
అమేయ పరిశీలన అద్భుత విశ్లేషణల సుశీలమ్మ (తొలితరం తెలుగు రచయిత్రులు- అభ్యుదయ కథలు పుస్త సమీక్ష)
-డా. కొండపల్లి నీహారిణి
మన కలం హలంగా చేసామంటే ఈ అక్కరల పొలంలో మొలిచిన మొక్కలన్నీ చిగురులెత్తి పూత పూయాలి కాతకాయాలి. అవి గట్టిగింజల్ని మొలిపించాలి. మళ్ళీ కొత్త చివురులెత్తాలంటే తెలివి అనే ఖనిజాలను, పోషకాలనూ అందించాలి. సాధారణంగా మనిషి శరీరంలో మెదడు,ఎముకలు, కండరాలు, గుండె వంటి అన్ని భాగాలు సరిగ్గా పని చేయాలి అంటే ఎలాగైతే మనిషి జీవించడానికి ఇవి ఎలా ఉపయోగ పడతాయో, సమాజం అనే శరీరానికి బుద్ధిని, లోతైన దృష్టిని ,అన్యాయాలు అసమానతలనూ పట్టించుకుని తాను చేయకుండా చేసినవి చూస్తూ ఉపేక్షించకుండా ఉండే ధైర్యాన్ని ఇచ్చేలా ఉపయోగపడే ఖనిజాలు, పోషకాలు ఏవంటే సాహిత్య వృక్షాలు,రచనల మొక్కలు.
ఔను! ఖనిజాలు( మినరల్స్ ) రోగ నిరోధక వ్యవస్థ శక్తిని ఎలాగైతే బలోపేతం చేస్తాయో, పోష కాలు (విటమిన్స్) జీవక్రియను నియంత్రిస్తూ సరైన శక్తి ఉత్పత్తిలో సహాయపడుతూ శరీరానికి ఇన్ఫెక్షన్లు రాకుండా ఎట్లా తోడ్పడతాయో అట్లా కవులు,రచయితలు రచించే రచనలు సమాజ శరీరాన్ని బలోపేతం చేస్తాయి. కవి క్రాంత దర్శి అనంటారెందుకు? ఇదిగో ఇందుకే! ప్రతి కవిలో రచయిత , ప్రతి రచయిత లోకవి ఉంటారనడం కూడా ఇందుకే. ఎవరు దర్శించని వాటిని కవులు దర్శిస్తారు, ప్రపంచానికి చూపిస్తారు. సుశీలమ్మ గారు ఎవరి కథను చదివినా, ఏ గ్రంథాన్ని చదివినా అందులోని అంతస్సారాన్ని గ్రహించి, సరైన వివేచన చేసి చక్కని వాక్య నిర్మాణంతో విశ్లేషణ చేస్తారు. ఇటువంటి విమర్శన శక్తి సమాజానికి ఎంతో మేలు చేస్తుంది.
” తొలి తరం తెలుగు రచయిత్రులు – అభ్యుదయ కథలు” పుస్తకం పై అభిప్రాయాలన్నీ నిజం అని నిరూపిస్తుంది. 1900-1955 మధ్య కాలంలోని కథా రచయిత్రుల కథలను ఒక్కోటి ఎన్నుకొని రచయితల క్లుప్త పరిచయాన్ని రాస్తూ,ఆయా కథల్లోని అంత సూత్రాలను వివరించారు. ముఖ్యంగా ప్రతి కథా విమర్శలో తమదైన గొంతుకను కూడా చూపించారు. పరిశోధకులకు కల్పతరువు వంటి అన్నమయ్య గ్రంథాలయ
వ్యవస్థాపకులు శ్రీ లంక సూర్యనారాయణ గారికి ఈ పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. ప్రముఖ కథా రచయిత, సాహితీవేత్త విహారి గారు ఈ పుస్తకానికి పీఠిక రాస్తూ ‘వ్యాసరచనలో సృజనాత్మక పథం ” అన్నారు. ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఒక్కో కథను ఏ విధంగా విశ్లేషణ చేస్తే ఆయా రచయిత్రుల ఉద్దేశ్యాలను ఒడిసిపట్టుకుని స్ఫూర్తిదాయకమైన విషయాలను వెలికితీయగలమో అలా రాసారు సుశీలమ్మ గారు. అందుకే ఈ పుస్తకం ఒక సమీక్షా రచననే అయినా సృజనాత్మక పథం గానే సాగింది.
