
వ్యాధితో పోరాటం-36
–కనకదుర్గ
బయట హాల్వేలో రోజులో మూడు నాలుగుసార్లు నడిచేదాన్ని. ఇవాళ రమ్య వచ్చిరాత్రి పడుకునే ఆఖరి రోజు. ఇంకా ఎపుడు డిశ్చార్జ్ చేస్తారో ఇప్పటిదాక చెప్పలేదు. ఈ రోజు చెబ్తారేమోనని ఎదురు చూస్తున్నాము. రేపు ఎలాగ? నాకు కొంచెం ధైర్యం వస్తుందనుకున్నాను కానీ సర్జరీ వల్ల ఒంట్లో శక్తి, మానసికంగా ఉండే శక్తి రెండూ పోయాయి నాకు. వాళ్ళు నొప్పికి ఇచ్చే మందు నేను హాస్పిటల్స్ లో ఉన్నన్ని రోజులు ఇస్తూనే వున్నారు. అది ఇస్తేనే నొప్పి కొంచెం తగ్గుముఖంపట్టి, కాస్త నిద్ర పడుతుంది. మరి ఇంటికి వెళితే ఇవి ఇస్తారా? ఇంజెక్షన్ కాకున్నా ఏవన్నా కొన్ని రోజులకైనా టాబ్లెట్స్ ఇస్తే బాగుంటుందేమో! ఏమి ఇవ్వకుండా, సడన్గా డెమొరాల్ ఇంజెక్షన్ మానేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నొప్పి ఎక్కువవ్వడం, వాంతులవ్వడం, నిద్ర పట్టకపోవడం లాంటివి. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇంటికి వెళ్ళాలంటే భయమేస్తుంది. కానీ పిల్లల్ని చూడకుండా ఉండాలంటే కష్టంగా ఉంది.
శ్రీని చైతన్యని ఒకటి రెండు సార్లు కొద్దిసేపటికోసం తీసుకొచ్చాడు. సర్జరీ వార్డులో చంటి పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు ఏడిస్తే అక్కడి పేషంట్స్ కి ఇబ్బందవుతుందని వద్దంటారు. పాపకి రెండునెలలు నిండి మూడు నెలలొచ్చాయి. సర్జరీ రోజు చూసిందే. సర్జన్ వచ్చి చూసి ఎల్లుండి వెళ్ళిపోవచ్చని చెప్పింది. హమ్మయ్య! పర్వాలేదు, ఒకటే రోజుండాలి. రేపొక్కరోజు ఎలాగోలా ఉంటే చాలు, ఇంటికెళ్ళి పోవచ్చనుకున్నాను.
రమ్య వచ్చింది రాత్రి పడుకోవడానికి. “రేపు ఎవరన్నా వస్తున్నారండి పడుకోవడానికి?” అడిగింది రమ్య.
“ఎవరొస్తారు రమ్య. మా వాళ్ళెవ్వరూ లేరిక్కడ. వున్న ఫ్రెండ్స్ అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారు నీకు తెల్సు కదా!” అన్నాను.
“సారీ అండీ మేము ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాము, సురేష్ వాళ్ళింట్లో పెళ్ళి తప్పకుండా వెళ్ళాలి.”
” అయ్యో పర్వాలేదు రమ్య. ఇన్ని రోజులొచ్చారు అదే చాలు. మీరు చేసిన ఈ సాయం ఎప్పటికీ మర్చిపోలేం. మళ్ళీ జూలియానే అడిగి చూస్తాను.” అన్నాను. అడగలేనని తెల్సు. తను ఉద్యోగం చేస్తుంది, ఇపుడింక రావడానికి కుదరదనుకుంటాను.
రమ్య కాసేపు ఇండియా సంగతులు, పెళ్ళి కబుర్లు చెప్పి పడుకుంది. రమ్య పొద్దున్నే లేచి వెళ్ళిపోయింది. నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను.
ఆ రోజు శనివారం, శ్రీని మధ్యాహ్నం వచ్చి రాత్రి దాక వుండి వెళ్తానన్నాడు. నేను ఇపుడే రావొద్దన్నాను. రాత్రి నేనొక్కదాన్ని ఉండలేను నువ్వొచ్చి వుండు, పిల్లల్ని జోన్ దగ్గర వదిలిపెట్టి రమ్మన్నాను. నా మీద నాకే కోపంగా వుంది, శ్రీనిని అంతగా విసిగిస్తున్నందుకు, కానీ ఎందుకో తెలియదు కానీ, నా భయం నను వీడటం లేదు, రాత్రవుతుందంటే ఎక్కడలేని భయంతో కూడిన వణుకు పుట్టుకొస్తుంది. ఏం చేయను. ఈ ఒక్కరోజు ఎలాగో గడిపేద్దామనుకున్నాను. కానీ నా వల్ల కావటం లేదు. శ్రీని ఫోన్ చేసి జోన్ పిల్లల్ని తీసుకుని భర్త దగ్గరకి వెళ్తుందట, చాలా రోజులయ్యిందని పిల్లలు గోల పెడ్తున్నారట, అని చెప్పాడు.
