నడక దారిలో-61

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ కావటం, రిటైర్ కావటం, పెద్దక్క మరణం, ప్రత్యేకతెలంగాణా ఏర్పాటు, వీర్రాజు గారి పెయింటింగ్స్ ప్రదర్శనలు. పల్లవి కొన్న సరూర్ నగర్ లో అపార్ట్మెంట్ కు వెళ్ళటం. డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు. వీర్రాజుగారికి బోయి భీమన్న, బాపూరమణల పురస్కారాలు- ప్రరవే సభలకు వెళ్ళటం, అమృతలతగారి పరిచయం-ఉమ్మడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం -చిన్నక్క మరణం తర్వాత—)

***

విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణానికి అంకురార్పణ పెద్ద ఎత్తున రంగరంగవైభవంగా జరిగింది. ఈ నిర్మాణానికి కొన్ని వేల ఎకరాల పంటపండే  భూములను గవర్నమెంట్ సేకరించింది. అది కొంత వివాదాస్పదంగా మారినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా ఆ ప్రాంత ప్రజలు సంతోషం ప్రకటించారు. రాజధానిలేని రాష్ట్రం అభివృద్ది చెందాలంటే విద్య, వ్యాపార రంగాలు పెరగాలి. పన్నులు రావాలంటే పెట్టుబడులు పెట్టే పెద్ద సంస్థలను ఆకర్షించ గలగాలి. చూడాలి అవన్నీ ఎంతవరకూ సాకారమౌతాయో. వీర్రాజుగారూ, నేనూ ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని చాలా ఆసక్తిగానే గమనించాం.

ప్రత్యేక హోదా డిమాండ్తో టీడీపీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని అమరావతిలో పరిపాలన కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇక్కడ స్థిరపడిన ఆంధ్రప్రాంత వుద్యోగులు విజయవాడకు తరలి వెళ్ళాల్సి వచ్చింది. ఆ దృశ్యం చాలా ఉద్వేగంగా కనిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ రాజధాని కావటాన ఇక్కడే కార్యాలయాలన్నీ వుండటాన ఉద్యోగులు ఇక్కడే ఇల్లు కొనుక్కుని పిల్లల చదువులతో స్థిరపడిన వాళ్ళు. చిరకాలంగా స్నేహ సంబంధాలు కలిగిన వాళ్ళని విడిచి వెళ్ళటం బాధాకరమే. వెళ్ళిన వారిలో అల్లూరి గౌరిలక్ష్మి కూడా వుంది. వుద్యోగ రీత్యా విజయవాడ వెళ్ళి పోవటంతో కలవటం తగ్గిపోయింది.

రాజమండ్రి, యానాం, విశాఖ, విజయవాడలలో వీర్రాజుగారి చిత్ర ప్రదర్శనల అనంతరం పెయింటింగ్స్ అన్నీ భద్రంగా ఇంటికి చేరాయి. ఆ సందర్భంలో ఒకసారి ఇంటికి వచ్చిన పొనుగోటి కృష్ణారెడ్డిగారు వారి స్వగ్రామం అయిన కావలిలో కూడా ప్రదర్శనకు ఏర్పాటు చేయాలని ఆలోచించారు. అక్కడి వారితో సంప్రదించి పెయింటింగ్స్ నుంచి భద్రంగా తీసుకు వెళ్ళే ఏర్పాటు చేసారు. కృష్ణారెడ్డిగారితో పాటూ వీర్రాజుగారు కావలికి వెళ్ళారు. కావలిలో కూడా రెండు రోజుల పాటు జరిగిన చిత్ర ప్రదర్శనకు మంచి స్పందన వచ్చిందని వీర్రాజుగారు చాలా సంతోషపడ్డారు.

సాధారణంగా పోటీలకు నా పుస్తకాలు పంపను. కానీ ఈసారి గంగిశెట్టి గారు ప్రకటించిన పోటీకి నా కవితా సంపుటిని పంపాను. గంగిశెట్టి లక్ష్మీనారాయణగారి మాతృమూర్తి జింకా రుక్మిణమ్మ  పురస్కారానికి ” నా ఆకాశం నాదే ” ఎంపిక అయ్యిందని ఫోన్ చేసి తెలియజేసారు. చాలా సంతోషం కలిగింది. పురస్కార సభలో ముగ్గురు పూర్వ వైస్ ఛాన్సలర్ లు అయిన ప్రొ.గంగిశెట్టి లక్ష్మీనారాయణ ప్రొ. కొలకలూరి ఇనాక్ , ప్రొ.అనుమాండ్ల భూమయ్య గార్ల చేతుల మీదుగా పురస్కారం అందుకోవటం చాలా ఆనందం కలిగించింది.

అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న తెలుగు సాహితీవేత్తలు ఎప్పటి నుండో నిర్వహించే సిరికోన వాట్సాప్ సమూహంలో నన్ను చేర్చారు. అందులో చాలామంది సంస్కృతాంధ్ర పండితులు కావటాన ఎక్కువగా వాటికి చెందిన రచనలే ఉంటున్నా కొందరు నా లాంటి వారు రాసే ఆధునిక కవిత్వాన్ని కూడా ఆదరించేవారు.

అనుకోకుండా లేఖిని అధ్యక్షురాలైన వాసా ప్రభావతి గారు పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీర్రాజుగారూ, నేనూ వెళ్ళి చూసి వచ్చాము. నాకు తెలిసి గొప్ప విల్ పవర్ ఉన్న రచయిత్రులలో ప్రభావతిగారు ఒకరు. అటువంటి పరిస్థితుల్లో సైతం ఆమె రాలేకపోయినా లేఖిని కార్యక్రమాలు కొనసాగేలా ఫోన్లు ద్వారానే చేసేవారు.

నా ముందుతరం రచయిత్రుల కథలు గురించి వ్యాసాలు రాయటంలో భలే ఆనందం పొందుతున్నాను. పదిహేను మంది రచయిత్రుల గురించి రాస్తే ఇంక చాలనుకున్నాను కానీ విస్తృతంగా కథలు రాసినవారు వున్నారు. చాలా మంది అనేక కథలు రాసినవాళ్ళు దొరికే సరికి ఉత్సాహంగా కొనసాగించాను. కథానిలయం నుండి ఒక్కరివే వందల కథలు డౌన్లోడ్ చేసుకుని చదివి రాయటం, తర్వాత మరొకరివీ ఇలా చాలా సమయం పట్టటంతో నా కవిత్వం, కథలు రాసేందుకు సమయం తక్కువ అయ్యింది. కానీ కనీసం పాతిక రచయిత్రుల కథలు గురించి అయినా రాయాలనే పట్టుదలతో కొనసాగిస్తున్నాను.

మృణాళిని ఐ డ్రీమ్స్ ఛానల్ లో అక్షరయాత్ర పేరిట వీర్రాజుగారిని ఇంటర్వ్యూ చేయటానికి వచ్చారు. ఆమె మొత్తం రచనలు చదివి చాలా సమగ్రంగా ఇంటర్వ్యూ చేసింది. అదే ఆమె ప్రత్యేకత అనుకుంటాను. అలా వచ్చినప్పుడే మిమ్మల్ని కూడా దగ్గర్లోనే వచ్చి చేస్తాను అని నా రచనల్ని అన్నింటినీ తీసుకుని వెళ్ళింది.

చెన్నై నుండి రాజేశ్వరీ కోదండం అనే ఆమె ఫోన్ చేసి వీర్రాజుగారి మైనా నవలను తమిళంలోకి అనువాదం చేయాలనుకుంటున్నానని ఫోన్ చేసింది. మైనా నవలని కెబి గోపాలంగారు ఇంగ్లీష్ లోకి అనువదించారు కానీ పుస్తకంగా వేయలేదు. ఆవిడే ఫోన్ చేసి చేస్తానంటోంది కదా అని అంగీకారం తెలియజేసారు. రాజేశ్వరీ కోథండం తాను అనువాదం చేయడమే కాక తానే పూనుకొని మా దగ్గర ప్రచురణ ఖర్చు తీసుకుని పుస్తకంగా కూడా ప్రచురించింది. ఆ తర్వాత నా యుద్ధం ఒక గుండె కోత కూడా ఆమె తమిళంలోకి అనువాదం చేసి అదే రకంగా ప్రచురణ ఖర్చు తీసుకుని  “ఉళ్ళక్ కుమురల్” పేరుతో పుస్తకంగా వేసారు.

ఈలోగా అనల్ప బలరాం వీర్రాజుగారి సమగ్ర సంపుటి వేస్తానని అన్నారు. వీర్రాజుగారు అప్పటికే తన ఎనభయ్యో పుట్టినరోజు నాటికి కథలన్నీ కలిపి వేయాలనే ప్రయత్నంలో వున్నారు.
మనం వేసే కన్నా పబ్లిషర్ వేస్తే అమ్మకాలు అవుతాయి. ఇంట్లో పుస్తకాలు పేరుకుపోవు. అందుకని అనల్పబుక్ హౌస్ వారికి అంగీకారం తెలియజేసారు.

