కొత్త అడుగులు-2

కొత్తతరపు చిక్కని కవిత్వస్వరం సుభాషిణి !

 –శిలాలోలిత

ఇటీవలి కాలంలో కవిత్వం రాస్తున్న కవయిత్రులలో చిక్కని కవిత్వం రాసే శక్తి సుభాషిణికి ఉంది. కొన్ని సంవత్సరాలుగా కవిసంగమంలో రాస్తున్న ఆమె కవిత్వం ఏవిధంగా మార్పుకు గురవుతూ, పరిణతి చెందుతూ వచ్చిందో గమనించే అవకాశమూ నాకు కలిగింది. అందుకే ఈ కవయిత్రి మీద  ప్రత్యేకాభిమానం. అధ్యయనం, జీవితం మీద, కవిత్వం పట్ల ఉన్న మక్కువా ఆ మూడింటినీ కలిపి కవిత్వాన్ని చేస్తున్న తీరూ సుభాషిణిని ఈ కాలంలో నిలబడగలిగే కవయిత్రిగా చేశాయి.   

రాసే కవితలలో అక్కడక్కడా  నిరాశ కనిపించినా జీవితపు సంఘర్షణలని ఎదుర్కున్న ధైర్యమే ఆమెను ఆప్టిమిస్ట్ గా తయారు చేసిందేమో. కవిత్వంతో తన నిరాశలన్నీ  వదిలేసి, అదే కవిత్వంలో ఒక ఆశావాద దృక్పథంతో కొనసాగటాన్ని గమనించవచ్చు. కవయిత్రులలో ఉన్న బలం ఇదే. జీవితాల్లోని చీకట్లని కవిత్వంతో తుడిచేసే ప్రయత్నమే వారిని మరింత బలంగా తయారు చేస్తుంది.  “అక్కడెందుకో ఈ రోజు ఎడారి కురుస్తోంది” ఇలాంటి ఒక్క వాక్యం కోసం ఎన్నెన్ని జీవిత సంఘర్షణలనీ, ఎంతటి నిశ్శబ్దాన్ని విని ఉండాలి. చూడటానికి దాదాపుగా ఎక్కువ శాతం కవితలు ఇలాంటి వాక్యాలతోనూ, విరహాన్ని, ఎడబాటును సూచించే వాక్యాలతోనూ ఉన్నా ఆమె చెప్పిందీ, ఊహించిందీ ఉన్నతజీవితాన్నేనేమో. ప్రతీక పురుషుడూ, వ్యక్తీకరణ విరహమూ కానీ రెండుక్షణాల ఆలోచనలో కవయిత్రి చెప్పాలనుకున్నది ఏమిటో అర్థమవుతుంది. జీవితమ్మీద ఉన్న అంతులేని ప్రేమనీ, జీవించటంలోని ప్రతీ సవాల్ నీ ఆమె ఆనందంగా ఆహ్వానిస్తున్న తీరు తెలిసిపోతుంది. కవిత వెనక ఉన్న కవిత్వం అద్బుతం అనిపిస్తుంది.

