అస్తిత్వపోరాటానికి చిరునామా: అమృతా ప్రీతమ్

– ఆర్.శాంతసుందరి

ఒక స్త్రీ అందంగా ఉంటే, ఆపై ప్రతిభ గలదైతే, తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలని అధిగమించేందుకు ఈ ప్రపంచంతో హోరాహోరీ పోరాడుతూ పేరు తెచ్చుకోడం ప్రారంభిస్తే ఆమెకి ఎన్ని రకాల సమస్యలు ఎదురౌతాయో తెలుసుకోవాలనుకుంటే అమృతా ప్రీతమ్ జీవితమే దానికి మంచి ఉదాహరణ.

అమృతా ప్రీతమ్ కూడా ప్రేమ్ చంద్ , శరత్ చంద్ర లాగ తెలుగు సాహితీ ప్రేమికులకి సుపరిచితమే. ౧౦౧౯,౨౧ ఆగస్ట్ లో పుట్టిన అమృత ౩౧ అక్టోబర్ ౨౦౦౫ లో చనిపోయింది.జీవించి ఉన్నన్నాళ్ళూ ఎవరికీ భయపడకుండా ,తలవంచకుండా తను అనుకున్నది సాధించేందుకే సంఘర్షిస్తూ జాతీయ స్థాయిలోనూ ,అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపును సంపాదించుకుంది.కానీ అరవై- అరవైఅయిదేళ్ళ క్రితం అన్ని రంగాల్లోనూ పురుషులే అగ్ర స్థానాల్లో ఉన్న రోజుల్లో ఒక స్త్రీ పైకి వచ్చి తనప్రతిభనీ ఉనికినీ చాటుకోవాలంటే ఎంత కష్టపడాలో అమృతా ప్రీతమ్ జీవితాన్ని చూస్తే తెలిసిపోతుంది.ఈ నాటికీ ఖాప్

 పంచాయత్ లాంటివి రాజ్యమేలుతున్న పంజాబ్-హరియానా ప్రాంతాల్లో ఆ కాలంలో ఒక స్త్రీ ఎలాంటి అడ్డంకులని ఎదుర్కొనిఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు.అసలు స్త్రీ కలం పట్టుకుని తన మనోభావాలని కవితలుగానూ, కథలూ, నవలలుగానూ ప్రకటించడమనేదే లేని కాలంలో అమృత తన కలాన్నే కరవాలంగా చేసుకుని యుద్ధం చేసింది.

స్త్రీలని మగవాడి ఆస్తిగా భావించే రోజుల్లో,వాళ్ళకి నోరువిప్పి మనసులో మాట చెప్పుకునే స్వేచ్ఛ లేని రోజుల్లో సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమృత తండ్రి చండశాసనుడు.ఆమె తల్లి చిన్నప్పుడే చనిపోయింది.తండ్రికి భయపడుతూనే పెరిగి0ది అమృత.ఆమె వివాహం కూడా తండ్రి నిర్ణయించిన వ్యక్తితోనే జరిగింది.కానీ ఆమె వ్యక్తిత్వంలో తిరుగుబాటు ధోరణి,ఆత్మవిశ్వాసం బైట పడేందుకు కొంత సమయం పట్టింది.దొరికిన జీవితంతో సర్దుకుపోలేక స్వేచ్ఛ కోసం పోరాడింది, సర్దుకుపోనందుకు మూల్యం కూడా చెల్లించవలసి వచ్చింది.

చిన్నతనం నుంచే ఆమెలో రచయిత్రి లక్షణాలు ఉండేవి.తను రాయాలనుకున్నది నిర్భయంగా రాసింది.ఎవరెన్ని ఘోరమైన విమర్శలు చేసినా తట్టుకుని ముందుకి సాగింది. 

