మా నాయనమ్మ కథలు-1

ఉప్పుడు పిండి

-లక్ష్మిమదన్

బడి నుండి వచ్చి బాగ్ ఇంట్లో పెట్టీ స్నేహితులతో ఆటలకి వెళ్ళాను. ఇంటి ముందు పెద్ద అరుగులు అక్కడే మా ఆట. వాడలోని పిల్లలు కూడా జత చేరారు. ఇంటి ముందు చాలా ఆటలు ఆడే వాళ్ళము చారు పత్తర్, తొక్కుడు బిళ్ళ, తాడాట ఇంకా ముట్టిచ్చుకునే ఆట ఆడుకునే వాళ్ళము, దాన్ని తుడుము ఆట అని కూడా అనేవాళ్ళము. అలసిపోయే వరకు ఆడుతూనే ఉండేవాళ్ళము సమయపాలన లేనే లేదు కదా పెరడుకి వీధికి మధ్య ఒకగోడ ఉండేది ఆగోడ కొంచెం ఎక్కితే మా పెరడంతా కనిపించేది. మరో పక్కన మా ఆంజనేయ స్వామి గుడి ఆగుడి కూడా మాకు ఆటస్థలమే, మాకు ఒక ఇంటి పెద్దలా అనిపించేవారు స్వామి. హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం ఆంజనేయుడి శ్లోకాలు చిన్నప్పటినుండే కంఠత వచ్చేవి. ఆటలు ఆడుతూ ఉంటే ఇంటి వైపు ధ్యాస మరిలింది.

ఆనాటి ఉపహారాలు ఉప్పుడు పిండి, తపాలా రొట్టె, అటుకుల చుడువా, ఎప్పుడో ఒకసారి పూరీలు ,బజ్జీలు మరియు అన్ని రకాల పేలాలు.

ఇంతలో పెరటిలో నుండి ఘుమ ఘుమలు రావడం మొదలయ్యాయి, ఒక్క ఉదుటున అందరం పెరట్లోకి పరిగెత్తాము , అక్కడ తుత్తురు చెట్టు కింద కట్టెల పొయ్యి దగ్గర నాయనమ్మ కూర్చొని ఉంది, పొయ్యి మీద పెద్ద గిన్నె చేతిలో సరాతం ( అట్ల కాడ) తో గిన్నెలో ఉప్పుడు పిండి కలుపుతూ ఉంది . గిన్నె కాలకుండా ఉండడానికి చేతిలో పచ్చి ఆకులను పట్టుకొని ఆ ఆకులతో గిన్నె పట్టుకొని ఉంది.

నాయనమ్మ వయసు అప్పటికే 90 ఏళ్లు. చక్కగా వినగలదు, చూడగలదు. ఆమెకి వండి అందరికీ వడ్డించడం అంటే ఎంతో ఇష్టం.

నేను ‘ ముసలి’ అని పిలిచినా పలికేది. రోజూ గొడవ పడే వాళ్ళం, వెంటనే పిలిచేది. కొంచెం నలతగా ఉంటే ఎన్ని దిష్టి మంత్రాలు వేసేదని.

నేను వెళ్లి ‘” ముసలి’ ఏం చేస్తున్నావ్ ?”అని అడిగాను,

“ఉప్పుడు పిండి చేస్తున్న” అని చెప్పి గిన్నెలో పిండి కలియ బెట్ట సాగింది. అంతా కలిపాక తల ఎత్తి పైకి చూసి
” అందరూ పొయ్యి సత్య నారాయణ ఆకులని కడిగి తెచ్చుకొండి” అన్నది. అందరం వెళ్ళి ఆకులు కోసి తెచ్చు కొని పొయ్యి చుట్టూ కూర్చున్నాం, 15 మంది పిల్లలం మొత్తం.

అందరికీ కొసరి కొసరి పెట్టింది. “బాగుంది” అంటూ అందరం మళ్లీ మళ్లీ వేయించుకుని తిన్నాము. మాతో వచ్చిన స్నేహితులు ” అబ్బ! మీ నాయనమ్మ ఉప్పుడు పిండి మంచిగ చేసింది” అని ఒకరు..
మరొకరు ” అవునే! మా ఇంట్లో ఇంత బాగా ఉండదు.. మరి మాకు నాయనమ్మ లేదు” మరొకరు” ఆకు నిండా పెట్టిందే కడుపు నిండి పోయింది..రాత్రికి అన్నం కూడా అవసరం లేదు” ఇలా అందరూ సంతోషంగా తిన్నారు..నాకు మా నాయనమ్మ చాలా గొప్పగా అనిపించింది..ఇంత సహనం ..దాతృత్వం ఎవరికి ఉంటుంది? అప్పుడు తెలియదు ..కానీ రాను రానూ అర్థం అయ్యింది.

