
జంతుబలి వద్దు
-కందేపి రాణి ప్రసాద్
వానకాలంలో బాగా వర్షాలు కురుస్తున్నాయి. చెట్టు పుట్ట వానలకు తలంటుకుంటూ, తమ దుమ్ముధూళిలను వదలగొట్టుకుంటున్నాయి. చెట్లన్నీ తడిసి ముద్దయ్యాయి. తన ఆకుల్ని విదుల్చుకుంటూ చెట్లు ఆనందపడుతున్నాయి. మళ్ళీ పైనుంచి పడుతున్న వాన చుక్కల్ని తమ ఆకుల మీద నిలుపుకుని సరదా పడుతున్నాయి. తిరిగి తన ఆకుల మీద నిలిచిన వాన చుక్కల్ని కిందకు దులుపు కుంటున్నాయి. ఇలా చెట్లు వానతో ఆటలాడుతున్నాయి.
ఒకరోజు అడవిలో ఉన్న కోడి తన పిల్లల్ని వెంటబెట్టుకుని గింజలు వెతుక్కుంటూ వెళుతోంది. ఆహారం ఎలా వెతుక్కోవాలో, గింజలు ఎక్కడ వెతికి తెచ్చుకోవాలో నేర్పిస్తూ ఉన్నది. వర్షాకాలం కాబట్టి, వర్షం తుంపర్లుగా పడుతున్నది. అప్పుడే కోడి తన పిల్లలతో ఇలా చెప్పింది. ‘‘త్వర త్వరగా తినేయండి! వర్షం వచ్చేస్తోంది. మనం వెళ్ళి గంప కింద దాక్కుందాం!’’ అంటూ తొందర పెట్టింది తల్లి కోడి.
అప్పుడే కొద్దికొద్దిగా చినుకులు పడటం మొదలయ్యింది. అలా వాన చినుకులు చిటపటమంటూ పడుతుంటే కోడి పిల్లలు ఆడుకోవటం మొదలుపెట్టాయి. ఒక కోడిపిల్ల ఆకాశం మీద నుంచి పడుతున్న చినుకుల్ని చేతిలో పట్టుకుని, మరో కోడిపిల్ల మీద పోస్తున్నది.
ఏయ్! ఏంటా ఆటలు. వర్షంలో తడవద్దని చెప్పానా? అంటూ, తల్లి కోడి ముద్దుగా విసుక్కున్నది. పిల్లల్ని చేత్తో పట్టుకుని, చెట్టు కిందకు లాక్కొచ్చింది.
పిల్లలు ఇంకా ఆడుకోవాలని అనుకున్నారు. కానీ,అమ్మ లాక్కొచ్చేసరికి బుంగమూతి పెట్టుకున్నారు. ‘‘ఎందుకమ్మా! వర్షంలో ఆడవద్దన్నావు. వర్షపు నీళ్ళు మీద పడుతుంటే చాలా సరదాగా ఉంటుంది. చెట్లు ఎలా తలలూపుతున్నాయో చూడు అంటూ, కోడి పిల్లలు తల్లిని చుట్టుకుంటూ అడిగాయి.
‘‘వర్షంలో ఆడుకుంటే సరదాగానే ఉంటుందమ్మా!. కానీ జలుబు చేస్తుంది. తుమ్ములు, దగ్గు, జ్వరం వస్తాయమ్మా. అందుకని వర్షంలో ఆడుకోవద్దన్నాను. లేకపోతే మిమ్మల్ని ఎందుకు ఆడుకోవద్దంటాను చెప్పు’’ అంటూ అనునయంగా మాట్లాడింది.
‘‘వర్షంలో తడిస్తే ఎందుకు జలుబు చేస్తుంది. జలుబు చేస్తే తుమ్ములు వస్తాయా ? అని అమాయకంగా అడిగిందో కోడిపిల్ల . ‘‘జ్వరం కూడా వస్తుందా అమ్మా. అప్పుడు నెమలి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలా. డాక్టర్ ఇంజక్షన్ ఇస్తారా అమ్మ’’ అని మరో కోడిపిల్ల అడిగింది.
