నా జీవన యానంలో- (రెండవభాగం)- 4

-కె.వరలక్ష్మి 

M.A. తెలుగులో స్పెషలైజేషన్ కి చేమకూర వేంకటకవిని ఎంచుకున్నాను. ఎందుకంటే ఆయన వ్రాసినవి రెండు కావ్యాలే అందుబాటులో ఉన్నాయి కాబట్టి. 1.విజయ విలాసము, 2. సారంగధర చరిత్రము. చదువుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు అనుకున్నాను. ఇప్పట్లాగా నెట్ లోనో , పుస్తకాల షాపుల్లోనో విరివిగా బుక్స్ దొరికే కాలం కాదు. నాకేమో మోహన్ కూడా పి.జి. చేసి హెడ్ మాస్టరో, లెక్చరరో అయితే బావుండునని ఉండేది. బుక్స్ కొనేస్తే తనే చదువుతాడులే అని ఒక ఆశ. ఇద్దరం కలిసి కాకినాడ, రాజమండ్రి బుక్ స్టాల్స్ అన్నీ చుట్టేసాం. మోహన్ కి M.Sc బుక్స్ దొరికేయి కాని, నా బుక్స్ దొరకలేదు. అప్పటికి మోహన్ ఆఖరు పిన్ని సరస్వతిగారు కుటుంబంతో వైజాగ్ డాబా గార్డెన్స్ లో ఉన్నారు. ఆవిడ భర్త లెక్చరర్ గా కొన్నాళ్లు సెలవు పెట్టి ఆంధ్రా యూనివర్సిటీలో హిస్టరీలో డాక్టరేట్ చేస్తున్నారు. ఆయన దగ్గర A.U లైబ్రరీ టోకెన్ ఉంటుంది అని దసరా సెలవుల మొదటిరోజు మోహన్ నన్ను వాళ్లింటికి తీసుకెళ్లి వదిలేసి తను వెనక్కి మద్రాసు వెళ్లిపోయాడు. 

అది మా అత్తగారి పెద్ద చెల్లెలి ఇల్లు. అప్పటికి ఎందుకో మా అత్తగారి వచ్చి ఉన్నారు. నేను ఆవిడ దగ్గర ఉంటూ సెలవులయ్యేలోగా లైబ్రరీలో నోట్స్ ప్రిపేర్ చేసుకుందామనుకున్నాను. ‘ఆదిలోనే హంస పాదు’ ఎదురైంది. నేను వెళ్లిన మర్నాడు రాత్రికి సరస్వతిగారి కుటుంబం తిరుపతి వెళ్తున్నారట. సెలవులయ్యే వరకూ రారట. టోకెన్స్ నా కిచ్చి వెళ్లడానికి ఆయన ఒప్పుకోలేదు. అప్పటికి జిరాక్స్ పద్ధతి లేదు. లైబ్రరీ అసిస్టెంట్ ఒకాయన నాకు ఉపయోగపడే బుక్స్ తీసి ఇచ్చేడు. 

ఆ పగలు, రాత్రి, మర్నాడు  సాయం కాలం వరకూ వీలైనంత, రాయగలిగినంత నోట్స్ రాసుకుని టోకెన్స్ సరస్వతిగారి భర్తకి ఇచ్చేసేను. నిజానికి నాకు ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్త. వారమంతా నోట్స్ రాసుకుని వాళ్ల టోకెన్స్ వాళ్లకి అప్పగించి వచ్చేదాన్ని. ఎందుకో కొందరు అలా ప్రవర్తిస్తారు. ఈ మధ్య మా ఆడపడుచు ఇంట్లో సరస్వతిగారి అమ్మాయితో మూడు రోజులు కలిసి ఉండాల్సొచ్చింది. ఆ అమ్మాయి పెద్దదై అమ్మమ్మ కూడా అయ్యింది. కాని అచ్చం ఆనాటి వాళ్ల పెద్ద వాళ్లలాగే ప్రవర్తిస్తోంది.