మొట్టమొదటి కథ “కుటీర లక్ష్మీ” తో ప్రారంభమైన ఈ విశ్లేషణ 25 వ కథ ” “అభ్యుదయం ” తో ముగిసింది. ఈ పాతిక మంది రచయిత్రుల రచనా సామర్థ్యాన్ని 1924 ల నాటి సాంఘిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల పట్ల వాళ్లకున్న అవగాహన కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అని వీరు అనడాన్ని బట్టి చూస్తే, కథలలోని పాత్రలూ వాళ్ళ మాటలూ అభిప్రాయాలు ఎంత అమాయకతను ప్రదర్శించాయి గానీ ఆదర్శం గా నిలబడ్డాయని నిర్ధారించిన సుశీలమ్మ గారి వివేచననను చదివితే ఆ అసలు కథలన్నింటినీ చదివితే బాగుండు అని ఎవరికైనా తప్పకుండా అనిపిస్తుంది.
సంఘసేవాతత్పరతతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన కనుపర్తి వరలక్ష్మమ్మ గారు “కుటీర లక్ష్మీ” కథలో గొప్ప సందేశాన్ని ఇచ్చారు. “జీవితంలో అన్నీ కోల్పోయినా తన కాళ్లపై తాను నిలబడి తనని తాను నిరూపించుకున్న స్త్రీ మూర్తి కథను రచించిన వరలక్ష్మమ్మ గారు అభినందనీయురాలు” అంటారు సుశీలమ్మ .
బండారు అచ్చమాంబ దంపతుల ప్రథమ కలహం కథను విశ్లేషిస్తూ, ” నేను పెళ్లాడిన భార్యను గాని దాసినిగాను. వివాహమాడుట వలన భర్తకు దాసిని అగుదునా యేమి?”అనే ప్రశ్న ను ఆ కాలంలోనే వేయడాన్ని “ఆమె తొలి స్త్రీ వాద రచయిత్రి గా నిలిచి పోయారు ” అంటారు.
దుర్గాబాయమ్మ ” నే ధన్యనైతి” కథను, ఎల్లాప్రగడ సీతాకుమారి “కులమా ప్రేమా”కథను విశ్లేషించారు. కథలలోని అమూల్యమైన విషయాలను వివరించారు. స్త్రీలు చదువుకుంటే ఏ స్థాయి వరకు అయినా ఎదగగలరు అని ఆనాటి స్త్రీలు బలంగా నమ్మారు అంటూనే “పులవర్తి కమలావతి రచించిన “మాదిగ వెంకడు” ( జూన్ 1934, వాసవి) కథ స్త్రీ రాసిన ప్రథమ దళిత వాద కథ అని చెప్పవచ్చు” అని నిర్థారించారు సుశీలమ్మ.
ఆ. భాస్కరమ్మ రచించిన “ప్రభావతి” అనే కథ 1926 భారతి పత్రికలో వచ్చింది. ” తల్లిదండ్రులారా ! సంఘమునకు అంత వెరువవలయునా!
ఓ సంఘమా ! వితంతు స్త్రీల విరూపిణులను చేయుటలో మీ యుద్దేశం ఏమి?” ప్రశ్నించిన ప్రభావతి కథ ను ఆనాటి కాలంలోని స్త్రీలకే కాదు భర్త మరణించిన వెంటనే ఇప్పటికి కూడా వివక్షకు గురి అవుతున్న నేపథ్యాన్ని ఖండిస్తూ ఆలోచనలో పడవేసేలా విశ్లేషించారు సుశీలమ్మ. “ఇంతటి విప్లవాత్మక భావాలతో విశ్లేషణతో కూడిన స్త్రీలకు సంబంధించిన ముఖ్యమైన విషాదకరమైన విషయాన్ని కథగా రాసిన ఈ రచయిత్రికి సంబంధించిన సమాచారము ఎంత ప్రయత్నించినా దొరకలేదు” అని రాస్తూనే ,”ఎవరైనా ఆ రచయిత్రుల వారసులుంటే లేదా ఎవరైనా వివరాలు తెలిస్తే నాకు తెలుపవలసినదిగా మనవి. నేను శ్రమపడి సేకరిస్తున్న ఈ కథలను నా విశ్లేషణ వ్యాసాలను ముద్రించే సమయంలో పుస్తకంలో వారి పేర్లను కూడా కృతజ్ఞతాపూర్వకంగా చేరుస్తానని మనవి” అంటూ వారి ఈ శ్రమకు వెనక గల ఉద్దేశాన్ని వివరించారు సుశీలమ్మ.
సాహిత్య విమర్శలు అడుగుపెట్టామంటేనే లోతైన పరిశ్రమ చేయవలసిన అవసరం ఉంటుంది . కథావస్తువు ఆత్మను పట్టుకుని వివరించినట్టే ఆయా కాలాల రచయితలను గురించి కూడా కాలమాన పరిస్థితులను బట్టి కూడా వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడూ సాహిత్యం కోసం తపన పడాల్సిన అవసరం ఉంటుంది. ఇది సాధించారు సుశీలమ్మ.