పోనీ జూలియా వస్తుందేమో అడగమన్నాను. ’నువ్వే అడగొచ్చు కదా!’ అన్నాడు. ’ముందంతా నేనే అడిగాను, ఈ ఒక్కసారికి నువ్వడగొచ్చు కదా!’ అని నేనన్నాను. శ్రీని ఏం మాట్లాడలేదు.
నాకర్ధమైపోయింది తనకి అడగడం ఇష్టం లేదని. నాకొక ఐడియా వచ్చింది.
శ్రీనికి ఫోన్ చేసి,”జూలియా, పాల్ ని పిల్లల్ని ఈ ఒక్క రాత్రికి ఉంచుకోమని అడిగితే, వాళ్ళొప్పుకుంటే నువ్వొస్తావా?’ అని అడిగాను.
“సరే వస్తాను. కానీ కొత్త వాళ్ళ దగ్గర పాప ఉంటుందంటావా? ఏడుస్తుందేమో ఆలోచించు!” అన్నాడు.
” నువ్వే చెప్పావు కదా! రాత్రిళ్ళు కదలకుండా పడుకుంటుందని. ప్రయత్నం చేద్దాం, నువ్వు కాసేపు దానికి కనపడకుండా వాళిద్దరి దగ్గర వుంచి చూడు. చాలా ఏడిస్తే జూలియాని బ్రతిమాలి ఈ ఒక్కరోజుకి పంపించు. పాప ఏడవకుండా వుంటే నువ్వే రా!” అన్నాను.
“సరే చూద్దాం.” అన్నాడు శ్రీని.
జూలియాకి ఫోన్ చేసి పిల్లల్ని ఈ ఒక్క రాత్రికి ఉంచుకుంటారా అని అడిగితే, “ష్యూర్ వై నాట్?” అన్నది. పాప ఏడిస్తే తను వస్తుందా అని నేనడగలేదు ఎందుకంటే పాప పడుకుంటుందనే నమ్మకం నాకుంది. శ్రీని సాయంత్రం వంట చేసి చైతన్యకి పెట్టి తను తినేసి, పాపకి పాలు త్రాగించి తనకు కావాల్సిన సామానంతా ప్యాక్ చేసి సాయంత్రం ఏడున్నర గంటలకి వాళ్ళింటికి తీసుకెళ్ళి తను ఎనిమిదింటి వరకు ఉండి, పాప వాళ్ళ దగ్గర బాగానే ఉందని ఎనిమిదింబావుకి బయల్దేరి తొమ్మిదింటికల్లా హాస్పిటల్ కి వచ్చాడు. కొంచెం చిరాగ్గా అనిపించాడు.
” కోపమొచ్చిందా?”
” వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనెట్లా వచ్చేవాడిని?”
“నాకు తెల్సు. నా వైపునుండి కూడా ఆలోచించు ఒకసారి. ఎన్నిరోజుల నుండి ఒక్కదాన్నే ఉంటున్నాను. సర్జరీ తర్వాత అస్సలు ఒక్కదాన్ని ఉండలేకపోతున్నానని చెబుతూనే ఉన్నాను కదా! నాకు తెలియదు. మా అమ్మకి ఆపరేషన్ అయితే మా చిన్నత్త వాళ్ళ తల్లి అమ్మ దగ్గరే పడుకునేది. అక్కడ కుటుంబ సభ్యులుంటారు కాబట్టి పెద్ద సమస్య కాదు.
సారీ నీకు ఇబ్బంది కలిగిస్తే నేను ఇప్పటివరకు నేనేమన్నా అడిగానా హాస్పిటల్లో చేరినప్పటి నుండి? ఎప్పటికప్పుడు నీకు, పిల్లలకు ఇబ్బంది కాకూడదనే ఆలోచిస్తూ వచ్చాను.” గొంతు గద్గదమయ్యింది.
“ఇప్పుడు నేనేమి అనలేదులే, ఎందుకంత బాధ పడ్తావు? ఒక్కరాత్రి అయిపోతే ఇంటికెళ్ళొచ్చు. పిల్లలిద్దరూ ఎంత సంతోషపడ్తారో?” అన్నాడు శ్రీని మంచం పై నా కాళ్ళ దగ్గర కూర్చుంటూ.
“నాకయితే మొదటి రెండ్రోజులు ఇందులోనుండి బయట పడ్తాననుకోలేదు. ఇప్పటిదాక పిల్లల్ని నేనీ ప్రపంచంలోకి తీసుకొచ్చాను, వారి పెంపకంలో కూడా నేను పాలుపంచుకోవాలి అని నాకు నేనే చెప్పుకుంటూ వచ్చాను. నర్సులు, డాక్టర్లు, నా విల్ పవర్ బాగుంది అదే నన్ను బయటికి తీసుకొస్తుందన్నారు. మా అమ్మ, నాన్న,మామయ్య లాంటి వాళ్ళు భగవంతుడు కాపాడతాడని, శ్లోకాలు చదువుకోమని, ఇక్కడ క్రిస్టియన్ మతంవారు ఆ ఏసుని నమ్ముకోమని అంతా బాగవుతుందని అన్నారు. కానీ నాకు మాత్రం పిల్లల పైనే ఆలోచనంతా! ఇప్పటికైనా ఇది తగ్గిపోయి మళ్ళీ హాస్పిటల్ మొహం చూడాల్సిన అవసరం రాకూడదు.” అన్నాను.