సరే, A.U లైబ్రరీ వాళ్లు నా వివరాలడిగి “అయ్యో, ఇంత దూరం ఎందుకొచ్చేవమ్మా, మీ రాజమండ్రి గౌతమి గ్రంధాలయంలో మీక్కావాల్సిన బుక్స్ అన్నీ దొరుకుతాయి. అక్కడ సన్నిధానం శర్మగారిని కలవండి” అన్నారు. నాకు ప్రాణం లేచొచ్చింది. ఇంకా సెలవులున్నాయి. పిల్లల్ని కూడా మా అమ్మకి అప్పగించి వచ్చేను. మరో రెండు రోజులు మా అత్తగారి దగ్గర ఉండిపోయి ఓ రోజు సముద్రాన్ని చూసొచ్చేను. మేమున్న ఇంటి నుంచి అప్ లోకి నడిస్తే కె .జి .హెచ్ దగ్గర సముద్రతీరాన్ని చేరేం. అప్పటికి బీచ్ లో జన సమ్మర్దం ఉండేది కాదు ఇప్పుడున్నంతగా. తనివితీరా కెరటాల్ని, సముద్రాన్ని చూస్తూ ఒంటరిగా ఏదో తాత్త్విక లోకంలోకి పయనించిన రోజది.

మర్నాడు పక్కింటి రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ నమ్మి అప్పారావు గారు, ఆయన భార్య అమ్మాజీ గారు నన్ను వాళ్లింటికి భోజనానికి పిలిచేరు. ఆయనకు నన్ను చూస్తే మద్రాసులో తన స్టూడెంట్ లైఫ్, గర్ల్ ఫ్రెండ్ గుర్తుకొచ్చి, బోలెడన్ని కబుర్లు చెప్పేరు. మధ్యాహ్నం భోజనాల తర్వాత ఊరు చూద్దాం రమ్మని జగదాంబ సెంటర్, పూర్ణా మార్కెట్ వైపు తీసుకు వెళ్లేరు. వాళ్ల పని మీద బంగారం షాపులో కెళ్లేం. వైజాగ్ వచ్చిన గుర్తుగా ఏదో ఒకటి కొనాలన్పించింది. నా దగ్గరున్న డబ్బుల్తో ముక్కు పుడక ఒక్కటే కొనగలను. అరవై రూపాయలకి తెల్ల ఒంటి రాయి క్లిప్పు ముక్కు పుడక కొన్నాను. నా ముక్కుకి కుట్టు లేదు కాబట్టి క్లిప్ మోడలన్నమాట! వచ్చేటప్పుడు వాళ్ల చుట్టాలింటికి తీసుకెళ్లేరు. అది పెద్ద భవంతి కాదు గాని ఇంటి వాళ్లు ఇల్లు సర్దుకున్న తీరు ఎంతో బావుంది. ముఖ్యంగా ఒక గదిలో బీరువా నిండా పుస్తకాలు, గోడకి చేర బెట్టిన సితార్ ఉన్నాయి. నేను బీరువాలోని పుస్తకాల్ని పరిశీలిస్తూండగా ఇంటి వాళ్లబ్బాయి వచ్చేడు. ఒత్తుగా ఉంగరాల జుత్తుతో హేండ్సమ్ గా ఉన్నాడు. యూనివర్సిటీలో చదువుతున్నాడట. చక్కగా పలకరించేడు. సితార్ తీసుకుని చిన్న మ్యూజికల్ బిట్ ఒకటి వాయించి చూపించేడు. నా గురించి అడిగితే కొద్దిగా వీణ పరిజ్ఞానం ఉందని చెప్పేను. ఆ తర్వాత వాళ్లమ్మ గారి దగ్గరకెళ్లి కూర్చుని ఏం చెప్పేడో కాని ఆవిడ నన్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని మా అమ్మ, నాన్న,ఇంటి పేరు, గోత్రం వగైరాలు అడగడం మొదలు పెట్టేరు. కాస్సేపటికి నాకే స్ఫురించి ‘నాకు పెళ్ళైపోయిందండీ’ అన్నాను .

“అవునా ?” అని తెల్లబోయారావిడ . “ముగ్గురు పిల్లలు కూడా” అన్నాను. అందరం కలిసి హేపీగా నవ్వేసుకున్నాం .

స్లిమ్ గా ఉండడం, బారు జడ ఉండడంతో బహుశా పెళ్లి కాని అమ్మాయిలా కన్పించి ఉంటాను .

