యాత్రాగీతం(మెక్సికో)-7

కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-1

-డా|కె.గీత

భాగం-9

 కాన్ కూన్ లో మూడవ రోజు మేం రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరికి కావలిసింది వాళ్లు చేసేం.

సత్య, వరు అడ్వెంచరస్ మనుషులు కావడంతో వాళ్లిద్దరూ జిప్ లైన్, జంగిల్ డ్రైవ్ & కేవ్ స్విమ్మింగ్ అడ్వెంచర్  టూరుకి వెళ్లేరు. ఇందులో జిప్ లైన్ అంటే ఒక తాడు ఆధారంగా నడుముకి కట్టిన చెయిన్లతో ఒక చోటు నుంచి మరో చోటుకి గాల్లో జారుకుంటూ వెళ్లడం. జంగిల్ డ్రైవ్ లో ఎత్తుపల్లాల అడవి మార్గంలో చిన్న వెహికిల్ లో స్పీడ్ గా డ్రైవ్ చెయ్యడం, ఇక కేవ్ స్విమ్మింగ్ లో నడుం లోతు నీటిలో మునిగి చీకటి గుహలో ఈదుకుంటూ వెళ్లడం. 

వరు ఇవన్నీ సునాయాసంగా చేసిపారేస్తుంది. సత్యకి  ఇటువంటివి చేసి చూడాలన్న ఉత్సాహం ఎక్కువ. ఇక ఇందులో ఏ ఒక్కటీ చెయ్యగల సత్తా, ధైర్యమూ లేనివాళ్ళం నేను, సిరి. కాబట్టి ఇక నేను, సిరి స్థిమితంగా లేచి రిసార్టులో ఫుల్ బ్రేక్ ఫాస్టు  చేసి అలా రిసార్టు లోపలే అక్కడక్కడే రిలాక్స్ గా తిరగడం పనిగా పెట్టుకున్నాం.

అయితే ఈ రిసార్టు లో బస చేసినందుకు గాను కొన్ని పాయింట్లు ఇస్తారు. వాటితో రిసార్టు లోఉన్న నెయిల్ సెలూన్, స్పా, గిఫ్ట్ షాపు మొ.న చోట డిస్కౌంట్ లు పొందవచ్చు. సరే, ఇందులో స్పా ప్రయత్నం చేద్దామని నిశ్చయించుకున్నాను.

ఉదయం 11 గం.లకు స్పా సెషన్ ను ముందురోజు రాత్రే బుక్ చేసుకున్నాను.

అనుకున్నట్టే సత్య, వరు ఉదయం 8 గం.లకు వాళ్ల అడ్వెంచర్ టూరుకి వెళ్లేరు.

నేను సిరిని తీసుకుని  స్పా ఉన్న రెండో అంతస్తులోకి  11 గం.లకు వెళ్లేను. 

తీరా వెళ్లేక నాతో బాటూ పాపని లోపలికి తీసుకురావడానికి వీలు లేదన్నారు స్పా డెస్క్ వాళ్లు.

ఆ విషయం ముందు రోజు బుక్ చేసుకునే సమయంలో అడిగితే ఫర్వాలేదన్నారు కదా అన్నాను. 

మీకు ఎవరో సరైన సమాచారం ఇవ్వలేదు, కుదరనే కుదరదు అని సమాధానం ఇచ్చారు.

సరే, బయట సోఫాలో నా సెల్ ఫోను ఇచ్చి కూచోబెడతాను. పాప బుద్ధిగా కూర్చుంటుంది.ఒకవేళ అటూ ఇటూ వెళ్లబోతే చూస్తారా అనడిగేను. అదీ వల్ల కాదు అన్నారు.

నాకు బాగా చిర్రెత్తుకొచ్చి మొదటి అంతస్తులో ముందు రోజు రాత్రి స్పా రిజర్వేషను చేసుకున్న కౌంటర్ దగ్గిరికి వెళ్లి అడిగేను. 

వాళ్లు పాపని రిసార్టు డేకేర్ లో కిడ్స్ ప్లే సెషన్ లో జాయిన్ చెయ్యమని చెప్పేరు.

తీరా అక్కడికి వెళ్లే సరికి అక్కడ ఎవ్వరూ లేరు.అంతా బయట స్విమ్మింగు సెషన్ లో ఉన్నారు. సిరిని జాయిన్ చేసుకోవడానికి వాళ్ల సెషన్ అయ్యేంత వరకూ ఆగమని ఇన్స్ట్రక్టరు చెప్పింది.

అదయ్యేసరికి ఇక్కడ నా అప్పాయింట్ మెంట్ అయిపోతుంది. చేసేదేమీ లేదని అర్థం అయ్యింది.

అయినా నేను విడిచి పెట్టకుండా రిసార్టు మేనేజరుని పిలిపించమని పట్టుబట్టేను.

హ్యూమన్ రిలేషన్స్ మేనేజర్ పరుగున వచ్చింది.

నా ప్రాబ్లమ్ సావధానంగా విని, వెంటనే నేను మీఅమ్మాయికి డేకేర్ వెంటనే ఏర్పాటు చేయిస్తాను నన్ను నిశ్చింతగా స్పాకి వెళ్లిరమ్మని ఆగమేఘాల మీద అందరికీ ఫోన్లు చేసి గబగబా నాప్రాబ్లమ్ సాల్వ్ చేసింది. 

