ఐనా..నేను ఓడిపోలేదు

 (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– బి.కళాగోపాల్

నీ మనోవాంఛలు తీర్చుకోవడానికి నన్నో దేవిని చేసి పూజించావు/
నీ దైహికవాంఛలు తీర్చుకోవడానికి నన్నో వేశ్యను చేసి రమించావు/
శిరోముండనాలు, సతీసహగమనాలు, అలనాటి సనాతన సాంప్రదాయమన్నావు/
గడపదాటని కట్టడి బతుకుల గానుగెద్దు చాకిరీలు/
నోరువిప్పనీయని కంటిచూపుల శాసనాలు/
ఒకప్పటి పురాతన ధర్మమన్నావు/
మరి నేటి యుగధర్మమేమి బోధిస్తుంది అనాది పురుషా?!/
అలాగా తల్లులపై అత్యాచారం మినహా /
అంటుడు ముట్టుడు అన్నింటికి అంటున్న వృద్ధ భారతంలో /
నగ్నభారతుల ఊరేగింపులు పతాకశీర్షికలో చోటు దొరక్క/
దారిపక్క అనాథశవాలై కుళ్లికంపుకొడుతున్నాయి/
పీతిగుడ్డలు, అలుకుబట్టలు, వంటింటి మసిపేలికల నడుమ నలిగిపోతున్న/
మా శరీరావయవాల గోడును నాలుగు మాటల్లో లిఖించుకుంటుంటే /
ముట్ల కవిత్వమని, నీలికవిత్వమని అభియోగాల్ని మోపే నీవు../
ఇక మారవని తెల్సిపోయింది/
పాలిచ్చి పెంచిన జననినని పదేపదే అరిగిపోయిన విశేషణాన్ని /
ఎన్ని మార్లని గుర్తు చేసినా నువ్వు గుర్తించవని సృష్టమై పోయింది/
నెత్తి మీద ఆకాశం ఎటో పారిపోకముందే సమభాగస్వామినని /
లక్షసార్లు చెబుతున్నా అర్ధం చేసుకోవని రుజువైపోయింది/
నా విజయం వెనుక నువ్వెప్పుడన్నా కనబడతావోనన్న /
దింపుడు కళ్ళెం ఆశా అడుగంటి పోయాక /
ఇంకెందుకీ క్షమయా ధరిత్రీ ట్యాగ్ లైన్లు?/
ఇంకెందుకాయనకు చెప్పాలన్న ఆబ్లిగేషన్లు ?/
ఇంకెందుకీ ఏడ్పించేవాని కోసం ఏడవాలన్న కండీషన్లు ?/
ఇంటా బయటా సాగుతున్న హింసతో పెరుగుతున్న ధరల మోతతో /
బతకడమే సవాలైన నా జీవితాన్ని ఒక *బ్లాక్ హ్యూమర్ పారడాక్స్ అని గేలిచేసే నీ పురుషాహంకారానికెపుడూ/
ఆఫీసులోనూ ఇంటిలోనూ లోపాలను వెతికే *క్వీన్ బి సిండ్రోమ్ కండ్ల మస్కలే కదా!/
జీవించడానికి నాకంటూ ఓ నమూనా లేకుండా ఆజమాయిషీల చేతికర్రతో/
నువ్వెన్ని అడ్డుగోడలు కడుతున్నా నేను ఓడిపోలేదు/
మొండి గోడల్ని బద్దలు గొట్టి మరీ నే అంకురిస్తూనే ఉంటాను/
నేనంటే అలనాటి పాతివ్రత్యపు మంత్రదండంతో నిద్రను నటించే ఊర్మిళను కానని /
నేనంటే అనేక స్త్రీల సమాహారాన్నని /
నువ్వు నిర్మించిన కంచెలను దాటుకొని మాదైన షీరోస్ రాజ్యంలో /
శ్రమా నాదే పరిశ్రమా నాదేనంటూ చేతిలో పట్టాతో గుండెల్లో పట్టుదలతో/
హింస నుండి దోపిడీ నుండి భద్రంగా గౌరవంగా జీవించే హక్కుకై /
పోరాడుతున్న హక్కుల స్వరాన్ని/
ఇల్లలుకుతూ పేరు మర్చిపోయిన ఈగ బతుకుకు ఫుల్ స్టాప్ పెట్టేస్తూ/
మా నేమ్ ప్లేట్ తో నున్న కొత్త ఇంటి చిరునామాలో/
పూడుకుపోయిన గొంతులకు ప్రశ్నించడం నేర్పించి/
తిరగబడటం అలవాటు చేసాక /
పెను సవాళ్ళూ తలవంచాల్సిందే ఘనవిజయాలు వరించాల్సిందే/
“నీ సెల్ఫ్ కేర్ నీలుగుడేంటని?” అడిగావు కాబట్టి విను/
మా తలలకు చుట్టిన రుబ్బురోలు సాంప్రదాయాలను దించుకొని /
నలిగిన ఆకాశంలో ఇప్పుడిప్పుడే నెగ్గడం నేర్చి/
ఈమాత్రం సెల్ఫ్ కేర్ లగ్జరీకి అసలుసిసలైన/
ఆధునిక ప్రమీలా వారసులం కాబట్టి నువ్వు వినాల్సిందే..!/
******************************************
*బ్లాక్ హ్యూమర్=వేదనా/విషాద హాస్యం
*క్వీన్ బి సిండ్రోమ్=మహిళలు సూచించింది ఎందుకు చెయ్యాలి లేదా వారి పనిలో లోపాలను వెతికి చులకన చేయడం
******************************************

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.