“ఇదే ఆఖరి హాస్పిటలైజేషన్ కావాలి,”అన్నాడు శ్రీని. చాలా రోజుల తర్వాత ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం. ఫోన్ చేసి ఒకసారి చైతన్యతో మాట్లాడాము. వాడికి చాలా సంతోషంగా ఉంది.
పాప పాలు తాగుతుంది, నిద్రపోయేలా ఉందని అన్నది జూలియా. ’ఏ గొడవ లేదు మీరు రిలాక్స్ గా రండి డిశ్చార్జ్ చేసాక,’ అని పాల్ చెప్పాడు. శ్రీని టీ.విలో ఏదో సినిమా పెడితే అది చూస్తూనే నేను నిద్రపోయాను. కాళ్ళు లాగినపుడు విజయ్ నర్స్ ని పిలిస్తే వచ్చి తీసుకువెళ్ళాడు.
“పొద్దున్న ఇంటికి వెళుతున్నారట! మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సర్జరీ అయిపోయింది, ఈ జబ్బు కూడా తగ్గిపోతుంది, ఆరోగ్యంగా అయిపోతారు. మీరెప్పటికీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను,” అన్నాడు విజయ్ నర్స్.
” ఇప్పుడే బాయ్ చెప్పేస్తున్నావు, పొద్దున కనిపించవా?”
“వస్తాను, బాయ్ చెప్పడానికి, కానీ అపుడు హడావిడిగా ఉంటుంది కదా! అందుకే ఇపుడే నా మనసులో మాట చెబ్తున్నాను.” అని నన్ను బెడ్లో పడుకోబెట్టి ఐ.వీ, యాంటిబయాటిక్స్ వైర్లు తీసినవి అన్నీ ప్లగ్ చేసి వెళ్ళాడు.
సర్జన్ వచ్చి చూసి అన్ని ట్యూబ్స్ తీసేయమని చెప్పింది, సర్జరీ జరిగిన దగ్గర సరిగ్గా మానుతుందా, లేదా అని చూసింది. “అంతా బాగుంది, సరిగ్గా హీల్ అవుతుంది. లెట్స్ హోప్ ఎవ్విరీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్రైట్…..”
“ఇది హీల్ అవ్వడానికి ఎంత సమయం పడ్తుంది? ఇక ఈ భయంకరమైన పేయిన్ రాదు కదా?” అని ఎంతో ఆశగా అడిగాను. శ్రీని కూడా ఎంతో ఆత్రంగా ఆమె ఏం చెప్తుందా అని వినడానికి రెడీగా నిలబడ్డాడు.
“లెట్స్ సీ హౌ ఇట్ గోస్ డియర్….వెల్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ క్యూట్ బేబి అండ్ డూ యు హావ్ ఏ సన్ టూ? హౌ ఓల్డ్ ఈజ్ హీ?” అని అడిగింది.
శ్రీని ఫోటోలు తీసి చూపించాడు.
“వావ్…లుక్ ఎట్ హిజ్ బిగ్ ఐస్ అండ్ క్యూట్ డింపుల్స్! యు హావ్ లవ్లీ కిడ్స్ మిస్టర్ అండ్ మిసెస్ డింగరి. మై బెస్ట్ విషెస్ టు యువర్ ఫ్యామిలీ. మూడు వారాల తర్వాత మా ఆఫీస్ కి వచ్చి కలవండి. ఎంతవరకు హీల్ అయ్యిందో చూడొచ్చు. ఓకే సీ యూ ఇన్ త్రీ వీక్స్. భాయ్!” అని చెప్పేసి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిపోయాక గుర్తొచ్చింది నేనడిగిన ప్రశ్నకి ( “ఇక ఈ భయంకరమైన పేయిన్ రాదు కదా?” ) జవాబు ఇవ్వకుండానే వెళ్ళింది. ఎందుకు ఎప్పుడు అడిగినా దాటేస్తుంది?
