ప్లీజ్ .. అర్ధం చేసుకోరూ

– శాంతి ప్రబోధ

          నాలోని వ్యాధి, అదొక నిశ్శబ్ద నీడ. గోడలపై వేలాడిన పాత పెయింటింగ్ లా, అది నాలో నెమ్మదిగా పాతుకుపోయింది. ఒకనాటి ఉదయం నిద్ర లేవగానే, నా నాలుకపై ఒక వింత పువ్వు పూసింది. అది చేదుగా ఉన్నా, సుగంధాన్ని వెదజల్లుతోంది. డాక్టర్ గదిలోకి అడుగుపెట్టగానే, ఆయన చేతిలోని స్టెతస్కోప్ గుండెచప్పుడు కాకుండా, నాలో దాగిన ఆ పువ్వు గుసగుసలు వినిపించింది.

          “ఇది ఒక ప్రయాణం,” ఆయన కళ్ళు అద్దాల్లా మెరిసాయి. “వెనక్కి మళ్ళదు.” స్పష్టంగా ఉంది ఆయన గొంతు.

          నేను అంగీకరించాను, ఎందుకంటే నాలోని పువ్వు నాకు తెలుసు, అది నాలో తన వేళ్ళను మరింత లోతుకు పంపుతోంది. నా అంగీకారం, గాలిలో కరిగిపోయిన మంచు బిందువులా, నన్ను తేలికపరిచింది.

***

          నేనిన్నాళ్ళూ, నేను ఒక గాజు బొమ్మలా బతికాను. ప్రతి ఇంటి తలుపు తెరిచి నప్పుడల్లా, “వాళ్ళు ఏమనుకుంటారు?” అనే ఒక పారదర్శకమైన తెర నన్ను కప్పేసేది. నాలోంచి నేను బయటకు రాలేకపోయాను. నా ప్రతి అడుగు వారి అంచనాల రేఖలపై పడింది. కానీ, ఆ తెర వెనుక, నాలోని నిశ్శబ్దపు నది ఇంకిపోతూ వచ్చింది. ఆ నదిలో చేపలు చనిపోతుంటే, ఎవరికీ వినిపించని హాహాకారాలు నా చెవుల్లో మ్రోగాయి. “నేను వారికి తృప్తినివ్వలేకపోయానా?”  ఈ ప్రశ్న ఒక ముళ్ళ తీగలా నా మనసు చుట్టూ అల్లు కుంది.

          ఒక చీకటి రాత్రి, నా కళ్ళముందు ఇల్లు కరిగిపోయింది. గోడలు మైనంలా కరిగి, నేను చేసిన ప్రతీ పని, వండిన కూర, పొంగిన పాలు, సర్దిన గిన్నెలు అన్నీ గాలిలో రంగురంగుల పొగలుగా మారిపోయాయి. నా నోరు మూగబోయింది, కానీ నా ఆలోచనలు రెక్కలొచ్చి ఆకాశంలోకి ఎగిరి పోయాయి. 

          “ఎందుకు నా గురించి నేను పట్టించుకోలేదు?” ఒక అదృశ్య చేయి నా భుజం తట్టింది. తప్పు వారిది కాదు, నాదే. ఈ జ్ఞానం ఒక మెరుపు తీగలా నా మెదడును చీల్చింది. కానీ అప్పటికే, నాలోని వసంతం సగానికి సగం రాలిపోయింది. ఛా! అయినా పర్లేదు, కనీసం ఇప్పుడైనా నాలోని అద్దం నన్ను చూపించింది: నన్ను నేను ప్రేమించు కోవాలి, నాకు నేను విలువ ఇచ్చుకోవాలి. అప్పుడు, నా మరో నేను,  ఒక మందహాసంతో “శభాష్!” అంది.

          బంధాల వల, అదొక మాయాజాలం. వారు సంతోషంగా ఉన్నంత సేపు, నేను వారి కంటి పాపలా ఉండేదాన్ని. 

          కానీ, వారి మాటలు… అవి సూదుల్లా నా మనసును గుచ్చాయి. “నువ్వేంటి అలా తయారయ్యావు, ఏదో లోకంలో ఉంటావు…,” అన్న ప్రతి మాట, నా గుండెపై పడి  అదృశ్య మైన సుత్తి దెబ్బలే. 