ఈ కింది కవిత చూడండి –

ఇవాళ నేను

నా ఇంటి నంబర్ ని చెరిపేశాను

వీధి నుదిటిమీదున్న

పేరునీ తుడిచి తొలగించాను-

మీకు నేను దొరకాలనే ఉంటే

ప్రతి దేశంలోనూ,ప్రతి ఊళ్ళోనూ

ప్రతి వీధిలోనూ ఉన్న

ఇళ్ళ తలుపుల్ని తట్టండి

ఇది ఒక శాపం,ఒక వరం

ఎక్కడ స్వేచ్ఛ సంపాదించుకున్న 

ఆత్మ గుర్తులు కనబడతాయో

-అదే నా ఇల్లనుకోండి!

పంజాబీ సాహిత్య రంగంలోని వారే కొందరు…వారిలో దాదాపు అందరూ పురుషులేనని వేరే చెప్పాలా…అమృతని విశృంఖలంగా పురుషులతో ప్రేమ వ్యవహారాలు నడిపే స్త్రీ అనీ,ఆ విశృంఖలత ఆమె రచనలలోనూ కనిపిస్తుందనీ సాహిత్య సభలనుంచి ఆమెని బహిష్కరించినంత పని చేశారు.అమృత ప్రేమించింది,ప్రేమించానని ధైర్యంగా చెప్పింది,కానీ ఆమె జీవితంలో అది ఒక పార్శ్వమే తప్ప అదే ఆమె జీవితం కాదు.ప్రసిద్ధ పంజాబీ రచయిత కుశ్వంత్ సింగ్ తన శ్రేయోభిలాషి అని నమ్మి ఆమె ఒకసారి తన ఆత్మకథ రాయాలని ఉందని ఆయనతో చెప్పిందిట.ఆయన ఆమె ప్రేమ వ్యవహారాల గురించే ఎక్కువ మాట్లాడి ,’నీ ఆత్మకథ లో పెద్దగా రాసేందుకేముంటుంది? ఒక రెవెన్యూ స్టాంప్ వెనక ఇమిడిపోతుంది అన్నాడట వ్యంగ్యంగా.తరవాత ఆమె తన ఆత్మకథ రాసినప్పుడు దానికి ’ రసీదీ టికట్’(రెవెన్యూ స్టాంప్) అని శీర్షిక పెట్టి ఆయనకి మొహం మీద కొట్టినట్టు జవాబు చెప్పింది.ఆమె వ్యక్తిత్వం లో ప్రేమ, ప్రేమించడం అనేవి నిండి ఉన్నప్పటికీ,ఆమెకి సమాజం గురించీ,సంస్కృతి గురించీ,రాజకీయాల గురించీ గొప్ప అవగాహన ఉండేది.దేశ విదేశాల్లో రచయిత్రిగా గొప్ప పేరు తెచ్చుకుంది.బైటి దేశాల్లో కూడా చివరి వరకూ కొందరితో గాఢమైన మైత్రిని నిలుపుకుంది.

దేశ విభజన జరిగినప్పుడు తను పడ్డ బాధని ఇలా వ్యక్తం చేసింది-

’ ౧౯౪౭ లో దేశ విభజన జరిగింది.సామాజిక,రాజకీయ,ధార్మిక విలువలు గాజు పాత్రల్లా పగిలిపోయాయి.పగిలిన ఆ గాజుపెంకులు జనం నడిచే దారంతా పరుచుకున్నాయి.అవి నా కాళ్లకీ,నుదుటికీ కూడా గుచ్చుకున్నాయి. ’(రసీదీ టికట్ఇది ౨౦౦ పుటలకి పైగా ఉన్న అద్భుతమైన రచన.) 