ఇంకా ఏదైనా సమస్య మిగిలిపోయిందా? జవాబు చెప్పడానికి ఎందుకంత సందేహిస్తుంది? నాకు బుర్రలో ఇదే ప్రశ్న చాలా సేపు తిరిగింది. కానీ ఇంటికి వెళ్తామనే ఆలోచన వచ్చేవరకు నాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. శ్రీని నా వస్తువులు, స్వెట్టర్లు, హాస్పిటల్లో చేరినప్పట్నుండి ఒకొక్కటి కాస్తా చాలానే అయ్యాయి. కొద్దిగా బాగున్నపుడు బుక్స్ చదువుకోవచ్చని తెచ్చిన పుస్తకాలు, తెలుగువి, ఇంగ్లీష్ వి ఉన్నాయి. ఇవి అన్నీ సర్ధిపెడుతున్నాడు. నర్సులు వచ్చి మెల్లి మెల్లిగా ఒకొక్కటి ట్యూబ్లు, ఐ.వి కనెక్షన్లు పీకేసారు. కానీ ఒక్కటి మాత్రం వుంచారు, టి.పి.ఎన్, న్యూట్రిషన్ వెళ్ళడానికి పెట్టిన పోర్ట్ మాత్రం ఉంచారు. రూం కర్టెన్ వేసేసి శ్రీని సాయం చేస్తుంటే నా బట్టలేసుకున్నాను. కార్లో కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి లూజ్ గా వుండే బట్టలు తెచ్చాడు. అవి వేసుకున్నాను. రెండు నెలల తర్వాత నా బట్టలు వేసుకున్నాను. అసలు ఈ నరకకూపంలా అనిపించిన ఈ హాస్పిటల్ నుండి ప్రాణాలతో బయట పడ్తానో లేదో అనుకున్న నేను ఇపుడు ప్రాణాలతో మా ఇంటికి పిల్లలను చూడడానికి వెళ్తున్నానంటే ఇక్కడి డాక్టర్లకు, సర్జన్ లకు, నర్సులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకోవాలి. ఈ రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తుంటే, మనసు ఎదో తెలియని భావోద్వేగానికి లోనయ్యింది. నాకు తెలియకుండానే కన్నీళ్ళు కారసాగాయి.
“ఇపుడెందుకు బాధ పడ్తావ్ చిన్నీ? అంతా అయిపోయింది, నువ్వు బాగా కోలుకోవాలి అంతే, నువ్వు మళ్ళీ నార్మల్ లైఫ్ మొదలు పెట్టొచ్చు. ప్రస్తుతమైతే పిల్లలు ఎదురు చూస్తుంటారు పద!”
నర్స్ వచ్చి డిశ్చార్జ్ సూచనలన్నీ ఇచ్చింది. “బరువులు ఎత్తొద్దు, మెల్లి మెల్లిగా నడవడం, చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. మీరు మూడువారాల తర్వాత వచ్చినపుడు ఏమైనా మార్పులు చేయాల్సివస్తే చేస్తారు సర్జన్.” అని చెప్పింది.
నర్సులు నేను వెళ్తున్నానని లోపలికి వచ్చి “ఆల్ ది బెస్ట్, బై, గెట్ వెల్ సూన్, టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్,” అని చెప్పి వెళ్తున్నారు.
“ఓకే దుర్గాజీ! హమ్ చల్తే హై! ఆప్కే హెల్త్ కా ఖయాల్ రకియేగా, మై ఆప్కే హెల్త్ కే లియే మై భగవాన్ సే ప్రార్ధన కరూంగా! సబ్ టీక్ హో జాయేగా, ఆప్ జ్యాదా సోంచ్నా నహీ! సబ్ అచ్చా సోంచే తో సబ్ టీక్ హోయేగా! నమస్తే!” అన్నాడు.
“చాలా చాలా ధన్యవాదాలు విజయ్ భయ్యా! మీరు చేసిన సాయం నేనెప్పుడు మర్చిపోను. రేపట్నుండి మిమ్మల్ని నాలాగ విసిగించేవారు ఉండరు లెండి, ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ టూ. థాంక్యూ సో మచ్!” అని చేతులెత్తి దండం పెట్టాను.
శ్రీని సామానంతా కార్లో పెట్టేసి వచ్చాడు, నర్స్ వీల్ చేయిర్ కోసం కాల్ చేస్తే ఒకమ్మాయి తీసుకొచ్చింది. హైస్కూల్ పిల్లలు ముందు ముందు నర్సులు, డాక్టర్లు కావాలనుకునేవారు హాస్పిటల్స్ లో స్కూల్ తర్వాత, లేదా శని, ఆదివారాల్లో వలంటీర్ చేస్తుంటారు. నన్ను వీల్ చేయిర్లో కూర్చోబెట్టారు. నర్సు ముందుకు వంగి నా నుదుటి మీద ముద్దు పెట్టి, “ఆల్ ది బెస్ట్ డియర్! ఎవ్విరిథింగ్ విల్ బి ఆల్రైట్, డోంట్ వర్రీ టూ మచ్! యూ ఆర్ ఎ స్ట్రాంగ్ వుమన్! ఇట్స్ ఎ బిగ్ సర్జరీ, యు డిడ్ వెరీ వెల్ గర్ల్! బీ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ మిస్ డింగరి. ఐ విల్ బి థింకింగ్ అబౌట్ యు! వియ్ విల్ మిస్ యూ, బట్ నెవర్ కమ్ బ్యాక్ హియర్. హావ్ ఏ నైస్ లైఫ్! బై!” అని చెప్పింది.
“థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ హెల్ఫ్! నాకు మాటలు రావడం లేదు మీరు చేసిన సాయానికి ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు….” అంటుంటే నా గొంతు గద్గమయ్యింది.
“డోంట్ బి సాడ్! యు విల్ బి ఫైన్ డియర్. ఓకే మిస్టర్ డింగరి టేక్ కేర్ ఆఫ్ హర్, యువార్ ఏ గుడ్ హజ్బెండ్ అండ్ ఫాదర్. ఆల్ ది బెస్ట్! నౌ గో హోం టు యువర్ కిడ్స్!” అన్నది.
వీల్ చెయిర్ తీసుకుని ఎలవేటర్ వైపు వెళ్తుంటే ఎవరు కనిపిస్తే వారు “బై” చెప్తుంటే నేను చెయ్యి వూపుతూ వెళ్ళాము. కార్లోకి ఎక్కి కూర్చుంటే అంతా కొత్తగా అన్పించసాగింది. ఎన్ని రోజులయ్యింది లోపలే వుండి, ఆసుపత్రులే నా ప్రపంచం అయ్యాయి. నేను చిన్న ఆసుపత్రి నుండి సిటీలో పెద్ద ఆసుపత్రికి వచ్చేటపటికీ మాంచిచలికాలం, మంచు తుఫానులొచ్చినప్పుడు స్నో ట్రక్స్ తో రోడ్లపై ఎన్నో అడుగుల మంచుని పక్కకు కుప్పలు కుప్పలుగా పోసారు. ఎన్ని రోజులు వాతావరణం చాలా చల్లగా వుంటే అప్పటివరకు రోడ్డు పక్కన మంచు పర్వతాల్లా ఉంటాయి. ఇపుడు అవన్నీ కరిగిపోయాయి. అక్కడక్కడ వున్న కొద్దిగా మంచు పూర్తిగా కరిగిపోతుంది.
శ్రీని సంతోషంగా అనిపించాడు. “ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? నేను ఇంటికి వస్తున్నాననా లేకపోతే ఇంకేదన్నానా?”
“చెప్పనా వద్దా అని ఆలోచిస్తున్నాను.”
“దేని గురించి.” అని అడిగా.
“ఏం లేదు…. మనింటికి…” అని ఆగిపోయాడు.
ఏంటి అమ్మ వచ్చేసిందా? ఇంత త్వరగా రావడం కష్టం.
“హేయ్, తొందరగా చెప్పు. గుంతల దగ్గర జాగ్రత్త, నాకు నొప్పి లేస్తుంది…”
“నేనింత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుంటే…”
“సారీ! నువ్వు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నావ్. నాకే కంగారుగా ఉంది. ఇంతకీ మనింటికి ఎవరొస్తున్నారో చెప్పు..”
“మంజుల ఫోన్ చేయలేదా నీకు?”
“ఊహూ, కానీ కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసినపుడు నేను డిశ్చార్జ్ అయేటపుడు చెబ్తే వస్తానన్నది… అయ్యో నేను చెప్పలేదు.”
“ఏం పర్వాలేదు, రెండు రోజుల క్రితం తనే ఫోన్ చేసింది, వాళ్ళూ, రాకేష్ వాళ్ళు సాయంత్రం వస్తారట. నీకు ఎనిమిదో నెలలో నొప్పులొచ్చినపుడు అంబులెన్స్ లో వేరే హాస్పిటల్ కి పంపించారు కదా! నేను అపుడు చైతూని సుజాత వాళ్ళ ఇంట్లో వుంచాం కదా! వాళ్ళు ఈ రోజు ఇండియాకి వెళ్ళిపోతున్నారు. మంజుల, వాళ్ళు వెళ్ళే లోపల రావాలని ప్రయత్నిస్తుంది.” అన్నాడు. మెల్లిగా, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ జూలియా ఇంటికి వచ్చాం.
చైతూ, డానియల్ బైట ఆడుకుంటున్నారు. చైతు మమ్మల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. నన్ను గట్టిగా పట్టుకుంటాడేమోనని శ్రీని, “జాగ్రత్త! అమ్మకి సర్జరీ అయ్యింది, మర్చిపోకు,” అన్నాడు.
“నాకు గుర్తుంది నాన్న!” నా చెయ్యి పట్టుకుని జూలియా ఇంట్లోకి తీసుకెళ్ళాడు.
