జానకి జలధితరంగం- 1

-జానకి చామర్తి

అపర్ణ

కావ్యనాయికలు పురాణ నాయికలు  , స్త్రీల గురించి పుస్తకాలలో చదువుకుంటున్నపుడు  తెలుసుకుంటున్నపుడు ..ఒక స్ఫూర్తి వస్తుంది , 

కలగా కమ్మగా ఉంటుంది, వారిలోన లక్షణాలకు మురిపం వస్తుంది, అలా ఉండలేమా అనిపిస్తుంది.  మంచివిషయాలు , అనుసరించదగ్గ విషయాలకే, ఇప్పటికాలానికిసరిపోనివి,సంఘవ్యతిరేకమైనవాటిగురించి కానే కాదు. 

చదివిన కధలూ కావ్యాలూ  మానసికానందమే కాక , చేయగలిగే సాయం కూడా ఏమిటని.

కొందరు స్త్రీనాయికలు లో గల  శ్రద్ధ పట్టుదల ప్రేమ వాత్సల్యము పోరాటము వివేకము త్యాగము ఆరాధన  నమ్మకం , స్త్రీత్వం .. ఈ నాయికాలక్షణాలు .. 

ఈ కాలంలో మనలో కూడా ఉండాలనుకోవడం .. 

ఆ ఆదర్శాలను పెంపొందించుకుందామనుకుంటే , అలవరచుకుందామనుకుంటే.. ఇప్పటివారిలోనూ ఉన్నాయనుకుంటే ..ఎంత గర్వం .. ఎంత ఆనందం..! ఎంత సానుకూలమైన దృక్పధం…..____

అపర్ణ .. ఆకులు  చేత్తో పట్టుకుని ఆలోచించుకుంది, వానినీ తినుట వదిలివేసి, సంతోషంగా మంచినీరు తాగింది. ఏకాగ్రతకు ధ్యానానికి  తెలుసుకోదగ్గ విషయాలు పొందవలసిన పరమార్ధం కొరకు, తన ప్రయత్నం గా మెల్లగా ధ్యానం కొనసాగించింది.

చటుక్కున కనులు తెరచింది .. ఎదురుగా ఎవరు ..

ఈ తాపసి వేషధారి, ముదుసలి యా , అలా లేదే, ఏదో తేజస్సు .. వెతుకుతున్న బ్రహ్మవర్చస్సు ఒడలంతా బూడిదలా పూసుకున్న ట్టున్న కాంతి పుంజం , వెలుగేనా కళ్ళల్లో అవి సూర్య చంద్రులా..

జడలు కట్టిన జుట్టు ముడి పెట్టినా కల్లోలం కట్టుబడునా,

దాచుకున్న నుదుటి జాజ్వలం రేఖామాత్రంగా తెలిసిపోవడం లా..

వయసు ఉడిగిన ముసలితనం నటనలాగ,

నిలబెట్టి తనని  చూసే చూపులు పట్టివ్వడంలా..

అనుకుంటున్న గిరిజ పర్వతరాజపుత్రిని ,

ఆకులు అలములు తింటూ తపస్సులో పరిపూర్ణమైన అపర్ణ ను, శైలజను, సంభ్రమంగా చూసాడు ముసలి బ్రాహ్మణ వేషధారి శివుడు.

ఆ కర్ణ నేత్రాలు  చిక్కిన మోములో ఇంకా విశాలమై, శాంతి తో నిండి న కన్నులు, చపలత్వము లేక స్ధిరమైన ఆ చూపులు,నిడుపాటి కేశపాశము దువ్వి ఎరుగక ఒంటిపాయలా చుట్టుకుని ఏకత్వము పొందినట్టు, సన్నబారిపోయిన చేతులు , పొందవలసినది వరమైన భారమైనా  ఎగియ సన్నద్ధమే అనే పతాకాల లాగ,

ధూళి తో నిండి చిక్కి సగమైన సుకుమార దేహము, ఎంతటి కఠినపరిక్షలకైనా సిద్ధము గా నున్న కోమల శిలా మూర్తి లాగ  , నిర్జన అడవులలో తిరిగే ఆమె , స్త్రీ రూపు దాల్చిన శార్ధూల సదృశము గా , సింహమునే మచ్చిక చేయగల శక్తిశాలినిగా గోచరించింది.

ఆమె లోని శక్తి , తపస్సుతో సంప్రాప్తించిన జ్ఞానముతోటి , స్త్రీ సహజమైన మార్దవము తోటి, కరుణతోటి, అదే సమయంలో హద్దు మీరితే చూపే ఆగ్రహము తోటి,  ప్రేమతో , ప్రేమలోధృఢత్వంతో,

తప్పు చేస్తే దిద్దగల సౌజన్యము తో.. ఎంత చూసినా ఎన్ని చూసిన ..సర్వ గుణముల రాశిగా , పరిపూర్ణ స్త్రీ గా ..

శివునికి తోచింది ..గిరిజ , శైలజ .. ఆ జగన్మాత.

ఇప్పటి మన అమ్మాయిలు కూడా ‘అపర్ణ ‘ లాటివారే..

చదువుకు  , పరువుకు , కొలువుకు , కన్నవారి కోర్కెకు, న్యాయపరమైన హక్కుకు, కొత్తగా వచ్చే బాధ్యతకు , సమాజంలో మంచి మార్పుకు,

తమ శక్తి కి తగ్గట్టు తపస్సే చేస్తున్నారు.

పట్టా పుచ్చుకున్నప్పుడు కన్నవారి కంటి తళతళలకోసం, నిద్ర మానుకునే వారు చదివారు, 

చక్కని కొలువులో కుదురుకు.. కొంత జీతం ఆపన్నులనుఆదుకోవడానికి ఖర్చు పెట్ట తయారైనవారు ..

ఆకలి విలువ తెలిసికొన్నవారు.

దేశానికి పేరు తేవడానికి బరిలోకి దిగి చెమటోడ్చి శిక్షణచేసి , వారు బంగారుపతకం ఎత్తగలిగినంతధృఢంగానే తయారు అయ్యారు.

దుడుకుపనులు చేసేవారిని, చురుకుగా వేటాడిపట్టుకునే  వారీ ‘ షి టీము’ వారు , ఆడపులులలాటివారు .

ఇంటా బయటా..సమస్యల శార్దూలములను మచ్చికచేయడంలో శక్తిశాలినులయ్యారు.

నిర్భయం కలిగి ఎందరో భయలకు అభయం ఇచ్చి , మేమున్నాం మీకనే మానవతావాదులయ్యారు.

అడవులూ తిరిగారు, పర్వతాలూ ఎక్కారు, సముద్రాలుదాటారు, దూరాలకూ ఒంటరిగాపయనించారు ,కార్యము సిద్ధించుకున్నారు , కీర్తి శిఖరాలకు ఎక్కు తున్నారు.

మేధతో విజ్ఞానపు అంచులు వెతికిపట్టుకుంటున్నారు

మానసిక  ధృఢత్వమువారికిపుడు కట్టుకున్న కనిపించని కంచుకం,  పట్టుదలపెట్టని ఆభరణము.

చల్లనిచేతులతో పసిపాపలను లాలించారు కుటుంబంలోప్రేమను పంచారు,

రంగుల చిరునవ్వులతో  జీవితాలలో వసంతంనింపారు.పరిపూర్ణ స్త్రీగా మారుతున్నారు.

వారు అనుకున్నది సాధించారు, (శివమ్) ‘ శుభము’ ను సాధించి, సుఖముగా ఉన్నారు .

మన అమ్మాయిలు ‘ అపర్ణ’ లు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.