
అణగిఉన్న నిజం
भीतर दबा सच
హిందీ మూలం – డా. రమాకాంతశర్మ
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
తలుపు బయట గుర్రపుబండి ఆగిన చప్పుడు విని నేను కిటికీలోంచి బయటికి తొంగిచూశాను. ఇప్పుడు ఎవరు వచ్చివుంటారని అనుకున్నాను. ఇంతలోనే బండిలోంచి దిగి ఒక చిన్న పెట్టె తీసుకుని మునిమాపు వేళ మసకచీకటిలో నీడలాగా కనిపిస్తున్న ఒక ఆకారం తలుపువైపుకి ముందుకి వస్తోంది. నేను వెంటనే తలుపు తీశాను. ఎదురుగా వదినని చూసి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. ఇలా ఆవిడ ఎప్పుడైనా మా యింటికి వస్తుందని నేను ఊహించుకునే అవకాశం కూడా లేదు. ఏంచెయ్యాలో తోచని స్థితిలో నేను వంగి ఆవిడకి పాదాభివందనం చేశాను. ఆవిడ ఆశీర్వదిస్తూ తన చెయ్యి నా తలమీద ఉంచింది. ఆవిడ చేతిలోంచి పెట్టెని అందుకుని నేను ఆవిడ లోపలికి రావడానికి తప్పుకున్నాను. ఆవిడ కొంచెం జంకుతూ లోపలికి వచ్చి తలుపుకి దగ్గరగానే గోడకి ఆనించివున్న దీవాన్ మీద ఆయాసపడుతూ కూర్చుంది.
“మంచినీళ్ళు తెస్తాను”- అని చెప్పి నేను త్వరగా లోపలికి వెళ్లాను. వదిన వచ్చిందని నేను నీతకి చెప్పినప్పుడు తన నోరు ఆశ్చర్యంతో తెరుచుకుని ఉండి పోయింది. తరువాత తను కొంచెం విసుగ్గా అంది- “ఏం తీసుకునేందుకు వచ్చింది ఇక్కడికి, ఈవూళ్ళో వాళ్ళ అన్నయ్య ఉన్నాడుగా, వాళ్ళదగ్గరికి ఎందుకు వెళ్ళలేదు?” నేను కుండలోంచి మంచినీళ్ళు తీసుకుని గ్లాసులో పోస్తూ అన్నాను- “అవన్నీ తర్వాత చూద్దాం. ముందు నువ్వు త్వరగా వీధిగదిలోకి రా.”
నేను వదినకి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ ఉండగానే నీత కూడా బయటికి వచ్చింది. తను వదిన చరణాలు స్పృశించింది. ఆవిడ తనని నిండుగా ఆశీర్వదిం చింది. మంచినీళ్ళు తాగి ఆవిడ గ్లాసు దగ్గరగా ఉన్న స్టూలుమీద పెట్టి అంది—“అన్నయ్య చాలా రోజుల నుంచి వాళ్ళదగ్గరికి వచ్చి కొన్నాళ్ళు ఉండమని పిలుస్తు న్నాడు. నేను ఇవ్వాళ ఇక్కడికి చేరుకుంటున్నానని, ముందు మరిదిగారి ఇంటికి వెడతానని ఫోనులో వాళ్ళకి చెప్పాను. మీ దగ్గర కొన్నిరోజులుంటాను. కొద్దిరోజుల్లో అన్నయ్య నన్ను తీసుకువెళ్ళటానికి వస్తాడు. అప్పుడు వాడితో వెడతాను.”
నీత అంది–“మంచిపని చేశావక్కా. మీ అన్నయ్య నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చేవరకు నువ్వు మాతోనే ఉండవచ్చు. రా, లోపలికి పద. కాళ్ళు-ముఖం కడుక్కో. ఈలోగా నేను చాయ్ పెడతాను.” నీత ఆవిడ తెచ్చిన చిన్న పెట్టెని తీసుకుంది. ఆవిడ తనతోబాటు లోపలికి వెళ్ళింది.
నేను ఆవిడ లోపలికి వెళ్ళడం చూస్తూ ఉన్నాను. ఆవిడ భుజాలకింద వేలాడు తున్న తెల్లనిజుట్టుతో వేసిన ఆ సన్నని జడ ఆవిడ వార్ధక్యపు ద్వారాన్ని దాటిందని సాక్ష్యం చెబుతోంది. ఒకప్పుడు ఆవిడ చాలా అందంగా కనుపించేది. తన సౌందర్యం గురించి ఆవిడకి తెలుసుకూడా. రోజుకి రెండుసార్లు స్నానం చెయ్యడం, మూడుసార్లు బట్టలు మార్చుకుని అద్దంలో తననితాను చూసుకోవడం ఆవిడ దినచర్యలో భాగం. ప్రతివ్యక్తిని తనకన్నా తక్కువగా బేరీజు వేసుకుని ఆ వ్యక్తి తక్కువతనాన్ని తెలిసేలా చెయ్యడం ఆవిడకి ఇష్టమైన హాబీ. ఆవిడ తన ముక్కుమీద ఈగని కూడా వాలనిచ్చేది కాదు.
