ఉనికిపాట 

వెలుగుని మరిచిన పూవు 

చంద్రలత  

 

ఆశై ముగం మరందు పోశే  : సుబ్రమణ్య భారతి

 సుబ్రమణ్య భారతి (1882 -1921)

*

అజరామరమైన పాటగా పదిలమైన కవిత గురించి ఒక మాట

*

         ఇది కొత్త విషయమేమీ కాకపోవచ్చు. కానీ,ఎవరికి వారం ఒకానొక ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం.

         ఒక అద్భుతమైన మానవ సంబంధాన్ని చేజార్చుకొన్నప్పుడు, ఆ ప్రపంచం అంతా దుఃఖ భరితం అయి,అంధకారబందురమైనపుడు,  ఆ మనసుకు కలిగే శోకం, క్లేశం అంతా ఇంతా కాదు. ఒక శూన్యం .ఒక చిమ్మ చీకటి. ఆ వేదనను అనుభవించ వలసినదే కానీ, మాటలలో వ్యక్తపరిచ గలిగేది కాదు.

   ఈ లోకంలో, ఎవరి లోకం వారిది.వారి వారి లోకాల్లో జీవిస్తున్నా, కొందరి అనుభూతులు అందరికీ అందుతాయి.చెందుతాయి. మనిషికి ఏ బంధం అత్యంత ప్రియమైనదీ అంటే, ఆ మాట టక్కున చెప్పలేము. అన్ని బంధాలు ఎంతో ప్రియమైనవి.కాకపోతే, ప్రియాతిప్రియమైన మానవ సంబంధాన్ని ప్రేమికుల రాగానురక్తితో ముడివేసింది మన కవితాలోకం. అది లౌకికమా,పారలౌకికమా,అలౌకికమా అన్నది ఆయా కవిత్వ భావావేశం పైనే ఆధారపడినా, ఆ కవిత, పాట, అందంగా.. ఆనందంగా.. మనోహరంగా రూపొందుతుంది.ఈ కవిత్వమంతా ప్రేమ, వియోగం ,విరహం , సమాగమం ,ఇలా ప్రేమికుల చుట్టూనే గిరికీలు కొడుతుందా అనిపిస్తుంది ఒక్కోమారు.ప్రేమ ఎంత సుందరమైన భావన. ఎంత సుకుమారమైనదీ మరెంత సున్నితమైనది. అక్షరాల వలలలో చిక్కినట్టే చిక్కి చేజార బట్టేగా, ఇన్నిన్ని కలాల పొడవునా  ఎన్నెన్నో కాలాలపాటు, మనిషి చేస్తోన్న ఈ ప్రయత్నాలు ఇంకా అసంపూర్ణంగానే ఉన్నాయి.ఆ విఫల ప్రయత్నాలన్నీ కవితలై ,పాటలై, కావ్యాలై అలరారు తున్నాయి.అలరిస్తున్నాయి.

 ఒకరి గాఢమైన ప్రేమంతా ప్రేయసికో ప్రియుడికో పరిమితమయితే,  అంతకన్న గాఢంగా అలౌకిక భావనను మరొకరు ప్రేమిస్తారు, దానా దీనా, అనుభూతి ప్రధానం గా సాగే,ఈ అపురూప ప్రియరాగాలలో , కొన్ని ముఖ్యమైన పాటలు , రచించిన వారి మనసును దాటి, గడపను దాటి, కాలాలను దాటి లోకాలన్నీ చుట్టేసాయి. అజరామరమరమవుతాయి.

   సుబ్రమణ్య భారతి జగమెరిగిన తమిళ కవి.పలు భారతీయ భాషలలో ప్రావీణ్యం తోపాటు, విభిన్న విదేశీ భాషల్లోనూ పట్టు ఉన్న వాడు. స్వదేశీ అభిమానం, స్వాలంబన సిద్దాంతం, స్వేచ్చాస్వతంత్రాలకొరకు ఆయన కలాన, గళాన ప్రజ్వలింపచేసిన స్వాతంత్ర జ్వాల అందరికీ తెలిసిందే. భాషలు వేరయినా, భౌగోళికంగా భిన్నత్వం ఉన్నా ,భారతీయులం అందరం ఒక అమ్మ బిడ్డలం అని భారతి విశ్వసించారు. కులరహిత సౌభ్రాతృత్వాన్ని, అంతరాలు తరగతులులేని సమతా లోకాన్ని, స్త్రీపురుష బేధాల్లేని సమాజాన్ని ఆయన కలలు కన్నారు. ఒక్క స్వదేశీయుడు ఆకలితో అలమటించినా  , లోకాన్ని భస్మీ పటలం చేస్తామని తీవ్ర ధిక్కారస్వరం తో ప్రకటించి ,ఆనాటి పాలకుల కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉద్యమకారుడు,సంస్కర్త,కవి సుబ్రమణ్య భారతి.