          నా ప్రేమ, అభిమానం ఒక విరిగిన అద్దంలా చిదిగిపోయింది. నేను ఎంత ఏడ్చినా, ఆ కన్నీళ్లు ఎవరికీ కనిపించని నిశ్శబ్దపు నదిలో కలిసిపోయాయి. ఆ మాటలు… పైకి  రంగుల సీతాకోకచిలుకల్లా కనిపించినా, లోపల విషాన్ని నింపుకున్నాయి.

***

          నాలోని భావోద్వేగాలు, అదో కల్లోల సముద్రం. ఆ సముద్రంలో నన్ను నేను బలోపేతం చేసుకుంటూనో బలహీనపరుచుకుంటున్నానో .. 

          వారి మాటలు, నా చెవులలో ఒక పాత పాటలా మోగుతూనే ఉన్నాయి,  నాలో నేను ముడుచుకుపోయి, దుఃఖించడం అధికమైంది. 

          ఈ మనసు… పాపం! అదొక నిశ్శబ్దపు బావి. ఆ బావిలో కన్నీరు ఎంతని ఇంకి పోగలదు? ఆత్మాభిమానం విరిగిన రెక్కలతో నేల రాలింది. 

          నా సామర్థ్యంపై విశ్వాసం, అదొక రాత్రిపూట మాయమైపోయిన నక్షత్రం. “ఏం మాట్లాడితే ఏ తప్పు వెతుకుతారో, ఎగతాళిగా నవ్వుతారో” అనే భయం నన్ను వెంటా డింది. నన్ను నేను ఒక శూన్య పంజరంలో బంధించుకున్నా, ఆ పంజరం గోడలు అదృశ్యంగా నన్ను నొక్కేశాయి. 

          నా గుండెలో ఎన్ని గాయాలు? అవి కనిపించని చీకటి మేఘాల్లా నన్ను కమ్మేశాయి. ఒక్కోసారి, రోజుల తరబడి దుఃఖం ఒక నదిలా ప్రవహించి, నన్ను పూర్తిగా తడిపేసేది.

          ఒకే ఇంట్లో మనుషులున్నా, అదొక విభజన రేఖ. ఆ రేఖలు నాలో నిరాశను, నిస్పృహను, అసహనాన్ని, అశాంతిని మరింత పెంచాయి. 

          మనసు సంతోషంగా ఉంటే, మాటలు వాటంతట అవే వస్తాయి. కానీ బాధగా ఉంటే… మౌనమే నా ఏకైక భాషగా మారింది. ఊరట కోసం, నేను పార్కుకు వెళ్ళేదాన్ని. అక్కడ చెట్లు నా చెవుల్లో గుసగుసలాడేవి. వంట చేస్తూ, నా మనసును మళ్లించుకునే దాన్ని. ఒక్కోసారి, తనివితీరా ఏడ్చేసి, ఆ కన్నీటి సముద్రంలోనే పడుకునేదాన్ని. అయినా నా గాయపడిన మనసు, అదొక సజీవమైన పుండు. అది సలుపుతూనే ఉంది. రసి కారుతూనే ఉంది. నా బతుకును కుదువ పెట్టి బతకలేక, పెదాలపై లేని నవ్వులు పూయించలేక నేను చేసిన పోరాటం… హూ..దానికి మాటలు లేవు.

          కుటుంబ బరువు బాధ్యతలు, పరువు ప్రతిష్టలు… అదొక బరువైన రాయి. నా ఒక్క దానిపైనే ఎందుకింత బరువు?

          ప్రతి వాళ్ళకి ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయని అప్పుడు నాకు తెలియలేదు. నా కోరికలు, భావోద్వేగాలు, నమ్మకాలు… అవి ఇంట్లోని మిగతా వాళ్ళతో పోల్చితే ఒక వింత జాతి పక్షుల్లా కనిపించేవి. నేను వారికి తక్కువగా కనిపించవచ్చు. నా తీరు బాధ కలిగించే ఉండవచ్చు. కానీ, నన్ను దద్దమ్మని చేసి చూడడం, నాలో ప్రశ్నల జ్వాలలను రగిలించింది.

          “మనిషిగా నా చిరునామా ఏంటి?”  ఈ ప్రశ్న ఒక విత్తనంలా మొలకెత్తి, నన్ను వెంటాడింది. నా స్వభావానికి తగ్గట్టు కాకుండా, మాతృత్వపు విలువలు, మమకారపు మాధుర్యం వగైరా వగైరా.. అదొక తెర వెనుక నాటకం. నీటి బుడగలాంటి పొగడ్తల కోసం ఆరాటపడ్డానేమో! 