పొనుగోటి కృష్ణారెడ్డిగారు వారి వూరు కావలిలో వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శన ఏర్పాటు చేస్తానని చెప్పారు.పెయింటింగ్స్ కావలికి చెందిన వారి కారులో పంపించారు. వీర్రాజుగారూ, కృష్ణారెడ్డి గారూ ట్రైనులో బయలుదేరి వెళ్ళారు. కావలిలో ప్రదర్శన చాలా బాగా జరిగిందనీ, చాలా మంది చూడటానికి వచ్చారనీ వీర్రాజుగారు తిరిగి వచ్చాక సంబరంగా చెప్పారు.

ఐ డ్రీమ్స్ ద్వారా వీర్రాజుగారిని ఇంటర్వ్యూ చేసిన ఆరేడు నెలలకే మృణాళిని నన్ను ఇంటర్వ్యూ చేయటానికి వచ్చింది. మొత్తం నా పుస్తకాలన్నీ చదివి చేసిన సమగ్రమైన ఇంటర్వ్యూ ఇదే అని చెప్పొచ్చు. ఈ ఇంటర్వ్యూలకు చాలామంది నుండి చక్కటి స్పందన వచ్చింది.

ఆషీ అన్ని క్వాంపిటేటివ్ పరీక్షలకూ ప్రిపేర్ కావటంతో పరీక్షలకు తీసుకు వెళ్ళటానికి పల్లవి బిజీ అయిపోయింది. బిల్డింగ్ లో ఆషీతోటి పిల్లలు రిజల్ట్ రాకముందే కాలేజీల ఎంపిక కోసం తిరుగు తున్నారని తెలిసి మేము కూడా కొన్ని కాలేజీలకు వెళ్ళి చూడాలనుకున్నాము. ఆ వరుసలో శంకరపల్లిలో ఆడపిల్లలదే మంచి ఇంజనీరింగ్ కాలేజీ వుందని తెలిసి వెళ్ళాము. వాళ్ళకి అమెరికన్ సిటిజన్ కీ, ఎన్ ఆర్.ఐ కీ తేడా తెలియదనిపించింది.

ఆప్లై చేయటం దగ్గర నుండి ఫీజు కట్టటం వరకూ అమెరికాలో వుండేవారే డాలర్ల రూపంలో కట్టాలన్నారు. తల్లి , పిల్లా ఇండియాలోనే వుంటే అక్కడి నుండి అప్లై చేయటం ఏమిటో అర్థం కాలేదు.పేరుకే ప్రవేశపరీక్షలు కానీ అంతా డబ్బు డిమాండే ప్రధానం అని తెలిసింది. పాతిక లక్షలు ముందు కట్టాలంట. ప్రతీ ఏడాదీ అయిదు లక్షలు కట్టాలన్నారు. విద్య కొనుక్కోలేక ఒక నమస్కారం పెట్టి వచ్చేసాము. అలా రెండుమూడు కాలేజీలు తిరిగి పది, పదిహేను లక్షలంటూ బేరాలదోపిడీ చూసి భయం వేసింది.

ప్రవేశపరీక్ష రిజల్ట్ వచ్చాక ఇక్కడ గీతం యూనివర్సిటీలో వచ్చినా అంత దూరం పంపటానికి నచ్చక వద్దనుకున్నాము. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకటన చూసి అయిదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీకి అప్లై చేసింది. అయితే విదేశీ విద్యార్థులు ఎంట్రెన్స్ రాయనక్కరలేదనీ, టోఫెల్ పరీక్ష  క్వాలిఫై కావాలని సమాధానం వచ్చింది. వెంటనే టోఫెల్ కు అప్లై చేసి పరీక్ష రాసింది. కానీ రిజల్ట్ సబ్మిట్ చేసే నాటికి సెంట్రల్ యూనివర్సిటీ టైమ్ దాటిపోయింది. ఈ ఏడాది మానేసి వచ్చే ఏడాది అప్లై చేద్దామని ఆషీ నిర్ణయించుకుంది. అంతవరకూ ఖాళీగా వుండటం ఎందుకని కోర్సెరాలో ఆస్ట్రో ఫిజిక్స్ సర్టిఫికెట్ కోర్సులో చేరింది.

