
ఎర్రచీర
(నెచ్చెలి-2025 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)
– పెనుగొండ బసవేశ్వర్
రోజు సాయంత్రం చిరు చీకట్లు ముసురుతుండగా
చెమటలు కక్కి వచ్చిన అమ్మ కూలి దేహం
తాగుబోతు నాయన బెల్ట్ వాతలకు చిట్లిపోయేది
విరుచుకుపడుతున్న రాక్షసుడి వికటాట్టహసాల మధ్యన
అమ్మ కన్నీటి రాగం గాలిలో దూదిలా తేలిపోయేది
రాలిపోయిన పక్షి ఈకలా దేహం, నేలకు అతుక్కుపోయేది
పొలంకాడ బొబ్బలెక్కిన అమ్మ చేతులకు
పొర్లుదెబ్బలు బహుమానంగా ఇచ్చి
నోటికాడి ముద్ద లాక్కుపోయిన నోట్లన్ని
కల్లు కాంపౌండ్ లో నీళ్లయిపోయేవి
ఏ నడిరాతిరికో తిరిగొచ్చిన మొగతనం సుక్క
పళ్ళెంలో ముక్క లేదని పక్కకు విసిరికొట్టి
పెళ్ళాం బొక్కల దేహంతో తన ఆకలి తీర్చుకునేది
ఎందుకలా జరిగేదో ఏమాత్రం తెలియని అమాయకత్వానికి
గుండెలమీద కొండలా కూర్చున్న భయం, గాబు చాటుకెళ్ళి
నిన్నటి వరకు అచ్చులు తేలిన గాయాల్ని లెక్కించేది
ఒళ్ళో తమ్ముడ్ని ఆడిస్తూ ఊయల్లో చెల్లికి పాలుతాగిస్తూ
కళ్ళల్లో కలల్ని కన్నీటితో తుడిచేస్తున్న నా బాల్యానికి
దారివెంట వెళుతున్న పలకలు పుస్తకాలు టాటా చెప్పేవి
ఉదయం రాత్రీ తప్ప ఏది మారని జీవితంలో
ఒకానొక రాత్రి అమ్మ మెడలో తాళి వాడి మెడకు బిగుసుకుంది
పీల్చి పిప్పిచేసిన పీడను గోడకు పటంలా వెళ్ళాడదీశాక
అమ్మ ఎర్రచీర ఒంటిమీద ఇంటిమీద జెండాలా రెపరెపలాడుతోంది
*****

పెనుగొండ బసవేశ్వర్ జన్మస్థలం తెలుగు ఆదికవి పాల్కురికి సోమనాథుడు జన్మించిన పాలకుర్తి గ్రామం. నాన్న సుదర్శన్ హిందీ పండిత్ మాత్రమే కాకుండా సాహిత్యం కోసం తపించి ఆ చిన్న పల్లెటూరులో పాల్కురికి సోమన సాహితీ సమితి సంస్థను 1982లోనే స్థాపించిన గొప్ప దార్శనికుడు. అమ్మ సుశీల గృహిణి. చదువుకోకపోయినా సొంతంగా పాటలు కైకట్టి ఆలపించగల సహజ గాయని. ఇక నేను వృత్తిరీత్యా ఎల్ఐసి లో పనిచేస్తున్నాను. ప్రవృత్తి కవితలు, కథలు, నానీలు, కార్టూన్లు, పెయింటింగ్ మొదలగు ప్రక్రియలలో అనేక బహుమతులు గెలుచుకున్నాను. కవిత్వంలో రెండు సంపుటాలను ఆకాశమంత పావురం(2018), ప్రశ్నలు మింగిన కాలం(2023) వెలువరించాను. నా రెండవ సంపుటికి ఇటీవల రాష్ట్రస్థాయి పెందోట పురస్కారం లభించింది. నెచ్చెలి కవిత్వ పోటీలో వరుసగా బహుమతి అందుకోవడం సంతోషకరమైన విషయం.