ఈ ఆధునిక యుగంలో వాదాలు అంటే ఇజం ఇవి వచ్చాయి కానీ ఇవి తెలుగు సాహిత్యంలో కనిపించినప్పుడు కూడా కూడా ఆనాటి రచయితలు ఒక కట్టుబాటుతో రచించారు. సమాజ శ్రేయస్సే దీనికి మూలం. Impression , అభిరుచి అనేది గుర్తింపు సంపాదించుకున్నప్పటినుంచి సాహిత్య విమర్శకులు మూల రచయితల ‘రుచి’ కి ప్రాముఖ్యత పెరిగింది. ఇది సురుచి అయితే పర్వాలేదు. విమర్శలో కేవలం అభిప్రాయం ఉంటే సరిపోదు వైయక్తిక పరిధిని దాటి పాఠకుల పరిధిలోకి వెళ్ళగలగాలి. అప్పుడే అవి సత్కావ్యాలవుతాయి వాళ్లు సత్కవలు అవుతారు మన పూర్వ లక్షణకులు ఇదే ఆశించారు. ఇదే పద్ధతి వచన సాహిత్యమైన కథా రచనకు కూడా ఆపాదించుకోవాలి. Interpretation, judgment ల ఆధారంగా విమర్శ ఉండాలి.
” ఊయల లోగించే కోమలకరాలే రాజ్యాలు శాసిస్తవి
తూలిక పట్టే మృదు హస్తాలే శతఘ్నులు విదిలిస్తవి
జోలలు బుచ్చే సుకుమారపు చేతలే జయభేరులు మోగిస్తవి”
అంటూ కొనక కనకమ్మ రాసిన కవితను ఉదాహరిస్తూ, వారి “నేను అభాగ్యుణ్ణి” కథను సమీక్ష చేశారు. కనకమ్మ గారి గురించి ఎన్నో వివరాలను రాస్తూ, వీరు రచించిన “ఉరి” కథను కూడా సమీక్షించారు. వస్తు విశేషంతో పాటు క్లుప్తత, శిల్ప నైపుణ్యము ఈ కథలను చదివితే తెలుస్తుంది. శ్రీమతి సిహెచ్ వు. రమణమ్మ రచించిన “ఆదర్శ ప్రాయురాలు” కథ ఒక వ్యాపారి కూతురు, ఒక సంఘసంస్కర్త కూతురు ఇద్దరు అమ్మాయిలు స్నేహితులైతే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పిన కథ. “పేదల కష్టాలు కార్మికుల శ్రేయస్సు గురించి ఆ రోజుల్లో ఒక రచయిత్రి కథ రాయడం గొప్ప విషయమే” అని సుశీలమ్మ గారు అనడం సత్య ప్రామాణికంగా ఉన్నది.
అలాగే ఆచంట కమలమ్మ రాసిన “శ్యామల” కథ లో స్త్రీని ధైర్యవంతురాలిగా విద్యావంతురాలిగా వివేకవంతులుగా చిత్రించారని అనడమైనా, స్థానా పతి రుక్మిణమ్మ రచించిన “ఘనాపాటి ” కథా విశ్లేషణ చేస్తూ ” తెలుగులో తొలి హారర్ కథల రచయిత్రి స్థానాపతి రుక్మిణమ్మ అని నిర్ధారించడమైనా విమర్శ దృష్టి కోణం ఆదర్శప్రాయమైనదని భావితరాలకు మార్గదర్శకమని చెప్పవచ్చు.