ఇక బిల్లు మాత్రం ఎంత డిస్కౌంట్ అని చెప్తున్నా మా ఊళ్లో కంటే ఎక్కువే అయ్యింది. అదన్నమాట సంగతి!

స్పా నుంచి నేను సిరిని తీసుకురావడం కోసం డేకేర్ కి వెళ్లగానే సిరి చక్కగా బొమ్మలన్నీ పేర్చుకుని ఆడుకుంటూ, ఆనందంగా కనిపించింది. ఇంకాస్సేపు అక్కడే ఉంటానని పేచీ పెట్టింది కూడా.

మధ్యాహ్న భోజనం చేసి సిరి, నేను రిసార్టుని ఆనుకుని ఉన్న బీచ్ ఇసుకలో కూలబడి చక్కగా ఆడుకున్నాం.

మూడు నాలుగు గంటల సమయానికే సత్య, వరు తిరిగి వచ్చేసేరు. అంతా కలిసి స్విమ్మింగుకి వెళ్లి, తిరిగొచ్చి స్నానాలు చేసి కేండిల్ లైట్ డిన్నర్ కి వెళ్ళేం. ఇలాంటి డిన్నర్ కి వెళ్లేటపుడు ఇక్కడి సంప్రదాయ దుస్తులు వేసుకోవడం పరిపాటి. మగవాళ్లు సూటు బూట్లు, ఆడ వాళ్లు గౌన్లు  వేసుకుంటారు. మేమూ అదే పద్ధతిలో తయారయ్యి డిన్నర్ చేసి వచ్చి పిల్లలతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ బాల్కనీలో నుంచి వెన్నెలని, సముద్రతీరాన్ని ఆస్వాదించేం. 

***  

మర్నాడు  ఉదయం మేం తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్ వగైరా చూడడానికి టూరు  బుక్ చేసుకున్నాం. ఈ ఫుల్ డే టూరులో సెనోట్ అంటే నీళ్లలో స్నానం తప్పనిసరికాబట్టి స్విమ్మింగు బట్టలవీ బ్యాగుతో తెచ్చుకున్నాం. మధ్యాహ్న భోజనం దారిలోని మాయా విలేజ్ లో చేయడం టూరులోభాగం కాబట్టి భోజనానికి చూసుకోనవసరం లేదు. తాగడానికి మంచినీళ్ల బాటిళ్లు వ్యానులో ఎప్పుడంటే అప్పుడు అడిగి తీసుకోవచ్చు. 

ఇక ఇది మొన్నటిలాంటి పెద్ద బస్సు టూర్ కాదు.  పది మంది కూర్చొనగలిగే చిన్న సైజు వేన్ లో మా డ్రైవరే గైడుగా అన్నీ తిప్పి చూపిస్తాడన్న మాట. మాతో బాటూ మరొక నలుగురు వేరే రిసార్టుల నించి ఈ  టూరుకి వచ్చేరు. అందులో ఇద్దరు అమ్మాయిల జంట, ఒక వృద్ధ జంట. అంతా అమెరికన్లే. ఇక ఇద్దరు పిల్లల్తో మేం నలుగురం. వెరసి డ్రైవరుతో కలిపి తొమ్మండుగురం రోజంతా కలిసి ప్రయాణం చేసేం. మేం మొదటి సీట్లలో కూర్చోవడం వల్ల మా  డ్రైవరు కం గైడుని నేను అక్కడి జీవన విధానం గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాను. కాన్ కూన్ లో డ్రగ్ ట్రాఫికింగ్, అభద్రత గురించి నేను ప్రశ్నించినపుడు “అమెరికాలో భద్రతారాహిత్యం ఎంత ఉన్నా పైకి తేలనివ్వరు. ఇక్కడి చిన్న సంఘటనల్ని కూడా భూతద్దంలో చూపిస్తారు.” అన్నాడు. నిజమేనేమో అనిపించింది. ఇక కాన్ కూన్ పర్యాటక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో యువత ప్రత్యేకించి హోటలు మేనేజ్ మెంటు వంటి కోర్సులు పూర్తిచేసి, ఇంగ్లీషులో కొద్దో గొప్పో ప్రావీణ్యం సంపాదించి రిసార్టు ఉద్యోగాలలో చేరడమే ప్రధాన జీవనోపాధి అనీ, అతనూ కొద్ది సంవత్సరాలు అదే వృత్తిలో గడిపి ఇప్పుడు ఈ వేను టూరు సంస్థలో డ్రైవరుగా చేస్తున్నానని చెప్పేడు. కుర్రవాడే అయినా ఇద్దరు పిల్లల తండ్రి అతడు. ఆ చుట్టుపక్కలే పుట్టి పెరిగిన మాయా సంతతికి చెందిన వాడు. మేం చేసిన ఆ ప్రయాణం అన్నిటికంటే ఉత్తమమైనదని చెప్పుకోవాలి. నిజమైన మాయా సంతతికి చెందిన మనుషుల్ని, వారి ఊళ్లని, సంస్కృతిని చూడాలంటే ఈ టూరుకి తప్పకుండా వెళ్ళిరావాలి. 

*****

(ఇంకా ఉంది) 

ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి – 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.