జానకి జలధితరంగం- 3

-జానకి చామర్తి

 సావిత్రి 

సావిత్రి నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తుంది, 

తలచుకున్నప్పుడల్లా……ఏమిటండీ ఆ ధైర్యం ,ఎంత నమ్మకం ,మృత్యువు వెంటాడింది ,యముడితో మౌనంగా దెబ్బలాడింది ,ప్రియమైనవాడికోసం పోరాడింది . 

అవడానికి సత్యవంతుడు పతే, కాని తన ఆనందాలకు కేంద్ర బిందువు , ఒకరకంగా సావిత్రి సంతోషానికి మమతకు భవిష్యత్ జీవితానికి అతనే మూలకారణం. ఆ కారణాన్ని గెలుచుకోవడానికి ఎంత తెగువతో పోరాడిందీ , ఎంత నిష్ఠ చూపిందీ, ఎంత ఏకాగ్రంగా సాధించిందీ . పద్ధతి తప్పలేదు , ఆడదాన్నని జాలి చూపమనలేదు ,ప్రత్యేక రాయితీలేమీ కోరలేదు , యముడంతటి వాడిని తన పట్టుదల ప్రేమ తో మెప్పించింది , మనోబలం తో భయంకర  వైతరణలు దాటింది, దారి కష్టమైనా వెనుదిరిగి పోలా …ప్రయాణం దుర్గమమైనా గమ్యం అగమ్యమైనా అనుసరించింది , పతి ప్రాణము తన ఆనందమే లక్ష్యము గా . 

తప్పు మార్గము పట్టలేదు , దగ్గరదారిని చేరలేదు , నిందా వాక్యము లేదు , సహనంతో స్తుంతించిందే తప్ప.

 ఎవరమ్మా ! ఎండకన్నెరుగకండా రాచనగరున పెరిగిన ఈ రాకుమారి , తల్లితండ్రులు నిశ్చయించిన వరుడు , ముని తెలియచెప్పినా అల్పాయష్కుడని ,తల్లితండ్రులు నిర్ణయించాక తిరుగులేదు అతనే నా పతి అన్నది. పతి ప్రాణములు దక్కించుకోవడమే పెళ్ళినాటి ప్రమాణమయ్యింది అగ్నిసాక్షి గా ఆమెకి .  

వ్రతము పట్టింది , సవాలును ఎదుర్కొంది . మంచితనము ఆమె మరో రూపమయ్యింది , సేవ ప్రేమ కరుణ పతిని రక్షించు కోవాలన్న తపన , తనని తను వదిలేసుకునేటట్టు చేసాయి , యమలోకానికి కూడా దారి కట్టాయి , యముడికే కంటనీరు పెట్టించాయి. వరాలిప్పించాయి. 

పతిని గెలుచుకున్న సావిత్రి ఒక జీవితాన్నే గెలిచింది ..తన జీవితం లో …గెలిచింది ..

ఎల్లాటి గెలుపు అది ? మహా మహులే చేయలేని సాహసంతో తిరిగి పొందలేని ప్రాణాన్ని గెలుపు , 

సొంత ప్రాణం కోసం అయితే ఆమె అంత పోరాడి ఉండనే ఉండదు కదా! పరోపకారార్ధమిదం శరీరం లాగ సావిత్రి.

పురాణాలలో సావిత్రి ఆశ్చర్యపరచినా, నిజజీవితంలో సావిత్రి వంటి ఆడపిల్లలు , పట్టుదలతో పతి కి, తమ ప్రియతములకు  కష్టం వచ్చినపుడు తమ సర్వశక్తులు వడ్డి, వారిని గెలిపించేవారు , నడిపించే వారు, బతికించేవారు, ..లేరంటారా..ఎందుకు లేరు ఉన్నారు !

తమ శరీరభాగాలలో కొంత దానమిచ్చి భర్తను బతికించుకున్నావారు, యముడితో పోరాడి జయించి, తమ భర్తలను కాపాడు కున్నవారి లెక్కే.

ఏదైనా ప్రమాదంలోనో , ఎందువల్లనో ఒక శారీరకలోపము ఏర్పడిన భర్తను, లేదా దీర్ఘకాలిక వ్యాధి బారిన పడిన సహచరుని ఆప్యాయతతో చూసుకుంటూ , కష్టానికి తన చేయి అందించి తోడుగా ఉంటూ , వారి జీవితాలను ఆనందమయం చేయగల త్యాగమయిలు  ఒక పక్కన,

భర్త కాలేయము కి తన దానిలో కొంత దానము చేసి ,కిడ్నీలలో ఒకటి ఇచ్చి రక్షించి .. ఇది ఒక రకమైన జీవితపు గెలుపు అనుకుంటే, 

మరొకరకం ఎలా ఉంటుంటుందంటే.. మృత్యవు కోరలలో చిక్కుకున్న భర్తకి తమ చేతలు మాటలు ఆదరణ ప్రేమ అక్కర చూపి తమ సర్వస్వమూ వడ్డి , తమ ప్రియమైనవారికి  తాము ఉన్నామన్న భరోసా ధైర్యము ఇచ్చి జీవించాలన్న ఆశని కలిగించి వారిని దక్కించుకునే స్త్రీ మూర్తులు .. కారా ..నేటి సావిత్రిలు.

మృత్యువు ఒక శారీరకలోపము, భయంకరవ్యాధి .. ఇవి ఒక  ఆవేదనకి, కష్టానికి యముని ప్రతిరూపంలా అనుకుంటే.. అవి అనుభవించేవారికి  కావలసినది , జీవితాశ, బతకాలన్న కోరిక , కష్టకాలం ఎదుర్కోవాలన్న పట్టుదల ధైర్యం. అటువంటి పరిస్తితి లో ఉన్న తమ జీవిత సహచరులకు చేదోడు వాదోడుగా ఉంటూ, కష్టకాలంలో పోరాడి , తమ జీవిత భాగస్వాములకు, ప్రియతములకు , జీవితాన్ని గెలిపించి తెచ్చే నేటి సావిత్రులూ , 

నన్ను ఆశ్చర్య పరచడమే కాదు.. మనలను గర్వ పడేట్టు చేస్తారు, సంతోషపడేట్టు చేస్తారు. 

వారికి నా అభినందనలు.

*****

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published.