          గుండె భారం దించుకుంటూ, నా జీవితాన్ని శూన్యంలో కలిపేసుకోకూడదని అర్థం చేసుకునే సరికి, నా సగం జీవితం అదృశ్యమైపోయింది. బహుశా, నా ముందు తరాల ఆడవారి అడుగుజాడలను అనుసరించానేమో! మారిన కాలానికి నేను మారలేక పోయానేమో! నా జీవన విధానం, నడవడిక ఇతరుల పట్ల ఉన్నట్టు వారూ ఉండాలని కోరుకోవడం… అదొక అత్యాశ. 

          నా ఇంట్లో నేను అనామకురాలిగా బతకలేక, నన్ను గౌరవించండి అని అడుక్కోలేక నరకయాతన పడ్డాను. నా చేతగానితనమా లేక నాలాంటి అమ్మలందరి పరిస్థితి ఇదేనా? ఈ సంఘర్షణలో ఉండగానే, పిల్లలు రెక్కలొచ్చి గూడు వదిలిన గువ్వల్లా పై చదువులకు వెళ్లిపోయారు.

          చిన్న కూతురు “అమ్మా, నువ్వు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నావు, అదే విషయాన్ని పాజిటివ్‌గా ఆలోచించి చూడు” అని పదే పదే చెప్పేది. ఆ మాటలు మొదట్లో నాలో విసుగు తెప్పించేవి. 

          నా ఫ్రస్ట్రేషన్‌ని, కడుపులో దాగిన కన్నీళ్ళని పాజిటివ్‌గా ఆలోచిస్తూ… నాలోకి నేను తొంగి చూసుకున్నప్పుడు, కార్చిన కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు నన్నొక ప్రశ్న వేశాయి: ‘ఎప్పుడైనా నీకు కలిగిన బాధ గురించి నీ వాళ్ళకు చెప్పావా?’  అప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా. లేదు, నేను ఎప్పుడూ చెప్పలేదు. నా మనసును వారి ముందు విప్పి పరచలేదు.

          “నీకు ఈ ఇంట్లో గౌరవం దక్కట్లేదనీ, ఎవరూ విలువ ఇవ్వడం లేదని భర్తను, పిల్లల్ని తప్పు పడుతున్నావు కానీ ఒక్కసారి ఆలోచించుకో… నిన్ను నీవు ఎప్పుడైనా గౌరవించుకున్నావా? నీకు నీవు ఎప్పుడైనా విలువ ఇచ్చుకున్నావా? నీకు నీవు ఎప్పుడైనా గుర్తింపు ఇచ్చుకున్నావా?”  లేదే, అంటూ నా అంతరాత్మ ఒక పెద్ద కేక వేసింది. అందరితో మంచిగా అనిపించుకోవాలని, తలలో నాలుకలా మెలగాలని అనుకున్నావు. అందుకే జీవితమంతా చాకిరీకి, ఇతరుల స్వార్థానికి బలయ్యావు. నీది మంచితనం కాదని, అతి మంచితనం అని గుర్తించావా లేదని మొట్టికాయలేసింది.

          “ఈ కాలంలో నిన్ను నువ్వే ఒక విలువైన సరుకుగా మార్చుకోవాలి,” అని నా మనసు లోని ఒక అదృశ్యమైన గొంతు గొణిగింది. ఉలిక్కిపడ్డ నేను ఆలోచించడం మొదలుపెట్టా. వెనక్కి తిరిగి చూసుకున్నా. అప్పుడు జ్ఞానోదయం అయింది. 

          గౌతమ బుద్ధుడిలా బోధి చెట్టు కింద కాదు, నా నాలుగ్గోడల మధ్యే… లోపం ఎదుటి వాళ్ళలో కాదని, నాలోనేనని గుర్తించే సరికి సగం జీవితం ఖాళీ అయిపోయింది.