పాఠకులకు సరైన జ్ఞానాన్ని అందించడంలో సమీక్షకులు ఆయా రచనలోని అంశాలను సమగ్రంగా అర్థం చేసుకోవాలి ముందు. పాత్రలు శైలి భాషా విశేషాలు అన్ని కథకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది చెప్పగలగాలి
సాధారణంగా
- రచయిత రచనా లక్షణాలు
- కథా ప్రక్రియ నిర్మాణ సూత్రాలు
- రచన భావవినిమయ వివేచన
అనే మూడు విషయాలు విమర్శ కు ముఖ్యమైనవి. ఇవి fundamental criticism కోవలోకి వస్తాయి. ఆచంట కొండమ్మ రచించిన శ్యామల కథ ఒంటరిగా పక్క ఊరికి వెళ్లి చదువుకున్న అమ్మాయి నాయికగా పక్షాన సాగిన కథ. ఆ రోజుల్లో ఇది కూడా పెద్ద సాహసమే అంటూనే ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో కథ రాయడం అది కూడా స్త్రీలు రాయడం ఆశ్చర్యం అంటారు సుశీలమ్మ. అలాగే “ఘనా పాఠి “అనే పేరుతో కథ రచించిన స్థానాపతి రుక్మిణమ్మ గారి గురించి రాస్తూ సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ అనేవి స్త్రీలు రచించిన కథలలో అప్పటికి ఇంకా రాలేదు. ప్రజల బలహీనతను తమ పెట్టుబడి గా సమాజాన్ని మోసం చేస్తూ వస్తున్న దొంగ బాబాలను నమ్మవద్దు అని చెప్పిన ఈ కథను విశ్లేషిస్తూ “ఆచంట సత్యవతమ్మ రాసిన నాటి పరిస్థితికి ఈనాటికి తేడా ఏమీ లేదని పిస్తోంది స్మార్ట్ఫోన్లో టీవీలు యూట్యూబ్లో వంటి ఆధునిక సాధనాల వల్ల బిజినెస్ మరింత పుంజుకుంది ముఖ్యంగా ఒంటరి స్త్రీలు వితంతువులు టార్గెట్ కల్లబొల్లి కబుర్లతో ఆకర్షణీయమైన ముచ్చటతో వారి ఒంటరితనాన్ని దూరం చేసే నెపంతో మోసపూరిత చర్యలు ఎక్కువయ్యాయి శ్రుతి మించిన పరిస్థితుల్లో ‘జ్ఞానోదయం’ అవుతుంది” అంటూ మాంఛి చురకలే వేశారు సుశీలమ్మ.
“పిల్లికి చెరలాటము – ఎలుకకు ప్రాణ సంకటము” కథను పులిపాక బాలా త్రిపుర సుందరమ్మ రచించారు. పత్రికలలో అడ్వర్టైజ్మెంట్ కోసం స్త్రీల బొమ్మలను ఉపయోగించడాన్ని ఖండించిన ఒక స్త్రీ ధైర్యాన్ని ఈ కథలో చూస్తాం. ఇట్లా ఆ కాలంలోనే రచయిత్రులు ఇట్లా స్త్రీలను ఆట బొమ్మల ఉపయోగించడాన్ని నిర్భయంగా ఖండించారు. ఈ విషయంపై సుశీలమ్మ గారు చాలానే వివరాలను రాశారు. ఇప్పటి ఎలక్ట్రానిక్ మీడియా విచ్చలవిడితనాన్ని స్పృశించి విశ్లేషించారు. ” తమ వస్త్రధారణ పూర్తిగా స్త్రీల అభీష్టమే కానీ దానిని అలుసుగా తీసుకొని కాసులు కురిపించుకోవడానికి చేసే వ్యాపారవేత్తల కుతంత్రమే అభ్యంతరం. ఈ విషయాన్ని 1936 లోనే నిర్ద్వంద్వంగా నిరసించిన శ్రీమతి పులిపాక బాలా త్రిపుర సుందరమ్మ గారి ఆత్మస్థైర్యాన్ని ప్రశంసించాలి’ అంటూ modern, very modern, ultra modern అంటూ అన్నిట్లో కేవలం స్త్రీల దుస్తుల advertisements తోనే ఆకర్షిస్తూ సొమ్ము చేసుకోవడాన్ని వీరు బాహాటంగా చెప్పడంలో ఉద్దేశ్యం మహిళలోకం కళ్ళు తెరుకునేలా ఉంది.
ఒక రచనలోని గుణదోషాలను విశ్లేషించి చెప్పే విమర్శ ప్రస్తుత ఆధునిక కాలానికి ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే మామూలు సాహితీవేత్తల కైనా కొత్తగా ఎదుగుతున్న రచయితలకైనా,
పాఠకులకులకైనా ఆ రచనలలోని మంచి చెడులను వివేచన చేసి చెప్పే వాళ్ళు అరుదుగా ఉంటారు ఇది ఒక పెద్ద బాధ్యత. ఈ బాధ్యతను తలకెత్తుకున్న సాహితీ విమర్శకులకు తమలోపల ముందు నుంచి ఉన్న సృజనాత్మక శక్తి కి సరైన సమయాన్ని వెచ్చించలేరు.
ప్రతి వ్యాసం ఉపోద్ఘాతంలో మంచి ప్రతిపాదనలను చేస్తూనో, ఒక విషయాన్ని చర్చకు పెడుతూనో సాగినవి.