తన ఆగ్రహావేశల్తో పాలకుల దేశబహిష్కరణకు గురై, పాండిచ్చేరిలో తలదాచు కొన్నా, తన స్వరం ఏ భయానికి  మొక్కబోనీయక ,మరింత రాటుతేలాడు .వ్యక్తిగా.శక్తిగా. పుటం పెట్టినట్లు మరింత రౌద్రంతో, తమిళనాట స్వాతంత్రాభిలాషను రాజేసి, తీవ్రజ్వాలలు  ఎగదోసింది అతని కలం. అలాంటి రౌద్రమూర్తి కరుకు కలంలోంచి, ఆ భీకర సంగ్రామ జ్వాలల్లోంచి , అందమైన ప్రేమగీతాలు సున్నితంగా జాలువారాయి.

   సుబ్రమణ్య భారతి సన్నిహితుడు, “లోకోపకారి” పత్రికా సంపాదకుడు,శ్రీ పరలి సు. నీలాయ్యప్పర్  గారు,1917 లో “కణ్ణన్ పాట్టు”( కన్నడి పాటలు) ను మొదటి సారి ముద్రించారు. ఆ సంధర్భంగా ,భారతి  నీలాయ్యప్పర్ కు వ్రాసిన ఉత్తరం మరెంతో స్పూర్తిదాయకమైనది.బహుభాషాకోవిదుడైన   సుబ్రమణ్య భారతి, తన మాతృభాష తమిళం గురించి, తమిళుల గురించి, మానవప్రేమ గురించి,”ఈ నేలపై నిలబడి ఆకాశాన్ని తాకాలన్న” తన తపన గురించి ఆ ఉత్తరంలో హృద్యంగా రాస్తారు.

“తమ్ముడా,ఈ లోకమే నీ హృదయం. పద!పద!పద! పైకి! పైకి! పైపైకి! ఎవరి స్థానాల్లో వారు కదలక మెదలక స్థిరపడాలని, తమ తాళ్ళతో తామే బంధాలు వేసుకొని, నేలను చతికిలబడ్డ  వెర్రివాళ్ళని చూసి, పగలబడి నవ్వు! నీవు రెక్కలు తొడుక్కో. ఎగిరి పో !”

 “కన్నడి పాటలు” పాటలలో అత్యంత ఆదరణ పొందింది ” ఆ అందాల మోము మరిచేనే ” భారతి స్వయానా స్వరపరిచిన ఈ పాట, తరతరాలుగా తమిళనాట వినిపిస్తూనే ఉంది. ఈ పాట  కన్నడి రూపురేఖల ఆనవాలయినా తెలియని భామ వేదన. కనీసం  ఒక్క పటమైనా చూడని తన మందమతి కి తానే వాపోతుంది.

అయినా, ప్రేమ రూపురేఖలకు అతీతం కాదూ ? ప్రేమ ఎంతటి అలౌకికమో అధిభౌతికమో, అంతటి భౌతికమూ కదా !

 నిజమే, సుబ్రమణ్య భారతి అయిదేళ్ళ వయస్సులో తన తల్లిని పోగొట్టుకొన్నాడు. ఆ శూన్యం ఎప్పటికీ శూన్యంగానే ఉండిపోయింది. అమ్మ రూపురేఖలను చూపే ఒకేఒక్క చాయాచిత్రం పోయినప్పుడు, కలిగిన శూన్యాతిశూన్యంలో, ఈ అపురూపమైన ప్రేమ గీతం పురుడుపోసుకొంది .

  అమ్మ ఎవరికైనా అందమైన అమ్మే. ముద్దారగా బిడ్డలను ఒడిన చేర్చుకొనే మురిపాల కొమ్మే.ముచ్చట తీరా ,అమ్మ పాడిన జోలపాట, తాగించిన ఉగ్గు ,చెప్పిన కథలు, అమ్మ కుచ్చిళ్ళ వెచ్చదనం, అమ్మ కొంగు మెత్తదనం, అమ్మ మాట, అమ్మ అలక, అమ్మ చేతి వంట, అమ్మ గోరుముద్దలు, అమ్మ పోసిన లాలి, సున్నిపిండి నలుగులు, తలంటు స్నానాలు,అమ్మ చేత చీవాట్లు,మొట్టికాయలు, రాయబారాలు రాజీలు, అమ్మ చుట్టు  బిడ్డలు అల్లుకున్న ఆ అందమైన లోకంలో ప్రతిధ్వనించే అమ్మ నవ్వు కు రూపురేఖలే కనుమరుగయినప్పుడు, కళకళలాడే అమ్మ ముఖరావిందపు చిట్ట చివరి ఆనవాలు కూడా, ఇక పై కనబడదని తెలిసినపుడు, మిగిలిన శూన్యంలోంచి ఒక బిడ్డ పాడిన పాట ఇది.

