపెట్టిన నట్టింట బంగారం పండుతుంది.” మైసూర్ పాక్, కారబ్బూంది, చేగోడీలు పళ్ళెంలో అమర్చిపెడ్తూ అన్నది వెంకాయమ్మగారు.

          “మనపిల్ల మనకు బంగారమే వదినా. ఈ రోజుల్లో కూడా ఎమ్,ఎ చదువుకున్న పిల్ల సరిగా సంసారం చేయదేమోనని సందేహపడటం నమ్మశక్యం కాకుండా ఉన్నది.” సీతమ్మగారు విచారంగా అన్నది.

          వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే వీధిలో కారు ఆగినశబ్దం విని, వచ్చేవారు స్తితిమంతులు, రిక్షాలలో తీసుకు రావటం బాగోదని తను తీసుకున్న బాడుగ కారులో వచ్చినవారికి స్వాగతం పలకటానికి, రఘుపతిగారు హడావుడిగా బయటకు వెళ్ళి పోయాడు.

          సీతమ్మ, రఘుపతిగార్లు పెద్దలిద్దరకి నమస్కరించి, అందరిని చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించారు. తమ ఇంట్లోవున్న రెండు చెక్క కుర్చీలకు తోడు కరణం గారింటి నుండి తెచ్చిన రెండు చెక్క కుర్చీలు ఎదురెదురుగ వేసి, నులకతాడుతో అల్లిన మూడు మోడాల్లాంటివి వేసి, ఎప్పటిదో తాతలనాటి నాలుక్కాళ్ళ చెక్కబల్ల , గుంటలు మరకలు కనుపించకుండా ఇంట్లోవున్న గళ్ళ దుప్పటి ఉతికి ఇస్తీృ చేసి దానిపై పరిచి,
దొడ్లోనుండి ఆకులతో కోసి గాజుగ్లాసులో అందంగా అమర్చిన గులాబీ పూలగుత్తి బల్లపై పెట్టారు.

          బంధువులు రాకముందు ఉదయమే వెలిగించిన సాంబ్రాణి కడ్డీల నుండి సువాసనలు వెదజల్లే గదిలోకి ప్రవేసించి, నలుగురూ నాలుగు కుర్చీలలో ఆసీనులు కాగానే, రఘుపతిగారు పంకా వేశారు. చలపతిగారు, గోడవారగా పెట్టిన రెండు మోడాల్లో ఒకటి తెచ్చుకుని, కుర్రవాని తండ్రి ప్రక్కగా వేసుకుని కూర్చున్నాడు.

          మైసూర్ పాక్ ప్లేట్ పట్టుకుని వస్తున్న అనిత ఎదురుగా వున్న వ్యక్తిని చూడగానే ఉలిక్కి పడింది. తొట్రుపాటుని పైకి కనుపించనీయకుండా ప్లేటు బల్లపైపెట్టి , పెద్ద వారిద్దరికి నమస్కారంచేసి, కుర్రవాడి తల్లి ప్రక్కనే వున్న మోడాపై కూర్చుని, ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది.

          “ఏం బాబూ నువ్వేమైనా అమ్మాయితో మాట్లాడాలా?” చలపతిగారు అడిగాడు.
కుర్చీలో కొంచెం ఇబ్బందిగా కదిలి, “ఏంలే,”దని తల ఊపాడు. మరోఐదు నిముషాలు కూర్చుని, వెళ్ళివస్తామని లేచారు.

          “అమ్మలూ నువ్వు అదృష్టవంతురాలివి తల్లీ . కానీ కట్నం లేదుకదా! పైగా పెళ్ళిఖర్చులు కూడ వారే పెట్టుకుంటారట. మనకు చేతనైనంత వారికిస్తే చాలు, మిగిలింది వారే చూసుకుంటామన్నారు. ఏమే విన్నావా? వంటగది వదిలి ఇటురావే! వారు ఇంకా ఏమన్నారంటే, అనితకి మనం నగలు కూడా ఏమీ చేయించనవసరం లేదట. దానికి నగలు చేయించి వారికి ఆడపిల్లలు లేరనే లోటు తీర్చుకుంటారట. అదృష్టం నీది కాదమ్మా, నాది.” పైకండువాతో కళ్ళొత్తుకుంటూ అన్నాడు. భర్త ఆనందంలో పాలు పంచుకోవటానికి సీతమ్మగారు కొంగుతో చేయి తుడుచుకుంటూ వచ్చింది. సంతోషంగా చెప్పుకు పోతున్న తండ్రివైపు బాధగా చూసింది అనిత. “ఇంత ఆనంద పడిపోతున్న అమ్మకు, నాన్నకు ఈ పెండ్లి నేను చేసుకోనని ఎలా చెప్పాలి?”
అనూష చేతిలో రెండు తాటాకు బొమ్మలు- ఒకదానికి చీర కట్టి, మెడలో పూసల గొలుసు లు వేసి, నల్లదారంతో జడ అల్లి, చివర చిన్న గుడ్డపీలిక రిబ్బన్ వేసి, రెండవ బొమ్మకు ధోవతి కట్టి, పైన చిన్న ఉత్తరీయం వేసినవి పట్టుకుని వచ్చింది. “ఇవి చూశావా! వెంకాయమ్మ అమ్మమ్మ చేసింది.” బొమ్మలు పదిలంగా గోడకు ఆనించిపెడ్తూ అన్నది.
ఏంచేయాలో తోచక, ఆలోచనలో మునిగిపోయిన అనిత వెంకాయమ్మగారి పాకలోకి వచ్చింది.

          వెంకాయమ్మగారు భర్తకు కాఫీ కలుపుతుంది. అనితనిచూసి, “పెండ్లికూతు రొచ్చింది,” అన్నది నవ్వుతూ.

          వెంకాయమ్మగారి మాటలకు ఏం బదులు చెప్పకుండా పుల్లయ్యగారి మంచం ప్రక్కనే కూర్చున్నది. మాటకు మాట బదులుచెప్పే అనిత పరధ్యాన్నంగా ఏదో అలోచిస్తుండటం చూసి, “ఏమ్మా, పెండ్లికుమారుడు నచ్చాడా? మాకు పప్పన్నం ఎప్పుడు పెడ్తావు?” పుల్లయ్యగారు అడిగాడు. 

          సమాధానంగా తలెత్తి ఆయన కళ్ళలోకి ఒకసారి చూసి, తల దించుకుని ప్రక్కనే వున్న తాటాకులను ముక్కలు చేస్తూ కూర్చున్నది.

          అనితని అలాచూడగానే ఆయన గుండె బరువెక్కి పోయింది. పుల్లయ్య, వెంకాయమ్మగార్లు వచ్చిన కొద్ది కాలానికె రేవతి పెండ్లి చేసుకుని వెళ్ళిపోవటం వల్ల అనిత రెండిళ్ళ మధ్య గారాబంగా పెరిగింది. పిల్లలులేని ఆ దంపతులిద్దరికీ అనిత అంటే అపురూపం.

          “అమ్మా, నాన్నా, చాలా సంతోషంగా వున్నారు. వాళ్ళకి అబ్బాయి వెనుక వున్న ఆస్తి నచ్చింది. ఆ కారణంగా అబ్బాయి నచ్చాడు. కాని నన్నెవరూ అబ్బాయి నచ్చాడా? నీ అభిప్రాయం ఏమిటని ఎందుకు అడగరు?” కళ్ళలో నీరు తిరుగుతుండగా ఆవేశ పడుతూ అన్నది.

