
తారామణి
(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– గోమతి(సుమచంద్ర)
ఆమె లోకానికి తొలి వేకువ
చిరు కువ-కువల ఉదయాలకు వేదిక
ఆమె లేకుంటే పుట్టుక…, తన మనుగడే ప్రశ్నార్థకమవుతుందని వెర్రిగా చూస్తుంది
అణువంత ప్రేమకే అంబరాన్ని తాకే ఆమె ప్రేమ… ఓ పసి వెన్నెల అమాయకత్వం
ఇసుమంత ఆప్యాయతకే నిత్యవసంతమై ముంగిటనుండే హరితం
తనువంతా తరువై, ప్రతి అణువు త్యాగంతో నిండిన సైనికుడై అంకితం అంటుంది ఆమె బ్రతుకు
మనసంతా మమతల కొలువై హారతులు ఇస్తుంది
నిస్వార్థం ఆమెను తన చిరునామాగా చెప్పుకుంటుంది
నీ నిర్లక్ష్యాన్ని, నిరంకుశత్వాన్ని నిరసన లేకుండా సహిస్తుంది
ఆమె సహనాన్ని పరీక్షిస్తే… నీకై తపించిన కన్నులు అగ్ని కీలలుగా మారుతాయి
ఆమె మౌన వేదన మహా ప్రళయంగా రూపు దిద్దుకుంటుంది
నీవు విరిచిన రెక్కలు, ఆమె సంకల్పంతో ఊపిరి పోసుకుని బలమైన సునామీని తెస్తాయి
గులకరాయి అనుకుని విసిరేస్తున్న ఓ మనిషి!
ఘనమైన వజ్రాన్ని కోల్పోయానని..
నీ కన్నీళ్ళు సంద్రమై…నీవే అలల కల్లోలానికి లోనైనప్పుడు,
నీవు అందుకోలేని ‘తారామణియై’ ఆమె ప్రకాశిస్తుంది
చుక్కల లోకానికి ఎగరలేని నీ రెక్కలు ముడుచుకుని,
చీకటి దుప్పటిలో నీవు అలమటించి అంగలార్చవలసిందే
*****

గోమతి (సుమచంద్ర ) కవయిత్రి