అన్నయ్య న్యాయవాదవృత్తి బాగా నడుస్తూఉండేది. సంపాదించిన డబ్బు ఖర్చు చెయ్యకపోతే ఇంక సంపాదించిన ప్రయోజనం ఏముంటుందన్నది ఆయన వేదాంతం. ఆ ఆలోచన కారణంగా ఆయన విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉండేవాడు. అన్నయ్య, వదిన ఇద్దరూ మంచి బట్టలు ధరించడమేకాక, తిండి విషయంలో కూడా శ్రద్ధ తీసుకునేవారు. వాళ్ళ భోజనంలో అసలుసిసలైన నెయ్యి వాడేవారు. ఊళ్ళోనూ, బయటిఊళ్ళలోనూ పేరెన్నికగన్న దుకాణాల నుంచి తెప్పించిన పిండివంటలు వాళ్ళు రోజూ చేసే భోజనంలో భాగంగా ఉండేవి. ఏదైనా లోటు అనేది ఉంటే అది కేవలం వాళ్ళకి పుత్రసంతానం లేకపోవడమే. తమ ఒకే ఒక కూతురు సుహానీని వాళ్లు కంటికి రెప్పలా చూసుకునేవారు.
నాన్నగారి తరువాత అమ్మకూడా అకాలమరణం చెందటంతో అన్నయ్య నన్ను తనదగ్గరికి తీసుకువచ్చాడు. వదినకి మాత్రం ఇది నచ్చలేదు. నన్ను మా అమ్మమ్మ గారి ఇంటివారు తీసుకువెళ్లి ఉంచుకోవాలన్నది ఆవిడ ఆలోచన. ఎంతో లౌక్యంగా మా మేనమామగారు, అత్తయ్య తన అమాయకుడైన భర్త నెత్తిమీద నన్ను కూర్చోబెట్టారని ఆవిడకి బాధగా ఉండేది. వాళ్ళు నన్ను తీసుకురాకపోతే నేను రోడ్లమీద అడుక్కోవలసి వచ్చేదని నాకు ఎప్పుడూ తెలిసేలా చెబుతూ ఉండేది. అన్నం తినేటప్పుడు ఇటు వంటి రాజభోజనం చేసే అదృష్టం కేవలం నాకు వీళ్ళతో కలిసిఉండే అవకాశం ఇవ్వడంవల్లనే లభిస్తోందని తిప్పితిప్పి తెలియచెప్పడం నాకు బాగుండేదికాదు. నా అశక్తత కారణంగా నేను ఇవన్నీసహించుకునేవాడిని.
వేసవి సెలవుల్లో ఒకరోజున నేను లోపలిగదిలో పడుకుని నిద్రపోతున్నాను. అన్నయ్య లంచ్ కోసం ఇంటికి వచ్చాడు. పాత్రల ధ్వనులతో నాకు నిద్ర తేలిపో యింది. బయటగదిలో అన్నయ్యకి అన్నం వడ్డిస్తూ వదిన అంటోంది—“రెండేళ్ళ నుంచి వీడు మనదగ్గర ఉంటున్నాడు. టెంత్ పాసై వచ్చాడు. వీడిని ఇంటర్ వరకూ చదువు చెప్పించాం. ఇప్పుడు వాడికి సెలవులు. రోజంతా ఇక్కడే పడివుంటాడు. నేను చెప్పేది వీడిని ఎక్కడైనా పనిలో కుదర్చమని.”
అన్నయ్య అంటున్నాడు—“నువ్వు చెప్పేది బాగానే ఉంది. రేపటినుంచి వీడిని నేను నాతోబాటు కోర్టుకి తీసుకువెడతాను.”
వదిన విసుగుదల చూపిస్తూ అంది- “మనం ఎప్పటివరకూ ఇతన్ని మన దగ్గర ఉంచుకుంటాం? ఇంకేదైనా ఊళ్ళో ఇతనికి ఉద్యోగం వస్తే కనీసం ఆవంకతోనైనా ఇతన్ని వదిలించుకోగలుగుతాం.”
అన్నయ్య ఏం జవాబిస్తాడా అని నా చెవులు రిక్కించుకుని విన్నాను—“సవతి తమ్ముడైతే ఏమయింది. నాకు వీడు తమ్ముడు. మేమిద్దరం ఒక తండ్రి పిల్లలమేకదా. బి.ఎ. చేశాడంటే ఆ తరువాత తనంతట తానే ఎక్కడో ఒకచోట ఉద్యోగం చేసుకునేం దుకు వెడతాడు.”
