మాన్ బుకర్ అందుకున్న తొలి అరబిక్  రచయిత్రి 

-జగద్ధాత్రి 

మాన్ బుకర్ అంతర్జాతీయ బహుమతిని అందుకున్న తొలి అరబ్ రచయిత్రి జోఖా అల్హర్తి. ఆమె రచించిన పుస్తకం “ సెలెస్టియల్ బాడీస్” ఆంగ్లానువాదానికి ఈ బహుమతి లభించింది ఈ సంవత్సరం. తొలి సారిగా ఒక ఓమన్ రచయిత్రి నవల ఆంగ్లం  లోకి అనువాదమై మాన్ బుకర్ వంటి ప్రతిష్టాత్మకమైన బహుమతిని సాధించింది. ఇది ప్రపంచ రచయిత్రులందరికీ గర్వకారణం. అనువాదకురాలు మారిలిన్ బూత్ తో కలిసి 50,000 పౌండ్ల బహుమతిని పంచుకున్నారు రచయిత్రి. ఈ అనువాదాన్ని శాండ్ స్టోన్ ప్రెస్ ప్రచురించింది. 

అనువాద సాహిత్యానికి కూడా ప్రాచుర్యం కలిగించే విధంగా ఈ బహుమతి మరింత మంది ఆరబ్ రచయితలకు ప్రోత్సాహకరంగా, స్పూర్తిదాయకంగా  ఉంటుందని పలువురు మేధావులు అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.ఓమన్ లో 1978 లో జన్మించిన అల్హార్తి ఇంతకు ముందు ఆరబిక్ భాష లో రచించినవి రెండు  కథల సంపుటాలు, బాల సాహిత్యం ఒకటి, మూడు నవలలు. ఈ నవల 2010 లోనే అరబిక్ భాషలో రచించారు. ఆంగ్లం లో మంచి నైపుణ్యం గల ఈమె సంప్రదాయ అరబిక్ కవిత్వం లో ఏడింబర్గ్ లో డాక్టరేట్ చేసి సుల్తాన్  ఖాబూస్ విశ్వవిద్యాలయం, మస్కాట్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఓమన్ లో నివసించే అల్హర్తి అక్కడి చరిత్ర ను నేపధ్యంగా తీసుకుని నేటి ఆధునికత వరకుఅక్కడి వారి జీవితాల్లో వచ్చిన మార్పును ఈ కథ రూపంగా మనకు అందించింది. ఇక అనువాదకురాలు మారిలిన్ బోస్టన్ లో 1955 లో జన్మించారు. ఆక్స్ఫర్డ్ మగ్దలెన్ కాలేజ్ లో ఉన్నత స్థానం లో ఉన్న ఈమె ఓరియెంటల్ ఇన్స్టిట్యూట్ లో సమకాలీన ఆరాబ్ సాహిత్య అధ్యయనం కోసం స్థాపించిన ఖాలిద్ బిన్ అబ్దల్లాహ్ ఆల్ సౌద్ పేరిట పదవిని నిర్వహిస్తున్నారు.   

 ఆద్యంతమూ ఒక పట్టు తో. ఆసక్తికరమైన నిర్మాణం తో సాగిన ఈ నవల మేధావి వర్గాలలో చాలా ఆసక్తిని కలిగించదమే కాక చాలా మంది మన్ననలు అందుకుంది. ఆల్ అవాఫి అనే గ్రామంలోని ముగ్గురు అక్కా చెల్లెళ్ల జీవిత కథ ఇది. మయ్య, అస్మా, ఖావ్లా ముగ్గురి జీవితం చుట్టూ అల్లబడిన ఈ కథలో , వీరి కుటుంబాలు సంప్రదాయల బానిసత్వం నుండి వలస పాలన తర్వాత నేటి ఆధునికతవైపు ఎలా మళ్ళారు అన్నది రచయిత్రి అంతర్లీన సూత్రంగా రచిస్తారు. గత కాలపు బానిసత్వ చరిత్ర కలిగి ఉన్న ఒక వ్యాపారి కుటుంబం లోని ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎలా జీవితాలను ఎదుర్కున్నారో అతి లాఘవంగా, ఆసక్తిగా చిత్రించారు రచయిత్రి. మార్పు జీవితం లో తప్పనిసరి అని తెలుసుకున్న ఈ మహిళలు ఏ విధంగా ఆ మార్పుకి అనుగుణంగా మార్పు చెందారు, జీవితాలను ఎలా మలుచుకున్నారు అన్నదే కథ. 