తల్లి పిల్లల్ని తన రెక్కల క్రింద కూర్చోబెట్టుకుని, ముద్దు చేస్తూ చెప్పసాగింది. ‘‘బుతువులు మారినప్పుడల్లా వాతావరణంలో మార్పులు జరిగి, జ్వరాలు, జలుబులు వస్తాయి. అందుకే వర్షంలో తడవకుండా ఉండటమే కాదు, నీళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ తాగకూడదు. బాగా తేటగా. ఉన్న నీళ్ళనే తాగాలి తెలిసిందా’’అని అమ్మ చెప్పింది.
ఎప్పుడైనా మనం నీళ్ళు ఎక్కడ మడుగులా ఉన్నా కూడా తాగేస్తాం కదా! ఇప్పుడు ఎందుకని తాగకూడదు. తాగితే! ఎందుకు జబ్బులు వస్తాయి అమ్మా! కోడి పిల్లలు తల్లి రెక్కల్లోంచి కొద్దిగా తల పైకెత్తి అడిగాయి.
‘‘వానకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. తేమ వల్ల బాక్టీరియా, వైరస్లు ఎక్కువగా పుడుతూ ఉంటాయి. నీళ్ళలోనూ, గాలిలోనూ ఎక్కువగా ఉంటాయి. అవి జబ్బుల్నీ కలగజేస్తాయి. కాబట్టి స్వచ్ఛంగా ఉన్న నీటినే తాగాలి’’ అమ్మ చెబుతుంటే ఆశ్చర్యంగా వింటున్నాయి కోడిపిల్లలు.
‘‘మరి నీళ్ళలో బాక్టీరియా, వైరస్లు ఉంటే మనకి తెలిసిపోతుంది కదా!, దూరంగా వెళ్ళి తాగుతాం కదా!, అలా చూసుకుని తాగవచ్చు కదా అమ్మ’’ అని అందరిలోకి చిన్నదైన కోడి పిల్ల అడిగింది.
తల్లి కోడి ఆశ్చర్యపోతూ, తన పిల్ల వంక చూసింది. ‘‘అబ్బో నువ్వు చాలా తెలివైన దానివే. మంచి ప్రశ్నవేశావు. ఇలాగే అలోచించి ప్రశ్నలు అడగాలి. అని చిన్న కోడి పిల్లను మెచ్చుకుంటూ, మిగతా పిల్లల వైపు తిరిగి’’ మీకూ ఈ అనుమానం వచ్చిందా. ఏదైనా విషయం వివరించినపుడు అర్ధం చేసుకోని ప్రశ్నలు అడగాలి’’ అని అన్నది తల్లి కోడి.
‘‘నీళ్ళలో బాక్టీరియా, వైరస్లు ఉంటే చూసుకుని, తాగవచ్చుగా అని అడిగావు కదా!, అది మన కంటికి కనిపించవు. కేవలం మైక్రోస్కోపు ద్వారా మాత్రమే చూడగలం. మనకు కనిపించవు కాబట్టే, పూర్వపు రోజులలో జలుబులు, జ్వరాలు ఎలా వస్తున్నాయో తెలిసేది కాదు. అప్పుడు అమ్మవారికి కోపం రావడం వల్ల ఇలా జరుగుతుందనుకునేవారు అమ్మవారికి మొక్కుకొని మనలాంటి కోళ్ళను, మేకలను బలి ఇచ్చేవారు. అమ్మవారు శాంతిస్తే, ఈ జబ్బులు తగ్గిపోతాయని అనుకునేవారు’’అంటూ తల్లి కోడి చెబుతూ ఉండగానే’’అమ్మా అమ్మా బలి ఇవ్వడం అంటే ఏమిటి’’ అని ఒక కోడిపిల్ల అడిగింది.
‘‘బలి ఇవ్వడం అంటే, అమ్మవారి విగ్రహం ముందు జంతువును నిలబెట్టి కత్తితో నరికేస్తారు’’ అని అమ్మ చెప్తూ ఉంది.‘‘కత్తితో నరికేస్తే మనం చచ్చిపోతామా అమ్మా’’ అంటూ ఇందాక ప్రశ్నించిన కోడిపిల్లే మళ్ళీ అడిగింది.
పిల్ల అమాయకత్వానికి తల్లి నవ్వుకుంటూ, ‘‘అవునే చిట్టి తల్లీ ! జంతువు చనిపోతేనే బలి ఇచ్చినట్లు అన్నమాట. అలా అమ్మవారు శాంతించి, జబ్బుల్నీ తగ్గించి, ప్రాణాలు పోకుండా చూస్తారని అనుకునేవారు అని అన్నది.