వదిన సణుగుడు మొదలయింది—“అంటే దాని అర్థం ఇంకా మూడేళ్లు….”
ఆ తరువాత నాకేమీ వినిపించలేదు. ఇంక నాకు నిద్ర రాలేదు. నేను లేచి నుంచున్న తరువాత, అక్కరలేకుండా ఇక్కడ పడివుండటంకన్నా నేను సాధ్యమయి నంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను.
కొన్నిరోజుల తరువాతే నాకు అనుకోకుండా అటువంటి అవకాశం కూడా లభించింది. నా స్నేహితుడు రాజవీర్ వేసవి సెలవులు గడపడానికి వాళ్ళ మామయ్య గారి ఇంటికి వెడుతున్నాడు. తనతో నన్ను కూడా రమ్మన్నాడు. నేను కూడా వెంటనే సరేనని సిద్ధపడ్డాను. ఆశించినట్లుగానే అన్నయ్య, వదిన దీనికి తేలికగానే నాకు అనుమతి ఇచ్చారు. నేను రాజవీర్ తో ఈ వూరికి వచ్చాను.
ఇక్కడికి వచ్చాక నాకు చాలా బాగా ఉందని అనిపించింది. మా చిన్న టౌన్ కన్నా ఈ పట్టణం చాలా పెద్దది. రాజవీర్ మామయ్యగారి ఇంట్లో వారు చూపించిన అభిమానం వల్ల తొందరగానే నేను వారితో కలిసిపోయాను. ఇంచుమించు రెండు వారాలు నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మేము తిరిగి బయలుదేరడానికి ఇంక రెండు రోజులే మిగిలాయి. అప్పుడు రాజవీర్ వాళ్ల మామయ్యకి, అత్తయ్యకి నేను ఎంత బాగానో నచ్చానని, వారు తమకూతురు నీతను ఇచ్చి నాతో సంబంధం కలుపుకునేందుకు మాట్లాడదామనుకుంటున్నారని చెప్పాడు.
మనస్సులోనే నేను కూడా నీత అంటే ఇష్టపడసాగాను. కాని ఈ ప్రస్తావన నాకు పూర్తిగా అనూహ్యమైంది. ఆ రోజు తేనీరు సేవిస్తూ ఉన్నప్పుడు రాజవీర్ మామయ్యగారు కూడా ఈ విషయం నాముందు ఉంచారు. నేను కేవలం నాకు ఉద్యోగం వచ్చేవరకూ పెళ్ళిగురించి అసలు ఆలోచించనని, అంతేకాక అన్నయ్యని, వదినని అడగకుండా సరేనని ఎలా చెప్పనని అన్నాను.
ముందు ఇంకా చదువుకునే కన్నా నేను ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నానని రూఢిగా నమ్మకం కుదిరాక ఆయన నన్ను చాలా స్కూళ్ళని నిర్వహిస్తున్న ఒక ట్రస్టు చైర్మన్ గారిని కలుసుకునేందుకు నన్ను తీసుకువెళ్ళారు. వారికి తమ మిడిల్ స్కూల్లో ఒక టీచరు అవసరం ఉంది. మర్నాడే నాకు ఇంటర్వ్యూ పెట్టారు. నాకు ఉద్యోగం దొరికింది. ఇదంతా ఎంతో వేగంగా జరిగింది. స్వయంగా ఆ భగవంతుడే వదిన మనో రథాన్ని, నా సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడని నాకు నమ్మకం కలిగింది.
నేను అన్నయ్యకి, వదినకి నాకు ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పాను. అన్నయ్యకి కొంచెం కోపం వచ్చినట్లు కనిపించింది. “నువ్వు అక్కడికి సెలవులు గడపటానికి వెళ్ళావా లేకపోతే ఉద్యోగం వెతుక్కునేందుకా? కనీసం గ్రాడ్యుయేట్ అయిన తరువాత ఉద్యోగం గురించి ఆలోచిస్తే బాగుండేది.”
నేనేదైనా చెప్పేలోపలే వదిన కల్పించుకుంది- “అరే, పెద్దపెద్ద చదువులు చదివినవాళ్ళు కూడా ఉద్యోగం కోసం మతిలేకుండా తిరుగుతున్నారు. ఇతనికి ఇంట్లో కూర్చుని ఉద్యోగం దొరుకుతూవుంటే ఇందులో అభ్యంతరం ఏముంది? నన్నడిగితే ఈ అవకాశాన్ని అసలు చెయ్యిజారనివ్వకూడదు.”