 పాకిస్తాన్ లోని గుజరన్ వాలా నుంచి ఢిల్లీ వెళ్ళేందుకు రైల్లో కూర్చున్న ఆ కవయిత్రి చేతిలో కలం పట్టుకుని గాజుపెంకులు చేసిన గాయాలతో బాధ పడుతూ,హీర్ రాంఝా అనే కావ్యాన్ని రాసిన ప్రసిద్ధ పంజాబీ కవి,వారిస్ షాహ్ ని సంబోధిస్తూ ఒక కవిత రాసింది-

ఈరోజు వారిస్ షాహ్ ని తన సమాధినుంచి మాట్లాడమంటున్నాను

ప్రేమ కావ్యానికి కొత్త పుట తెరవమంటున్నాను

పంజాబ్ లో పుట్టిన ఒక అమ్మాయి ఏడిస్తే పెద్ద కావ్యమే రాశావు

ఈరోజు లక్షలమంది అమ్మాయిలు ఏడుస్త్తూ నీతో అంటున్నారిలా

బాధితుల మిత్రమా! నీ పంజాబ్ ని ఒకసారి చూడు

అడవులన్నీ శవాలతో కిక్కిరిసిపోయాయి,చెనాబ్ రక్తసాగరమే అయింది…

అమృత కవిత్వం కాలం ,ప్రాంతం అనే సరిహద్దులని దాటి ప్రపంచాన్నంతా తమలో ఇముడ్చుకుంటుంది-

ఇది జలియన్ వాలా

అక్కడి గోడల్లో మౌనంగా కూర్చున్న 

తూటాలు చేసిన రంధ్రాలు…

ఇది సైబీరియా

ఈ నేలమీద ముక్కలు ముక్కలుగా

మంచులో గడ్డకట్టిన ఆర్తనాదాలు…

కాన్ సన్ట్రేషన్ క్యాంపుల్లో

బట్టీల బూడిదలో నిద్రపోతున్న

మనిషి మాంసం వాసన…

ఇది హిరోషిమా

ఒక మూల పడి ఉంది

చిరిగిపోయిన దస్తావేజులా…

ఈ పంక్తులు అమృత హృదయ వైశాల్యాన్నీ, సున్నిత మనస్తత్వాన్నీ తెలుపుతాయి.

అమృత చిన్నతనం నుంచే కవిత్వం రాసేది.వయసు ప్రభావం వల్ల ఆ కవితల్లో ప్రణయం, తిరుగుబాటు ధోరణీ ఎక్కువగా ఉండేవి.ప్రకృతి అంటే ఆమెకి విపరీతమైన ప్రేమ ఉన్నప్పటికీ చుట్టూ ఉన్న సామాజిక సమస్యలని ఆమె పట్టించుకోకుండా పోలేదు.తరవాత ఆమె పరిధి  మరింత విస్తృతమైంది.విదేశాలలో జరిగిన సాహిత్య సభలలో పాల్గొనడం ఆమెకి మరింత విశాల దృక్పథం ఏరడేందుకు తోడ్పడింది.ఇటలీ, లండన్,యుగోస్లావాకియా,బల్గేరియా తదితర దేశాలకి వెళ్ళి తన కవితలు చదవడం వల్ల అక్కడి రచయితలతో స్నేహం కలిసింది.తమకన్నా గొప్ప రచయితలని కలుసుకుని వాళ్ళ రచనలు వినడం,చదవడం వల్ల వర్ధమాన రచయితల మీద,వాళ్ళ సృజన మీద వాళ్ళకి తెలియకుండానే  ప్రభావం పడుతుంది. 

అమృత మనసు ఎక్కువ బాధ పడింది తనవాళ్ళైన పంజాబీ రచయితలే తనని అంటరానిదానిలా చూసి విమర్శించడం.దేశ దేశాల్లో గొప్ప అభిమానులనీ,స్నేహితులనీ ఎందరినో సంపాదించుకున్నప్పటికీ,ఆమె ఆత్మకథలో చాలా సందర్భాల్లో ఈ లోటు గురించి  బాధపడుతూ రాసింది.