కథనంలో కొంత సంక్లిష్టత ఉందన్న అభ్యంతరం కొందరికి ఉన్నప్పటికీ, నవల ఆద్యంతమూ ఆసక్తికరంగా  చదివించేదిగా ఉందని చాలా మంది విమర్శకులు పేర్కున్నారు. 

ముగ్గురు మహిళలు మయ్య, (కుట్టు పని చేస్తుంది), అస్మా( పుస్తకాల పురుగు), ఖావ్లా( అందగత్తె), అందరూ ఎవరికి వారే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్లే. తల్లి తండ్రులు అజ్జన్ , సలీమ కథ పూర్తయే లోపల వాళ్లేమీ శ్రమ పడకుండానే ముగ్గురు కూతుళ్ళకి  పెళ్లిళ్లు అయిపోతాయి. ముగ్గురి వివాహాలు మూడు రకాలుగా జరుగుతాయి. ఇష్టం లేకుండానే అబ్దల్ ని పెళ్లి చేసుకున్న మయ్య, అతి మామూలుగా పెళ్లిని తీసుకున్న అస్మా, ఎక్కడో విదేశాల్లో ఉన్న తన ప్రియుని కోసం ఎదురుచూసే ఖావ్లా. ముగ్గురు చివరికి ఎలా జీవితాలలోని మలుపులను స్వేకరించారో అదే ఇతివృత్తం.  నవల మొత్తానికి మంచి ఆకర్షణ శైలి, కథనం. కథలోని పాత్రల ద్వారానే పాఠకులు కథ తెలుస్తుంది. ముగ్గురు మహిళలు, వారి తల్లితండ్రులు, జరిఫా (వీరి జీవితాలతో సంబంధం కలిగిన బానిస మహిళ), మయ్య భర్త అబ్దల్ ఇలా కథనం వారి వారి వివిధ కోణాల నుండి సాగుతుంది. అబ్దల్ చెప్పే కథలో తన గత జీవితం గురించి, తన తండ్రి అనుభవించిన బానిసత్వం గురించిన చరిత్ర తెలుస్తుంది. మానవ సంబంధాలు ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలను చారిత్రిక నేపధ్యం నుండి చర్చించడం రచయిత్రి ఉద్దేశంగా మనకు కనబడుతుంది. సంప్రదాయానికి ఆధునికతకు నడుమ చరిత్రను ఒక కుటుంబానికి అన్వయించి  చిత్రిస్తుంది రచయిత్రి. 

1988 లో తొలి సారిగా ఆరబ్ రచయిత  నగ్యూబ్ మెహ్ఫూజ్ కి నోబెల్ పురస్కారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకి అరబ్ దేశాల సాహిత్యం విశ్వవ్యాప్తమౌతుంది ఈ పుస్తకం తో అని ఇసోబెల్ అబుహౌల్ (ఎమిరేట్స్ లిటరరీ ఫెస్ట్, సీ ఈ ఓ) పేర్కొన్నారు. అంతేకాక అనువాద సాహిత్యానికి కూడా పురస్కారాలు లభిస్తే ఇది ప్రపంచ సాహిత్యం లో మరిన్ని దేశాల భాషల సంప్రదాయాలని , సంస్కృతిని  మరింత అర్ధం చేసుకునే అవకాశం ఇస్తుందని కూడా పలువురు మెచ్చుకున్నారు. తొలి ఓమన్ మహిళ గా మాన్ బుకర్ స్వీకరించిన అల్హర్తి , అనువాదకురాలు మారిలిన్ బూత్ కూడా మహిళలు కావడం ,రచన కూడా మహిళల జీవితాల గురించే కావడం విశేషం. “ ప్రతిభావంతమైన ఊహాత్మకత తో , మారుతున్న సమాజం లోనికి , మరుగు బడిన జీవితాలను చిత్రించడం ఈ రచన గొప్పతనం” అని పేర్కొన్నారు మాన్ బుకర్ న్యాయనిర్ణేతలు. అరబ్ సాహిత్యానికి , అందునా ముఖ్యంగా అరబ్ మహిళా సాహిత్యానికి విశ్వకీర్తి లభించే మంచి రోజులు వచ్చాయన్నది ప్రపంచం అంతా ఏకగ్రీవంగా అంగీకరించిన విషయం.  