కొంతసేపు వాదోపవాదాలు చేసిన తరువాత అన్నయ్య ఓటమిని అంగీకరిం చాడు. సెలవులు అయిపోగానే నేను డ్యూటీలో చేరడానికి ఇక్కడికి వచ్చేశాను. అన్నయ్య నాతో వచ్చాడు. నేను ఉండటానికి ట్రస్టు వారు గది ఏర్పాటు చెయ్యడానికి ముందు రెండురోజులపాటు రాజవీర్ మామయ్యగారి ఇంట్లోనే ఉన్నాం. నాకు ఏర్పాటు చేసిన గదికి షిఫ్టు అయిన తరువాత అన్నయ్య నాకు కొంత డబ్బు, చాలా సలహాలు ఇచ్చి మర్నాడే తిరిగి వెళ్ళిపోయాడు.
ఇక్కడికి వచ్చాక నాకు విముక్తి లభించినట్టు అనుభూతి కలిగింది. దేవుడు ఎప్పుడూ ఎవరికీ ఎవరిదగ్గరా, చివరికి స్వంత బంధువుల దగ్గర కూడా అవాంఛితంగా, భారమై ఉండవలసిన విధంగా దైన్యం ఇవ్వకూడదని నాకనిపించింది. నాకయితే చాలా తొందరగా ఈ పరిస్థితి నుంచి విడుదల లభించింది. కాని, మరో దారి లేనివాళ్ళ కయితే ఎలావుండేది. ఆలోచిస్తేనే నా అంతరాత్మ క్షోభ పడుతోంది. ఈ చిన్న ఉద్యోగమే నాకు నా ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడానికి, వదినకి ఇంత త్వరగా ఊరట కలిగించ డానికి చాలా దోహదం చేసింది.
ఉద్యోగం వచ్చిన కొన్ని నెలలకే రాజవీర్ మామయ్యగారు నాకోసం నీత సంబంధం విషయంలో అన్నయ్య దగ్గరికి వెళ్లారు. అన్నయ్య నీతని చూసివున్నారు. నేను కూడా నీత అంటే ఇష్టపడుతున్నానని ఆయనకి తెలిసినప్పుడు ఆయన నీత మరో కులానికి చెందినదంటూ వదిన చూపించే వ్యతిరేకతని లెక్కచెయ్యకుండా తన సమ్మతిని వ్యక్తం చేశారు. కొద్దిరోజుల్లోనే మా వివాహం జరిగింది. వదిన ఇష్టం లేకుండానే ఆ పెళ్ళికి వచ్చింది. ఆవిడ నీత గురించి, వాళ్ల కుటుంబం గురించి, పెళ్ళికి చేసిన ఏర్పాటుల గురించి లోటుపాట్లు వెలికి తీస్తూనేవుంది.
పెళ్ళి అయ్యాక కొన్ని రోజులు నేనూ, నీతా, అన్నయ్య-వదినల దగ్గరే ఉన్నాం. నీత కొంచెం నిరుత్సాహంగా ఉన్నట్లు నేను గమనించాను. ఒకరోజు మేము దగ్గరలో ఉన్న పార్కులో తిరగడానికి వెళ్ళినప్పుడు నేను దీనికి కారణం అడిగాను. తను నా భుజంమీద తల ఉంచుకుని ఏడవసాగింది. తను అంది- “మనం ఇక్కడి నుంచి ఈ రోజునే వెళ్ళిపోవడం కుదరదా?”తను అలా ఎందుకంటోందో నాకు అర్థం కాలేదు.
“ఏమయింది? అసలు విషయమేమిటో చెప్పకూడదా?”
“ఏం చెప్పను? అక్కయ్యగారు నన్ను ప్రతివిషయంలోనూ తక్కువగా చూపించ డానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఎంతగా ఆవిడ మనస్సుని ఆకట్టుకోవాలను కుంటున్నానో, ఆవిడ అంతగానే నన్ను, నా కుటుంబాన్ని వాళ్ళతో పోలిస్తే అసలేమీ స్టేటస్ లేనివాళ్ళమని తెలిసేలా చేస్తున్నారు. మీ ఆయన్ని మేము మా దగ్గర ఉంచు కుని చదివించకపోతే అతను ఈ మాస్టరు ఉద్యోగం చేసేందుకుకూడా యోగ్యుడయే వాడు కాదని ఆవిడ చాలాసార్లు అన్నారు. నిన్నకి నిన్న ఆవిడ హద్దులు మీరిపోతూ అంది- మేస్టారుకి ఇన్ని రోజులు సెలవు ఇచ్చేది ఇదేం స్కూలు? ఎప్పుడు వెళ్ళాలను కుంటున్నారు? చూడు, మీ బావగారు మిమ్మల్ని ఇంకా ఉండమని అంటారు. కాని కొత్త ఉద్యోగంలో ఎక్కువ సెలవులు తీసుకోవడం మంచిది కాదని మీ ఆయనకి చెప్పు.”