అమృత ఏం రాసినా అందులో ప్రత్యక్షంగానో,పరోక్షంగానో ప్రేమ స్థాయీభావం గా తప్పక ఉండేది.ఆత్మకథలో తన జీవితంలో ప్రేమ పాత్ర గురించి ఇలా రాసుకుంది:

పదహారో ఏటనుంచే నా పరిచయం ఒక భగ్న ప్రేమికురాలిలాగే ఉంది.ఆ బాధ ముల్లులా ఎక్కడో గుచ్చుకుంటూనే ఉంటుంది.అందుకే ఆ పదహారో ఏడు ప్రతి సంవత్సరం నా జీవితంలో భాగంగా ఉండిపోతూ వస్తోంది.ఓర్పుతో,తృప్తితో జీవితంలో పనికిరాని విలువలతో చేసుకున్న ఒప్పందం వల్ల సమాధి స్థితిలాంటిది ఏర్పడి మొత్తం జీవితం నిరర్థకంగా గడిచిపోతుంది. సమాధిస్థితిలో ప్రశాంతంగా ఉండే వరాన్ని కోరుకోకుండా,దారితప్పే శాపాన్ని ఎంచుకున్నందుకు నాకు ఆనందంగా ఉంది…నా పదహారో ఏడు ఇప్పటికీ నావెంటే ఉంది,కానీ ఇప్పుడు దాని మొహం బాగా పరిచితమైనట్టు అనిపిస్తుంది నాకు.పైగా ఇప్పుడది దొంగలా గోడ దూకి రావక్కర్లేదు.అడ్డుకున్న ప్రతి వ్యక్తినీ ఓడించి మరీ ముందుకెళ్తుంది.బైటినుంచి వచ్చే వ్యతిరేకతనే కాదు,నా యాభై ఏళ్ళ వయసుని కూడా ఓడిస్తుందది-ఇప్పటికీ నా చుట్టూ ఉండేవన్నీ ఒంటిమీది బట్టలు బిగుతైపోయినట్టు ఆత్మని పీడిస్తాయి,జీవితాన్ని ఇంకా ఆస్వాదించాలన్న దాహం తో పెదవులు ఎండిపోతాయి,నక్షత్రాలని చేత్తో తాకాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది,ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా నా శ్వాస నిప్పులు చెరుగుతుంది .

౧౯౪౪లో కొత్తగా కలం పట్టి కవిత్వం రాస్తున్న సాహిర్ లుధియాన్వీ ని అమృత ప్రీత్ నగర్ అనే ఊళ్ళో ఒక కవి గోష్ఠిలో కలిసింది.అతను ఆదర్శవాది, గాఢమైన కవితలు వినిపించాడు.ఆమె గొప్ప అందగత్తె,ఆపైన ప్రతిభ గల కవయిత్రి.అక్కడ ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి, మనసులు కలిసిన తరవాత ఇద్దరి మధ్యా ఏర్పడిన సంబంధం సమాజం ఆమోదించనటువంటిది.

సాహిర్ ని కలుసుకున్నప్పుడు అమృత పెళ్ళైన స్త్రీ, ప్రీతమ్ ఆమె భర్త. మరీ చిన్నప్పుడే జరిగిన పెళ్ళి అది. అతనితో ఆమె జీవితం సంతోషంగా గడవలేదు.

సాహిర్ లాహోర్ లోనూ అమృత ఢిల్లీ లోనూ ఉండేవారు. వాళ్ళిద్దరి మధ్యా ఉత్తరాలే నడిచాయి. అమృత సాహిర్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. కానీ సాహిర్ ఎందుకో దాన్ని ఇంకా ముందుకి తీసుకుపోయే ప్రయత్నం చెయ్యలేదు. రహస్యంగా ఎప్పుడైనా కలుసుకున్నా మౌనంగా ఒకరివైపు ఒకరు చూస్తూ గంటలు గంటలు గడిపేసేవారు. అలా ఎప్పటికీ దూరంగానే ఉంటూ ప్రేమించుకోవడం వల్లనేమో అమృత చివరివరకూ సాహిర్ ని గాఢంగా ప్రేమిస్తూనే ఉంది. వీళ్ళిద్దరిమధ్యా అల్లుకున్న ప్రేమ గురించి రాయాలంటే అది వేరే ఒక పుస్తకమే అవుతుంది!