          “నిజమే! వాళ్ళు తప్పు చేసారు. మంచి కుటుంబం, ధనవంతులు, తమకు తామే నిన్ను కావాలనుకుని వచ్చారనే ఆనందంలో వాళ్ళు నిన్నడగలేదు. నేనిప్పుడు అడుగుతున్నా చెప్పు నీకు ఆ అబ్బాయి నచ్చాడా?” చిరునవ్వుతో అడిగాడు.

          “లేదు నాకు నచ్చలేదు. నేను చేసుకోనీపెళ్ళి !” గట్టిగా అరిచినట్లు అన్నది.
శ్రోతలిరువురూ ఉలిక్కి పడ్డారు. వెంకాయమ్మగారు అనిత ప్రక్కన కూర్చుని భుజంపై చేయివేసింది. అనిత నెమ్మదిగా ఆమెచేయి తీసివేసి బయటకెళ్ళి పోయింది……….

          భయంతో సరోజ వేస్తున్న కేకలు, వికటాట్టహాసం చేస్తూ, కామంతో, మదంతో కళ్ళు మూసుకుపోయి, సరోజ చీరకొంగు చేతిలో పుచ్చుకుని చీర విప్పుతున్న కమలేష్, చప్పట్లు కొడ్తూ వీరిద్దరిచుట్టూ తిరుగుతున్న అతని ముగ్గురు స్నేహితులూ–తలనొప్పిగా ఉన్నదని క్లాస్ మానివేసి, గదికి వచ్చిన అనితకు కనపడిన భయంకరమైన దృస్యం! అకస్మాత్తుగా తలుపు తెరుచుకుని వచ్చిన అనితను చూసి కమలేష్ స్నేహితులు
కలవర పడుతూ నిల్చుండి పోయారు. మూల పెట్టిన గొడుగు తీసుకుని అనిత వారి ముగ్గురినీ చితకబాద సాగింది. అకస్మాత్తుగా వచ్చిపడ్తున్న దెబ్బలను  తప్పించుకో వటానికి ప్రయత్నిస్తూ చేతులు అడ్డు పెట్టుకుని పారిపోవాలని చూస్తున్న స్నేహితులతో,

          “ఒరే చవటల్లా చూస్తారేంరా! దాన్ని కట్టి పడేయండి.” కోపంగా అరుస్తున్న కమలేష్ తలపై బలంకొద్దీ గొడుగుతో బాదింది. బిత్తర పోయిన కమలేష్ వెంటనే తేరుకుని, సరోజని వదిలి అనిత వెంట పడ్డాడు. మెరుపులా తలుపు తీసుకుని, రొడ్డుమీదకొచ్చి, కేకలు వేయసాగింది. గలాభావిన్న ఇరుగు పొరుగువారు చుట్టూ పోగై నలుగుర్నీ చిత క్కొట్టి, మళ్ళీ ఈవీధిలో కనుపిస్తే చంపేస్తామని బెదిరించటంతో, వారి కారు సంగతి కూడా మరిచి, కాళ్ళకు బుద్దిచెప్పారు.