కవిసంగమంలో వచ్చే కాలమ్స్, అక్కడ వచ్చిన సలహాలూ, సూచనలూ తనను పూర్తిస్థాయి కవయిత్రిగా నిలబెట్టాయని ఆమె చెబుతూ వస్తోంది. తనని తాను కవయిత్రిగా మార్చుకుంటూ, ఇతర కవుల కవిత్వాన్ని గమనించుకుంటూ  కవిత్వంలోని అనేకానేక నిర్మాణ, తాత్విక విషయాలను గమనించుకుంటూ ముందుకు సాగానని ఆమె అభిప్రాయం అయి ఉండవచ్చు. రాసే విధానంలో ఆధునికత, నవ్యత, ఊహా శబలత, ఒక కొత్తతరపు వ్యక్తీకరణా మళ్ళీ మళ్ళీ చదివించేలా ఉంటాయి. రోజు రోజుకూ ఎదుగుతున్న కవిత్వపు మొక్క ఆమె. అచిరకాలంలోనే వృక్షమై ఎదుగుతుంది.ఇన్నేళ్ళ కాలంలో తనకవిత్వాన్ని గమనించినప్పుడు వచ్చిన నమ్మకం ఇది.
సుభాషిణి అంటే మంచి మాటకారి. నిజమే, ఎన్నెన్ని సంభాషణలు, ఎన్ని మాటలూ ఆమె కవిత్వాన్ని ఆవరించాయి. ఆ మాటకారితనమే కవిత్వమంతా వ్యాపించింది. ఎక్కువగా తనతో తాను, తనకైతాను, తనచుట్టూ ఉన్న సమాజమూ, ప్రకృతితో తాను మాట్లాకున్న మాటలే ఇలా కవిత్వమై పోయాయి.      కవిత్వం అంటే పైకి కనిపించే అక్షరాలు, పదాలు మాత్రమే కాదన్న సత్యం అర్థం చేసుకున్నాక, భాషలో ఉండే క్లిష్టపదాల మేళవింపే కవిత్వం కాదన్న విషయం అర్థమైపోతుంది. ఆ పిదప భాష లోలోతుల భావాన్ని పరచటం ఆరంభమవుతుంది. అందుకే సుభాషిణి కవిత్వంలో ఎక్కడా పదాడంబరాల జోలికి పోలేదు. అతి తేలికైన మాటల్లో, రోజువారీ మాట్లాడుకునే పదాలకే కొత్త కొత్త రంగులని తొడుగుతూ నేలమీద పరుచుకున్న ఇంద్రధనుస్సులాంటి ముగ్గులా ఆమె కవిత్వం ఉంటుంది. చదువుతున్నంత సేపూ మనచుట్టూ మనమే తిరుగుతూ మనలని మనమే శోధించుకున్నట్టు మన రోజువారీ భాషలోనే మనం మాట్లాడుకున్నట్టు కవిత్వమై మనముందుకు వస్తాయి.

ఇదివరకటి రోజుల్లో ఇంకా ఈ సినిమాలూ, టీవీలూ రంగప్రవేశం చేయక మునుపు వీధినాటకాలూ, జానపద కళారూపాలూ ఇలాగే ప్రజల్లో ఉండేవి. జనసామాన్యం మాట్లాడుకునే భాషలోనే కావ్యాలూ, పాటలూ మనుషుల నోళ్ళలో ఆడుతూ ఉండేవి. ఆ గతకాలాన్ని కోల్పోని సుభాషిణి అదే టెక్నిక్ ని కవిత్వంలోకి పట్టుకు వచ్చింది.  కొన్ని కవితలు చదువుతున్నప్పుడు ఆ అక్షరాలన్నీ మనముందే ఆ సంఘటనని ఆవిష్కరించిన అనుభూతిని పొందుతాం. కొన్నిసార్లు కళ్ళని దాటుతున్న దుఃఖసముద్రాలు చెక్కిలిమీదకి జారటాన్ని అనుభూతిస్తాం. ఏదో ఒక గొప్ప ఫిలాసఫీ చెబుతూనే ఉన్నట్టుండీ నిరాశ ఒడిలో మొహన్ని దాచేస్తుంది. ఆ నిరాశ ఎందుకా అని అనుకునే లోపే ధైర్యంగా దాన్ని జయించటం పాఠకున్ని సంతోషపరుస్తుంది. ఇదొక అద్బుతమైన టెక్నిక్. చదువుతున్న మనిషికి ఒక ప్రశ్న వేసి మళ్ళీ సమాధానాన్ని చేరుకునే క్లూ అందించటం. దీనివల్ల కవిత్వాన్ని చదవటం ఉందదు అనుభవించటం, అనుభూతించటం తప్ప. కొత్త తరం దీన్ని ఆకళింపు చేసుకుని, కవిత్వంలో ఆ పద్దతి వాడటం అపురూపం అనిపించింది.   

అయితే ఇది ఊరికే అలవడే, తేలికగా పట్టుబడే విషయమేమీ కాదు. నిరంతరంగా సాగుతున్న జీవితాన్ని, తన చుట్టూ ఉన్న జీవితాలనీ ప్రకృతి పోకడనీ గమనిస్తే తప్ప అలా ఒక భావాన్ని అంతగా పాఠకులకు చేర్చటం సాధ్యం కాదు. అంటే కవిత్వం రాస్తున్నంత సేపూ ఆమె కవిత్వంగా జీవిస్తే తప్ప ఆ మమేకత్వం సాధ్యం కాని విషయం. వస్తువు ఎన్నికలో కొత్తదనం, దాన్ని కవితగా ప్రజెంట్ చేయటంలో తనదైన సున్నితత్వం, ఒక తాజాదనం ఉంది. ప్రతీ అక్షరాన్ని, పదాలుగా పేర్చటంలో, దాన్ని కవిత్వంగా చెక్కటంలో, ఊహలన్నిటినీ మలుపులు తిప్పుతూ, కవిత్వగాఢతని అద్ది నైపుణ్యంతో తన అక్షరాలని అడుగులు వేయించిన  కవయిత్రి సుభాషిణి.

