జగద్ధాత్రి గారితో చివరి ఇంటర్వ్యూ 

ఇంటర్వ్యూ : సి.వి. సురేష్ 

*సి.వి.సురేష్ : మీ బాల్యం, విద్య ఎక్కడెక్కడ సాగింది!?

*జగతి : మూడవ క్లాస్ వరకు విజయనగరం సెయింట్ జోసెఫ్ లో చదివాను. 4, 5 వైజాగ్ సెయింట్ జోసెఫ్ లో సాగింది. 6వ తరగతి, ఆర్నెల్లు వైజాగ్ కోటక్ స్కూల్లో  సాగి, 12 ఏళ్లకే మెట్రిక్ పాస్ అయ్యాను. 14 ఏళ్లకి పి యు సి (ప్రైవేట్) , బి ఏ (ఆంగ్ల సాహిత్యం, పోలిటిక్స్, సైకాలజీ) విశాఖ సెయింట్ జోసెఫ్స్ కాలేజ్, ఏం ఏ 19 ఏళ్లకే ఆంధ్ర యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడల్ తో ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయ్యాను. గవర్నర్ కుముద్ బెన్ జోషి తో అవార్డ్ స్వీకరించింది 1986, నవంబర్ 15న. ఆ తర్వాత ఎం ఏ (ఫీలాసఫీ, సోషియాలజీ, ఏ యు ), బి ఎడ్, ఎం ఎడ్(మధురై కామరాజ్ ) ఎం ఎస్ సీ (సైకాలజీ, మద్రాస్ యూనివర్సిటీ), ఎం ఫిల్ (అరబిందో చిన్ని కవితల్లోని తాత్వికత , మధురై కామరాజ్) ఇలా నా విద్యాభ్యాసం సాగింది..

..

*సి.వి.సురేష్ : ప్రస్తుతం జాబ్!? 

*జగతి : లిటిల్ హార్ట్స్ అనే స్కూల్ స్వయంగా స్థాపించి 1996 నుండి 2002 వరకు విజయవంతంగా నడిపాను , ఆ తర్వాత 2003 నుండి 2010 వరకు బి ఎడ్ కాలేజీల్లో ఇంగ్లీష్, సైకాలజీ , ఫిలాసఫీ ఫాకల్టీ గా పనిచేశాను. ఇప్పుడు షిప్పింగ్ రంగంలో ఈస్ట్ కోస్ట్ మెరిటైమ్ అకాడెమీ లో డీన్ గా షిప్పింగ్ ఇంగ్లీష్ చెప్తున్నాను. లైఫ్ టైమ్ జాబ్ సాహిత్యం.

..

*సి.వి.సురేష్ : అసలు కవిత్వం అనే పదం ఏ వయసులో విన్నారు!? ఎప్పుడు చిక్కబడుతూ వచ్చింది!?

*జగతి : ఆరేళ్ల వయసపుడు కవిత్వం పద్యం అన్నీ డాడీ నుండి విన్నాను , అమ్మమ్మ నుండి కొంత నేర్చుకున్నాను.

..

*సి.వి.సురేష్ : అస్తిత్వ పోరాటాలు… ఆ నేపధ్యం లో కవిత్వం పరిణతి చెంది, విశృంఖలం అయ్యిందని భావిస్తున్నారా!? లేక కవిత్వం ఒక గాడిలో చిక్కుకుందని అనుకుంటారా!?

*జగతి : అస్తిత్వ పోరాటానికైనా.. ఇంకే పోరాటానికైనా, దేనికైనా.. కావాల్సింది మళ్ళీ రాజకీయ పరిష్కారమే. ఈ చిన్న పోరాటాలన్నీ ఆ మెయిన్ స్ట్రీమ్ పోరాటం లో కలవాల్సిందే అప్పుడే సరి అయిన దశ దిశ చేరుతాయి. 

..

*సి.వి.సురేష్ : మీకు హఠాత్తుగా ఏదేని సందర్భం లో మీరు ఊహించని విధంగా మీరు గొప్పగా భావించే కవులు మీకు చాలా దగ్గరగా తారసపడటం జరిగిందా!? అలా ఎదురైన సంఘటన పై మీ స్పందన!?