          కమలేష్ యూనివర్సటీలో పేరుమోసిన రౌడీ అని ప్రఖ్యాతి గాంచాడు. తలి దండ్రుల సంపాదనని జల్సాలకు ఖర్చుపెట్టటం, అమ్మాయిల్ని అల్లరి చేయటం అతని ప్రత్యేకత. అతనికి భయపడి విద్యార్దినీ విద్యార్ధులు అతన్తో పేచీ పెట్టుకోకుండా దూరంగా ఉంటారు. మొట్ట మొదటిసారిగా తనకు జరిగిన పరాభవానికి పగబట్టిన త్రాచులా ఎంత గొడవచేస్తాడోనని అనిత, ఆమె స్నేహితులు భయపడ్డారు. అందర్నీ ఆశ్చర్యపరిచేలా యూనివర్సటీలో ఉన్నన్ని రోజులూ గొడవ ఏమీ చేయలేదు. అనితకు ఇప్పుడర్ధమై పోయింది అతని పధకం. తన ఊరు, తన తలిదండ్రుల స్థితిగతులు అన్నీ తెలుసుకుని, డబ్బుని, పరపతిని ఎరగా చూపి, అమాయకులైన ఎందరో తలిదండ్రులు ఆరెండిటి వలలో పడిపోతారని అతను అవగాహన చేసుకుని, తనని వివాహం చేసుకుని, తన జీవితం నాశనం చేయాలనే దృక్పధంతో వున్నాడని. ఒకవేళ అతన్ని తను  తిరస్కరిం చినా తనెక్కడ ఉన్నా వెంటబడి తరిమి, తరిమి తన జీవితం నాశనం చేస్తాడని. తననే కాదు, తన కుటుంబాన్నంతటినీ మట్టు పెట్టకుండా వదలడని. వాములదొడ్లో , గడ్డి మోపుపై కూర్చుని దీర్ఘాలోచనలో మునిగి ఉన్న అనిత తన ప్రక్కనే ఉన్న వెంకాయమ్మ గారిని గమనించ లేదు. ఆప్యాయంగా అనిత తల నిముర్తూ , “ఈ దొడ్లో త్రాచు తిరుగు తుందని తిరపయ్య చెప్పాడు. ఒక్కదానివి ఈవేళప్పుడు ఇలా రావటం ప్రమాదం తల్లీ లోపలకు వెళ్దాంపద,” అని అనిత చేయి పట్టుకుని లేవదీసింది. యాంత్రికంగా ఆమెను అనుసరించింది.

          “వయసు, దానితో పాటే పెరిగిన ధనమదం అలాంటివమ్మా. ఈ రెండూ ఒక్కొక్క సారి మనుష్యులను తప్పుదారి పట్టిస్తాయి. ఒకవేళ అతనికి తను చేసిన పనికి పశ్చాత్తాపం కలిగిందేమో! నిన్ను వివాహం చేసుకుని ఆ తప్పు సరిదిద్దుకుందామని అనుకున్నాడేమో! నందూతో చెప్పి, నా కొంగుకి బకెట్ ముడి వేయించావు చూడు. అలాంటి చిలిపి తనమే అనుకోమ్మా.” అనిత చెప్పిందంతా విని వెంకాయమ్మగారు
నచ్చచెప్పే ధోరణిలో అన్నది.

          “అత్తా ఏం మాట్లాడుతున్నావ్ ? చిలిపిగా బకెట్ ముడివేయటం లాంటిదే ఇదెలా అవుతుంది? ఒక నిస్సహాయురాలైన యువతి జీవితం నాశనం చేయటానికి  ప్రయత్నిం చాడు. సరోజ అదృష్టంవల్ల నేను ఆ సమయంలో అనుకోకుండా గదికి వెళ్ళాను. నువ్వు నాకు చిన్నతనం నుండీ తెలుసు. నేను అల్లరి చేయటం, నువ్వు గదమాయించటం ఎన్నోసార్లు జరిగింది. మనిరువురి మధ్యా ఉన్న సంబంధం అనురాగంతో, ఆప్యాయతతో నిండి ఉన్నది. దయచేసి ఈ రెంటికీ ముడిపెట్టకు. అతని కళ్ళలో కసి తప్ప పశ్చాత్తాప
సూచనలేవీ కనుపించలేదు.”

