యాత్రాగీతం(మెక్సికో)-5

కాన్ కూన్ – చిచెన్ ఇట్జా-ఇక్కిల్ సెనోట్

-డా||కె.గీత

భాగం-7

కాన్ కూన్ లో మొదటి టూరు ప్రపంచంలో ఎనిమిది ఆధునిక వింతల్లో  ఒకటైన “చిచెన్ ఇట్జా”లో విచిత్రమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. 

ప్రధాన కట్టడమైన కుకుల్కాన్ గుడి [El Castillo (Temple of Kukulcan)] దాదాపు 98 అడుగుల ఎత్తున తొమ్మిదంతస్తుల్లోఉంటుంది. కింది అంతస్తుకంటే పైది కొంచెం చిన్నదిగా కట్టుకుంటూ వెళ్లి, ఒకదాని మీదొకటి పేర్చినట్లు చతురస్రాకారంలో ఉంటాయి. చిట్టచివరి అంతస్తు 20 అడుగుల పొడవు, వెడల్పు కలిగి ఉందంటే అన్నిటి కంటే కింది అంతస్తు ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు.

ప్రధాన కట్టడపు పాద భాగంలో మెట్లకిరుప్రక్కలా రెండు సర్పాల తలలు భీకరంగా నోళ్లు తెరుచుకుని ఉంటాయి. అంతేకాదు ఏటా వసంత, శిశిరకాలాల ప్రారంభంలోఏర్పడే విషువత్తులలో మధ్యాహ్నపుటెండ మెట్ల నుంచి ప్రసరిస్తూ నీడల్ని ఏర్పరిచే తీరు సర్పం పాకుతున్న భ్రాంతిని కలగజేస్తుందట. దీనిని బట్టే ఋతువుల మార్పుల్ని అప్పటి ప్రజలు గమనించేవారని తెలుసుకుని అబ్బురపడ్డాం. 

ముఖ్యంగా ఒక మూలగా ఉన్న వీరుల ఆటస్థలం (Temple of Warriors and the Great Ball Court) లో బంతి వెళ్లడానికన్నట్లు  కట్టడానికి మధ్య అంచున పెద్ద రాతి రింగు ఉంటుంది. పైపెచ్చు 30 అడుగుల ఎత్తులో  ఉంటుంది. అంత ఎత్తులోఉన్న రింగులోకి రాతిబంతిని ఎలా విసిరేవారో, ఎలా ఆడేవారో అని ఆశ్చర్యం కలగకమానదు.

ఇక మరో కట్టడం చుట్టూ  పుర్రెల బొమ్మలు, మరోచోట క్రూరమృగాలు, దాదాపు అన్ని చోట్లా పాములు. 

“చిచెన్ ఇట్జా” లో కట్టడం నుంచి కట్టడానికి నడుస్తూ ఉంటే శతాబ్దాల వెనక్కి అప్పటికప్పుడు ప్రయాణించిన అనుభూతి కలిగింది.

పొడయ్యి రాలిపడ్తున్న సున్నపు రాళ్ళ చుట్టూ అల్లుకుని ఉన్న మాయా జాతి జనుల పురాస్మృతులేవో గాల్లో అంతటా వ్యాపించి చుట్టుముట్టినట్లు వింత భ్రాంతి కలిగింది.

ప్రధాన కట్టడం చుట్టూ ఉన్న చిన్న చిన్న బల్లలమీద రాతి బొమ్మల దుకాణాల దగ్గిర ఆగి గాలి ఊదితే వింత శబ్దం చేసే రాక్షసుని తల వంటి బొమ్మ అక్కడి గుర్తుగా కొన్నాను.  అక్కడ స్థానికంగా దొరికే నల్లరాయి బిళ్లలు గ్రహణం వచ్చినపుడు సూర్యుణ్ణి చూడడానికి వాడతారని అమ్ముతుండగా ఒకటి కొనమని వరు అడగసాగింది.

మమ్మల్ని చూడగానే దూరదేశం నుంచి వచ్చినవారమని తెలియడంతో అరచేతిలో ఇమిడే చిన్న బిళ్ల రాయి ఒక్కటి 20 డాలర్లు చెప్పసాగేరు.

మొత్తానికి నేనేదో బేరమాడి పది డాలర్లకు కొన్నాను. నిజానికి అది డాలరు కూడా చెయ్యదన్న విషయం నాకూ తెలుసు. 