ఇక అమృత జీవితంలోకి ప్రవేశించిన రెండో వ్యక్తి ఇమ్ రోజ్. ఇతను చిత్రకారుడు. అమృతకి చాలాకాలంగా అతనితో పరిచయం.ఆమె చనిపోయేవరకూ, నలభైయేళ్ళు అతనితో కలిసి జీవించింది. ఆమె ఆరోగ్యం పాడయి మంచం పట్టినప్పుడు ఇమ్ రోజ్ ఆమెకి మంచం మీదే అన్ని సేవలూ చేశారు. అతను ఆమెకన్నా ఆరున్నరేళ్ళు చిన్న, కానీ అలాంటివేవీ వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమకి అడ్డంకి కాలేదు.’నీకు నేనున్నాను,’ అని ఆమెకి ప్రియుడిగా, స్నేహితుడిగా నాలుగు దశాబ్దాలు తోడుగా ఉన్న అలాంటి వ్యక్తిని ఎవరు గౌరవించరు? సమాజం ఎన్ని రకాలుగా విమర్శించినా మనసున్న మనుషులు ఆ అనుబంధాన్ని ఆదర్శమనే అంటారు ! 

***

గుల్ జార్ అమృతా ప్రీతమ్ కవితలని తన  గొంతుతో చదివి ఒక ఆల్బమ్ వెలువరించాడు. అందులో భాగంగా ఇమ్ రోజ్ కీ ఆమెకీ మధ్య నలభైయేళ్ళ పాటు నెలకొన్న అనుబంధాన్ని గురించి చెపుతూ ఇలా అంటాడు : అమృతా ప్రీతమ్ జీ 20వ శతాబ్ది పొడుగూతా కవిత్వం మీదే ప్రయాణం చేసింది . ఆ శతాబ్ది ముగియగానే ఆమె శరీరం అలసిపోయిందేమో గాని మనసు ఇంకా స్ఫూర్తిని కోల్పోలేదు. బహుశా ఆమె లేచి నిలబడబోతే  ఇమ్ రోజ్ చెయ్యందిoచారేమో ,ఆమె వెనక్కి తిరిగి చూసినా చెయ్యి వదల్లేదేమో, అందుకే ఆమె ఈ కవిత రాసిందేమో!

మీకోసం ఆ కవిత – 

                               నిన్ను మళ్ళీ కలుసుకుంటాను

నిన్ను మళ్ళీ కలుసుకుంటాను

ఎక్కడో ,ఎప్పుడో తెలీదు నాకు

నీ ఊహల్లో ఒక కట్టుకథనౌతానో

నీ కాన్వాస్ మీద నిగూఢ రేఖలా పరుచుకుని

నిన్నే తదేకంగా చూస్తూ ఉంటానో !

ఒక సూర్య కిరణాన్నై

నీ రంగుల ఆలింగనంలో ఒదిగిపోతానో

నీ కాన్వాస్ మీద నన్ను నేనే చిత్రించుకుంటాను.

ఎలాగో,ఎక్కడో తేలీదు నాకు-

కానీ తప్పకుండా కలుసుకుంటాను నిన్ను.

వాగులా మారి

నురుగుల జల్లుని మండే నీ గుండెలమీద 

చల్లగా వెదజల్లుతానో…

ఈ జీవితం నావెంటే నడుస్తుందని తప్ప

ఇంకేమీ తెలీదు నాకు.

శరీరం నశించిపోయాక

అంతా నశించినట్టే;

కానీ జ్ఞాపకాల దారాలు

అల్లుకుపోతాయి శాశ్వతంగా .