పొణకా కనకమ్మ గారి గురించి ” ఆమె చరిత్రకు ఎక్కితే ఎందరో చరిత్రహీను లవుతారు అని ఓల్గా గారు అన్నారని అనడాన్ని, “ఆకాల చంద్రకాంతమణి వ్రాసిన కవిత ప్రకృతి Objective , వస్తు దృష్టి తోను subjective, విషయదృష్టితోను విశ్లేషణ చేయాలి సమన్వయపరచాలి. దీనికి విమర్శకులకు కావాల్సింది నవీన దృక్పథం. సుశీలమ్మ గారు 19 వ శతాబ్దపు మలిదశలో వచ్చిన ఈ కథలను 21 శతాబ్దపు సమాజానికి అన్వయించి చెప్పిన కథా విశ్లేషణ లు ఇందులో కొన్ని ఉన్నాయి. అది ఆ కథ బలమా? సమాజంలోని బలహీనతల కారణమా? కానీ ఆత్మాభివ్యక్తంగా సాగిన ఈ సమీక్షలు విశ్వజనీయమైనవే.
స్త్రీలు తమను తాము నిరూపించుకుంటూ బ్రతకాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నారు ఇంకా. అలాగే అద్దంపూడి అన్నపూర్ణమ్మ గారు రచించిన “వింత విశాలాక్షి” కథనూ, పాకాల చంద్రకాంతమణి గారు రచించిన “దైవమేమి చేసినను మన మేలుకొరకే ” కథను వివరించేప్పుడు ఆనాటి రచయితలు కాలక్షేపం కోసం కథలు రాయలేదని తమ పేరు పత్రికల్లో చూసుకొని మురిసిపోవాలని రాయలేదని, కేవలం మారుతున్న బలహీన మనస్కుల వలన సమాజానికి కలిగే వైపరీత్యాలను వివరించే ప్రయత్నం చేశారని చెప్తారు.
విశ్లేషించబోయే రచనలలోని కళాత్మకత ఎలా ఉందో ఒడిసి పట్టాలి నాణ్యతను అంచనా వేస్తూ వ్యక్తపరచగలగాలి. ఊహాగానాలకు తావియ్యని compelling ఉండాలి. కథా రచనలోని దశలను వింగడించుకుంటూ సాగిన ఈ విశ్లేషణలో కథా పరిణామ దశ ఒక ప్రయోగదశగా నడక సాగిస్తూ వచ్చిందడానికి ఈ కథలన్నీ సాక్ష్యంగా ఉన్నాయి.
ఎన్నెన్ని ఆంక్షలు మధ్య స్త్రీల బ్రతుకులు గడిచేవో ఈ కథలు చెబుతాయి.
భారతదేశ స్వాతంత్ర్య సాధన ఉద్యమంలో స్త్రీలు కూడా చైతన్యవంతంగా పాల్గొనాలన్న ఆకాంక్షతోనూ, దేశ స్వేచ్ఛ అనే కాదు వ్యక్తిత్వ వికాసం కొరకు వ్యక్తి స్వేచ్ఛ కూడా అవసరమైన అని ఆనాటి రచయిత్రులు ఎన్నో వ్యాసాలు కథలు రచించారని సాహిత్య చైతన్యం ఇప్పటికీ గౌరవనీయమైనదని అభిప్రాయపడ్డారు సుశీలమ్మ గారు. ఇట్లా చెప్పడానికి విస్తృతమైన పఠన అనుభవం కావాలి.
సమయమంత్రి రాజ్యలక్ష్మి గారు రచించిన “రెండు వరాలు” కథ, ” మనదేశంలో స్త్రీని భోగ వస్తువుగా చూడక ఆమె యొక్క సున్నిత హృదయాన్ని ఉదారపూరితలైన ఆశయాలని వ్యక్తిత్వాన్ని గమనించి ఆమెకు సమాన హక్కులు ఇచ్చి దేశాన్ని సంఘాన్ని ఉద్ధరించటం ముఖ్య అవసరం మీరు వివాహమాడే స్త్రీకి సమాన హక్కులు ఇచ్చి ఆదర్శకుల అవడం నా మొదటి కోరిక మీ వివాహం వితంతుద్వాహంగా ఉండటం రెండవది” అంటూనే ప్రాణాలు విడిచిందామే.” అంటూ కథానాయక రెండు వరాలు పొందిందా లేదా? ఆమె కోరికలే సమాజానికి రెండు వరాలా? అనే కోణంలో పాఠకులు ఆలోచించేలా కథను ముగించిన తీరును సుశీలమ్మ గారు విశ్లేషిస్తూ,ఇంత ఉన్నత భావాలతో ఆనాటి రచయిత్రులు కథలను రచించారనే ఉద్దేశ్యంతో ” వాళ్లని స్మరించు కోవలసిన అత్యవసరం నేటి సమాజానికి ఉన్నది” అంటూ ముక్తాగింపుగా చెబుతారు సుశీలమ్మ గారు.