          తప్పు చేసినవాడి చేతిలోనే నలిగి పోవలసిందేనా? స్తీృ జీవితం ఇంతలా దిగజారి పోయిందా? కామంతో మదవిహ్వలులైన పురుషులు, ఉమ్మడిగా అమాయకురాలైన ఒక యువతి జీవితం నాశనంచేసి, రాజకీయనాయకుల పరపతి వల్లనో లేక పేరుమోసిన వ్యాపారులకు సంబంధించిన వారవటం వల్లనో ఆ కేసుని కొట్టివేయించుకుని, గర్వంతో మీసం మెలివేసుకుంటున్న వార్తలు తరుచూ చూస్తూనే, వింటూనే వుంటాం. తన స్నేహితురాలు సరోజ జీవితం నాశనం చేయాలని ప్రయత్నించిన వ్యక్తితో తను తన జీవితం ముడి వేసుకుని, ఏమీ ఎరగనట్లు ప్రశాంతంగా జీవించ గలదా? అలాకాదని అతన్ని తిరస్కరించినా, ఆవేశంలో తను ఆ రోజు చేసిన పనికి పగతీర్చుకోక మానడు.
అతన్ని తిరస్కించి, దాని ఫలితం ధైర్యంగా ఎదుర్కోవటమా? లేక కుటుంబ క్షేమంకోరి అతన్ని వివాహం చేసుకుని తన భవిష్యత్తు నాశనం చేసుకోవటమా? అనితకు తాను ఎదురు చూడని విషమ పరీక్ష ఎదురయింది.

          సిమెంట్ మిక్సర్ లో గులక రాళ్ళతో కలిపి త్రిప్పుతున్న గులక రాళ్ళలా అనిత మెదడులో ఆలోచనలు గిరగిరా తిరిగి పోతున్నాయి. కొడుకు కావాలని కోరుకున్న అమ్మా, నాన్నలకు తనని కొడుకుగా ఎందుకు పుట్టించలేదా భగవంతుడు? మా మీదే ఆశలు పెంచుకుని మా క్షేమం కోసం అహర్నిశలూ ఆరాటపడే వారిద్దరికీ నేను ముప్పు తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు కల్పించాలి? ఈ గండం నుండి అందరము ఎలా బయట పడాలి?

          నిద్రాహారాలు మాని అదే పనిగా ఆలోచించి చివరకు ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా నింపాదిగా తలి, దండ్రులవద్దకు వెళ్ళింది.

***

          చేతులులేని బనీను వేసుకుని, గళ్ళ నిక్కరు తొడుక్కుని, తలపాగా చుట్టుకుని పారతో మొక్కలకు పాదులు చేస్తున్న రాజారావుగారు, గేటు తీసుకుని లోపలకు వస్తున్న యువతిని ఎవరా! అని పరీక్షగా చూసి, పార క్రిందపడేసి, ఎదురు వెళ్ళి, “లతా ఎవరొచ్చా రోచూడు,” అని భార్యను కేకవేశాడు.

          భర్త కేక విని బయటకు వచ్చిన హేమలతగారు అనిత ఇక్కడకు ఇప్పుడెందుకు వచ్చిందని అర్ధంకాక భర్తవైపు అయోమయంగా చూసింది. ఆయన లోపలకు తీసుకు వెళ్ళమని కనుసైగ చేసి చెప్పాడు.

          “రామ్మ రా, ప్రయాణం బాగా జరిగిందా?” ఏదో ఒకటి అడగాలి కాబట్టి, ఏదో అడిగే సింది. సమాధానంగా తలవూపి ఆమెను అనుసరించింది. లోపల హాల్లో అనితను కూర్చోబెట్టి , భర్త లోపలకు వచ్చేవరకు మౌనంగా అనితకు ఎదురు సోఫాలో కూర్చుంది.

          “అమ్మా, నాన్నగార్లు కులాసానామ్మా?” లోపలకు వచ్చి, భార్య ప్రక్కన కూర్చుంటూ అడిగాడు.

          ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఒణుకుతున్న చేతులు రెండూ ఒళ్ళో పెట్టుకుని అదిరే గుండెలను చిక్కబట్టుకుని, “మీతో నేనొక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చానండీ.” అన్నది అనిత ఇరువురివైపు చూస్తూ. “మీ అబ్బాయి ప్రస్తుతం ఇక్కడ లేరనే విషయం తెలుసుకుని ధైర్యం చేసుకుని వచ్చాను.”
ఏమిటో చెప్పమన్నట్లు చూశాడాయన.