కానీ అన్ని మూడో ప్రపంచదేశాల్లాగే పేదరికంతో సతమవుతున్న మెక్సికో దేశమన్నా, అక్కడి ప్రజలన్నా ఏదో తెలియని ప్రేమ కలిగింది మాకు.

అందుకే ప్రతీ చోటా ఒక్కొక్కరికీ 20 డాలర్లకు తక్కువ కాకుండా  టిప్పులు ఇచ్చేవాళ్ళం.

అంటే అక్కడి స్థానిక పేసోల్లో దాదాపు 400 పేసోలన్నమాట! 

ఆ ప్రయాణంలో అయిన ఖర్చు ఇంటికొచ్చాక లెక్కచూసుకుంటే ఇంత వరకు మేం చేసిన అన్ని ప్రయాణాల కంటే 

అత్యంత ఖరీదైనదని తేలి ముక్కున వేలేసుకున్నాం! ఆ సంగతలా ఉంచితే దాదాపు గంటన్నర, రెండు గంటల్లో 

“చిచెన్ ఇట్జా” టూరు పూర్తి చేసి మళ్లీ బస్సెక్కేము.

మరో అరగంటలో టూరిజమ్ హోటలు దగ్గిర బఫే భోజనానికి ఆపేరు. 

 గడ్డితో నేసిన పై కప్పుతో చల్లని ఆవరణ లో అప్పటికప్పుడు వేడివేడిగా తయారుచేసిన నోరూరించే పదార్థాలు.

మెక్సికను వంటల్లో ఎండుమిరపకాయలు, మన బెంగుళూరు  మిరపకాయల వంటి రంగురంగుల మిరపకాయలు ఉల్లిపాయలు వెయ్యడం వల్ల తినడానికి బానే ఉంటాయి. అయితే దాదాపు అన్ని వంటకాలు మొక్కజొన్న పిండితో చెయ్యడం వల్ల వాసన గిట్టడానికి కొంచెంసమయం పడుతుంది.

మెక్సికను రైసు చవక రకం దుడ్డుబియ్యంలా అనిపిస్తాయి. దానితో బాటూ రాజ్ మాని పోలిన పొడవైన బీన్స్ ఉప్పులేక తినలేకపోయినా, మన మసాలా వడల్ని పోలిన మొక్కజొన్న, ఏదో ఆకుకూర కలిపి చేసిన వడలు, నంజుకోవటానికి పెట్టిన పచ్చిమిరపకాయల సాస్, పరపరా నమలగలిగే చికెన్ రోల్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటితో బాటూ కేరట్ల వంటి పచ్చికాయగూరలు, పుచ్చకాయలు సరేసరి. ఇక మన పరమానాన్ని పోలిన పాల పరమాన్నం చూడడానికి బానే ఉన్నా నెయ్యి, బెల్లం, యాలకపొడి లేని కారణంగా ఎవరికీ నచ్చలేదు.

ఇక చికెన్ అంటే పరుగెత్తుకొచ్చే మా సిరి ఇక్కడి వంటకాల వాసనకి ఆమడదూరం పరుగెత్తింది.  ఏదో కష్టమ్మీద అటూ ఇటూ కలిపి వదిలేసింది.

భోజనాలయ్యేక మరోఅరగంటలో ప్రసిద్ధ ఇక్కిల్ సెనోట్ (Ik Kil cenote) దగ్గిర ఆపేరు. 

దారిపొడవునా ఊళ్లలో ఇళ్లన్నీ అచ్చు ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి. కాకపోతే అంత జనాభాయే లేరు. అంతే తేడా.

సెనోట్ కి బస్సు పార్కింగ్ నుంచి ఆవరణ చుట్టూ దుకాణాలు  ఉన్నాయి. అదేదో పాత నగరానికొచ్చిన అనుభూతి కలిగింది.

సెనోట్ అంటే భూఅంతర్భాగంలోని సున్నపురాయి లోపలికి చొచ్చుకుపోయి అంతర్భాగంలోఎక్కడో ఉన్న జలాల్ని పైకి తీసుకొచ్చిన “సహజసిద్ధ జలాశయం” అని చెప్పుకోవచ్చు.