అన్నయ్య మమ్మల్ని ఆపుజేసినా, కొంచెం కోపగించుకున్నా కూడా మేము మర్నాడే తిరిగి వచ్చేశాం.
ఇంచుమించు రెండు-మూడు నెలల తరువాత అనుకోకుండా అన్నయ్య, వదిన మాదగ్గరికి వచ్చారు. మేము కంగారుపడ్డాము. నెలాఖరు రోజులు కావడం మూలంగా డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రైవేటు స్కూల్లో మాస్టారు ఉద్యోగంతో రోజులు ఎలాగో వెళ్ళబుచ్చుతున్నాం. అసలైన నెయ్యి మాకు విలాసంకన్నా, లగ్జరీకన్నా తక్కువకాదు. అది లేకుండా వాళ్ళకి అన్నం గొంతు దిగదని నాకు తెలుసు. వాళ్ళు మొదటిసారి మాదగ్గరికి వచ్చారు కనుక సాధ్యమైనంతవరకు వాళ్ళకి సౌకర్యంగా ఉండేలా శ్రద్ధ తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో కేవలం వాళ్ళకోసం ఉపయోగించడానికి నేను బజారు నుంచి వంద గ్రాముల నెయ్యి మాత్రమే తీసుకురాగలిగాను.
మేము ఇంతగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాళ్ళకి అలవాటైన విధంగా వాళ్ళకి సౌకర్యం కలగటంలేదు. రెండురోజుల తరువాతనే వాళ్ళు తిరిగి వెళ్ళి పోవడానికి నిర్ణయించుకున్నారు. అన్నయ్య గుర్రపుబండి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నీత వదినతో “ఇంకా కొన్నాళ్ళు ఉంటే మాకు సంతోషంగా ఉండేది” అన్నప్పుడు ఆవిడ వ్యంగ్యంగా నవ్వుతూ అంది- “మీకు సంతోషంగా ఉంది. కాని మా విషయం ఏమిటి? ఈ రెండు రోజులే మాకు అతి కష్టం మీద గడిచాయి. నేనయితే మళ్ళీ ఇక్కడికి రావడానికి వందసార్లు ఆలోచిస్తాను.”
ఆ తరువాత అన్నయ్య ఎప్పుడు వచ్చినా, తను ఒక్కడే వచ్చేవాడు. కూడా వదిన రాకపోవడానికి ఏదో ఒక వంక చెప్పేవాడు. సాకు చెప్పేటప్పుడు తను ఎదురుగా చూడలేకపోయేవాడు. మాకు మనస్సులో మెలిపెట్టినట్లు అయ్యేది.
సుహానీ పెళ్ళికి వాళ్ళకి సహాయపడేందుకు మేము కొన్నిరోజులు ముందుగానే చేరుకున్నాము. ఈ విషయం నీత వదినకి చెప్పినప్పుడు ఆవిడ నిర్లక్ష్యంగా అంది- “దగ్గర డబ్బులుండాలి కాని, ఈ రోజుల్లో పనులన్నీ ఇంట్లో కూర్చుని వుండగానే అయిపోతాయి. మీరు పెళ్ళిరోజున వచ్చినా ఏం తేడా ఉండేది కాదు.”
సుహానీ పెళ్ళిరోజునే వదిన తన అన్నగారిని మాకు పరిచయం చేసింది. “ఈయన మా అన్నయ్య. చాలా పెద్ద గవర్నమెంటు ఆఫీసరు. పోయిన నెల్లో మీ ఊరికే ట్రాన్స్ ఫర్ అయి వచ్చాడు.” ఆయన వెంటనే నాకు షేక్ హాండ్ ఇచ్చి అన్నాడు- “బాగుంది. ఆ వూళ్ళో మనవాళ్ళు కూడా ఉన్నారని తెలిసి సంతోషంగా ఉంది.” నేనేదో చెప్పేలోగానే వదిన అంది-“ఇతను సరజూ. ఈయనకి సవతి తమ్ముడు. అక్కడ మిడిల్ స్కూల్లో మేస్టరుగా పనిచేస్తున్నాడు.” నేను వదినవైపు చూస్తూ ఉండిపోయాను.
పెళ్ళి అయ్యేవరకు నేను, నీత ఒక విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. వదిన తన ఆఫీసరన్నయ్యకి ఎంత గౌరవ మర్యాదలు ఇస్తున్నారో, అంతగానే మమ్మల్ని తక్కువ గా చూడడానికి ప్రయత్నం జరిగింది. మా యింట్లోనే పరాయివాళ్ళలాగా ఉండి మేము సుహానీకి అప్పగింతలు అవగానే తిరిగి వచ్చేశాం.