          తల ఒంచుకుని, కొద్దిలో తన స్నేహితురాలికి తప్పిపోయిన ప్రమాదం గురించి చెప్పి, తన అనుమానం, భయం, వ్యక్తం చేసింది.

          విన్న శ్రోతలిద్దరి ముఖాల్లోనూ నెత్తురుచుక్కలేనట్లు పాలిపోయి వున్నాయి. హేమలతగారు నీళ్ళు నిండిన కళ్ళతో అన్నది. “పిల్లలకు విద్యాబుద్దులు  నేర్పిస్తున్నా మని గర్వపడుతుంటాం. కాని వాళ్ళ బుద్ది గురించి పట్టించుకోకుండా విద్యకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి వదిలి వేశామని అర్ధమౌతుంది. ఈ తప్పులో సగభాగం మనదే. సరిదిద్దుకుని క్షమాపణ చెప్పవలసిన బాధ్యత మనపైన వున్నది.”

          రాజారావుగారు అనితవైపు తిరిగి అన్నాడు. “వాడు నీ మీద పగతీర్చుకోవాలనుకుని ఇంత పధకం వేశాడని ఊహించలేక, పేద పిల్లను చేసుకోవాలనుకుంటున్న నా కొడుకు ఉదారబుద్దిని పొగిడి, నా కొడుకెంత ఎదిగి పోయాడని పొంగి పోయాను.”

          ఆ తరువాత చాలాసేపు ఆయన మౌనంగా కూర్చున్నాడు. “ఎందరో నిర్భాగ్యులైన యువతులను బలాత్కరించి వారి జీవితాలను నాశనం చేశారనే వార్తలు చదివినప్పుడు, విన్నప్పుడు, నా కొడుకులు అలాంటివారు కాదు. నేను, లత, వారికి నైతిక విలువలు బోధించి పెంచాం, అని గర్వపడేవాడిని. మా పెంపకంలో లోపమా తల్లీ ? ఒక యువతి జీవితం ధైర్యంతో కాపాడగలిగిన నిన్ను చూస్తూంటే నాకు చాలా గర్వంగా ఉన్నది తల్లీ!” అంటున్న ఆయన పాదాలకు నమస్కరించి, “నేనిక్కడకు రాకముందు నేను మోసు కొచ్చిన దుర్వార్తవిని మీరు ఎలా స్పందిస్తారోనని భయపడ్డాను. కాని నేను వచ్చినందు వల్ల, పుణ్యదంపతులను దర్శించుకునే భాగ్యం కలిగింది.” కన్నుల వెంట నీరు కారుతుండగా అన్నది. 

          “మీ అమ్మా, నాన్నగార్లతో సంప్రదించావామ్మా?” హేమలత అడిగింది.

          “విషయం విని వారు చాల బాధపడ్డారు. నాన్నగారు నా నిర్ణయాన్ని మన్నించి నన్నిక్కడ దింపి, బజర్లో పని ఉన్నదని వెళ్ళారు. మీ మనస్సులను నొప్పించినందుకు క్షమించండి.” అన్నది అనిత హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయల్దేరుతూ.

          తన స్నేహితురాలి, ఊరూ, పేరూ, ఆమె అడ్రస్ తో పాటు, తాము అద్దెకు ఉన్నవారి ఇంటి అడ్రస్ కూడా తమ చేతుల్లో పెట్టి, మీకు పూర్తి నమ్మకం కలగాలంటే, వీళ్ళను అడిగి నిజానిజాలు తెలుసుకోవచ్చు, అని చెప్పి, గుండెల్లో రగులుతున్న బరువును దించివేసుకుని, నింపాదిగా నడిచి వెళ్తున్న అనితను బరువెక్కిన హృదయాలతో, దిగులుగా చూస్తూ నిల్చుండి పోయారు దంపతులిరువురూ.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.