
నేల మీద నడక
– నర్సింహా రెడ్డి పట్లూరి
నేల నిండా పరుచుకున్న
దారులు కాదని..
ఆకాశంలో లేని గీతల్ని
ఊహించుకొని మరీ..!
దేని కోసం దేన్ని కోల్పోతామో
కోల్పోతే గాని అర్థం కాదు.
అన్ని సార్లు దిద్దుబాటు ముగ్గు
చెల్లుబాటు అవ్వదు.
ప్రయాణానికి ప్రాణం వేగం.
కక్ష్య దాటితే వేగం
ప్రమాదాన్ని కౌగిలించుకుంటుంది.
ఒకవైపు గాయాల పాలవుతూనే
మరో వైపు దిగ్బంధం.
నాణానికి రెండు వైపులా శూన్యం
రంగురంగులుగా ఆవహిస్తుంది.
దిగ్మండలం ఒక అద్భుతమైన
కాంతుల భ్రాంతి.
కాళ్ళని కోసి తయారుచేసిన రెక్కలు
చేతులతో గొడవపడతాయ్.
దేని కోసం దేన్ని కోల్పోతామో
కోల్పోతే గానీ అర్థం కాదు..!
బ్రష్ చేసిన గాయాలను దాచిపెట్టి
స్పెక్ట్రం రంగుల్లా నవ్వే గోడల కన్నా
నాచు పెరిగిన గోడలే మక్కువ.
*****
Please follow and like us:

పట్లూరి నర్సింహా రెడ్డి మనూర్ , సంగారెడ్డి వాస్తవ్యులు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో పి.జి. పూర్తి చేశాను.
“జత” అనే పుస్తకం 2021లో అచ్చయింది.