అప్పట్లో తెలంగాణా ఉద్యమం వలన కావచ్చు, కుందుర్తి సత్యమూర్తి ఆకస్మిక మరణం వలన కావచ్చు ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతుల ప్రదానం మందగించింది. ” ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు ఇప్పటికే నలభై నాలుగు అయ్యాయి. తరువాయి ఆరు బహుమతులు మనమే ఇచ్చేసి యాభై పూర్తిచేసి ఆపేస్తే ఎట్లా వుంటుంది ” అని ఒకదశలో వీర్రాజుగారూ నేనూ ఆలోచించాం. కానీ సత్యమూర్తి భార్య కుందుర్తి శాంత ” ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు యాభై పూర్తి చేసేవరకూ తానే ఇస్తానని ముందుకు రావటంతో కొనసాగింది. అయితే రెండేళ్ళ కొకసారి  రెండేళ్ళవీ రెండేసి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది.

ఆ విధంగా 14,15 సంవత్సరాల బహుమతులు సత్యమూర్తి ఉన్నప్పుడే నిర్ణయించిన ప్రకారం తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్ గారికి, ప్రసాదమూర్తికి ప్రకటించి 2015 లోనూ, 16,17 సంవత్సరాల ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు డా.భవానీదేవికీ, బాల సుధాకర్ మౌళికీ 2017లోనూ ప్రదానం చేయటం జరిగింది. 18,19 లకు కూడా చాలా కవితా సంపుటాలు చదివి సిరికి స్వామినాయుడికీ, ఇబ్రహిమ్ నిర్గుణ్ కీ ఫోన్ చేసి వీర్రాజు గారు ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతికి ఎంపిక చేసినట్లుగా చెప్పి అంగీకారం పంపమన్నారు. వాళ్ళనుండి అంగీకారం ఉత్తరం వచ్చాక సభ ఎప్పుడన్నది నిర్ఢయించుకొని పేపర్ ప్రకటనకు ఇవ్వాలను కున్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2 న తెలంగాణ అవతరణ దినోత్సవం నిర్వహిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో కృషి చేసినవారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు పేరిట పురస్కారాలను అందించారు. ఆ క్రమంలో మా ఆత్మీయులైన ఆశారాజు, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు మొదలైనవారంతా ప్రభుత్వ పురస్కారంగా లక్షానూటపదహార్లు అందుకోవటం మాకూ సంతోషం కలిగింది.

కానీ ప్రభుత్వం నుండి పొందే పురస్కారాలు అక్షరాలకు ఆనకట్ట వేసే అవకాశం వుండొచ్చు.

ఒకరోజు అమృతలతగారు ఫోన్ చేసి కవిత్వానికి అపురూప పురస్కారం నాకు ఇవ్వాలనుకున్నట్లు తెలియజేసారు. సుమారు పది పన్నెండు మంది మహిళలకు ప్రతి ఏడాదీ అందజేసే అమృతలతగారి అపురూప అవార్డులు నిజంగా అపురూపమైనవే. మా దంపతులు ఇద్దరికీ చాలా ఆనందం కలిగింది. నాకు సంబంధించిన ముఖ్య వివరాలూ, ఫొటోలు పంపమన్నారు.

అమృతలతగారి అవార్డుల సంబరంలో అతిథులను ఆహ్వానించటం దగ్గర నుండి చివరివరకూ ఆద్యంతం సమయనిబద్ధతను పాటిస్తూ ఆహ్లాదకరంగా, ఆసక్తికరంగా వైభవోపేతంగా కొనసాగుతుంది‌. అంతేకాదు సభలోని వారిని కూడా అంచెలంచెలుగా వేదిక మీదకు గౌరవపురస్సరంగా ఆహ్వానిస్తారు. మరోవిశేషం అప్పటికప్పుడు సర్ప్రైజింగ్ గా వచ్చిన సభికులకూ బహుమతులు ఇస్తారు. అందుకే రచయిత్రులు అందరూ అమృతలత అపురూప పురస్కారాల సభని ఒక పండుగగా భావిస్తారు. ఈ సారి ముఖ్య అతిథులుగా జలంధరా చంద్రమోహన్, ఎస్.పి.శైలజా వచ్చారు. నాకు పురస్కారం ఇచ్చేటప్పుడు వీర్రాజుగారిని కూడా వేదిక పైకి ఆహ్వానించి ఇద్దరికీ కలిపి సత్కారం చేసారు‌. సభకి మామరిదీ చిట్టీ, తోటి కోడలు ఉషా కూడా సభకి వచ్చి ఆ సంబరం చూసి ఆశ్చర్యపోయారు.