ఒక్కొక్క సంవత్సరం గడుస్తూ ఉంది. ఈలోగా నేను ప్రైవేటుగా పరీక్ష రాసి బి.ఎ. పాసయ్యాను. ట్రస్టువారు తమ ఖర్చుతో నన్ను బి.ఎడ్. చేయించారు. ఆ తరువాత స్కూల్లో పెద్ద క్లాసులు తీసుకునేందుకు నాకు అవకాశం లభించింది. నా జీతం కూడా బాగా పెరిగింది. ట్రస్టువారు నాకు రెండు గదుల మంచి ఇల్లు ఉండటానికి ఇచ్చారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, అప్పుడప్పుడూ మేము మనస్సు పీకినప్పుడు ఒకటి-రెండు రోజులపాటు అన్నయ్యని, వదినను కలుసుకుని వచ్చేవాళ్ళం. అప్పుడప్పుడూ అన్నయ్య కూడా మా యోగక్షేమాలు కనుక్కునేందుకు వస్తూ ఉండేవాడు. ఆయనతో బాటు వదిన లేకపోవడం మొదట్లో ఆశ్చర్యంగా ఉండేది. కాని నెమ్మదిగా ఈ పరిస్థితి అలవాటైపోయింది.
అంతా సామాన్యంగా గడిచిపోతుండగా, ఆ రోజు ఉదయాన్నే వచ్చిన ఒక ఫోన్ మమ్మల్ని పూర్తిగా కుదిపేసింది. నేను ఫోన్ చేత్తో పట్టుకుని స్థాణువులా నిలబడి పోయాను. రాత్రి అన్నయ్యకి గుండెనొప్పి వచ్చింది. హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి ముందే ఆయన తుది శ్వాస తీసుకున్నాడు. నేనూ, నీతా మొదటి బస్సు పట్టుకుని అక్కడికి చేరుకున్నాం. అన్నయ్యని ప్రాణరహితంగా చూసి నేను తట్టుకోలేకపోయాను. మరోపక్క వదిన పరిస్థితి కూడా నేను చూడలేకపోయాను.
సంపాదించడం గురించి, దాన్ని సౌకర్యాల కోసం ఖర్చు పెట్టడం గురించి అన్నయ్య చూపించిన ధోరణి కారణంగా అన్నయ్య పొదుపుకి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. చివరికి తనకో స్వంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఈ అద్దెయింట్లో ఉండటమే ఆయనకి ఎక్కువగా బాగుండేది. ఆయన కాలం చేసిన తరువాత సంపాదించే ఒకే ఒక మార్గం కూడా లేకుండా పోయింది. వదినని ఒంటరిగా విడిచిపెట్టే ప్రశ్నే లేదు. మాతో వచ్చి ఉండమని నేనూ, నీతా ఆవిడకి ఎంతగానో నచ్చ జెప్పాం, పట్టు పట్టాం. కాని ఆవిడ తన కూతురు సుహానీ దగ్గరికి వెళ్ళి ఉండటానికి ఇష్టపడింది. ఆవిడ నిర్ణయం చూసి మాకు ఆశ్చర్యం కూడా కలుగలేదు. ఎందుకంటే సుహానీ దగ్గర ఆవిడ అలవాటు పడిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. కాని, ఆవిడ మమ్మల్ని దేనికీ యోగ్యులుగా భావించలేదని మాత్రం బాధ కలిగింది. తరువాత కూడా ఎప్పుడూ మా దగ్గరికి వచ్చి మాతో ఉండటానికి సుముఖత కనబరచలేదు.
చూస్తూ ఉండగానే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ మధ్యకాలంలో నేను చాలా సార్లు వదినకి ఫోన్ చేశాను. కాని ప్రతిసారి ఆవిడ చూపించిన నిర్లక్ష్య వైఖరి నిరాశపరిచింది. నేను ఎప్పుడు ఆవిడని కొన్నిరోజులు మా దగ్గరికి వచ్చి ఉండమని చెప్పినా, ఆవిడ చాతుర్యంగా ఈవిషయాన్ని తోసిపుచ్చింది. మధ్యమధ్యలో ఆవిడ చాలా రోజులు ఈవూళ్ళో తన ఆఫీసరన్నయ్య ఇంటికి వచ్చి వెడుతోందని, మమ్మల్ని కాంటాక్టు కూడా చెయ్యలేదని నాకు తెలిసినప్పుడు చాలా బాధ కలిగింది. ఆ తరువాత మేము కూడా ఆవిడకి ఫోన్ చెయ్యడం మానేశాం.
ఇవాళ వదిన అనుకోకుండా ఇలా రావడం మాకు ఆశ్చర్యం కలిగించే విషయం. ఆవిడ వచ్చినా, కేవలం ఒక అతిథిలాగా. కొన్నిరోజుల్లోనే ఆవిడ ఆఫీసరన్నయ్య ఆవిడని తీసుకువెళ్ళిపోతాడు. ఆ తరువాత ఇంక ఎంతకాలానికోగాని ఆవిడ ముఖం చూడటం కూడా వీలుపడదు. కనీసం కొద్దిరోజులపాటైనా ఆవిడ మా దగ్గరికి వచ్చి ఉండాలని అనుకుంది. మాకు అంతేచాలు.
