స్నేహం 

                                                   -అనసూయ కన్నెగంటి 

     హరిత, భవిత ఇద్దరూ ఒకే బడిలో చదువుకుంటున్నారు.  ఇద్దరివీ పక్క పక్క ఇళ్ళే కావటంతో  కలిసే బడికి వెళ్తారు. అలా చిన్నప్పటి నుండీ కలసి మెలసి ఉండటంతో మంచి స్నేహితులయ్యారు.   అయితే ..పొరుగు ఊరిలో చదువుకునే గణిత అక్కడ చదువు మానేసి వీళ్ల తరగతిలో చేరింది.

     వచ్చిన కొద్ది రోజుల్లోనే  హరితకు, భవితకు మంచి స్నేహితురాలు అయిపోయింది గణిత.

     ఒకరోజు హరిత, భవిత వచ్చే సరికి గణిత తరగతి గదిలో కనపడలేదు. కొంతసేపు ఎదురు చూసి ఎంతకీ రాకపోయేసరికి గణిత కోసం వెదకటం మొదలు పెట్టారు. దూరంగా చెట్టు కింద తలొంచుకుని కూర్చుని ఉంది గణిత. స్నేహితులిద్దరూ గణిత దగ్గరకంటా వెళ్ళి “ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు ?” అని అడిగారు.

      స్నేహితులు ఇద్దరూ  అలా అడిగే సరికి గణితకు బాధ ఎక్కువై గొల్లున ఏడ్చేసింది.

    “ఏడ్వ వద్దు. ఏం జరిగిందో చెప్పు. మాకు చేతనైనది మేము చేస్తాము. అదే కదా స్నేహం అంటే “ అన్నారు హరిత, భవిత. దాంతో ధైర్యం వచ్చింది గణితకు.

     లేచి నిలబడి వెనక్కి తిరిగి “ చూడండి. నా గౌనంతా ఎంత ఎర్రగా ఉందో. మన తరగతిలో సుధాము నేను బడికి వస్తుంటే సీసాలో తీసుకు వచ్చి వెనుక నుండి నా మీద పోసాడు. ఈ గౌనుతో తరగతికి ఎలా వెళతాను? ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది “ అంది ఏడుస్తూ. గణిత చెప్పింది విని గౌను వైపు చూశారు హరిత, భవిత.

   వాళ్ళిద్దరికీ చాలా కోపం వచ్చింది. “పద..టీచర్ కి చెబుదాము. “ అంది కోపంగా హరిత. హరితకి దూకుడెక్కువ.

      వద్దంది భవిత. “ఎందుకు వద్దంటున్నావు భవితా? ఇలా ఎందుకు చెయ్యాలి “ కోపంగా అంది హరిత.

   “ అవును.అలా చెయ్యకూడదు. వాడు చాల అల్లరి. వాడికి బుద్ధి చెప్పాలంటే టీచర్ కి చెప్పకూడదు. రెండు రోజులు భయపడ్దా మూడవ రోజు మళ్ళీ పోస్తాడు. అప్పుడు ఎవరికి చెబుతాము? ప్రధానోపాధ్యాయుల వారికి చెప్పాలి. తర్వాత మళ్ళీ పోస్తే? అప్పుడెవరికి చెబుతాము? పై అధికారులకు చెప్పలేము కదా..! ఇలా చేస్తున్నాడని ఇంట్లో చెబితే మన అమ్మా, నాన్నా బడి మానిపించేస్తారు. అందుకని మన సమస్య మనమే పరిష్కరించుకోవాలి.

గణిత సమస్య గణితే పరిష్కరించుకోవాలి..”

    “ బాగుంది నువ్వు చెప్పింది. ఇక స్నేహితులం మనం ఉండి ఏమి లాభం?”

   “ఎంత స్నేహితులం అయినా మనమూ కొంత వరకే చెయ్యగలము. ఇవ్వాళ ఇలా జరిగింది. మనం ఉంటాము. రేపు ఇంకొక చోట ఇంకొకటి జరుగుతుంది. అప్పుడు మనం ఉండము. ఎలా? కాబట్టి..గణిత ధైర్యం పెంచుకోవాలి. తన సమస్యను తనే ధైర్యంతో ఎదుర్కోవాలి. తనలో అలాంటి శక్తి పెరిగిననాడు ఏదీ పెద్ద సమస్యగా అనిపించదు..”

    వింటున్న గణితకు నిజమే అనిపించింది.

        ఇప్పుడు తనకు జరిగినది అవమానంగా అనిపించలేదు.

  ఎలా సుధామునికి బుద్ధి చెప్పాలో అప్పటికప్పుడు ఆలోచన చేసిన గణిత భవిత వైపు కృతజ్ఞతగా చూసింది.

      లేచి నిలబడి కళ్ళు తుడుచుకుంటూ “పదండే ..తరగతికి వెళదాం” అంది.

      సంతోషంతో అంతా తరగతి దారి పట్టారు.

   “ ఇప్పుడు నీకు అర్ధమైందా? చేపను ఇవ్వటం కాదు..ఎలా పట్టాలో నేర్పు “ అని పెద్దలు ఎందుకు అన్నారో..” అంది భవిత హరితతో.

      అవునన్నట్టు ధీమాగా తల ఊపింది గణిత.

                                                            *****   

Please follow and like us:

2 thoughts on “ స్నేహం (బాల నెచ్చెలి-తాయిలం)”

Leave a Reply

Your email address will not be published.