ఆ తర్వాత  ఎప్పటి నుంచో వాయిదా పడుతోన్న వీర్రాజుగారి కేటరాక్ట్ ఆపరేషనుకు నేత్రాలయ కంటి హాస్పిటల్ లో చూపించాము. ఈయనకి హాస్పిటల్ అంటే చాలు బీపీ పెరిగి పోతుంది. అందుకనే వాయిదాలు వేస్తూనే వున్నారు. ఇటీవల వారాల కృష్ణమూర్తిగారు వారి భార్యకీ, తనకీ నేత్రాలయలోనే కాటరాక్టు కోసమై సంప్రదించి అక్కడే చేయించుకున్నానని చెప్పటమే కాక వారికి ఆపరేషను చేసిన డాక్టర్ పేరుకూడా చెప్పారు. అప్పుడు వీర్రాజుగారు కూడా చేయించుకోవడానికి సమ్మతించారు.

ఉదయమే ఏడున్నరకి ఇద్దరం వెళ్ళాము. ఫార్మాలిటీలు అన్నీ పూర్తి చేసాక ఆపరేషను కోసం లోనికి తీసుకు వెళ్ళారు. పూర్తిఅయ్యాక బయటకు వచ్చేవరకూ నాకు గుండె దడదడ లాడుతూనే వుంది. బీపీ పెరిగి హడావుడి చేస్తారేమోనని భయపడ్డాను. కానీ బయటకు వచ్చాక వీర్రాజుగారు కూడా రిలీఫ్ గానే వున్నారు. నేనుకూడా గుండె నిండా వూపిరి పీల్చి వదిలాను. టైమ్ ప్రకారం కంట్లో చుక్కల మందు వేసే పని వలన కొంచెం బిజీ అయ్యాను. నెలరోజులు అయ్యాక రెండో కన్ను కూడా చేయించుకోవడానికి సిద్ధపడ్డారు. బహుశా ఇది కష్టమైనది కాదనే ధైర్యం వచ్చిందేమో. రెండో కన్ను కూడా చేయించుకు వచ్చేసాము.

అయితే మర్నాడు చూపించుకోటానికి వెళ్ళాల్సి వుంది. టిఫిన్ తిని బయలు దేరుదామనుకునేసరికి వీర్రాజుగారికి వెక్కిళ్లు మొదలయ్యాయి. ఏం చేసినా తగ్గలేదు. కాసేపటికి తగ్గుతాయిలే అనుకుని రివ్యూ కోసం నేత్రాలయకు బయలుదేరాము. కన్ను బాగానే వుందని చెప్పి కళ్ళద్దాలకూ నాలుగు వారాలకు రమ్మన్నారు. తిరిగి ఇంటికి వచ్చాము. మధ్యాహ్నం అవుతోన్నా వెక్కిళ్లు తగ్గటం లేదు. అప్పుడే పొనుగోటి కృష్ణారెడ్డిగారు ఆయన్ని పరామర్శించడానికని వచ్చారు. అప్పటికీ వెక్కిళ్లు తగ్గకపోయే సరికి కృష్ణారెడ్డిగారితో చెప్తే ఓ మినీ హాస్పటల్ కి తీసుకు వెళ్దామన్నారు. పల్లవి వాళ్ళతో వెళ్ళింది. ఏవేవో టెస్టులు చేసి ఊపిరితిత్తుల్లో నెమ్ము పేరుకుపోయింది అది తీయాలని అన్నారు. రేపు చేయించుకోవడానికి వస్తామని వీర్రాజుగారు అంటే తీసుకుని వచ్చేసారు. ఈ లోపున వెక్కిళ్లు ఎప్పుడో తగ్గి పోయాయి. వీర్రాజుగారు మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళననేసారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికలో అత్యధిక సీట్లు పొందిన తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ ఐదు సంవత్సరాల కాలపరిమితి దాటకుండానే తొమ్మిది నెలల ముందే  అసెంబ్లీని రద్దు చేసి ముందుగానే ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించింది. ఇతర పార్టీలన్నీ కూటమిగా ఏర్పడినా ఎన్నికలలో టీఆర్ఎస్‌ దూకుడుని అడ్డుకోలేక పోయాయి.

కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పడంతో రాష్ట్ర,కేంద్రాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాంతో  2019 చివరలో జరిగిన  ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

ప్రజల మధ్యకి వాళ్ళ నాన్నలాగే యాత్రలు చేసి ప్రస్తుత ప్రభుత్వాన్ని బూచిగా ప్రజలు కళ్ళ ముందు చూపటంతో భారీ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం మారిపోయింది. వచ్చిన వెంటనే అమరావతి కాకుండా  మూడు చోట్ల రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసారు. అమరావతి రాజధానికి వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు అంతా గగ్గోలుపెట్టి అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే ఉద్యమం ప్రారంభ మైంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.