వదిన స్వభావం, ఆవిడ వైఖరి దృష్టిలో ఉంచుకుని మేము ఆవిడ ఇక్కడ ఉన్నంత వరకూ ఆవిడకి ఏమీ ఇబ్బంది కలుగకూడదని ప్రయత్నిస్తూ ఉన్నాం. వదిన స్వభావంలో ఒకప్పుడు ఉన్న కఠినత్వం ఇప్పుడు లేదని మేము గమనించాం. అన్నయ్య కాలం చేసిన తర్వాత ఏర్పడిన ఏకాంతం వల్ల బహుశా ఆవిడలో ఈ మార్పు వచ్చి ఉండవచ్చు. ఎప్పుడు చూసినా సణుగుతూ, ప్రతివిషయంలోనూ ఎదుటివాళ్ళని తక్కువగా చూసే వదిన ఇప్పుడు మౌనంగా ఉండటం మాకు అసహజంగా అనిపిస్తోం ది.
రెండువారాలు గడిచాయి. వదినని తీసుకువెళ్ళడానికి వాళ్ళ అన్నయ్యగారు రాలేదు. ఆయన దగ్గర నుంచి ఫోన్ కూడా ఏదీ రాలేదు. వదినకి దిగులు పట్టుకుంది. ఎప్పుడు ఏ ఫోన్ వచ్చినా, అందరికన్నా ముందు వదిన ఫోన్ ఎత్తడానికి పరుగిడు తోంది. తర్వాత నిరాశతో ఫోన్ మాకు ఇస్తోంది. ఒకసారి నేను ఆవిడతో అన్నాను కూడా- “వదినా, నువ్వే ఆయనకి ఫోన్ చెయ్యవచ్చు కదా? ఆయన పెద్ద ఆఫీసరు. పని వత్తిడి ఎక్కువగా ఉండి టైము దొరకడంలేదేమో. నువ్వు ఫోన్ చేసి ఎలావున్నారో కనుక్కో. నువ్వు మన ఇంట్లోనే ఉన్నావని ఆయనకి చెప్పు. తొందరేమీ లేదు. ఆయనకి వీలు చిక్కినప్పుడు వచ్చి నిన్ను తీసుకువెడతాడు.”
“అవును. నువ్వు చెబుతున్నది కూడా నిజం. తనకి టైమ్ దొరకడంలేదేమో. ఇంకా కొద్దిరోజులు చూసి ఆ తర్వాత ఫోన్ చేస్తాను.”
వాళ్ళ అన్నయ్య కోసం ఎదురు చూస్తూ వదినకి ఒక నెలకన్నా ఎక్కువే అయింది. ఆవిడ ముఖంలో దిగులు స్పష్టంగా తెలుస్తోంది. తరచు నేను స్కూలు నుంచి తిరిగి వచ్చినప్పుడు వదిన ఎక్కువగా తన గదిలో మౌనంగా పడుకుని ఉంటుందని నీత నాకు చెబుతోంది.
ఆ రోజు నేను స్కూలు నుంచి వచ్చి తిన్నగా ఆవిడ గదిలోకి వెళ్ళాను. మంచం మీద పడుకున్న వదిన నన్ను చూడగానే లేచి కూర్చుంది. నేను ఆవిడతో అన్నాను-“వదినా, కొన్నిరోజులుగా నువ్వు ఏం మాట్లాడకుండా ఉంటున్నావు. ఇక్కడ నీకు ఏమీ ఇబ్బందిగా లేదుకదా? మా వల్ల ఏమయినా పొరపాటు జరిగితే చెప్పు. ”అయినా ఆవిడ మౌనంగా ఉంటే నీత అంది- “బహుశా అక్కయ్యగారికి వాళ్ళ అన్నయ్య గురించి దిగులుగా ఉన్నట్లుంది. ఒకవేళ ఏకారణంచేతనైనా ఆయన ఈవిడని తీసుకువెళ్ళడానికి రాలేకపోతే మీరే తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో దిగబెట్టి రండి.”
“సరే, రేపు ఆదివారమే కదా, స్కూలుకి సెలవు. నేను రేపే ఈవిడని అక్కడ దిగబెట్టి వస్తాను.” అలా అని నేను లేచి నుంచున్నాను. నేనింకా గదిలో నుంచి బయటికి వెడుతూవుండగానే వదిన ఏడుస్తున్న ధ్వని విని ఆగిపోయాను. ఆవిడ మోకాళ్ళలో తల దూర్చి ఎక్కిళ్ళతో వెక్కి-వెక్కి ఏడుస్తోంది.