          నన్ను నేను గుర్తించడం చాలా ముఖ్యమని ఇప్పటికైనా గ్రహించగలిగినందుకు, నాకే నేనే శభాష్ అని జబ్బ చరుచుకున్నా. “నాతో నేనుండాలి, నా జీవితంలో నేనుండాలి, నా కోసం నేను పోరాటం చేయాలి” అని అర్థమైన తర్వాత నాలో కొంత ప్రశాంతత వచ్చింది. అందుకోసం జీవన శైలి మార్చుకోవాలని, నన్ను కబళించడానికి వేగంగా దూసుకొచ్చే అనేక విషయాలకు దూరంగా ఉండాలని, నన్ను నేను సవరించు కోవాలని స్థిర నిర్ణయానికి వచ్చా.

          “తోడు లేకుండా మనిషి బతకలేడు. తోడు ఉరితాడైనా తోడు కావాల్సిందే” అని నాయనమ్మ చెప్పేది. అది వారి కాలపు మాట. నేను ఈ కాలపు మనిషిని. ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపే, గద్దలా పొడిచినట్లు మాట్లాడే తోడు గురించి ఆలోచించడం, ఆ టార్చర్ అనుభవించడం ఎందుకు చెప్పండి?

          అయినా ఆయనకు నేనెంత దూరమో, నాకూ ఆయన అంతే దూరం. అంతే నంటారా?! 

          నాకు నచ్చిన దారిలో నేను వెళ్తూ, నాకు నేను గుర్తింపు ఇచ్చుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టా. నాకు నేను ప్రాధాన్యత ఇచ్చుకోవడం, గుర్తింపు ఇచ్చుకోవడం, విలువ ఇచ్చుకోవడం మొదట్లో ఇబ్బందిగా అనిపించినా తర్వాత అలవాటైంది. నన్ను నేను చిన్నబుచ్చుకోవట్లేదు కాబట్టి ఎదుటి వాళ్ళు నన్ను చిన్నబుచ్చడానికి, తక్కువ చేయడానికి ప్రయత్నించడం కొంత తగ్గింది. భర్త, పిల్లలతో ఎక్కువ అనుబంధం కోసం ఆరాట పడకుండా, ఆధారపడకుండా ఉండాలని, స్వయంగా జీవించడం అవసరం అని గ్రహించాను.

          ఎదుటి వాళ్ళు చెప్పేది పట్టించుకోకపోతే ఏమైనా అనుకుంటారేమోననే సంశ యాన్ని వదిలేశా. ఎవరు చెప్పినా వింటున్నా కానీ గుడ్డిగా అనుసరించకుండా నా అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నా. 

          వారు చెప్పింది నచ్చితే గ్రహిస్తూ… లేకుంటే మర్చిపోతున్నా. ఏది మంచిదో, ఏది కాదో గుర్తించి మంచిని తీసుకుని చెడుని వదిలేస్తున్నా. అది నా మనసుకు సుఖంగా ఉంటే, నా ఇంట్లో వాళ్ళకు కష్టంగా ఉంది. 

          ఇన్నాళ్లు “తాన” అంటే “తందాన” అనే ఈ మనిషి ఇట్లా మారిపోయిందేమిటని ఓ పజిల్ లా చూస్తున్నారు. నన్ను పాత పద్ధతిలో మార్చడానికి ప్రయత్నించి విఫల మయ్యారు. ఇప్పుడిప్పుడే నన్ను నాలాగా చూడటానికి అలవాటు పడుతున్నారు.

          నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాక నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇతరులతో సంబంధాలకు విలువ ఇవ్వడంలో, అర్థం చేసుకోవడంలో పొరపాట్లు రాకుండా చూసుకోవడం వల్ల బంధాలు మరింత బలపడ్డాయని నాకనిపించింది. గతంలో కన్నా ఇప్పుడే ఇతరులతో బంధాలు బలంగా పెరుగుతున్నాయి. నా నిర్ణయాలు నేను తీసుకుంటున్నాను.

          బతుకంతా బాధగా… కలలోని గాధగా… కన్నీటి ధారగా బతికిన నేను నా బతుకును ప్రేమిస్తున్నాను. నన్ను నేను నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. నలుగురిలో కలవడానికి హృదయ లోతుల్లో చిక్కిపోయిన భావాల్ని పైకి తోడి పంచడానికి ప్రయత్నం చేస్తున్నా.