*జగతి : అలా ఎదురైన గొప్ప కవి రామతీర్థ .. ఆ పై జ్వాలాముఖి.. ఇప్పుడు సినిమా స్టార్స్ ని ఎంత ఆరాధనగా చూస్తున్నారో… మేము అలా కవులను చూసేవాళ్లం. అసలు వాళ్ళు మాట్లాడడటం గొప్పగా భావించే వాళ్ళం… ఇది ఊపిరి ఉన్నంత వరకు మరవలేని అనుభూతి. 

..

*సి.వి.సురేష్ : మీరు ఇప్పటికి ఎన్ని కవితలు రాసారు!?

*జగతి : ఎన్ని అని చెప్పలేను అలా అని ఎన్నో అనీ చెప్పలేను హింది, ఇంగ్లీష్ , తెలుగు లో రాస్తాను.

..

*సి.వి.సురేష్ : ఎన్ని సంకలనాలు వేశారు!? వాటి పేర్లు.!? 

*జగతి : ఒకటే పుస్తకం “సహచరణం’ దానికి రెండు పురస్కారాలు వచ్చాయి. ఒకటి “ పాతూరి మాణిక్యమ్మ అవార్డ్” ,  రెండవది అజోవిభో ప్రతిష్టాత్మకమైన ‘సరిలేరు నీకేవ్వరు’ అవార్డ్.

..

*సి.వి.సురేష్ : ఈ సంకలనాల నేపథ్యం లో మీకు ఎదురైన అనుభవాలు!?

*జగతి: నేను నమ్మినది రాశాను , ఏ అక్షరం మార్చకుండా వేశాను , నా మరదలు కీ. శే. ఉషా నాకు స్ఫూర్తిని డబ్బుని ఇచ్చి పుస్తకం తీసుకొచ్చేలా చేసింది. మా తమ్ముడు జగన్నాథ్ (యు ఎస్ ఏ ) కూడా నాకు అన్ని విధాలా సహాయ పడ్డాడు. రామతీర్థ పుస్తకాన్ని అందంగా దిద్ది తీర్చారు. 

..

*సి.వి.సురేష్ : వచన కవిత్వం లో ప్రస్తుతం వస్తున్న వైవిధ్య భరిత మైన వస్తువు కారణంగా అది అనుకొన్న మేరకు ప్రజలకు చేరువ అవుతోందా!?

*జగతి : ఈ రోజుల్లో ఒక అంశాన్ని కవిత్వం చేయక ముందే వందల సంఘటనలు జరిగి పోతున్నాయి. నేటి కవి అందుకే చాలా స్పీడ్ గా ఉండాల్సి వస్తోంది. అందాల్సిన వాళ్ళకి చేరుతోంది చాలా ఎక్కువగా.. సోషల్ మీడియా కూడా అందుకు సహకరిస్తోంది బాగా. 

..

*సి.వి.సురేష్ : ఏదైతే కవిత్వ లక్ష్యం  అనుకుంటామో.. ఆ లక్ష్యం పూర్తవుతోందా!? ప్రజలకు చేరువ అవుతోందా!?

*జగతి : కవిత్వ లక్ష్యం పూర్తవుతోంది కవి పరంగా, అది ప్రేక్షకుల్లో ఎలాంటి స్పందన తెస్తుందో అన్నది అంచనా వేయడం లేదు మనం. ఏ రచన గురించి కూడా సమగ్ర విమర్శ రావడం లేదు. ఒక వేళ వచ్చినా అది పొగడ్త కావాలి తప్పించి ఏ మాటా ఎక్కువగా ఉండకూడదు. లేకపోతే కవులు రచయితలూ స్వీకరించరు. అది మన దురదృష్టం. మంచి విమర్శ ఉన్న నాడే మంచి రచనలు వస్తాయి అన్న జ్వాలాముఖి మాట ఎవరికి గుర్తు ఉంది నేడు. ఇది బాగా విచారం కలిగిస్తుంది . పూర్వం ఇలా లేరు మన సాహితీవేత్తలు.

..

*సి.వి.సురేష్ : కవిత్వం  ఏ దిశగా కదులుతోంది!? సమాజం లో సమస్యల పట్ల కవులు సరైన రీతిలో స్పందిస్తున్నరని భావిస్తారా!?