పాల్ వొళ్ళో స్ఫూర్తి పడుకొని నిద్ర పోతుంది. జూలియా వచ్చి నా చేతులు పట్టుకుని, బుగ్గ పైన ముద్దు పెట్టి నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టింది. వాళ్ళ పిల్లులు వచ్చి శ్రీని కాళ్ళని, నా కాళ్ళని రాసుకుంటూ తిరగసాగాయి. నాకు పిల్లులతో అలవాటు పోయింది. మా చిన్నపుడు కుక్క, పిల్లి రెండు వుండేవి. కానీ అక్కడ పెంపుడు జంతువులను పెంచడం వేరు, ఇక్కడ పెంచడం వేరు. చాలామంది ఇండియన్స్, “ఈ దేశంలో కుక్కలు, పిల్లులై పుట్టడమంత సుఖం లేదని.” ఇక్కడ తమ పిల్లలతో సమంగా పెంచుతారు. వాటికి పక్కలు, ఆడుకోవడానికి బొమ్మలు, వాటికి స్పెషల్ తిండి, కుక్కలకు ట్రైన్ చేస్తారు, అవి మూత్రానికి, రెండుకి వెళ్ళాలంటే తలుపు దగ్గరకి వెళ్ళి అరుస్తాయి, లేదా ఏడుస్తాయి, అపుడు ఇంట్లో వాళ్ళు బయటకు తీసుకెళ్ళి వాటి కార్యక్రమాలు అయ్యాక అవి రెండుకి వెళ్తే అది అక్కడే వదిలివేసి రావడానికి లేదు. వీళ్ళ జేబుల్లో అది ఎత్తి తీసుకురావడానికి ప్లాస్టిక్ బ్యాగ్లు పెట్టుకుని వెళ్తారు. అది తీసుకొచ్చి తమ చెత్త డబ్బాల్లో పడేస్తారు. ఇదొక్కటే నాకు నచ్చింది. ఎక్కడ పడితే అక్కడ కుక్క షిట్ తొక్కుతామేమో అనే భయం వుండదు. పిల్లులకు ఇంట్లోనే ఒక లిట్టర్ బాక్స్ పెట్టి అందులోనే ఒకటి, రెండు పోయేలా ట్రైన్ చేస్తారు. అవి ఇంట్లో వాళ్ళు ఎప్పటికపుడు తీసి పడేస్తుంటారు, లేకపోతే చెడ్డ వాసనొస్తుంది. ఆ వాసన రాకుండా ఉండడానికి మంచి సువాసనలుండే కొవొత్తులు వెలిగించి పెడ్తారు.
స్ఫూర్తి లేచింది. పాల్ తీసుకొచ్చి మెల్లిగా నా వొళ్ళో పడుకోబెట్టాడు. ఈ సారి ఏడవలేదు. హాస్పిటల్లో ఏడిచేది, ఆ వాసనలు, అక్కడి వాతావరణం ఇష్టం లేక ఏడ్చేదేమో! పాపకు పాలు కలిపి బాటిల్లో పోసి తీసుకొచ్చింది జూలియా. “థ్యాంక్స్,” అని చెప్పి బాటిల్ తీసుకొని పాపకి తాగించాను. సగం తాగింది, బాటిల్ అక్కడే వున్న టేబుల్ మీద పెట్టాను. మేము మాటల్లో పడ్డాము. చాలా రోజులు కాదు నెలల తర్వాత ఒకరి ఇంట్లో కూర్చుని మామూలుగా మాట్లాడుతుంటే సంతోషంగా అనిపించింది కానీ సర్జరీ నొప్పి, నీరసంతో కూర్చోవడం కష్టమవుతుంది. వాళ్ళ పిల్లుల్లో ఒక పిల్లి మేము మాటల్లో ఉన్నపుడు పాప పాల సీసా పీక పట్టుకుని లాగింది. అయ్యో! ఒక సీసా పాలు పాడయిపోయాయి కదా అనిపించింది. జూలియా, పాల్ పిల్లుల్ని అక్కడ్నుంచి వెళ్ళగొట్టారు. “సో సారి అబౌట్ ఇట్! చాలా వరకు ఏమీ పీకవు కానీ ఈ బాటిల్లో పాలు కనిపించాయి కదా! అందుకని అట్లా చేసింది. సారీ దుర్గా!” అని చెప్పారు ఇద్దరు.
కాసేపు కూర్చొని థ్యాంక్యూ చెప్పి పిల్లల్నిద్దరిని తీసుకుని బయల్దేరాము. పది నిమిషాల్లో ఇల్లు చేరాము. దాదాపు ౩ నెలల తర్వాత ఇంటికి వచ్చాను. నాకింకా నమ్మకం కలగటం లేదు. కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నేనూ, చైతన్య మెల్లిగా అపార్ట్మెంట్లోకి వచ్చాము. స్పూర్తి కారు సీట్లో నిదురపోతుంది, శ్రీని దానికి మెలుకువ రాకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాడు. “వాళ్ళందరూ సాయంత్రం ఆరుగంటలకు వస్తానన్నారు. అప్పటివరకు కొంచెం పడుకుని రెస్ట్ తీసుకో. నేను త్వరగా కాస్త ఉప్మా చేస్తాను చైతన్యకి నాకు. పాపకు పాలు తాగించి కాసేపు మేము కూడా పడుకుని రెస్ట్ తీసుకుంటాం,” అన్నాడు శ్రీని.