‘‘మరి ఇలాంటి జబ్బుల్నీ అమ్మవారు తెస్తుందా నిజంగా ’’అని మరో కోడిపిల్ల అడుగుతుంటే’’ కాదు కాదు బాక్టీరియా, వైరస్ల వల్లనే జబ్బులు వస్తాయి. అమ్మవారు కాదు. నాకు అర్ధం అయింది’’ అని ఇందాక అడిగిన కోడిపిల్ల ఉత్సాహంగా చెప్పింది.
‘‘శభాష్, భలే అర్ధం చేసుకున్నావు. జబ్బులు వ్యాప్తి చేసేది బాక్టీరియా, వైరస్లని తెలియకముందు అమ్మవారికి ఆగ్రహం వచ్చి, జబ్బుల్నీ వ్యాప్తి చేస్తుందని అనుకోనేవారు. ఎప్పుడైతే బాక్టీరియా, వైరస్‌లే కారణమని తెలిసిందో, వాటిని చంపడానికి మందులు కనుక్కున్నారు. ఆ మందులు వేసుకోవడం వలన జలుబు, జ్వరం, దగ్గులు తగ్గిపోతాయి. వీటన్నీంటికీ కారణం మైక్రోస్కోపే లేకపోతే భూమి మీద జంతువులు, మనుషులు ఎంతో మంది చనిపోయేవారు’’అని ఆగకుండా తల్లి కోడి చెప్పింది.
పిల్ల కోళ్ళు తల్లి చెప్పినదంతా జాగ్రత్తగా, ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టుకొని వింటున్నారు. ‘‘అమ్మా ఇప్పుడు తెలిసింది కదా మరి బలి ఇవ్వడం ఆపేశారా. అమ్మవారు అలా జబ్బుల్నీ వ్యాపించనివ్వదు అని తెలుసుకున్నారా.’’ అని మళ్ళీ ప్రశ్నించాయి.
‘‘లేదమ్మా! బాక్టీరియా, వైరస్‌లే రోగాలకు కారకాలు అని అందరికీ తెలిసిపోయింది. అందుకే జంతువుల్నీ బలి ఇవ్వకూడదు అని ప్రభుత్వం నిషేధాజ్ఞలు కూడా ఇచ్చింది కానీ, పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు అదేనమ్మా మన జంతువులకు వచ్చిన బాధ! ఏం చేస్తాం’’ అంటూ నిరాశతో కూడిన స్వరంతో చెప్పింది తల్లి కోడి.
అమ్మా! నాకొక సందేహం. రోగాలు ముమ్మరంగా వచ్చినపుడు చాలా మంది రోగాల బారిన పడి చనిపోతారు కదా! మళ్ళి ‘‘బలి’’ పేరుతో మరికొన్ని జంతువులను చంపేస్తే ఎలా. రోగాల వలననే చనిపోతున్నపుడు, ఆ చావుల్ని ఆపాలి కానీ మరల చావులు చంపడాలు ఏమిటి?, మనుషుల ప్రవర్తన నాకు అర్ధం కాలేదు.’’ అని కొద్దిగా తెలివి గల కోడి పిల్ల అడిగింది.
‘‘ఈ జ్ఞానం మనుషులకు ఉంటే బాగుండేదమ్మా! చిన్నదానివైనా భలే ప్రశ్న అడిగావు. రోగాలతోనే చాలా మంది చనిపోతుంటే, మళ్ళీ చూడడమేమిటి అని. శభాష్! ఈ తెలివి మనుషులకు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ వర్షాకాలపు జబ్బులకు పైరస్లు తెచ్చే జబ్బులకు ‘‘బలులు’’ ఇస్తూనే ఉన్నారు. ఈ మనుషులలో మార్పు వచ్చి, మనల్నీ, మేకల్నీ బలిచ్చే విధానం మానుకోవాలి . ఆ రోజుల కోసమే ఎదురు చూద్దాము’’ అని తల్లి కోడి నిట్టూరుస్తూ పిల్లలతో అన్నది.
అంతలో వర్షం తగ్గింది. పద ఇంటికి వెళ్దాం అంటూ పిల్లలను వెంట పెట్టుకుని తల్లి ఇంటికి బయలు దేరింది.
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.