సెలెస్టియల్ బాడీస్ ఒకచిన్న పరిచయం 

విడివిడిగా ఒక్కొక్కరిది ఒక్కో కధ కలిపితే ఒక కుటుంబ కథ. అన్నా కరెనినా లోని  టాల్ స్టాయ్ తొలి వాక్యం “Happy families are all alike; every unhappy family is unhappy in its own way.” నాకు స్పూర్తి ఈ నవలకి అంటుంది రచయిత్రి.

ఈ నవల ఒమన్ దేశం లో జరిగిన కథ. ఆల్ అవాఫి అనే ఊహా ప్రదేశమైన ఒక గ్రామం. మూడు తరాల మనుషుల కథను చెప్తారు రచయిత్రి. 1970లో అన్నీ దేశాలలో లో కెల్లా ఆఖరిగా ఒమన్ దేశం  బానిసత్వాన్ని నిషేధించింది. సులేమాన్ ఆల్ అవాఫి నగరం లో ఒక బానిసల వ్యాపారం చేసే వర్తకుడు. నిషేధం తర్వాత చాలా మంది బానిసలు దేశాన్ని వదిలి వెళ్లిపోతారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న జరిఫా అనే ఆమె మాత్రం సులేమాన్ వద్దనే ఉండిపోతుంది. సులేమాన్ జరిఫా ప్రేమ లో ఉన్నట్టు ఆమె సులేమాన్  భార్య ని చంపినట్టు అర్ధం అవుతుంది కథలో. సామాజిక మైన బానిసత్వం తొలగినా ఇంకా ఆ ఛాయలు ఎలా జీవితాలను ప్రభావితం చేస్తాయో సులేమాన్ కొడుకు అబ్దల్లా కథనం ద్వారా తెలుస్తుంది. 

సులేమాన్ కొడుకు అబ్దల్లా బానిసత్వం అంతరించినందుకు ఆనందిస్తాడు. బిసినేస్స్ స్కూల్ లో చదువుకుని ఒమన్ రాజధాని మస్కాట్ లో వ్యాపారవేత్తగా స్థిరపడతాడు. అబ్దల్లా మయ్యా ని పెళ్లి చేసుకుంటాడు. కానీ మయ్యా తన ఇష్ట ప్రకారం కాక తండ్రి కుదిర్చిన పెళ్లి చేసు కున్నందుకు ఆనందంగా ఉండదు. తనని మస్కట్ లో క్రిస్టియన్ డాక్టర్ల హాస్పిటల్ లో పురుడు పోయించుకోవడానికి ఇష్టపడని భర్త పై కక్ష సాధించడానికి అన్నట్లు  తన మొదటి కూతురికి లండన్ అని పేరు పెడుతుంది. తర్వాతి కొడుకుకి సలీం అని పేరు పెడతారు. తర్వాతి కొడుకు ముహమ్మద్ పుట్టుకతో వికలాంగుడు కావడం అబ్దల్లా ని బాధిస్తుంది.  

మయ్యా తండ్రి అజ్జన్, తల్లి సలీమా. సలీమ అన్నయ్య ఓమాని అంతర్యుద్ధం లో సైనికునిగా పొరాడి మరణిస్తాడు. మయ్యా పెళ్లి అయిన కొద్ది రోజులకే అజ్జన్ మరో నాజియా అనే బెడాయిన్ స్త్రీ ప్రేమలో పడతాడు, వారిరువురు రహస్య ప్రణయం సాగిస్తారు. ఆ తర్వాత ఆ సంబంధం అజ్జన్ తప్పు తెలుసుకొనేలా యూసుఫ్ చేయడం తో ముగుస్తుంది. ఈ నడుమ వారి ఆచారాలూ, వ్య్వహారాలూ, సంప్రదాయాలూ అన్నీ కూడా కథనం లో భాగంగా మనకు విశదమౌతాయి. 