***

          అదేంటో నాకు భాష అందడం లేదు. పదాలు దొరకడం లేదు. నా  గొంతుకలోంచి సీతాకోకచిలుకలు ఎగిరిపోతున్నాయా? ఏదో తేడా వస్తున్నదని గమనించి ఒంటరిగానే వైద్య సహాయం కోసం వెళ్ళినప్పుడు తెలిసింది వ్యాధి ఏంటో.  ఆ వ్యాధి విచిత్రమైన  పురుగులా నా మెదడును కొరుక్కు తింటోంది. అది నక్షత్రాల దుమ్ముతో అల్లిన పురుగు. జ్ఞాపకం దారాలను విడదీస్తోంది. వైద్యం లేని జబ్బు. పెరిగేదే కానీ తరిగేది కాదని తెలిశాక నాలో నేను ఉండిపోయా. తీవ్రమైన కుంగుబాటుకు లోనయ్యా. ఆ జబ్బుతో జీవితం ఒక ప్రయాణం అని అప్పుడు నాకు తెలియదు. 
 
          ఇంట్లో వాళ్ళు నా మాటలు నమ్మలేదు. నేనేదో వారి దృష్టిని ఆకర్షించడానికి అలా చెప్పానని, నా మాటలు గాలిలో పూసే అగ్గిపువ్వులని ఒక అనుమానపు నవ్వు నవ్వారు. డాక్టర్ రాసిన మందులు చూశాక మరో వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ కూడా వ్యాధి నిర్ధారించారు. బంధుమిత్రులెవరికీ ఈ విషయం చెప్పొద్దని పిల్లలు, పెద్దలు హుకుం జారీ చేశారు. ఆ హుకుం నా చుట్టూ ఒక గోడలా పెరిగింది. 

          నా వ్యాధి గురించి బాధ కంటే, విషయం తెలిస్తే బంధుమిత్రులు మా కుటుంబాన్ని ఎలా చూస్తారో, పిల్లల పెళ్లిళ్లకు ఇబ్బంది అవుతుందేమో అనే రకరకాల శంకలు మా వాళ్ళలో పాదుకున్నాయి. అందుకే ఆ ఫర్మానా. నేను ఎంత వాస్తవమో నాకున్న జబ్బు కూడా అంతే వాస్తవం. అది నా వెంటబడి, నా నీడలా, నాలోని ప్రతి అణువులో నివసిస్తోంది. దాన్ని నేనెందుకు దాచి పెట్టాలి? ఈ ప్రశ్న నా పెదవులపై ఒక బుడగలా తేలింది, రంగుల ఇంద్రధనస్సులా మెరిసి, ఆకాశంలోకి ఎగిరిపోయింది. అది అర్థం చేసుకోకుండా ‘ఇంటి గుట్టు రోగం గుట్టు ఉండాల నేది’ మా ఆయన నినాదం. హ్హా… హ్హా… గుట్టుగా ఉండడం వల్ల, ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉండటం వల్ల ఇబ్బంది పడేది, వత్తిడికి గురయ్యేది నేనే, మరింత దిగజారేది నా ఆరోగ్యమే అని నాకిప్పుడు తెలుసు. 

          ఒకప్పుడు చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకుని కూర్చునే మొగుణ్ణి, కూతుళ్ళను చాలా సార్లు తిట్టుకున్న నేను, ఇప్పుడు దాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. నాకున్న జబ్బు గురించి గూగులమ్మ నడిగి చాలా విషయాలు తెలుసుకున్నా. ఆ స్క్రీన్ లోంచి వేలమంది నా లాంటి వాళ్ళు నా వైపు చూసి నవ్వారు. వ్యాధి నిర్ధారణ అయిన నాలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. కానీ మనం గమనించం. తెలిస్తే సమాజం వారిని తమలో కలుపుకోదనే భయంతో కుటుంబం వారిని నాలుగు గోడలకే పరిమితం చేస్తుంది. ఫలితంగా కుంగుబాటుకు లోనైన వారిలో వ్యాధి మరింత త్వరగా ముదురుతుంది, అశక్తులుగా మారుస్తుంది. కాస్తో కూస్తో చదువుకున్నా కాబట్టి గూగుల్‌లో గాలించి నాలాంటి వ్యక్తుల గ్రూప్ ఒకటి పట్టుకోగలిగా. అది నాకెంతో ఉపకరించింది. వారితో మాట్లాడటం నేను కుంగుబాటు నుంచి బయటపడటానికి కొంత దోహదం చేసింది. వాళ్ళ మాటల ద్వారా సంబంధిత కొన్ని విషయాలు గ్రహించా. 