ఇక నందగిరి ఇందిరా దేవి గారి “వాయిద్యం సరదా” కథ, ఆచంట శారదా దేవి గారి “ఒక్కరోజు” కథ , వాసిరెడ్డి కాశీరత్నం గారి “ఒడిదుడుకులు” కథలలో అంతరార్ధాన్ని వివేచిస్తూ, అనుమానాస్పదమైన కాపురాలు నిలబడవని చెప్పినా, స్త్రీ పురుష సంబంధాలలో అసమానతలు ఉండవద్దని చెప్పేప్పుడు “సతీ ధర్మం” వంటి కథలను కూడా ఉటంకించారు.
“స్త్రీకి స్వాతంత్య్రంలేక జైల్లో పెట్టారా?” అంటూ వేళాకోళంగా వెటకారంగా అంటున్న భర్తకు సమాధానమిస్తూ, ఖైదీల పై నిఘా ఎలా ఉంటుందో స్త్రీకి అంతే . అన్నింటికీ మగవాళ్ళ అనుజ్ఞ కావాలి. లేకుంటే ఎవరిదో ఒకళ్ళ సాయం కావాలి . దీన్నే స్వేచ్ఛ లేదని అనడం అనే భావంతో ఒక స్త్రీ ఎదురు ఇరిచి చెప్పడం అనే భావాన్ని ప్రోది చేస్తూ కథ రాయడాన్ని సుశీలమ్మ గారు నేటి కాలానికి అన్వయించి వివరించారు. రంగస్థలంపై స్త్రీల పాత్రలను స్త్రీలు ధరించే వారు కాదని అటువంటప్పుడు వాళ్లకు ఇష్టమైన వాయిద్యాలను నేర్చుకోవడం వాళ్లకు ఒక అందని చందమామనేనని అయినా అటువంటి కాలంలోనూ వాళ్ళు సాధించుకున్నారని చెప్తారు. స్త్రీకి మెదడు ఉంటుంది హృదయం ఉంటుంది ఆలోచనలు అభిరుచులు ఉంటాయి అనే స్పృహతో రాసారని చెబుతూ, ‘మనసుకు ‘ చాలా ప్రాధాన్యత ఇచ్చిన కథలో వచ్చాయని చెబుతారు.
రచన లోని అంశాలకు న్యాయం చేస్తున్నవా ఈ కథలు ? లేదా ? అనేది వివేచించడం ఎంత అవసరమో ఆ రచన సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుందో అనేది వివేచించి చెప్పడం సాహిత్య విమర్శకుల బాధ్యత.
అలివేలు మంగతాయారు గారు రచించిన”పరివర్తనము ” కథ భార్య అందం మాత్రమే కోరుకునే భర్త ప్రవర్తన తో విసుగుచెంది” నేను చనిపోయిన తర్వాత మీరు అందమైన కన్యను వివాహం చేసుకోండి అంటుంది ఏడుస్తూ. భార్య మంచితనం, సహనం అతనిలో పరివర్తన తీసుకొస్తుంది. అయితే ఈ కథలో ఉన్న విషయం ఆ కాలంలో సర్వసాధారణంగా ఉంటూ ఉండేది. పెద్దలకుదురుచిన పెళ్లిళ్లు తప్పనిసరిగా ఒప్పుకునేవాళ్లు పెళ్లయిన తర్వాత వాళ్ళ అసలు మనస్తత్వం బయట పెట్టడం వంటివన్నీ చూసేవాళ్ళం. సౌందర్యం చుట్టూనే తిరిగిన ఈ కథను వివేచిస్తూ పాఠకులకు ఆలోచనలో పడేస్తారు సుశీలమ్మ గారు. “చర్మ సౌందర్యం కోసం కేశ పోషణ కోసం అర్రులు చేర్చడం ఈ రోజుల్లో మరి ఎక్కువైంది ” అంటారు.అంత సౌందర్యాన్ని గుర్తించే లోకమిది. దీనికి పరిష్కారం చూపించిన ఆనాటి రచయిత్రి భావాన్ని ఎంతమంది ఈ కాలం వాళ్ళు ఒప్పుకుంటారు? అంతా false prestiges కోసం ప్రాకులాట. అలా అని అలంకరించుకోవద్దు అని కాదు. వ్యక్తిగతంగా ఇష్టముంటే అలంకరించుకొని తయార వ్వచ్చు కానీ ఇతరుల కొరకు తాపత్రయపడడం తప్పు అని విషయాన్ని పూర్వ రచయిత్రులు చెప్పారు అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఇల్లందర సరస్వతి దేవి “అక్కరకు రాని చుట్టము” కథ గురించి శీలా సుభద్ర దేవి ” మధ్యతరగతి జీవితాలలోంచి సమకాలీన సమస్యలను తీసుకొని సహజ పరిణామ క్రమంలోనే ఇతివృత్తానికి తగినట్టుగా పాత్రలని సంఘటనని సంభాషణాలను సమకూర్చారు” అని అన్నారని చెబుతూ, కథను క్లుప్తంగా చెప్పారు, స్త్రీల ఆత్మ అభిమానాన్ని గౌరవిస్తున్న కథలుగా వివరించారు సుశీలమ్మ గారు. ఇంటిని ఇల్లాలిని కనిపెట్టుకొని ఉండే సమాజం ఒకటుంటుంది. ఇది అర్థం కావడమే కష్టమైన విషయం. వేదుల మీనాక్షి దేవి , “మానివేసిన కథ” విశ్లేషణ లో ” అసంబద్ధమైన కథలను రాయలేక రచయిత్రి మానివేసింది, ఆమెకు మెలకువ వచ్చేసరికి పిల్లలు ఆ కాగితాలతో పడవలు చేసుకుని ఆడుకుంటుంటారనేది” ఈ కథలో విషయము అంటారు. చాలా ఆదర్శనీయంగా ఉన్న రచన విధానం ఇప్పటి రచయితలకు ఒక కనువిప్పు. ఆమె ఎందుకు రాయకుండా మానివేసిందో కథను చదివి తప్పకుండా తెలుసుకోవాల్సిందే! కొమ్మూరు పద్మావతి దేవి “శోభ” కథలో మాయా జలతారుల సినిమా రంగానికి సంబంధించిన కథ. “పరమపద సోపానం వంటి సినిమాలలోకంలోని జీవితాన్ని తాను ఆ రంగంలోనే ఉంటూ కూడా నిర్భయంగా చిత్రించారు” అని ఈ రచయిత్రిని గురించి అభిప్రాయపడ్డారు వీరు. కళ్యాణి “ఇంటి నీడలో…” కథను సమీక్షిస్తూ” పుట్టినింట జాగ్రత్త భయంతో కూడిన ఆంక్షలు ఉంటే అత్తారింటి ఆధిపత్యం ఎక్కువ” అంటూ కచ్చితమైన అభివ్యక్తిని చేశారు. జెండర్ వివక్ష ప్రస్ఫుటించారని అన్నారు. బి. ప్రేమలీల “దూరపు కొండలు నునుపు” కథ గురించి రాస్తూ, ” మందహాసానికి ఒక ఇంచ్ దూరంలో ఉంటాయి మధ్యతరగతి వారి జీవితాలు” అనడం చాలా బాగుంది. భాష ప్రావీణ్యత విస్తృత పట్టణ అనుభవం సుశీలమ్మ గారి వ్యాసరచనలో ప్రస్ఫుటంగా ఉంటుంది.కొమ్మూరి ఉషారాణి “అభ్యుదయం” ఈ పుస్తకంలో చివరిదైన 25వ కథ రచయిత్రి కథ ఇది. ” ప్రేమ అనేది రెండు హృదయాల స్పందన రెండు మనసులు కలిసి ఏకోన్ముఖంగా అందంగా ఆనందంగా సాగిపోయేది .ఒక్క మనసులో పుట్టి వ్యక్తం కాకుండా మిగిలిపోతే అది విఫల ప్రేమ అవుతుంది” అని చెప్పడం అక్షర సత్యం.
ఈ కథలు ఒక్కో కదా ఒక్కో నీతిని బోధిస్తూ ఒక్క ఆలోచనను ప్రేరేపిస్తూ సాగినవే. అన్ని కథలను తమదైన శైలిలో విశ్లేషణ చేస్తూనే ఆయా రచయిత్రుల వివరాలను సందర్భోచితంగా రాస్తూనే, రచయిత్రుల హృదయాలను పట్టుకొని సందేశాలను అందించారు. ప్రతి కథా విమర్శలో తమదైన ముద్రను వేస్తూ సాగిన వాక్యాలు చాలా ఉన్నాయి.
విశ్లేషిస్తున్నటువంటి రచనలోని జ్ఞానము కొత్త ఆలోచనలు ఏదైనా రేకెత్తిస్తోందా లేదా అనేది పరోక్షంగా నిందిచుని సాహిత్య విమర్శకులు ప్రజాపక్షంగా ఆలోచించి చెప్పగలగాలి. ఇక్కడ రచయితల పట్ల పక్షపాత వైఖరి ఉండకూడదు. ఇలా తలకెత్తుకున్న సాహిత్య విమర్శ చేస్తున్న రచయితలు తమదైన సృజనాత్మకతకు భంగం వాటిల్లుతున్నా లెక్కచేయకుండా అమూల్యమైన తమ సమయాలను త్యాగం చేస్తారు.