అజ్జన్ సలీమ కి ముగ్గురు కూతుర్లు.  మయ్య, ముగ్గురు అమ్మాయిలలో పెద్దది. మధ్య అమ్మాయి అస్మా , మూడో అమ్మాయి ఖవ్లా. అస్మా పుస్తకాల పురుగు తండ్రి కుదిర్చిన పెళ్లి ఒప్పుకుంటుంది. ఖాలిద్ అనే చిత్రకారుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. ఖాలిద్ ఆమెకు ఎక్కడికైనా వెళ్ళే స్వేచ్ఛనిచ్చినా చాలా మటుకు ఆమెను తన అధీనం లో ఉంచుకుంటాడు.ఎంతగా ప్రేమించాలని ప్రయత్నించినా ఈ విషయం ఆమె మనసులో మెదులుతూనే ఉంటుంది.  ఖవ్లా తనకు వరసైన బంధువు నాసిర్ ని పెళ్లి చేసుకోవాలని ఆస పడుతుంది. అతను కెనడా లో చదువుకుని అయిదేళ్లకు కానీ రాడు. వచ్చినా ఆమెను పేలి చేసుకుని మరింత డబ్బులు పోగేసుకుని తిరిగి కెనడా వెళ్లిపోయీ పదేళ్ళకు వస్తాడు. వారిద్దరికి పిల్లలు కలిగినప్పటికి ఖవ్లా అతనికి విడాకులు ఇచ్చేస్తుంది. తాను గతం లో పోగొట్టుకున్న అన్నిటికి నాసిర్ ను క్షమించలేను అంటుంది. పదేళ్ళు తన కోసమే స్వార్ధం తో మసిలిన నాసిర్ , అప్పుడు తాను అనుభవించిన వేదన ఆమె మరువలేదు. 

మయ్య, అబ్దల్లా కూతురు లండన్ డాక్టర్ అవుతుంది. పెళ్లి చేసుకుంటుంది కానీ అతను మంచివాడు కాక పోవడం వలన విడాకులు ఇచ్చేస్తుంది. విడాకులు తీసుకున్నందుకు ఓమన్ సంస్కృతిలో సిగ్గుగా తల వంపులుగా భావిస్తుంది. సలీం ఎందుకు పనికి రాని బద్ధకస్తూడిగా తయారు అవుతాడు. చివరిలో అబ్దల్లా ముహమ్మద్ అనే తన వికలాంగుడైన కొడుకుని చంపేసాడా అన్నట్టు ముగుస్తుంది. మయ్యా తానని ఎప్పటికీ ప్రేమించలేదు అన్న సంశయం అబ్దలా మనసులో మెదులుతూనే ఉంటుంది. నవల మొత్తం ముందుకి వెనకకి గత వర్తమానం లోకి జీగ్ జాగ్ పజిల్ లా సాగుతుంది. అందువలన పాఠకుడు కొంచం ఓపిక తో చదవాలి. 

ఈ నవల లో పెళ్లి అనేది సంస్కృతి పరంగా స్త్రీల పట్ల ఎంత అన్యాయమో చెప్తుంది. పెళ్లి అనే దాన్ని స్త్రీల ను అణచివేయడానికి ఉపకరణం లా ఉంటుంది, ఎందుకంటే వారికి పెళ్లి తమ ఇష్టం  వచ్చినట్టు చేసుకునే హక్కు లేదు. అందువలన ఏ పెళ్లి కూడా పూర్తిగా సఫలం కాదు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు వివాహ వ్యవస్థకి బలైన వారే. పెళ్లి బానిసత్వం రెండూ హానికరక మైన వ్యవస్థలే అని రచయిత్రి నిరూపిస్తుంది. వ్యక్తిగత ఇష్టాలకు ఆస్కారం లేని రెండు వ్యవస్థలే. ఓమన్ లోని బానిసత్వాన్ని నిషేధించిన మార్పు ఎంత మంచిదో అలాగే వివాహం లోని స్వేచ్చా స్వతంత్రాలు స్త్రీకి ఎంత ముఖ్యమో చెప్పే కథ ఇది. బానిసత్వం నిషేధం సామాజిక అభివృద్ధి లో మార్పు అయితే వివాహం లో స్వేచ్చ స్త్రీ హక్కు అని చాటి చెప్పగలదీ నవల. సలీమ అజ్జన్, అస్మా ఖాలిద్, మయ్య అబ్దల్లా, ఖవ్లా నాసిర్, జరిఫా ఆమె భర్త ఇలా ఇన్ని జంటల వైవాహిక సమస్యలని సంబంధాన్ని  చిత్రిస్తుంది రచయిత్రి. 