          మొదటిది నేను ఒంటరిగా లేనని, ఆ భావన నాకెంతో ఊరటనిచ్చింది. మేము ఒక నక్షత్రాల గుంపులా, ఒకరికొకరం మెరుస్తున్నాం. రెండోది జీవితం ఇంకా చాలా దూరం ఉందని నేను చేయ గలిగింది చేయడానికి కావలసిన సమయం ఉందనే ఊరట, జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉన్నప్పటికీ ఏదైనా చేయగలననే నమ్మకం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది, జీవితం పట్ల నాకో దృక్పథాన్నిచ్చింది. మీరు చెప్పండి. నేనేం తప్పు చేశానని నా వ్యాధి గురించి చెప్పకూడదు? నాకు నేనుగా టముకు వేసి చెప్పను కానీ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను. నాకు చిత్తవైకల్యం వచ్చిందని నేనేమీ కుమిలిపోవట్లేదు. 

          అవును, రాకూడని జబ్బు వచ్చింది. వచ్చిన దాన్ని నేను తీసివేయలేను కానీ దాన్ని ఎదుర్కో   గలను కదా… అయితే అది ఎలా అని ఆలోచిస్తున్నాను. మా చిన్నమ్మాయి చెప్పినట్లు పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాను. అందుకే నా కుటుంబ సభ్యులతో ‘ఇదేమీ అంటువ్యాధి కాదు. కుటుంబ సభ్యులు గా నన్ను అర్థం చేసుకోండి. నాకు చిత్తవైకల్యం ఉండవచ్చు కానీ నేను మనిషినే’ అని చెబుతు న్నాను. ఈ మాటలు నా నోటి వెంట రావడం లేదు, నా ఆత్మలోంచి పక్షుల్లా ఎగిరిపోతున్నాయి.
ఇప్పుడున్న మతిమరుపు, భాషా సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలే కాకుండా భవిష్యత్తులో నా పరిస్థితి మారొచ్చు. ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉంటానేమో, పాత విషయాలు మర్చి పోవడం లేదా వర్తమానాన్ని మర్చిపోవడం, బంధువుల్ని చివరికి కళ్ళ ఎదుట కనిపించే భర్త, కన్న కూతుళ్ళను కూడా గుర్తించలేకపోవడం వంటి ఇబ్బందులు ఉండొచ్చు. సమయం గడిచే కొద్దీ కొత్తగా ఉన్మాదం, భ్రమలు వంటి లక్షణాలు రావచ్చు. ఇల్లు వదిలి వెళ్లిపోతుండొచ్చు, ఆ ఇంటి గోడలు నన్ను పిలిచి, నాతో పాటలు పాడవచ్చు. కంటికి ఒకటి రెండుగా కనిపించవచ్చు, అప్పుడు నా కళ్ళు అద్దాల్లా మారి, నా వెనుక దాగున్న లోకాలను చూపించవచ్చు. అప్పటి నా మనసు ఎలా మాయ చేస్తుందో, నేనెలా ప్రవర్తిస్తానో చెప్పలేను. చివరికి నా పనులు నేను చేసుకోలేని అశక్తురాలిని కావచ్చు. పూర్తిగా ఇతరు లపై ఆధారపడే స్థితిలోకి దిగజారిపోవచ్చు. నా శరీరం ఒక పాత పుస్తకంలా మారి, దాని పేజీలు నెమ్మదిగా కరిగిపోవచ్చు. 