అప్పటివరకూ గైడు చెప్పిన వివరం ప్రకారం ఏదో చిన్న జలాంతర్వాహినిని మెట్లు దిగి చూడాలని

అర్థం చేసుకున్న మేం తీరా వెళ్లి చూసేసరికి అదొక అతి పెద్ద దిగుడు బావిలా, ఊడలతో దాదాపు 85 అడుగుల వెడల్పుతో అతి భయంకరంగా ఉంది.  అసలింత వరకు అంత పెద్ద బావి లాంటి ప్రదేశాన్ని మేం ఎప్పుడూ చూడలేదు. అసలు పైనుంచి చూడడానికే కళ్లు తిరగసాగేయి. సిరి భయపడి దగ్గిరికే రానని మొరాయించింది. 

ఇక సత్య, వరు అందులో ఈత కొట్టడానికి లైఫ్ జాకెట్లు వేసుకుని,  గోప్రో కెమెరా తగిలించుకుని తయారయ్యేరు. ఆ సెనోట్ అసలే నూట ముప్ఫయి (130)  అడుగుల లోతైనది.

నేను వద్దని గోలపెట్టినా వినిపించుకోలేదు. అరగంటైనా వీళ్లు రాకపోవడంతో మా పక్కన చాలా సేపట్నుంచి

కూచున్న చైనీస్ ఆడ వాళ్లిద్దరికి సిరిని అప్పగించి నేను బావి వైపు దారి తీసేను. బావిలోపలికి దిగే మెట్లు పదిమంది ఒక్కసారిగా దిగగలిగినంత పెద్దవి.

కాస్త దిగగానే మెట్ల రెయిలింగ్ మీంచి చూస్తే దాదాపు వంద మంది వరకూ నీళ్లలో లైఫ్ జాకెట్లు  వేసుకుని ఈతకొడుతూ కనిపించేరు. అంత మందిని చూసి కాస్త ధైర్యం వచ్చింది నాకు.

ఇక కొంత మంది దాదాపు ఇరవై ముప్ఫై అడుగుల ఎత్తు నుంచి నీళ్ళలోకి దుమకసాగేరు.

సరిగ్గా నేను వెళ్లిన సమయానికి వరు, సత్య ఆ లైనులో కనిపించేరు.

వరుకి ఈత వచ్చు. తను ఇలాంటి జంపులు బానే చేసేస్తుంది కూడా.

కానీ సత్య ఇలాంటి జంపులు ఎప్పుడూ  చెయ్యగా చూడలేదు. 

నేను  పై నుంచి వద్దని అరిచినా  మెట్ల మీద చాలా మంది ఉండి గందరగోళంగా  ఉండడంతో వాళ్లకు వినబడలేదు. 

చేసేదేంలేక  భయంగా చూడసాగేను.  సత్య దుమికి వెంటనే  పైకి వచ్చినా పక్కన తాడు కట్టిన నిషిద్ధ ప్రాంతానికి   వెళ్లిపోతుండడం చూసి మళ్లీ అరిచేను. నా అరుపు వినబడకపోయినా  వరు వెంటనే చూసి వెళ్లి చెయ్యందించి, వెనక్కి లాక్కొచ్చింది. అంతేకాకుండా ఒడ్డున ఒకరిద్దరు సిబ్బంది కూడా ఉన్నారు.ఇక అది చూసేక నాకు పూర్తిగా ధైర్యం వచ్చింది. 

మధ్యలో నన్ను చూసి చేతులూపి సంతోషంగా ఈతకొడ్తున్న వాళ్ల సరదా చూసి, పోనీలే బానే ఉంది కదా! అనుకుని ఇక వచ్చెయ్యమనడం మానేసి వెనక్కి  సిరి కోసం వచ్చేసేను. 

వెనక్కి వచ్చేసరికి సిరియే వాళ్లను  ఆడించడం మొదలు పెట్టింది. ఆ ఆడవాళ్ళిద్దరూ సిరి చెప్పినట్లు అటూ  ఇటూ పరుగులెడుతూ కనిపించేరు. అంతే కాకుండా వీళ్లకి అటూ ఇటూ వాళ్ల కుటుంబసభ్యులు నిలబడి చప్పట్లు కొట్టసాగేరు. 

నేను వాళ్ళకి థాంక్స్ చెపుతుంటే “లేదు, మేమే మీకు థాంక్స్ చెప్పాలి. మీ అమ్మాయి భలే మంచి కంపెనీ ఇచ్చింది మాకు” అన్నారు వాళ్లు. 

మేం వచ్చేస్తుంటే సిరిని  వాళ్లు వదల్లేక వదల్లేక వెళ్లేరు. 

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి – 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.