ఓమన్ లో బానిసత్వాన్ని నిషేధం తర్వాత కథ ఆయినా బానిసత్వపు రోజుల్లో మనుషులు ఎలా చూడబడేవరో కూడా ఈ నవలలో  చర్చకు వస్తాయి. నిషేధం ముందర బానిసలుగా జరిఫా తల్లిని అంకాబుతా ని తన యజమానికి ఎదురు చెప్పినందుకు జైల్లోపెట్టి ఆమెను రేప్ చేస్తారు. వ్యక్తిగతమైన స్వార్ధాల కోసం వ్యవస్థ ఎలా వాడుకోబడుతుందో కూడా చర్చిస్తుంది రచయిత్రి. 

నవల మొత్తం మూడవ మనిషి చెప్తున్నట్టు ఉన్న ఒక్కొక్క పాత్ర దృష్టికోణం  నుండి కథను నడిపిస్తారు , ముఖ్యంగా అబ్దలా పాత్ర ఎక్కువ్గా చెప్పినట్టు కనిపిస్తుంది. మయ్యా, అబ్దల్లా, అస్మా, లండన్, జరిఫా, సలిమ, అజ్జన్, ఇలా. సగానికి పైగా నవల అబ్దల్లా చెప్పినట్టే ఉంటుంది. చివరి భాగం కూడా అబ్దల్లా తన కొడుకు ముహమ్మద్ ను సముద్రం లో జారవిడిచినట్టు ముగిస్తారు రచయిత్రి. అబ్దల్లా గత వర్తంనాల నడుమ ఎలా జీవితం సాగిందో ఎక్కువగా అది ప్రధమ పురుషలో చెప్తారు. ఖవ్లా నాసిర్ పూర్తిగా ఓమన్ లో స్థిరపడి పిల్లలు పుట్టాక, ఇంటి పట్టునే  ఉంటూ పనికి తప్ప బయటికి వెళ్లని సమయం లో అతనికి విడాకులు ఇస్తాను అంటుంది. ఇది అందరికీ పిచ్చిగా అనిపిస్తుంది కానీ ఎంత చెప్పిన గతాన్ని క్షమించలేను అంటుంది. ఇలా సాగే ఈ కథనం చాలా సంక్లిష్టమైన సామాజిక , దేశీయ, సంస్కృతిక భౌతిక అంశాలతో కూడిన మానవ సంబంధాలను చిత్రిస్తుంది రచయిత్రి . 

సెలెస్టియల్ అంటే దివ్యమైన మూర్తులు అని కూడా అర్ధం ఉంది. సెలెస్టియల్ బాడీస్ అని పేరు పెట్టడం లో కూడా ఖగోళం లో మనిషి లోని ప్రేమ , భావాలపై చంద్రుడు ప్రభావం ఉంటుంది, చంద్రుడు ఏ గ్రహానికి దగ్గరగా ఉంటే అక్కడ దివ్య శక్తి ఏర్పడుతుంది అన్నది ప్రతీకాత్మకంగా పెట్టిన పేరు. శని గ్రహ ప్రభావం వలన చంద్రుడు దూరం అయితే అది నభో మండల శక్తిని క్షీణింపజేస్తుంది. అలాగే ప్రేమ దురమైతే మనసుల్లోనూ మార్పు వస్తుంది. ఇది ప్రతీకాత్మకంగా తీసుకుంటే ,  ఒక్కొక్క పాత్రా ఈ సామాజికమైన మార్పును ఎలా స్వీకరించారు అన్నది, సమాజం ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉండడం కొంతవరకు, తమదైన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడం రెండూ ఈ పాత్రల్లో కనిపిస్తాయి. ఖవ్లా విడాకులు, అలాగే లండన్ విడాకులు ఇవ్వడం ఇవన్నీ స్త్రీలు ఏ అధిక్యతకూ లొంగని తమదైన వ్యక్తిత్వం కలిగి ఉంటారని నిరూపించే కథ ఇది. అనాదిగా బానిస అయిన స్త్రీ ఇప్పుడే రెక్కలు విప్పుకుని స్వేచ్చా ప్రకటించుకుంటుంది. స్త్రీలోని అనురాగానికి ఆత్మ గౌరవానికి నడుమ సంఘర్షణ ఉంది కథలో. 