రాబోయే కాలంలో తన రాతలతో చెలిమి చేసేందుకు కొత్త తరం ఎదురుచూస్తుందనీ, అలా ఎదురుచూసే వాళ్ళకోసం తన కవిత్వాన్ని మరింతగా తీర్చిదిద్దుకుంటుందనీ ఆశిస్తూ…   

*****

నాకు కొన్ని మగపదాలు కావాలి

-సుభాషిణి తోట

వాడిపై బలమైన

అస్త్రం ప్రయోగించాలి

అనుకున్నప్పుడు ….

సున్నితమైన బాష

సహజమైన వ్యక్తీకరణలు అదుపుచేయలేనప్పుడు

నేను కొన్ని ఆయుధాలను సమకూర్చుకుంటాను

వాటికై నాకు కొన్ని మగపదాలు కావాలి..

పదే పదే ఆడదానివని చెబుతూ

లేని నిందల్ని రాయల్లే విసురుతున్నప్పుడు

గాయాన్ని చేసి

హేయంగా మాటలతో కోస్తున్నప్పుడు

తట్టుకోలేని సంఘర్షణ మౌనాన్ని చేరుకోగానే

విప్పిచెప్పలేక నేను అడవిలో మానైపోతున్నా

చీకటి నిట్టూర్పుల్లో

కాగడా కోసం వెతుకుతున్నప్పుడల్లా

వాడు గాలై నన్ను బంధిస్తున్నాడు

మంటై నేను చెలరేగేందుకు

నాకు కొన్ని మగపదాలు కావాలి

ఖచ్చితంగా నాకు కొన్ని మగపదాలు కావాలి

మానని పుండుని చేసి

మానాన్ని అభిమానాన్ని నిలువెత్తునా చీల్చి

స్త్రీత్వాన్ని  వీధుల్లో అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వాడి చేష్టలను నిరోధించడానికి

నాకు కొన్ని మగపదాలు కావాలి…

*****

ఇంతకాలం కననందుకు నిందలు మోసుంటావ్

ఇప్పుడు కన్నందుకు…

ఆడదానివి కదా ఏది చేసినా మాటలైతే పడాల్సిందే.  …

అభివృద్ధి చెందుతున్నారు

కొత్త కొత్త మాటలు సృష్టించడం లో

కేవలం అనేందుకే..

మౌనం తప్ప ఆడ అనే పదం ఏది చేసినా

ఆంక్షలు సహజం. .. 

*****

నాకోసం ఒక కవిత రాయవా అతనడిగాడు ఆమెను… కాస్త ప్రేమతో..

ఏమని రాయాలని అందామె ఏదో దిగులులో…

నీ ఇష్టం అన్నాడతను ఆమె కు ఏ ఆంక్షలు లేవన్నట్లు , అక్షర రూపం ఇస్తే చాలని

నిజమా ఆశ్చర్యం గా అందామె..

అవునని తలూపాడతను..

రాయిని నేను నీరై నువ్వు

కదలలేక ఉన్న నన్ను ఎప్పటికీ తాకుతూనే ఉండు.. నాలో ఏ పలకరింపు లేకున్నా నువ్ మాత్రం ఆవిరవ్వద్దు నన్ను వీడొద్దు అందామె..

పిచ్చా నీకు అన్నాడతను కోపంగా

అదేంటి అలా అంటున్నావ్ అందామె

కవిత్వం రాయమన్నా సోది కాదు అన్నాడు

అంటే అని ప్రశ్నించింది ఆమె

అతను మౌనమే సమాధానమయ్యింది..

క్షమించు కవిత్వం అంటే నిజమనుకున్నా ఊహలని తెలియక..

ఊహించడం ఎంతసేపు

దాన్ని సొంతం చేసుకోలేనప్పుడు ఎన్ని మాటలైనా వ్యర్థం అందామె…

అతనెప్పుడు ఆమెను ఏది రాయమని అడగలేదిక

ఆమెప్పుడు నిజాన్ని కోరలేదు అతని నుండి.

వాళ్ళింకా ఊహల్లోనే ఉన్నారు

ఆమెకు నిజం తెలిసినా కలం విప్పదు

అతనికి అబద్ధం అయినా ఆ ఊహల్లోనే విహరిస్తాడు..

The way of life is bitter truth,

bold news….

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.