షర్మిలాం”తరంగం”

-షర్మిల కోనేరు 

ఇదీ మాట్టాడుకోవాల్సిందే !

కొన్ని విషయాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి . కానీ వాటిగురించి పెద్ద చర్చే చేయాల్సి వస్తుంటంది ఒక్కోసారి .

మన ఇళ్లల్లో ఎంగిలిపళ్లాలు కడిగి మనం పారేసే చెత్తని ఊడ్చి శుభ్రం చేసే మనుషుల పట్ల మనం ఎలావుంటున్నాం !

కనీసం వాళ్లు అత్యవసరంగా టాయిలెట్ వాడాల్సి వస్తే మనం అనుమతిస్తామా ?

కొందరు వున్నత వర్గాల్లో బయట సర్వెంట్ బాత్రూంలు అని కడతారు .

మామూలుగా అందరిళ్లల్లో లేదా అపార్ట్మెంట్లలో పని చేసే వారికి ఈ అవకాశం వుండదు .

ఎక్కెడెక్కడినుంచో వచ్చి పనులు చేసుకునే వారికి మనం కచ్చితంగా మన రెస్ట్ రూం వాడుకోనివ్వాలి .

ఏమో బాబూ నాకు చిరాకు అనే కొందరు ఇల్లాళ్లూ వుంటారు  .

వారు ఒకటి గుర్తుంచుకోవాలి మనం అంతా మనుషులమేనని .

మనుషుల మధ్య అంతరాలు వాళ్ల స్థితిని గుర్తుచేసేలా వుంటే అది అమానవీయం .

మాకు శుభ్రం ఎక్కువ అనేవాళ్లంతా పనివాళ్లతో ఎముకలు అరిగేలా చాకిరీ చేయించేవారే .

బాత్రూంలు తళతళలాడేలా శుభ్రం చేసేవారికి అవి వాడటం మాత్రం తెలియదా ?

పోనీ తెలియదనుకుంటే స్పష్టంగా చెప్పడానికి ఏం మొహమాట పడక్కరలేదు.

అసలు మన దేశంలో ఇప్పుడు

కాస్త బయట రెస్ట్ రూం లు వుంటున్నాయి .

కానీ ఇంతకు ముందు కార్ లలో లాంగ్ డ్రైవ్ లకి వెళ్లినప్పుడు ఒక్కో చోట ఆపి అక్కడున్న ఇళ్ల వాళ్లని రిక్వెస్ట్ చేసి వెళ్లాల్సి వచ్చేది .

ఒక సారి మేం చిన్న తిరుపతి వెళ్తూ ఒక ఇంటి ముందు ఆపి “బాత్రూం వాడుకో వచ్చా “అని అడిగాం .

అసలే గోదావరి జిల్లా మర్యాదలకి పెట్టింది పేరు .

“అయ్యో ! అదేం బాగ్గెం వాడుకోండె !” అన్నారు . అంతేకాదు “టీ తాగెళ్లాల్సిందే ” అని మా అందరికీ టీ ఇచ్చి గానీ పంపలేదు .

ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడే మనిషికి మనిషికి వుండే సంబంధం మన గ్రామీణ భారతంలో ఇంకా తెగిపోలేదని తెలిసేది .

ఇది జరిగి 15 ఏళ్లయినా వాళ్ల మొకాలు గుర్తులేవు కానీ వాళ్ల మనిషితనం గుండెల్లో నిలిచి పోయింది .

ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే ఈ మధ్య తెలిసిన వాళ్ల ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది .

ఆ ఫంక్షన్ కి కేటరింగ్ చేసే కుర్రాళ్లు వచ్చారు .

వాళ్లూ చదువుకునేవారే . పార్ట్ టైం గా వడ్డనకి వచ్చారు .

నాలుగైదు గంటలుండాల్సి వస్తుంది కాబట్టి సహజంగానే వాష్ రూం వాడాల్సి వచ్చింది.

వెళ్లొచ్చా అని ఆ ఇంటివారిని అడిగితే వాళ్లు నిర్మొహమాటంగా కుదరదని చెప్పేశారు .

ఈ విషయం వాళ్లు చెప్పినప్పుడు నాకైతే అన్యాయం అనిపించింది .

వాళ్లు ఆ అవసరానికి  ఎక్కడికో వెతుక్కుని వెళ్లాల్సిన అగత్యం కల్పించడం మనం సాటి మనిషికి చేసే అన్యాయం కదా !

ఈ ఒక్క సంఘటనే కాదు ఇంట్లో పనిచేయడానికి వచ్చేవాళ్లమీద చేసే కామెంట్లు ఆశ్చర్యం కలిగిస్తాయి.

” ఈ మధ్య దీనికి ఆశ ఎక్కువైందండీ!  అన్నిటికీ డబ్బులు డబ్బులు !!

కాస్త ఎక్స్స్త్రా పని చెప్పగానే డబ్బులిమ్మంటుంది ” అని .

మనం ఉద్యోగంలో ఓవర్ టైం చేస్తే డబ్బులు ఆశించినప్పుడు వాళ్లు ఒళ్లు విరుచుకుని పని చేస్తూ డబ్బులు ఆశించరా !

అవసరాల్ని మించి వున్న వారికే ఆశ వున్నప్పుడు అరకొరతో బతుకు సాగించే వారు ఆశపడడం ఆశ కాదు వాళ్ల హక్కు .

సమతూకం వున్నప్పుడే మానవ సంబంధాలు మెరుగ్గావుంటాయి .

వాటితో మాకేం పని లేదంటే మనుషులకి మాత్రమే వున్న విచక్షణాజ్ణానం మనకి లేనట్టే.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.