ఆ దారాలని ఏరుకుని

అల్లుకుని

నిన్ను మళ్ళీ కలుస్తాను.

***

ఇమ్ రోజ్ అమృత ఒకే ఇంట్లో నలభై యేళ్ళకు పైగా కలిసి జీవించారు. వాళ్ళ అనుబంధం ఎలాంటిదో ఇమ్ రోజ్ మాటల్లోనే వినండి-

“మేమిద్దరం భార్యా భర్తలా కాదు, స్నేహితుల్లాగే కలిసి ఉన్నాం. మా ఇద్దరి గదులూ వేరు వేరు. ఇద్దరి సంపాదనా విడి విడిగానే ఖర్చుపెట్టుకునేవాళ్ళం. ఒకరిమీద ఒకరు పెత్తనం చెలాయించేవాళ్ళం కాదు. పూర్తి స్వేచ్ఛా జీవుల్లా బతికాం. అందుకే అన్నాళ్ళు కలిసి ఉన్నా మేమెప్పుడూ పోట్లాడుకోలేదు, ఆఖరికి అలగడం, కోపగించుకోడం కూడా ఉండేది కాదు. ఒకరంటే ఒకరికి ఇష్టం, గౌరవం, ప్రేమ. మేమెప్పుడూ,’నువ్వంటే నాకు ప్రేమ’ అని చెప్పుకోలేదు.ప్రేమ ఒక అనుభూతి,మాటల్లో చెప్పలేని అద్భుతమైన ఒక భావం.అమృత మూర్తీభవించిన ప్రేమ! ఆమెది బాహ్య సౌందర్యం మాత్రమే కాదు,అంతస్సౌందర్యం కూడా.

’ఇమ్ రోజ్ లాంటి వ్యక్తి దొరకడం అమృతకి కూడా లభించిన అరుదైన అదృష్టం! ఎక్కడో తప్ప అందరికీ అలాంటి అదృష్టం దొరకదు,’ అంటుంది ప్రసిద్ధ రచయిత్రి సుధా అరోరా.

అమృతా ప్రీతమ్ తన ౮౬వ యేట చనిపోయింది. ఆమె భౌతిక దేహాన్ని ఇమ్ రోజ్ తాళ్ళతో కట్టనివ్వలేదు.తనే స్వయంగా ఆమె దగ్గరున్న రంగురంగుల దుపట్టాలతో కట్టి,తన చేతులతో ఎత్తి చితిమీద ఉంచాడని చూసినవాళ్ళు చెపుతారు. ఆమె మీద అంత ప్రేమ ఆయనకి. ప్రేమలోనే జీవించి, చివరి క్షణం వరకూ అరుదైన ప్రేమని చవిచూసి, నిండైన జీవితాన్ని అనుభవించి ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది అమృత…ఆమె జీవితమే ఒక ప్రేమ-కావ్యం!

***

ఇది అమృతా ప్రీతమ్ జీవితాన్ని అద్దంలో కొండని చూపడం లాంటి ప్రయత్నం మాత్రమే. ఆమె సాధించిన విజయాలూ, పోగుచేసుకున్న  అనుభవాలూ అందరికీ ఒక చిన్న వ్యాసంలో తెలియజేయడం అనేది సాధ్యం కాని పని.

*****

Please follow and like us:

One thought on “అనుసృజన-అస్తిత్వపోరాటానికి చిరునామా: అమృతా ప్రీతమ్”

  1. అమృతా ప్రీతం ప్రేమమయి. ఆమె జీవితాన్ని ఎంతో మధురంగా చెప్పారు. వ్యాసం లో తెలుగు అంకెలు, ఎంతమంది అర్థం చేసుకుంటారు. మంచి తీపి మిఠాయిలో రాళ్ళ వలే తగిలాయి తెలుగు అంకెలు.

Leave a Reply

Your email address will not be published.