ఊళ్ళో కూడా నా అందాన్ని ప్రశంసిస్తూ ఎవరెవరో పేరు చెప్పకుండా ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. కొన్ని తీర్చి దిద్దిన అక్షరాలు. కొన్ని కొక్కిరి బిక్కిరి అక్షరాలూ. ఏ చెట్టూ లేని చోట ఆముదపు చెట్టే మహా వృక్షంలా కన్పిస్తుందంటారు కదా! నేను మాత్రం మోహన్ భయంతో వచ్చిన ఉత్తరాల్ని వెంటనే చింపి పడేసేదాన్ని. మా ఊరి పోస్ట్ మేన్ ముసలాయన ఏమనుకున్నాడో తెలీదు నా స్కూల్ ఎడ్రస్ కి వచ్చిన ఉత్తరాల్ని హైస్కూల్లో మోహన్ కి ఇవ్వడం మొదలు పెట్టేడు. అంతే, వాళ్లెవరో చెప్పమనీ, నేను రాయడం వల్లే వాళ్లలా రాస్తున్నారనీ సాధిస్తూండేవాడు.

ఒక ఆదివారం నాడు మోహన్ తోడు రాగా గౌతమి గ్రంధాలయానికి వెళ్లేను. గేటు దగ్గరొకటి, కాంపౌండు లోపల మరో రెండు పొగడ పూల చెట్లు విరగబూసి ఉన్నాయి. పూల పరిమళంతో పరిసరాలన్నీ గుబాళిస్తూండగా కొన్ని పూలు ఏరి పర్స్ లో వేసుకున్నాను. గ్రంధాలయంలో సన్నిధానం శర్మ గారు ఆప్యాయంగా పలకరించి నాక్కావాల్సిన పుస్తకాల్ని స్వయంగా తీసి ఇచ్చేరు. పుస్తకాల్ని ఒక్కటొక్కటిగా ఇంటికి పట్టుకెళ్లి తెచ్చి ఇవ్వడానికి వీలుగా డిపోజిట్టు కట్టి మెంబర్ గా జాయినయ్యాను. నేను వాళ్ల చెల్లెలిలాగ ఉన్నానంటూ శర్మగారూ ఆరోజే నన్ను సోదరిని చేసేసుకున్నారు. ఆయనకి ఎవరైనా ఇచ్చిన పుస్తకాల్ని నాకిచ్చేస్తూ ఉండే వారు. 

ఆ గ్రంధాలయంలోకి అడుగు పెట్టడమే గొప్ప సాహితీ ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టైంది. రాజమండ్రిని మరో కోణంలో చూసినట్టైంది. అప్పటి వరకూ ఒక్క రచయితను కూడా చూసి ఉండని నేను ఎందరెందరో గొప్ప రచయితల్ని, కవుల్ని చూసి పులకించిపోయేదాన్ని.  అలా మొదటి రోజుల్లో చూసి, వారి చేతుల మీదుగా వారి రచనల్ని అందుకున్నాను. వారు కాళీ పట్నం, స్మైల్, ఆవంత్స సోమ సుందర్ మొదలైన వారు.

M.A.  పరీక్షలకి ఆర్ట్స్ కాలేజ్ సెంటరు. అప్పుడెందుకో బస్సుల స్ట్రైక్ జరుగుతోంది. మోహన్ ఫ్రెండ్ లాయర్ రమణ మూర్తి గారు పోస్టాఫీసుకి ఫోన్ చేసి గాంధీపురంలో ఉన్న వాళ్లింటికి కాలేజ్ దగ్గర కాబట్టి వాళ్లింట్లో ఉండి పరీక్షలు రాయమన్నారు. స్కూలు వల్ల నాకు వీలు పడదని చెప్పేను. పోనీ, ఉదయాన్నే ఎలాగోలా వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలకి పరీక్షకి హాజరై సాయంకాలం వెళ్తూండమన్నారు. సరే అని మొదటి రోజు వెళ్లేను. అప్పటికి వాళ్ల అక్కయ్యకి కూడా పెళ్లి కాలేదు. అప్పుడెప్పుడో వాళ్ల పెరట్లోని సంపెంగలు కోయించి ఇచ్చిన ఆవిడే ఇప్పుడు వాళ్ల వంటింటి మురిక్కాలవ పక్కన బైట వరండాలో నేల మీద ఆకువేసి ఎత్తెత్తి వడ్డించింది. నాకు ముద్ద గొంతు 