నేను బత్రూంకెళ్ళి వచ్చి బయటే ఉన్న సోఫాలో పడుకున్నాను. పొద్దున్న ఇచ్చిన ఇంజెక్షన్ పని చేస్తుందేమో కొద్దిసేపుకాగానే నిద్ర పట్టింది.
సాయంత్రం అయిదు గంటలకు మంజుల కుటుంబం, సురేష్ కుటుంబం కల్సి వచ్చారు. మంజుల పాపని చూసి చాలా సంతోషించింది. పాపకి బోలేడు బట్టలు తీసుకొచ్చింది. సురేష్ వాళ్ళకి రెండునెల్ల ముందు ఒక పాప పుట్టింది. పాప నాలుగు పౌండ్లే పుట్టిందని తల్లికి కోపం. “చూడండి ఎట్లా వుందో బక్కగా,” అని చూపించేది అందరికీ. స్ఫూర్తిని చూసి, “నువ్వు చూసుకోవడానికి లేకున్నా మీ పాప ఎంత ఆరోగ్యంగా, అందంగా ఉందో…మా పాప చూడు అయిదునెల్లు వచ్చాయి ఇంకా సన్నగానే ఉంది,” అన్నది. నేను వెంటనే, “అలా అంటావేంటీ? చక్కగా ఉంది పాప.” పక్కనే సురేష్ ఉన్నాడు, “ఎప్పుడు ఇట్లాగే అంటుంది చూడండీ! డాక్టరేమో పాప బాగుంది, బాగానే ఎదుగుతుంది, ఏం కంగారు పడక్కర్లేదు అని చెప్పింది.” అన్నాడు.
భర్త అలా అనగానే, “నేను ఊరికే అన్నాను. ఏదో జోక్ గా అన్నా సీరియస్ గా తీసుకుంటాడు చూడు,” అంది. మంజుల సుజాత వెళ్ళిపోతుంది కదా, చూసొస్తానని వెళ్ళింది కానీ వెంటనే వచ్చేసింది.
“ఏమైంది మంజుల,” అంటే, “లేదు దుర్గా! నేను వెళ్ళేవరకు కార్ వెళ్ళిపోయింది. తన ముఖం కూడా కనబడలేదు.” అంది నిరాశగా. మొగవాళ్ళిద్దరూ ఇండియన్ హోటల్ నుండి తిండి తీసుకు రావడానికి వెళ్ళారు. పిల్లలందరు ఆడుకుంటున్నారు. మంజుల భర్త, “నేను పాపని చూసుకుంటాను మీరు కొద్దిసేపు పడుకొండి దుర్గా,” అన్నాడు. నేను బెడ్రూమ్ లోకి వెళ్ళి కాసేపు నడుం వాల్చాను. అంత సేపు కూర్చున్నందుకు నడుం నొప్పిగా ఉంది. తిండి తీసుకొచ్చాక అందరు కల్సి బోంచేసారు. రాత్రి అందరూ లివింగ్ రూంలోనే పడుకున్నారు. పొద్దున్నే లేచి వెళ్ళిపోయారు. నాకు ఇంటికి రాగానే ఫ్రెండ్స్ ని చూస్తే కొంచెం ధైర్యం వచ్చినట్టనిపించింది.
సర్జరీ నొప్పి తగ్గితే నాకు పాన్క్రియాటైటిస్ నొప్పి రాదు అనే నమ్మకం ఉండింది. ఇంటికి వచ్చాక కుదురుగా వుండలేకపోతున్నాను. ఎందుకంటే దాదాపు ౩ నెలలు ఆసుపత్రులలో వుండి డెమొరాల్ ఇంజెక్షన్లు రోజు మూడు నాలుగుసార్లు అలవాటయ్యింది. నిద్ర అస్సలు పట్టటం లేదు. జూలియా, పాల్ రోజు వచ్చి కూర్చొని పాపతో ఆడుకొని, నాతో కాసేపు సమయం గడిపి వెళ్ళేవారు. వాళ్ళ అబ్బాయి డానియల్, చైతన్య కల్సి ఆడుకునేవారు. నేను ఇన్ని నెలలు ఇంట్లో లేకపోవడంతో ఇల్లంతా ముఖ్యంగా వంటిల్లు చాలా చిందర వందర అయిపోయింది. శ్రీని వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఆఫీస్ కు వెళ్ళడంతోనే సరిపోయేది. అపార్ట్మెంట్లో కార్పెట్ మరీ ఎక్కువ మురికి అయితే వాక్యూమ్ చేసేవాడు, ఒకోసారి జోన్ చేసేది. వంటింట్లో సర్దడానికి టైం ఉండేది కాదు. నాకు ఇంటికి వచ్చినప్ప ట్నుండి వంటిల్లు సర్ధాలని అనిపిస్తుంది కానీ ఇంకా వొంట్లో శక్తి రాలేదు అదీ కాక ఒకసారి పని మొదలు పెడితే పూర్తిగా శుభ్రం అయ్యేదాక వదిలిపెట్టను. దాంతో అల్సిపోయి మళ్ళీ కోలుకోవడానికి చాలా సమయం పడ్తుంది. నేను ఇంటికి రాగానే జోన్ ని పాపను చూసుకోవడానికి రావొద్దు అని చెప్పలేదు. నాకు పూర్తిగా మానిపోయిం తర్వాత నేను పాపని నా అంతట నేను చూసుకోగలను. జోన్, జూలియా, పాల్ వీళ్ళు రోజు వచ్చేవారు. కొంచెం కాలక్షేపంగా అనిపించేది.