మాన్ బుకర్ ఇంటెర్నేషనల్ సైట్ లో ఒక ఇంటర్వ్యూ లో రచయిత్రి ఇలా అన్నారు. “ప్రపంచమంతా విశాల దృష్టితో హృదయం తో మా దేశం వైపు చూడాలి. ప్రపంచం లో ఎక్కడైనా ప్రేమ, స్నేహం, నష్టం, బాధ , ఆస ఇవి అన్నీ మనుషుల్లో ఒక్కలాగే ఉంటాయి , మానవాళి ఈ సత్యాన్ని గ్రహించడానికి చాలా పని చేయాల్సి ఉంది”. 

బానిసత్వపు రోజులనుండి నేటి సెల్ఫోన్ యుగం వరకు సామాజిక పరంగా మనుషుల్లోని మార్పు, సాంకేతిక పరంగా వచ్చిన మార్పు , అలాగే జీవన వైఖరిలో వచ్చిన మార్పులు చిత్రించింది రచయిత్రి. నిజానికి ఒక సమగ్రమైన కధాంశం లేదు ఇందులో చాలా విషయాల నడుమ కథను అద్దింది అంతే. అందుకే కథ అంతా ఇదీ అని చెప్పేసే అవకాశం లేదు. గతానికి వర్తమానానికి నడుమ పాత్రల మానసిక సంఘర్షణ పాఠకుడు ని కూడా చాలా ఆవేదన కలిగిస్తుంది. పైగా కథనం లో కంటిన్యూటి లేకపోవడం కూడా అన్నీ గుర్తు పెట్టుకుని నవల చివరికి కథను అల్లుకోవాల్సిన అవసరం పాఠకుడికి కలుగుతుంది. కుటుంబ నేపతయ్ఙ్గా చిత్రించినా ఇది ఒక సమాజం కథ అందుకే ఇన్ని సంక్లిష్టమైన సామాజిక, వ్యక్తిగత, రాజకీయ మైన ఎన్నో అంశాలు ఉన్నాయి. నిజానికి ఒక్కో పుటను విశ్లేశిస్తే చాలా చరిత్రాత్మకమైన విషయాలు తెలుస్తాయి. 

2010లో అరబిక్ భాష లోరాయబడిన ఈ నవల విశేష ఆదరణ పొందింది. ఈ నవల మీద చాలా విస్తృతమైన చర్చ, అలాగే పరిశోధనాత్మక మైన సాహిత్యం కూడా వెలువడింది. ప్రపంచమంతా ఈ అనువాదం ద్వారా తమ అస్తిత్వాన్ని గుర్తిస్తారు అనే ఆనందాన్ని వ్యక్తం చేశారు రచయిత్రి. 

“మానవ సంబంధాలన్నీ ఎప్పుడూ సంక్లిష్టమైనవే నా దృష్టిలో. చాలా మంది స్త్రీలు బానిసలు గా చూడబడుతున్నప్పటికీ చాలా శక్తిమంతులు. అరబ్ పాఠకులని ఆకర్షించినంత గా ప్రపంచ పాఠకులని అలరించక పోవచ్చును కానీ ఇందులోని సాహిత్య సార్వజనీనత అందరినీ ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాను”. అంటుంది అల్హర్తి.  

సంస్కృతిలోని ఆచారాలు, వ్యవహారాలు, నిర్దేశనలు ఇలా చాలా ఉన్నాయి ఈ కథలో. ఒమన్ గురించి తెలియని వారికి అర్ధం కాక పోవచ్చును కథ. ఏ విషయాన్ని విశదీకరించదు రచయిత్రి. కానీ చదివితే ఒమాని స్త్రీల గురించి పూర్తి అవ్గహన వస్తుంది. “ఈ నవలలో ముగ్గురు అక్క చెల్లెళ్ళు  ప్రేమలోనూ పెళ్ళిలోను తమదైన స్వతంత్రాన్ని , సంక్లిష్టతని, శక్తిని నిరూపిస్తారు, అదే ఇప్పుడు వర్తమానం లో ఒమన్ స్త్రీల వ్యక్తిత్వం” అని చెప్తుంది జోఖ ఆలహార్తి. వీలైతే పుస్తకం చదువుకోవడం మంచిది ఆసక్తి ఉన్నావారు. తెలుగు పాఠకులకి ఈ కథ పరిచయం చేద్దామని చేసిన చిన్న ప్రయత్నం ఇది.

                                                              ***** 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.