మా ఇద్దరికీ కంగారు పుట్టింది. నీత ఆవిడని సముదాయించే ప్రయత్నం చేయబోయేసరికి ఆవిడ ఇంకా గట్టిగా ఏడవసాగింది. ఏడుస్తూనే ఆవిడ అంది- “ఈ నాటకం ఇంక నావల్ల కాదు. నన్ను తీసుకువెళ్ళడానికి అన్నయ్యగాని, కూతురు గాని…ఎవరూ రారు. నా కూతురు దగ్గర ఉంటూ కొన్ని సంవత్సరాలు గడిచేసరికి చుట్టుపక్కలవారు, నా కూతురి బంధువులు, ఆఖరికి మా అల్లుడు కూడా కూతురి అత్తవారింట్లో ఇంకా ఎన్నాళ్ళు తిష్ఠవేసుకుని కూర్చుంటావని అడగడం మొదలు పెట్టారు. మేము నిన్ను యావజ్జీవితం ఇక్కడ ఉంచుకుంటామని ఏమయినా కాంట్రాక్టు తీసుకున్నామా?” “కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. అమ్మ వింటుంది. ”సుహానీ అన్నదానికి అతను జవాబిచ్చాడు- “వింటే మరీమంచిది. కూతురి అత్తవారింట్లో పడివున్నందుకు కొంచెమైనా సిగ్గు కలుగుతుంది.”
“కూతురినీ, నన్నూ సిగ్గుచెందకుండా కాపాడుకునేందుకు నేను ఏడునెలల క్రిందటనే ఇక్కడ మా అన్నయ్య గారి ఇంటికి వచ్చాను. తను ఎప్పటిలాగానే నన్ను చాలా బాగా చూసుకున్నాడు. కాని నేను కొన్నిరోజులకి కాకుండా ఎప్పటికీ వాళ్ళ యింట్లో ఉండటానికి వచ్చానని తెలియగానే అన్నయ్య-వదినల వైఖరిలో మార్పు రావడానికి ఎంతోసేపు పట్టలేదు. వాళ్ళు తమ పనులతో, వ్యవహారంతో నేను ఉండటం కొద్దిరోజులకయితే ఫరవాలేదు కాని, ఎల్లకాలం వాళ్ళదగ్గరే ఉండిపోవడం వాళ్ళ మంచితనం వల్ల లబ్ధి పొందడంకన్నా మరేమీ ఎక్కువ కాదని సంకేతం ఇవ్వసాగారు. అంతా అర్థం అయ్యాక కూడా నేను ఆ అవమానాన్ని సహించుకుంటూ రోజులు గడిపాను. కాని, అన్నయ్య-వదినలు అకారణంగా రెండు-రెండు రోజులకి నాతో మాట్లాడటం మానేసే సరికి నేను నా అభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఇక్కడికి వచ్చేశాను. నిజం చెప్పాలంటే, ఎక్కడో కాస్త ఆశ మిగిలింది అన్నయ్య నన్ను ఒప్పించి తీసుకువెడతాడని. కాని ఈ లేనిపోని ఆశ ఎప్పుడో అడుగంటిపోయింది.”
మేము స్తబ్ధులమైపోయి ఇదంతా వింటున్నాము. తనలో అణగి ఉన్న నిజాన్ని బయటికి వెళ్ళగక్కాక బహుశా ఆవిడకి ఊరట కలిగినట్లు అనిపించింది. ఆవిడ కళ్ళ నుంచి కారుతున్న కన్నీరు ఆగిపోయాయి. కాని మా కళ్ళు చెమ్మగిల్లాయి. నీత ఆవిడని తన బాహువుల్లో బంధించి అంది- “అక్కా, ఇప్పటివరకూ ఇదంతా ఎందుకు సహించు కుంటూ ఉన్నారు? మీ యింటికి మీరు ముందే ఎందుకు రాలేదు?”
వదిన శుష్క నయనాల్లో మళ్ళీ కన్నీరు ముప్పిరిగొన్నాయి. ఆవిడ నీతని గట్టిగా పట్టుకుంది.
***
డా. రమాకాంత శర్మ – పరిచయం
1950 లో భరత్ పుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. రమాకాంత శర్మ 100కి పైగా కథలు వ్రాశారు. నాలుగు కథాసంకలనాలు, రెండు వ్యంగ్యసంకలనాలు, నాలుగు నవలలు, ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు ప్రతిష్ఠాత్మకమైన యు.కె. కథాకాసా, కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, కియాన్ ఫౌండేషన్ ల ద్వారా సన్మానం పొందారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించ బడ్డాయి. బ్యాంకింగ్, మానేజిమెంట్ మొ. విషయాలపైన వ్రాసిన పుస్తకాలకు రాష్ట్రపతి మరియు
కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మానేజరుగా రిటైరయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.