          క్రమేణా అభివృద్ధి చెందే నా ఆరోగ్య పరిస్థితి ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళను ఇబ్బంది పెట్టొచ్చు. అసలు నన్ను చూసుకోవడమే పెద్ద సవాల్‌గా మారిపోవచ్చు. నిరంతరం పర్యవేక్షణ అవసరం రావచ్చు, అదొక కనిపించని కాపలాదారుని నీడలా నా వెంటే ఉండవచ్చు. చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి అనేక రకాల ప్రశ్నలు ఎదుర్కోవలసి రావచ్చు. నేనే కాదు, ఎవరూ పరిస్థితి ఎలా ఉంటుందో లేదా ఇలాగే ఉంటుందని చెప్పలేరు, కానీ నన్ను చూసి పిచ్చిది అని ముద్ర వేయకుండా కరుణ, సానుభూతితో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అని తెలుసుకోండి’ అని చెబుతున్నాను. 
చిత్తవైకల్యం నిర్ధారణ తర్వాత కూడా జీవితం ఉందని  నా మెదడుతో ఒక దూత గుసగుస లాడింది. స్తబ్దుగా ఉండడం కంటే చురుకైన జీవితం మంచిదని, నిన్ను నీవు నిరూపించుకో అని చెప్పింది. నిన్ను అర్థం చేసుకునే సహాయం చేసే స్నేహ బృందాలున్నాయి. వాళ్ళు నీ పట్ల చూపే అభిమానం, శ్రద్ధ నిన్ను ముందుకు నడిపే ఇంధనంలా పని చేస్తాయని కూడా చెప్పింది.  నాకో కొత్త శక్తినిచ్చింది. 
మీ కంటే భిన్నమైన మానసిక స్థితిలో ఉన్న వ్యక్తిగా నాలాంటి వ్యక్తులు స్వతంత్రంగా బతకడానికి నేను సహాయం చేయాలనుకుంటున్నాను. నేను నా కథను ప్రజలకు అవగాహన కలిగించే సాధనంగా ఉపయోగించాలనుకున్నాను. 

          చిత్తవైకల్యం వృద్ధులను ప్రభావితం చేసే పరిస్థితి మాత్రమే కాదని, మధ్య వయస్సులోకి వస్తున్న నాలాంటి వారి పరిస్థితి కూడా అని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా.  వ్యాధి చిహ్నాలు కనపడుతుంటే హేళన చేయకుండా సానుభూతితో అర్థం చేసుకోమ్మని వేడుకుంటున్నా. నా మాటలు గాలిలో కలిసిపోయి, ప్రతి ఇంటి తలుపునూ తట్టాలని కోరుకుంటున్నా. నా సమయం పరిమితం కావచ్చు. కానీ ఉన్న సమయం నాదేగా. అది నా అరచేతిలో ఒక రంగుల సీతాకోక చిలుకలా ఉంది. ఉన్నంతలో చేయగలిగినంత చేయాలని నా సంకల్పం. ప్రశాంతంగా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతూ, సంగీతం వింటూ నన్ను నేను రీఛార్జ్ చేసుకుంటున్నా. “దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి” అంటారు కదా… అలాగే నేను చేయగలిగినప్పుడే నేను చేయాలనుకున్న వన్నీ చేసేయాలని నా ఆరాటం. 

          “ఆయుష్షు మూడితే ఏ బొక్కలో దాక్కున్నా రాక మానుతుందా” అనేది మా నాయనమ్మ. అదెంత నిజమో తెలియదు కానీ మీకు చిత్తవైకల్యం లక్షణాలు ఏమైనా ఉంటే ముందు వెళ్లి వైద్య సహాయం పొందండి. తద్వారా మీరు మీ జీవితాన్ని మీరు నాణ్యంగా కొనసాగించవచ్చు. మీరు  చెప్పండి, నేను ఎప్పటికీ నేనే కదా! నాలా చిత్త వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తుల్ని మీరు చాలా మందిని కలిసి ఉండొచ్చు లేదా అసలు చూసి ఉండకపోవచ్చు. కానీ, మీరు ఎప్పటిలాగే మాతో వ్యవహరించండి. మీరు మాట్లాడేటప్పుడు మా వైపు చూడండి. మా పట్ల జాలి చూపకండి. కుటుంబంలో భాగంగా ఉండడానికి మాకు సమయం ఇవ్వండి. సహనం గా ఉండండి. మాకు ఇష్టం లేకుండా బలవంతంగా ఏ పని చేయించడానికి ప్రయత్నించకండి. అది మా లో మానసిక కల్లోలానికి, అస్థిర ప్రవర్తనకు దారి తీసే అవకాశం ఉందని మర్చిపోకండి. 

          ఈ క్రమంలో మీరు కొంత కోల్పోవచ్చు. కొన్ని త్యాగాలు చేయాల్సి రావచ్చు. మా మనసు పొరల్లో కల్లోలం ఏమైనప్పటికీ మేము ఇప్పటికీ అదే వ్యక్తులం కాబట్టి మాతో యథావిధిగా ఉండటానికి ప్రయత్నించండి. మేము మేమే అని గుర్తించండి. మాలోని అదృశ్య వంతెనలను మీరు అర్థం చేసుకోగలరా?

ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోరూ…?

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.