నాకు నిద్రపట్టటం లేదని సర్జన్ కి ఫోన్ చేస్తే మెల్లిగా బయటకు వెళ్ళి రోజు కాసేపు వాక్ చేయమన్నది. కొద్ది కొద్దిగ శరీరం అల్సిపోతుంటే నిద్ర దానంతట అదే వస్తుంది అని అన్నది. నాలుగురోజులు నిద్ర లేక నా బుర్ర అస్సలు పనిచేయటం లేదు. జూలియా ఆ రోజు నన్ను చూసి, “నా దగ్గర కొన్ని నిద్ర మాత్రలున్నాయి, రెండు తెచ్చి ఇస్తాను. ఈ రోజు ఒకటి వేసుకుని చూడు, బాగా నిద్ర పట్టి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే రేపు కూడా వేసుకో లేకపోతే మానేయ్,” అని చెప్పింది.
కానీ ఒకరి ప్రిస్క్రిప్షన్ మందు ఇంకొకరు వేసుకోవచ్చా లేదా? డాక్టర్స్ ని అడగాలా? ఒకవేళ ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఏం చేయాలి? అని కొంచెం సేపు చర్చ జరిగింది. మొత్తానికి ఒకటే వాడుతున్నాం కాబట్టి ఏం పర్వాలేదు అని ఒకే అభిప్రాయానికి వచ్చాక జూలియా ఇంటికి వెళ్ళి తీసుకు వచ్చి ఇచ్చింది. రాత్రి తొమ్మిది గంటలకు వేసుకుంటే పొద్దున్న వరకు నిద్ర పడుతుంది అని చెప్పింది. రాత్రి తొమ్మిది గంటలకు వేసుకు పడుకున్నాను. పది పదకొండు గంటలకు నిద్ర పట్టింది కానీ అన్ని పీడకలలు, ఏవేవో ఆలాపనలు, ఎక్కడెక్కడో చీకటి ప్రదేశాల్లో తిరుగుతున్నట్టు ఎవరో వెంబడిస్తు న్నట్టు….నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఏదో లోయలో పడిపోయినట్టు పీడకలలొచ్చాయి. పోనీ మెలుకువ తెచ్చుకుని పడుకోకుండా ఉందామంటే కళ్ళు మూసుకుపోతున్నాయి. గుండెల్లో దడ, ఒంట్లో వణుకు పుట్టుకొచ్చాయి. నా కలవరింతలకు శ్రీని రెండు మూడు సార్లు లేపాడు నిద్ర నుండి. నిద్ర మాత్ర యాత్ర అలా ముగిసింది. మళ్ళీ జూలియాని మాత్రలు అడగలేదు. సర్జన్ కి ఫోన్ చేసి అడిగితే దగ్గుకు వేసుకునే మాత్రలు ’బెనడ్రిల్,’ ఒకటి రాత్రి వేసుకుని పడుకోమంది. అది ఒకరోజు కొన్ని రోజులు, రోజుకి కొన్ని గంటలు పని చేసింది. కొన్ని గంటలు నిద్రపోయినా కొంచెం రిలాక్సింగ్ గా ఉండేది. తర్వాతర్వాత అది కూడా పని చేయడం మానేసింది.
మా అమ్మ రావడానికి కావాల్సిన పేపర్ వర్క్, డాక్యుమెంట్స్ అన్నీ పంపించాడు శ్రీని. అమ్మ ఒక్కతి పాస్ పోర్ట్, వీసా కోసం ఆఫీసుల చుట్టు తిరగలేదు. మా అన్న ఉదయభాను అమ్మకు పాస్ పోర్ట్ కోసం, అది వచ్చాక వీసా కోసం అపుడు వీసా ఆఫీసు చెన్నెయ్ లో ఉండేది, చెన్నెయ్ కి తీసుకెళ్ళాడు. డాక్టర్ల లెటర్స్ కూడా ఉండడం వల్ల త్వరగానే వీసా వచ్చింది. కానీ ఇండియాలో మా కుటుంబం వారికి ఎవ్వరికీ అమ్మ నా దగ్గరికి రావడం ఇష్టం లేదు. వాళ్ళు రారు, అమ్మ కూడా రాకూడదు. వారికి మేము ఇక్కడ జరిగేది ఏది సరిగ్గా చెప్పటం లేదు. వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు, మేము అమ్మ, నాన్న, మా మామగారికి తెలిస్తే బాధపడతారేమో అని చెప్పలేదు.
*****
(సశేషం)

నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.