ఏ బిడ్డయినా తన తల్లి కోసం పడే తపన ఒకటేగా. అమ్మ బిడ్డ కోసమూ, బిడ్డ అమ్మకోసం వెతుకులాడే ఆ శూన్యాన్ని ఏ పదం పూరించ గలదు? ఏ పాట వినిపించగలదు? ఆ ఆర్ద్రత వలననేమో, తరతరాలుగా , ఈ పాట గుండెలను చీల్చుకొని వినబడుతూనే ఉన్నది! అది సంగీత సభ అయినా ,లలిత గీతాల పండగయినా, ఆ పాట ఏ మూల నుంచో పలకరిస్తూనే ఉంటుంది. పోగొట్టుకొన్న అమ్మ పటంలో ,అమ్మ రూపురేఖల ఆనవాళ్ళను వెతుకుతూనే ఉంటుంది. ప్రేమగా.ఆర్ద్రంగా. గుండెలను తడుతూ. “ఆశై ముగం మరందు పోశే ” అంటూ.

సుబ్రమణ్య భారతి తన భార్య శ్రీమతి చెల్లమ్మతో.

తమిళ రచన: సుబ్రమణ్య భారతి (1912)

తెలుగు సేత : చంద్ర లత (25-4-2017)

 వెలుగుని మరిచిన పూవు

       ***

ఆ అందాల మోము మరిచేనే …ఇక

నా బాధ ఎవరితో చెప్పేనే,  చెలీ!

 

 నా మది ఆ చెలిమిని మరిచేనా …మరి

 చెలికాడి మోమును మరిచేది న్యాయమా?

 

 నా కనుపాపలలో నిలిపిన నా కలలమూర్తి లో

 ఆ కణ్ణడి సొగసులు కళ్ళారా చూసేనా?

 

 అతనిని ఎదురుగా చూసిన వేళ, వెతికినా

 ఆ వెన్నెలనవ్వు కణ్ణడి మోమున కనలేదే !

 

 ఎలాంటి అడ్డూఆపు లేకుండా,  కణ్ణడితో

నా బంధం గురించే తలుస్తోందే, నా మనసు!

 

విన్నావుగా, నా నోటి పలుకులు …అవి

ఆ మాయావి మహిమల పొగడ్తలేగా ఎపుడూ?

 

నా కన్నులు చేసిన పాపం ఏమిటో…ఆ

కణ్ణడిని కళ్ళారా చూడడం మరిచాయి.

 

ఈ లోకాన ఉన్న వనితలలో నీవు

నాకన్నా  మందమతిని చూశావా?

 

తేనెను మరిచినా మధుపమూ..మెరిసే

వెలుగుని మరిచిన పూవు

వానను మరిచిన పైరు …ఇవేవీ ఈ

లోకాన చెల్లవుగా …చెలీ!

కణ్ణడి ముఖాన్నే మరిచి పోతే ,ఇక

ఈ కనులు ఉండీ ఎందుకే ?

చూశావా? కణ్ణడి పటమైనా లేదు …ఇక

సిగ్గుతో చితికిపోకుండా ఎలా బతికేనే, చెలీ!  

 

(ఆధారం: ఆంగ్లానువాదం : http://www.lyricaldelights.com/2016/06/19/bharathi-aasai-mugam-maradhu-poche-lyrics-and-translation/)

  1.       గానం :సుచిత్రా కార్తీక్

https://www.youtube.com/watch?v=utBPfITWcog

 

  1.       గానం : ప్రియ సోదరీమణులు

https://www.youtube.com/watch?v=wXuIBB9RCsc

  1.       గానం :కార్తీక్ అయ్యర్ 

https://www.youtube.com/watch?v=ZJ6VQFTxzcw

  1.       గానం :విద్య వోక్ష్ ,వందన అయ్యర్, సంగీతం :శంకర్ టక్కర్ 

https://www.youtube.com/watch?v=ib3r6mPD3aY

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.