మమ్మల్ని తృప్తిగా చూసి సంతోష పడ్డది. తనకి మాత్రం గిన్నెలో గుప్పెడు పిండి మాత్రమే మిగిలింది.

అలా తన చేత్తో ఎంతో మందికి భోజనాలు పెట్టింది, తెలియని వారు కూడా మా ఇల్లు వెతుక్కొని వచ్చే వారు, 98వ ఏట కూడా వంట చేసి పెట్టింది. వందవ ఏట కన్ను మూశారు… అయినా మా ముసల్ది మాతోనేవున్నట్టు అనిపిస్తుంది. మా మంచి నాయనమ్మ. ఎప్పుడూ మర్చిపోలేని మాముసలమ్మ మా మనసులో ఎప్పుడూ నిలిచే ఉంటుంది.

*****

Please follow and like us:

9 thoughts on “మా నాయనమ్మ కథలు-1 ఉప్పుడు పిండి”

  1. ఈ రచనను కథ అనడం కంటే గల్పిక లేదా తీపి జ్ఞాపకం లేదా మేలైన గతం అనవచ్చు. ఒక యాదృచ్ఛికం – ‘ఉప్పుడి పిండి ‘ గురించి గతవారమే స్నేహితులతో మాట్లాడడం తటస్థించింది. కొడుకులు లేని మా పెదనాయనమ్మ మా దగ్గరే ఉండేది. భర్తలేని ఆవిడ గుండుతో తలపై కొంగు కప్పుకునేది. ఆవిడ రాత్రి భోజనం ఉప్పుడి పిండి. తనే చేసుకునేది. అందువల్ల, ఇంట్లో పిల్లలందరి లాభం ఏమిటంటే, ఉదయాన్నే అందరికి తలా పిడికెడు ఉప్పుడి పిండి. ఎంత రుచిగా ఉండేదో.

  2. లక్ష్మిగారిది సృజనాత్మక శైలి. ఈకథ చదువుతూంటే
    చిన్నప్పటి జ్ఞాపకాల పొదరిల్లు లోకి వెళ్ళిపోతాము.
    అసలు ఇటువంటి శైలి గల రచనలు చాలా అరుదుగా
    వస్తున్నాయి. మన పాతతరం వాళ్ళను తలచుకుంటే
    చాలు .ఎన్నో జ్ఞాపకాలు వాటంతట అవే జ్ఞప్తికి వస్తాయి.
    ఉప్పుడుపిండి తాళింపుల గుభాళింపులు అదరహో
    అదరహః.

  3. ఆ రోజుల్లో, నానమ్మల్లో, అమ్మమ్మల్లో మాత్రమే కాదు పిల్లల నుంచి కూడా ప్రేమ, ఆప్యాయతలు అలా ఉండేవి. అప్పటి పిల్లల ఆటలు ఇప్పుడు కనిపించట్లేదు. ఏదేమైనా రచయిత్రి గారి బాల్యపు అనుభవం ఒక నానమ్మ కథగా అల్లరించింది. నా బాల్యం గుర్తుకు వచ్చింది. రచయిత్రి లక్ష్మీమదన్ గారికి అభినందనలు 💐💐అవేరా, హైదరాబాద్.

  4. లక్ష్మీ మదన్ గారి నాయనమ్మ కథలు మొదటి కథ ” ఉప్పుడు పిండి ” చదువుతుంటే భలే అనిపించింది. అటువంటి నాయనమ్మ గానీ బామ్మగాని ఉండటం నిజంగా అదృష్టం. ఆ ఇంట్లో పిల్లలకు ఏ లోటూ ఉండదు.
    ఆ తరం పెద్దమనుషులు ఆంతటి దయా హృదయంతో ఉండే వాళ్ళు. రచయిత్రి బాల్యంలో ఆటల గురించి చదువుతుంటే నా బాల్యం గుర్తుకు వచ్చింది. లక్ష్మీ మదన్ గారికి అభినందనలు.

  5. మీరు నయనమ్మ మేడమ్ గురించి చాలా చక్కగా రాస్తున్నారు

  6. లక్ష్మీ మదన గారి రచన నాయనమ్మ కథలు మొదటి కథ ” ఉప్పుడు పిండి ” చదువుతుంటే సరదాగా అనిపించింది. అటువంటి నాయనమ్మ గానీ బామ్మగాని ఉండటం నిజంగా అదృష్టం.జీవించినంత కాలం అందరికీ చేసి పెట్టటమే కానీ చేయించుకోవటం తెలియని కష్టజీవులు ఆఖరి శ్వాస వరకు.
    రచయిత్రి కి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.