ఇన్ని కథలను సంపాదించి ,చదివి, మూల్యాంకన చేస్తూ విశ్లేషించడం అనేది tankless job. కానీ ఎంతో గుర్తింపుకు రావాల్సిన అవసరం ఉన్నది.
ఆనాటి సాంఘిక ఆచారాలు సామాజిక పరిస్థితులు కథల్లో రచయితలు రాసిన వివరాలు చెప్తూనే, ప్రముఖ రచయితలు గారు, కాత్యాయని విద్మహే గారు ఈ రచయిత్రులలో కొందరి గురించి చెప్పిన అభిప్రాయాలు కూడా సుశీలమ్మ గారు సందర్భోచితంగా రాశారు.
సాహిత్యం సమాజానికి ఎంతో అవసరం. ఇది కవిత్వ రూపమో కథా రూపమో, వ్యాస రూపమో. ఏదైనా పాఠకులకు అందాలంటే పత్రిక లు కావాలి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోనూ చదవగలిగే అవకాశం ఉన్నది. అందుకే అంతర్జాల పత్రికలు ఇంత ఆదరణ పొందుతున్నాయి. ఇట్లాగే సాహిత్యానికి పోషకులు కూడా ఉండాలి. సుశీలమ్మ గారు రచించిన ఈ వ్యాసాలన్నీ ప్రముఖ రచయిత్రి గీతా మాధవి నడుపుతున్న ‘ నెచ్చెలి ‘ ఆన్లైన్ పత్రిక లో ధారావాహికంగా ప్రచురితమైన వ్యాసాలు. ఇట్లా సాంకేతిక పరిజ్ఞానం సహకారం తో అంతర్జాలం ద్వారా సాహిత్యాభిమానులకు అందాయి. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా అందరమూ చదవాలి. చదివితేనే అలనాటి రచయిత్రులు అప్పటి సమాజాన్ని ఈ కథల ద్వారా ఎంత మేల్కొలిపారో తెలుస్తుంది.
కథలలో ఉన్న తాత్విక కోణాలను ఆయా కథల ఇతివృత్తాలకు సమన్వయం చేస్తూ సాగిన ఈ సాహిత్య విమర్శ కథా చరిత్ర లో నిలిచిపోయే విమర్శ. ఈ పుస్తకం భావితరాల సాహిత్య విమర్శకులకు పరిశోధకులకు వాళ్ళు ఒక గైడ్ లా ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఈ కథలలోని రచన లక్షణాలను వివరిస్తూ నిర్మాణ సూత్రాలను ఏర్పరుస్తూ భావ వినిమయ వివేచన చేస్తూ వ్యాసాలు సాగినవి. పాత్రల గుణగణాలలోని శక్తియుక్తులను,బలహీనతలను సమతుల్యంగా వివరించారు. కాలానుగుణ మార్పులు ఏవో చెబుతూ కథా సంవిధానానికి జోడించి అర్థం చేయించేలా రాసారు.
దీనికి పాశ్చాత్య విమర్శ సూత్రాలు అవసరమా? అదే ధోరణులను ఆధారం చేసుకుని విమర్శ చేయాలా? ఏం… అవేవీ చదవని వాళ్ళు కూడా ఆ కథలో ఏముందో ఆ కవిత్వంలో ఏముందో చెప్పలేరా? చెప్పవచ్చు చెప్పగలరు. కాకుంటే వాళ్లలో ఉండాల్సింది నిబద్ధత. సమాజ పరిజ్ఞానం. కాస్తంత మంచితనం. ఈ మంచితనం ఏంటి? ఇది ఎందుకు ? ఇది ఏమైనా వ్యక్తిగత విషయమా? అనే ప్రశ్నలు ఉద్భవించవచ్చు. ఈ ప్రశ్నలోనే జవాబు కూడా దొరుకుతుంది. విభిన్నమైన వస్తువులున్న కథలు ఇవి. ఎంతో రచనా నైపుణ్యం ఉన్న వాళ్ళు , అభ్యుదయ భావాలు ఉన్నవాళ్లు మాత్రమే ఇంత లోతైన విశ్లేషణ చేయగలుగుతారు. తెలుగు సాహిత్య చరిత్రలో విమర్శకు ఉన్న విలువ తెలిసిన వాళ్లకు సుశీలమ్మ గారు రచించిన ఈ పుస్తకం ఎంతో విలువైన పుస్తకం.

ఎం .ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం), ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్దిరాజు సోదరుల జీవితం-సాహిత్యం‘ పై పరిశోధన చేసి , డాక్టరేట్ పట్టా పొందాను . నిత్యవిద్యార్థిగా నిరంతర సాహిత్య పఠనం . పెద్దల మాటలను , కొత్తగొంతుకలను వినడం ఇష్టం .