*జగతి : స్పందిస్తున్నారు. కవిత్వం ఎప్పుడూ ప్రగతి దిశగానే కదులుతోంది. 

..

*సి.వి.సురేష్ : మీ ఈ సాహితీ ప్రయాణం లో ఎప్పుడైనా…ఈ  కవిత్వం ఏంటి!? ఎలాంటి ప్రయోజనం ఇది!? అని నిరాశ పడిన సందర్భాలు ఉన్నాయా!?

*జగతి : లేదు… కలలో కూడా లేదు.

..

*సి.వి. సురేష్ : మీ ఈ సాహితీ ప్రయాణం లో  అత్యంత (height of joy) ఆనంద పడిన సందర్భం ఏదీ?

*జగతి : నా అక్షరాలు పుస్తక రూపం లో వచ్చి సాహితీ వేత్త, మంచి మనిషి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా విజయవాడ లోనూ, నాకు అత్యంత ప్రేమ మయమైన సాహితీ వేత్త శ్రీ సలీం చేతుల మీదుగా వైజాగ్ లోనూ ఆవిష్కరణ జరిగినప్పుడు .

రెండవ సందర్భం నవ్య ఈ వారం కవిత లో ‘వాసన’ అనే నా కవిత వచ్చినప్పుడు వచ్చిన పెద్దవారి ఫోన్లు, ఎన్. గోపి , సలీం, నిఖిలేశ్వర్ ఇంకా ఎందరో పెద్దలు. అలాగే ‘రూప వస్తువు’ నా కథ నవ్య లో వచ్చినప్పుడు మొదటి ఫోన్ నిఖిలేశ్వర్ ది, సలీం భార్య డాక్టర్ గీత  ఫోన్ చేసి మెచ్చుకున్నప్పుడు.

ఎప్పుడు ప్రాణం పోతుందో నని పుస్తకమంతా ఒకేసారి చదివేశానమ్మా అని అమ్మ అన్నప్పుడు… ఈ రెండు సందర్భాలు నాకు చాలా ఆనందంగా నా ఎదుట నిలబడుతాయి. 

..

*సి.వి.సురేష్ : వర్ధమాన కవులకు మీరిచ్చే సందేశం!?

*జగతి : మనం చాల సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం, కవులారా.!. విషయాన్ని సంపూర్తిగా అర్ధం చేసుకోండీ , ఆలోచనలు స్పష్టంగా ఉంటే మీ అక్షరాలు కూడా స్పష్టంగా ఉంటాయి. అప్పుడు మీరు ఏ వేపు నిలబడుతున్నారో మీకే అర్ధం అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అయి పాఠకులను కన్ఫ్యూజ్ చేయకండి.

..

*సి.వి. సురేష్ : ఈ కవిత “కాలగాయం”.. ఏ నేపథ్యం లో రాసారు!?  దాని సోల్ కంటెంట్ !?

* జగతి : కాలం గాయాలను మాన్పుతుంది అని ఎవరో ఒకసారి అన్నారు తరచూ వినిపించేదే అయినా మనసు అంగీకరించని విషయం నాకది. డాడీ ఎప్పటికీ నా మనసులో ఉంటారు అందరూ అమ్మా అని ఏడిస్తే ఇప్పటికీ ఏదైనా కష్టం వచ్చినా డాడీ అని ఏడుస్తాను. అందుకే అన్నాను కాలం గాయాలను మాన్పదు, మనుషులను మరిపింపదు. 

..

*****

Please follow and like us:

2 thoughts on “జగద్ధాత్రి గారితో చివరి ఇంటర్వ్యూ ”

  1. సురేష్ గారు! మీరు FB లో ముందే పోస్ట్ చేశారనుకుంటాను. అప్పుడు నేను చదవలేదు. చాలా మంచి ఇంటర్వూ! జగధాత్రిగారి అభిప్రాయాలు చాలా నిక్కచ్చిగా ఉన్నాయి. ఆమె మనసు, ఆమె కవితలు తెలిశాయి.ఆమె చదువు డిగ్రీలు, వచ్చిన బంగారు పతకాలు, సన్మానాలు అపురూపం.అపూర్వం! చాలా మంచి ఇంటర్వూ చేశారు.మీకు అభినందనలు!!

Leave a Reply

Your email address will not be published.