దిగలేదు. కళ్లల్లో నీళ్లొచ్చేయి. సరే, వాళ్లు బ్రాహ్మలు కదా అని సరిపుచ్చుకున్నాను. మిగతా పరీక్షలకి టిఫిన్ బాక్స్ తెచ్చుకుని తిన్నగా కాలేజ్ కే  వెళ్లేదాన్ని. ఈ ప్రయాణాలన్నిటికీ మోహన్ నా వెంటనే ఉండేవాడు. ఒకోసారి బస్సు దిగేక నేను గోల పెడుతున్నా వినకుండా సినిమా హాలుకి దారి తీసేవాడు. మోర్నింగ్ షో సినిమా చూసి పరీక్షకెళ్ళడం.

అప్పటికి నేను నడుపుతున్న రవీంద్ర కాన్వెంట్ ఒక్కటే ప్రైవేటు స్కూలు ఊళ్లో. మంచి పేరు రావడం వల్ల ఉద్యోగస్తులందరూ పిల్లల్ని మా స్కూలుకే పంపేవారు. వాళ్లల్లో కొందరికి మోహన్ తెలియక ఎక్కడైనా ఎదురుపడితే నన్ను మాత్రమే పలకరించి నమస్కారం చెప్పేవారు. చివరికి సినిమా హాల్స్ లో కూడా దగ్గరకొచ్చి మరీ పలకరించే వాళ్లు. అది కూడా మోహన్ కి నచ్చేది కాదు. బాగా ఉడుక్కునే వాడు. కానీ  టీచర్ గా మోహన్ కి చాలా మంచి పేరుండేది. ఇంగ్లీష్, మేథ్స్, సైన్స్ అతనిలాగా ఎవరూ టీచ్ చెయ్యలేరు అని చెప్పుకొనే వారు. పరీక్షల్లో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. పిల్లల దగ్గర ఒక్క స్లిప్పు దొరికినా కొట్టడమో, బైటకి పంపెయ్యడమో చేసేవాడట. ఒకసారి అలా చేసినందుకు చిట్టబ్బాయి రెడ్డి గారి పెద్ద కొడుకు, రామబ్బాయిరెడ్డి గారి కొడుకులిద్దరూ కలిసి వీధి దీపాలు లేని చీకటి వీధిలో మోహన్ ని బాగా కొట్టేసేరు. సైకిలు విరిచేసి, చొక్కా చింపేసి, రక్తం చిమ్మేలా కొట్టేరు. మోహన్ పోలీసు కంప్లైంటు ఇచ్చేడు. పెద్దకేసయ్యేదే, వాళ్ల తండ్రులొచ్చి బతిమలాడి కేసు వెనక్కి తీసుకునేలా చేసేరు.

ఒకసారి మోహన్ కోరుకొండ నుంచి జగ్గంపేటకి రిక్వెస్ట్ బదిలీ పెట్టుకున్నాడు. అది వెంటనే అయ్యిందట. కోరుకొండలో స్టాఫ్ ఒక చిన్న ఆత్మీయ సభ పెడుతున్నారు అని నన్నూ, మా చిన్న పాపనీ తీసుకెళ్లేడు. అందరికీ పరిచయం చేసేడు. సభలో టీచరొకాయన మాట్లాడుతూ “ఈయనకింత తొందరగా బదిలీ ఎలా దొరికిందో నాకు ఈవిణ్ణి చూస్తే అర్ధమైంది” అన్నాడు. నాకు అప్పటి వరకూ టీచర్స్ అంటే ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ ఆ సంఘటన చూసేక అది కాస్తా ఎగిరిపోయింది. గొప్ప అవమానంతో కృంగి పోయేను. మోహన్ కి కోపం వచ్చి వాడి చెంపపగల గొడతాడేమో అనుకున్నాను. అసలు పట్టించుకోనే లేదు. అంతే, ఇంకెప్పుడూ మోహన్ పని చేసే ఏ చోటికి పిలిచినా వెళ్లలేదు. 

 

*****

(ఇంకా ఉంది )






Please follow and like us:

One thought on “నా జీవన యానంలో- (రెండవభాగం)- 4”

Leave a Reply

Your email address will not be published.